కలకత్తాలో ఓ హిందూ సంస్థ వారు పెట్టిన దసరా దుర్గా మండపంలో మహిషాసురుడి స్థానంలో గాంధీ బొమ్మ పెట్టారు. దాన్ని తప్పు పట్టాల్సింది ఎవరు? గాంధీపై గౌరవం ఉన్న భారతీయులు. వారి కంటూ ఒక సంఘం ఉండదు కాబట్టి, గాంధీ పేర వెలసిన ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో ఎవరో ఒకరైనా ఒక ప్రకటన ద్వారా ఖండించాలి. అలా కాకుండా ఆర్యవైశ్య సంఘం వాళ్లు ఖండించడమేమిటి? అంటే గాంధీగారిని కులం కళ్లతో చూస్తున్నట్లా? లేక ఆ ఖండన ప్రకటన ద్వారా తమ సంఘం ఉనికిని చాటుకున్నట్లా? గుజరాతీ సమాజ్ వాళ్లు ఖండించినా ఎబ్బెట్టుగానే ఉండేది. కులపరంగా అయితే మరీ ఘోరం. ఆంబేడ్కర్ విగ్రహానికి ఎవరైనా మసి పూస్తే, దళితులు మాత్రమే స్పందించడం సరి కాదు. ఇదే కొనసాగితే సుభాష్ చంద్ర బోసు విగ్రహాన్ని దుండగులు పడగొడితే కాయస్తులు మాత్రమే అభ్యంతరం చెప్పాలి కాబట్టి, మన దగ్గర ఆ కులస్తులు లేరు కాబట్టి ఊరుకోవచ్చనే అర్థం వస్తుంది.
చింతామణి నాటకంలో అసభ్యత పెచ్చు మీరుతున్నపుడు ఖండించవలసినది పౌరసంఘాలు. వారు కిమ్మనక పోవడంతో కాబోలు సుబ్బిశెట్టి పాత్ర కులస్తులైన వైశ్యులు ఆందోళన చేశారు. అది వాళ్లకు సంబంధించిన గొడవలే అన్నట్లు తక్కిన సభ్యసమాజం వేడుక చూసింది. తాజాగా గరికపాటి వివాదంలో చిరంజీవి అభిమానుల తరఫున అంటూ నాగబాబు దాడి మొదలుపెట్టారు. దానికి ప్రతిగా గరికపాటి తరఫున ఎవరైనా సాహితీకారులు, అవధానులు, లేక గరికపాటి సాంస్కృతిక సంఘం లాటిది ఉంటే వాళ్లూ మాట్లాడవచ్చు. మధ్యలో బ్రాహ్మణసంఘం అంటూ దూరి, నాగబాబును ఖండిస్తున్నా మనడమేమిటి? గరికపాటి ఆ సభకు వెళ్లినది పండితుడిగా! బ్రాహ్మణత్వం చాటుకోవడానికో, పురోహితుడిగానో కాదు. తన వలన వచ్చిన సమస్య కాబట్టి గరికపాటి క్షమాపణ కోరి గట్టెక్కారు. కానీ మధ్యలో కులప్రస్తావన తెచ్చి పబ్లిసిటీ కోసం పాకులాడిన బ్రాహ్మణసంఘం వాళ్లు ఎప్పటికైనా గట్టెక్కగలరా?
ఆ సంఘటన జరిగినది అలయ్ బలయ్ కార్యక్రమంలో, అది అందరూ సరదాగా కలిసే చోటు, