ఈ రోజుతో రజనీకాంత్‌కు 70 ఏళ్లు నిండాయి. రాజకీయాల్లోకి దిగుతానని తాజాగా గతవారమే ప్రకటించడంతో యీసారి పుట్టినరోజుకు అభిమానుల హడావుడి జాస్తిగానే వుంది. రాజకీయనాయకుల హడావుడి కూడా. మోదీ నుంచి పన్నీరుశెల్వం దాకా పొద్దున్నే గ్రీట్ చేసేశారు. డిసెంబరు 31న పార్టీ పెడతానంటా డితను.
2021 మేలో అసెంబ్లీ ఎన్నికలు. అంటే మధ్యలో నాలుగు నెలలు మాత్రమే టైముందన్నమాట. ఈలోగా బూత్ స్థాయి దాకా పార్టీ నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలపై చర్చ, మానిఫెస్టో తయారుచేయించడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం అన్నీ పూర్తయిపోయి, దశాబ్దాలుగా పకడ్బందీగా. పటిష్టంగా ఏర్పడిన డిఎంకె, ఎడిఎంకె పార్టీలను, కులాలవారీగా, ప్రాంతాలవారీగా బలంగా వున్న యితర పార్టీలను ఢీకొనే స్థాయికి ఎదగాలన్నమాట. ఇదంతా జరిగేనా?
రాజకీయ పార్టీ పెట్టడమంటే ఆషామాషీ వ్యవహారమని కొందరు ఎందుకనుకుంటారో నాకు అర్థం కాదు. డబ్బున్నవాళ్లంతా సినిమాలు తీయలేరు. అదొక విద్య. కష్టపడి నేర్చుకోవాలి. అలాగే గ్లామరున్న వాళ్లంతా పార్టీలు పెట్టలేరు. అది బ్రహ్మవిద్య. ఓ పాతికమంది నమ్మకస్తులు, సమర్థులు దొరికితే, ఓ వందా రెండువందల మంది చేత బాగా పని చేయించగలిగితే సినిమా విడుదల చేసేయవచ్చు.
కానీ పార్టీ అంటే వేలాదిమంది కార్యకర్తలు కావాలి. వివిధ స్థాయిల్లో, వివిధ దశల్లో డబ్బు పెట్టుబడి పెట్టేవాళ్లుండాలి. మీడియా మద్దతు కొంతైనా వుండాలి. ఓటర్లను కలుసుకోవడంలో, పోలింగు రోజున బూతులకు తరలించడంలో కార్యకర్తలకు తర్ఫీదు యివ్వాలి. టీవీ చర్చల్లో పాల్గొనడానికి కొంతమంది వక్తలను తయారుచేయాలి.
అందరికంటె ముందుగా పార్టీ అధినేత ట్రైనింగు తీసుకోవాలి. సినిమానటుడంటే పోనీలే అని వూరుకుంటారు కానీ రాజకీయాల్లోకి వచ్చాడనగానే జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయం చెప్పమంటారు. ప్రతీ నియోజకవర్గం గురించి ఏదో ఒకటి చెప్పమంటారు. మొదటినుంచీ తెలుసుకుంటూ వస్తే తప్ప హఠాత్తుగా నేర్చుకుందామంటే యివన్నీ కొరుకుడు పడవు.
సినిమాల్లో డైలాగులు వేరే రాస్తారు. సరిగ్గా చెప్పకపోతే రీటేకులుంటాయి. రాజకీయాల్లో ప్రజలు క్షమించరు. పవన్ రాయప్రోలు బదులు గురజాడ అంటే వెక్కిరించి వదిలిపెట్టారు. లోకేశ్ నాలుక మడతపడి ఒకే ఒక్కసారి మంగళగిరికి బదులు మందలగిరి అంటే యిప్పటికీ వదిలిపెట్టటం లేదు. ఆ పాటి పొరపాటు మనం చేయమా? కానీ రాజకీయనాయకుడనగానే లోకువ.
ఎమ్జీయార్ లాటివాడు డిఎంకె ప్రచారకర్తగా వున్నప్పటి నుంచి ఉపన్యాసాలిస్తూ తర్ఫీదు పొందాడు. రజనీకి అలాటి ట్రైనింగ్ ఎక్కడుంది? ఇప్పటికిప్పుడు నాలుగు నెలల్లో అన్నీ చేయాలంటే ఎవరో సలహాదారులను పెట్టుకోవాలి. వాళ్లు చెప్పినట్లు వినాలి. వాళ్లు నీట ముంచుతారో, పాల ముంచుతారో ఫలితాలు వచ్చేదాకా తెలియదు.
ఆధ్యాత్మిక రాజకీయాలు, సామాజిక తెలంగాణ.. యివన్నీ కేచీ ఫ్రేజెస్. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి అన్నీ ఒకటేగా తేలతాయి. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు అని అడగ్గానే ‘నాకు పదవీలాలస లేదు, నటుడిగా నన్ను అభిమానించి యింతవాణ్ని చేసిన ప్రజలకు తిరిగి యివ్వాలనే ఉద్దేశంతో సామాజికసేవ చేద్దామని దిగాను’ అంటూంటారు వీళ్లు. రజనీ కూడా అదే చెప్పబోతాడు కానీ ‘ఎన్నికలు నాలుగు నెలలు వుండగా కానీ యీ విషయం గుర్తుకు రాలేదా?’ అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు?
మన పవన్ కళ్యాణ్ ఎన్నికల కంటె ముందే పార్టీ పెట్టాడు కానీ చురుగ్గా లేకుండా, పార్టీ నిర్మాణం చేయకుండా వూరుకున్నాడు. అది దెబ్బ కొట్టేసింది. ట్రాన్స్‌ఫార్మర్ లేని పవర్ హౌస్ అన్నారొక మిత్రుడు. ఆ విద్యుత్ గ్రామగ్రామానికి వెళ్లాలంటే కొన్నేళ్లపాటు తీగలు వేసుకుంటూ పోవాలి కదా! ఎన్నికల సమయంలో ఓ రెండు నెలలు బహిరంగసభలు పెడితే సరిపోయిందా? సభకు వచ్చిన జనాన్ని ఓట్లు వేయడానికి తీసుకుని వచ్చే యంత్రాంగం అమర్చుకోవాలి కదా! 2019 ఫలితాలు దారుణంగా వచ్చాక, పవన్ నిష్క్రియాపరత్వం అభిమానులను నిరాశ పరుస్తోంది.
ఎప్పటికప్పుడు ఎన్నికలలో పాల్గొంటూ వుంటేనే పార్టీలో యాక్టివిటీ వుంటుంది, కార్యకర్తలకు పని వుంటుంది, నిధులు కూడా వస్తాయి. ఎక్కడ బలం వుందో, ఎక్కడ లేదో తెలుస్తుంది. అవేమీ చేయకుండా ఓ స్టేటుమెంటు యిచ్చి వదిలేస్తే రాజకీయంగా చురుగ్గా వుండదలచినవారు తమను పిలిచినవారి దగ్గరకు వెళ్లిపోతారు. పార్టీ అధినేత ‘పేపర్ టైగర్’గా మిగిలిపోతాడు.
రజనీ అభిమాన సంఘాలు పవన్ అభిమాన సంఘాల కంటె బలమైనవి, విస్తృతమైనవి అని కొందరు వాదించవచ్చు. 40 ఏళ్ల క్రితం వాటిలో సభ్యులుగా చేరినవాళ్లు యీ పాటికి వయసు మీరి, రాజకీయాలంటేనే కాదు, జీవితమంటే కూడా విరక్తి చెంది వుంటారు. ఈలోగా అనేకమంది యువహీరోలు పుట్టుకుని వచ్చారు.
యువత రజనీ అంటే పడిఛస్తోందా అంటే నాకు డౌటే. రజనీ సినిమాలు హిట్ అయ్యాయంటే దానికి కారణం రజనీ ఒక్కడే కాదు. కథ, డైరక్షన్, యితర నటీనటులు యిత్యాది ఎన్నో హంగులు చక్కగా అమిరాయి కాబట్టి హిట్టయ్యాయి. ఇటీవలి కాలంలో అమరకపోవడం హెచ్చయింది కాబట్టి భారీ ఫ్లాపులు వచ్చాయి.
ఎమ్జీయార్ తరహాలో రజనీ మహాదాతగా పేరు తెచ్చుకోలేదు. ప్రజాసమస్యల పట్ల స్పందించినదీ లేదు. ఉద్యమాలు చేసినదీ లేదు. తన కమ్మర్షియల్ సినిమాల్లో ‘నేనే కనుక రాజకీయాల్లోకి వస్తేనా..?’ అనే డైలాగులు పవర్‌ఫుల్‌గా పలికి చప్పట్లు కొట్టించుకోవడం తప్ప నిజంగా గోదాలోకి దిగిన సాహసం చేయలేదు.
అంతకంటె కరుప్పు (నల్ల) ఎమ్జీయార్‌గా పేరు తెచ్చుకున్న విజయకాంత్ మేలు. పార్టీ పెట్టుకుని ఏవో తంటాలు పడుతున్నాడు. ఓటమి ఎదురైనా పారిపోలేదు. రజనీకి వున్న పేరల్లా భక్తుడు, స్వతహాగా మంచివాడు అనే. తెలివైనవాడు, రాజకీయ చతురత వున్నవాడు అని ఎవరూ అనలేదు. అసలు ప్రజాసమస్యల పట్ల అవగాహన వుందా లేదా అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఇలాటి వాణ్ని చూసి ఓటర్లలో కొందరు మురవచ్చేమో కానీ రాజకీయాల్లో తలపండినవారు కానీ, యాక్టివ్‌గా వుండదామనుకునే వారు కానీ యింప్రెస్ అవరు.
అసలు రజనీని కలవడమే కష్టం. ముఖ్యంగా యిప్పుడు అనారోగ్యం పీడిస్తోంది కాబట్టి, జనంలోకి వెళితే యిన్‌ఫెక్షన్ వస్తుందంటే తను పెద్దగా ప్రచారం చేయడేమో కూడా. సినిమాల్లో కూడా గ్రాఫిక్స్‌తో సరిపెడుతున్నారు. జయలలితకు కూడా ఎన్నో వ్యాధులు వుండేవి. కానీ ఆమె 30 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి దిగిపోయి, పూర్తి నాయకురాలిగా ఎదిగింది కాబట్టి ఎంతో శ్రమకోర్చి, జనాల్లో తిరిగి అమ్మ అనిపించుకుంది.
ప్రతీకార రాజకీయాలకు గురై, ఒక విధమైన కసితో వుంది కాబట్టి, ఆమెకు అలా తిరిగే శక్తి వచ్చింది. రజనీకి అలాటి అనుభవాలు లేవు. అందువలన కరోనా వుంది కాబట్టి వీడియోల ద్వారా ప్రచారం చేస్తాను అంటాడేమో, అలా అంటే ప్రజల్లో ఉత్సాహం పుట్టదు, కార్యకర్తలు నీరసిస్తారు. తటస్థ ఓటర్లు పెదవి విరవవచ్చు.
అసలీ రజనీని రాజకీయాల పరంగా నమ్మడానికి లేదు. పాతికేళ్లగా ‘లేస్తే మనిషిని కాను’ అంటూ హడావుడి చేయడమే తప్ప, లేచింది లేదు. ఇన్నాళ్లకు, యీ వయసులో, యీ ఆరోగ్యస్థితిలో లేస్తానంటున్నాడు. వ్యవధి అతి తక్కువ వుండగా ఫుల్‌స్కేల్ పార్టీ పెడతానని ఆశ పెడుతున్నాడు.
ఆ మధ్యెప్పుడో ప్రకటన చేసినపుడే పెట్టి వుంటే యీపాటికి కొంతమంది చేరడం, వారిలో కొంతమంది వెళ్లిపోవడం కూడా జరిగేది. బిజెపికి యితన్ని దువ్వుతోందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. బిజెపికి ప్రచారకర్తగా చేస్తాడంటే నమ్మి వుండేవాళ్లం. కానీ కొత్తగా పార్టీ పెడతాడంటే నమ్మగలమా?
అసలు రజనీని నమ్మడం చేతనే పివి నరసింహారావుగారు నిట్టనిలువునా మునిగారని గుర్తు తెచ్చుకుంటే అతని మీద చికాకు కలగక మానదు. ఆ విషయమంతా పివికి బాగా సన్నిహితులైన పివిఆర్‌కె ప్రసాద్ తన ‘అసలేం జరిగిందంటే..?’లో విపులంగా రాశారు. సంక్షిప్తంగా చెప్తాను – పార్లమెంటులో మెజారిటీ లేకపోయినా 1991లో ప్రధాని అయిన పివి ఐదేళ్లూ తన రాజకీయ చాతుర్యంతో నెట్టుకుని వచ్చి దేశాన్ని అనేక రకాలుగా గట్టెక్కించారు.
1996 ఎన్నికలు వచ్చాయి. ప్రతీ రాష్ట్రమూ ముఖ్యమే. ముఖ్యంగా తమిళనాడు. అక్కడ జయలలితతో కాంగ్రెసుకు పొత్తు. జయలలిత పివితోనే అంటీముట్టనట్టుగా వుండేది. ఎప్పుడేం చేస్తుందో పివికే అంతుపట్టేది కాదు. ఇక రాష్ట్ర కాంగ్రెసు నాయకులైన మూపనార్, చిదంబరాలను జయలలిత పూచికపుల్లలుగా చూసేది.
వీళ్లూ ఆమె పేరు చెప్తేనే మండిపడేవారు. మన పార్టీతో పొత్తు పెట్టుకుని కూడా లెక్క చేయదేమిటి, ఈ పొత్తు తెంపేసుకోవాలి అని వాళ్ల పంతం. భాగస్వామి అయినా జయలలితకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. ఎన్నికలు ఆర్నెల్లు వున్నాయనగా వాటి జోరు పెంచారు. ఈ పరిస్థితి నివారించడానికి పివి, జయలలితతో మా వాళ్లతో కూడా సఖ్యంగా వుంటే మంచిది కదా అని సూచనప్రాయంగా అంటే ఆమె పైకి ఏమీ అనకపోయినా, సలహాను పట్టించుకునేది కాదు.
1996లో పార్లమెంటు ఎన్నికలతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మళ్లీ జయలలితతో పొత్తు అంటే తమకు బొత్తిగా విలువ వుండదని మూపనార్, చిదంబరాలకు బాధ. ఏది ఏమైనా జయలలితతో పొత్తు కొనసాగాలని మరో కాంగ్రెసు నాయకుడు తంగబాలు ఆలోచన. అతనంటే వీళ్లకు మంట.
జయలలితతో పొత్తు వద్దు అంటే మరి ఎవరితో పెట్టుకోవాలి? డిఎంకెతో పెట్టుకోవాలి. పెట్టుకోగలరా? 1991లో రాజీవ్ హత్య జరిగింది. చేసినది ఎల్‌టిటిఇయే ఐనా, వారికి సహకరించినది డికె, డిఎంకెలలో కొందరు ముఖ్యనాయకులు అని అందరికీ తెలుసు. డిఎంకె పాలనలోనే ఎల్‌టిటిఇ తమిళనాడులో పాతుకుపోయింది, విస్తరిస్తూ పోయింది. అందుకే రాజీవ్ హత్య జరగగానే అందరికీ డిఎంకెపైనే అనుమానం కలిగింది.
ఊరూరా దాని పార్టీ ఆఫీసులను దగ్ధం చేశారు. ఎన్నికలలో డిఎంకెను చిత్తుగా ఓడించి, కాంగ్రెసు, ఎడిఎంకెలను గెలిపించారు. జయలలిత ముఖ్యమంత్రి అయి రాష్ట్రపోలీసులను ‘సిట్’కు సహకరించేట్లా చేసింది. కాబట్టే వందలాది ద్రోహులు బయటపడ్డారు. ఎల్‌టిటిఇ నెట్‌వర్క్ బయటపడింది. హంతకులను పట్టుకోగలిగారు.
కేంద్రంలో పివి, రాష్ట్రంలో జయలలిత సారథ్యంలోని ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేశాయి కాబట్టే అంత త్వరగా విచారణ ముగిసింది. డిఎంకెను యీ విషయంలో నిందించాలా లేదాని 1991లో అనుమానించిన వారందరి సందేహాలూ 1992 ముగిసేనాటికి తీరిపోయాయి.
ఇలాటి డిఎంకెతో కాంగ్రెసు ఎలా పొత్తు పెట్టుకోగలదు? పెట్టుకుంటే దానికి పరువు మిగులుతుందా? పైగా రాజీవ్ గాంధీ అనుచరుడిగా, అతని కుటుంబం ఆమోదంతో ప్రధాని అయినా పివి, డిఎంకెతో పొత్తు పెట్టుకుంటే సోనియా గాంధీ చుట్టూ వున్నవారేమంటారు? చూశారా రాజీవ్ హంతకులతో పివి చెయ్యి కలిపాడు అంటారు. అందువలన డిఎంకెతో పొత్తుకు కాంగ్రెసు అధ్యక్షుడిగా వున్న పివిని ఒప్పించడం మహా కష్టం అని మూపనార్ ముఠా అనుకుంది.
ఏం చేద్దామా అని ఆలోచిస్తూ వుంటే రజనీకాంత్ పేరు తట్టింది వాళ్లకు. అప్పుడు హీరోగా వెలుగుతున్నాడు. జయలలితకు అతనికి వ్యక్తిగతంగా పడదు అని అందరికీ తెలుసు. అతన్ని కాంగ్రెసులో చేర్పించేస్తే ఎవరి పొత్తూ లేకుండా స్వతంత్రంగా పోటీ చేసేయవచ్చు, అతన్ని కీలుబొమ్మ ముఖ్యమంత్రిగా పెట్టుకుని మనం చక్రం తిప్పేయవచ్చు అని మూపనార్ ముఠా ఐడియా. వెళ్లి రజనీకాంత్‌కి చెపితే అతను జయలలితపై కోపంతో అన్నాడో, లేక ఆశపడి అన్నాడో కానీ సై అన్నాడు. వెంటనే వీళ్లు దిల్లీలో వాలారు. పివి ముందు ప్రతిపాదన పెట్టారు. పివి చాలాసేపు ఆలోచించి ‘‘రజనీ కాంగ్రెసులో చేరతారని మీరు నిజంగా నమ్ముతున్నారా?’’ అని అడిగారు.
‘‘ఆ విషయం మాకు వదిలేయండి. రావడం ఖాయం.’’ అన్నారు వీళ్లు. ‘‘సరే, విషయం ఖరారయ్యేవరకూ ఏమీ మాట్లాడకండి. ఈలోగా జయలలితను దూరం చేసుకుంటున్నట్లు బయటకు పొక్కనీయకండి.’’ అన్నారు పివి. ఇది మూపనార్ ముఠాకు నచ్చలేదు. వాళ్లు ఎప్పుడెప్పుడు జయలలితను ఛీ కొడదామా అని చూస్తున్నారు. కానీ పివి తొందరపడలేదు. మూడు రకాల సర్వేలు చేయించారు.
అన్నిటిని కలిపి క్రోడీకరించి చూస్తే వాళ్లు చెప్పినదేమిటంటే – ‘కాంగ్రెసు స్వతంత్రంగా పోటీ చేస్తే సీట్లు రావు. డిఎంకెతో పొత్తు పెట్టుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ. జయలలితకు ఆదరణ తగ్గింది కాబట్టి ఎడిఎంకెతో పొత్తు పెట్టుకుంటే గెలవడం కష్టమే. రజనీకాంత్ కాంగ్రెసు పార్టీ పగ్గాలు చేపట్టి, పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తే అధికారంలోకి వస్తుంది. ప్రస్తుత కాంగ్రెసు నాయకుల సామర్థ్యంపై ప్రజలకు నమ్మకం లేదు. కానీ రజనీకి అపారమైన ప్రజాదరణ వుంది. ’ అని.
1996 ఫిబ్రవరి వచ్చేనాటికి యిదీ పరిస్థితి. మూపనార్ ముఠా తనను దుమ్మెత్తిపోస్తూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నా జయలలిత కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధమే అంటూ పివికి రాయబారం పంపింది. పివి ఆమెకు తలుపులు మూసేయకుండా రజనీని వచ్చి మాట్లాడమన్నారు. మార్చి నెలాఖరులో మూపనార్ రజనీని వెంటపెట్టుకుని దిల్లీలో పివి యింటికి తీసుకుని వచ్చారు. రాత్రి విందులో ‘కాంగ్రెసు గెలిస్తే మీరే ముఖ్యమంత్రి’ అని ఆల్మోస్ట్ చెప్పేశారు. రజనీ అత్యుత్సాహంతో తప్పకుండా చేరతాను అన్నాడు.
రాత్రికి రాత్రి మూపనార్ తన కార్యకర్తలకు ఫోనే చేసి ‘రేపు రజనీ చెన్నయ్‌లో దిగుతారు. సాయంత్రం ప్రకటన చేస్తారు. మనం వీరగంధంతో స్వాగతం పలకాలి, అట్టహాసం చేసేయాలి. జయలలిత పల్లకి మోయవలసిన పని యికపై మనకు లేదు.’ అని ఫోన్లు చేసేశారు. అయితే రజనీ మర్నాడు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ‘‘నేను రాజకీయాల్లో చేరటం లేదు. ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నానంతే.’’ అని ప్రకటించేశాడు.
ఇదీ రజనీ కారెక్టరు. ప్రధాని, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడికి మాట యిచ్చి 24 గంటలు గడవకుండా మాట తప్పిన మనిషి. మధ్యలో ఏం జరిగిందో యిప్పటిదాకా మనకు తెలియదు. ఎవరూ ఏ పుస్తకంలోనూ రాయలేదు. రాసినా నిజమో కాదో తెలియదు. కానీ అతనికి ధైర్యం లేదనేది సుస్పష్టం. సాక్షాత్తూ పివిని దగా చేశాడు.
మూపనార్ ముఠాను గాడిదలను చేశాడు. దీనివలన కాంగ్రెసు పార్టీకి, పివికి అపారమైన నష్టం కలిగింది. రజనీ ప్రకటన రాగానే మూపనార్, చిదంబరం పివి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి సారీ అన్నారు. ‘మించిపోయింది లేదు, జయలలితతో పొత్తు లేదని ప్రకటించలేదు కదా, సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడతామని కబురు చేయండి, ఆ కసరత్తు ప్రారంభించండి.’ అన్నారు పివి.
కానీ మూపనార్ ముఠాకు యిష్టం లేదు. ‘జయలలితతో తెగతెంపులు అయిపోయాయనే ధైర్యంతో చాలా ముందుకు వెళ్లిపోయాం. ఆమెతో వ్యవహారం కుదరదు. డిఎంకె సిద్ధంగానే వుంది. వాళ్లతో పెట్టుకుందాం.’ అన్నారు. ఈ ముఠాలో మూపనార్, చిదంబరం, మణిశంకర్ అయ్యర్, జయంతి నటరాజన్ వగైరాలు వున్నారు.
వీళ్లంతా రాజీవ్‌కు, సోనియాకు అత్యంత ఆప్తులని చెప్పుకుంటారు. పివి ఆ విషయం గుర్తు చేస్తూ, ‘ఎల్‌టిటిఇకి, డిఎంకెకు సంబంధాలున్నాయని మీరేగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే సోనియాకు ఏం సమాధానం చెప్తారు?’ అని అడిగారు. (ఆయన యింత జాగ్రత్త తీసుకున్నా, కడకు సోనియా ఆయన్ని తొక్కేసింది)
వాళ్లు సమాధానం ఏమీ చెప్పలేక, చెన్నయ్‌కు తిరిగి వెళ్లి కాంగ్రెసును రెండుగా చీల్చేశారు. తమిళ మానిల (ప్రాంతీయ) కాంగ్రెసు అనే పేర పార్టీ పెట్టేశారు. డిఎంకెతో పొత్తు పెట్టేసుకున్నారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని మూపనార్ వర్గీయులు ఆక్రమించేశారు. తంగబాలు వర్గం కాంగ్రెసుతో వుండిపోయింది.
జయలలితతో పొత్తుకు సిద్ధమైంది. నామినేషన్ల దాఖలుకి తుది గడువు రెండు రోజులుండగా యిది జరిగింది. పొత్తు అనిశ్చితంగా కనిపించడం వలన అన్ని నియోజకవర్గాలలోనే రెండు పార్టీల వాళ్లూ నామినేషన్లు వేసేశారు. సీట్ల కేటాయింపు జరిగాక కొంతమంది చేత ఉపసంహరింప చేయాలి. పార్లమెంటు, అసెంబ్లీ రెండింటికీ యింత తక్కువ టైములో, అదీ దిల్లీలో ఖరారు కావాలి.
రాత్రి తెల్లవార్లూ కూర్చున్నా ఏదీ తేలటం లేదు. ఆఖరి నిమిషంలో అయోమయ పరిస్థితిలో ఏదో ఒక రకమైన సర్దుబాటు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు కాలేదు. నామినేషన్ల ఉపసంహరణ సరిగ్గా జరగలేదు. మూపనార్ ధర్మమాని కొన్నాళ్లగా సిగలు పట్టుకున్న కాంగ్రెసు, ఎడిఎంకె కార్యకర్తలు భుజంభుజం కలిపి పనిచేయలేదు.
ఇవన్నీ చాలనట్లు మూపనార్ పార్టీ కాంగ్రెసు పార్టీ ఓట్లు చీల్చింది. ఫలితాలు వచ్చాయి. జయలలిత ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వుందంటే ఎడిఎంకె కూటమికి గతంలో 220 సీట్లు వుంటే యీసారి 4 వచ్చాయి. డిఎంకెకు గతంలో 2 వుంటే యీసారి 173 వచ్చాయి. జయలలిత ఒక నియోజకవర్గంలో ఓడిపోయింది. డిఎంకె భాగస్వాములైన మూపనార్ పార్టీకి 39, సిపిఐకు 8 వచ్చాయి. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెసుకు ఒక్క సీటూ రాలేదు.
ఇక పార్లమెంటుకి వచ్చేసరికి 39 సీట్లున్న తమిళనాడు నుంచి కాంగ్రెసుకూ, ఎడిఎంకెకూ ఒక్కటీ రాలేదు. డిఎంకెకు 17, మూపనార్ పార్టీకి 20, సిపిఐకు 2 వచ్చాయి. దీనివలన కాంగ్రెసుకు మొత్తం సీట్లు 140 మాత్రమే వచ్చాయి. బిజెపికి 161 వచ్చాయి. నేషనల్ ఫ్రంట్‌కు 79, లెఫ్ట్ ఫ్రంట్‌కు 52 వచ్చాయి. ఏ కూటమికి సరైన బలం రాక యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడి దేవెగౌడ, గుజ్రాల్ వంటివారు ప్రధానులై అస్థిరప్రభుత్వాలు నడిపారు. 1998 కల్లా మళ్లీ పార్లమెంటు ఎన్నికలు వచ్చిపడ్డాయి. రజనీకాంత్ సృష్టించిన గందరగోళం పరిణామం యిలా వుంది.
ఇప్పుడు కూడా రజనీ ఏమంటాడో తెలియదు. పార్టీని శ్రద్ధగా నడిపే శక్తీ, ఆసక్తీ వుంటాయని తోచదు. చివరకు పవన్ కళ్యాణ్ లాగానే పేరుకి ఏదో పార్టీ పెట్టినా బిజెపికి మద్దతుదారుగా మిగలవచ్చని, ఓట్ల వేళ నాలుగైదు సభల్లో మాట్లాడి బిజెపిని ఖుషామత్ చేయవచ్చనీ నా అనుమానం. 1996లో అతను డిఎంకె, టిఎంసిలకు అనుకూలంగా ప్రకటన యిచ్చి వూరుకున్నాడు. కానీ అతని వల్లనే కూటమి గెలిచిందని అతని అభిమానులు చెప్పుకున్నారు.
జయలలిత పట్ల తీవ్రవ్యతిరేకత వుందనే ఫ్యాక్టర్‌ను విస్మరించడం సబబు కాదు. ఈసారి అతని ప్రకటనకు ఎంత విలువ వుంటుందో తెలియదు. 2014 ఎన్నికలలో ఆంధ్రలో బిజెపి, టిడిపి పొత్తుకు పవన్ సాయపడినట్లే 2021 తమిళనాడు ఎన్నికలలో బిజెపి ఎడిఎంకె పొత్తుకు రజనీ మాటసాయం చేయవచ్చు తప్ప, పూర్తి స్థాయి ప్రజానాయకుడవుతాడంటే నమ్మబుద్ధి కావటం లేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2020)
[email protected]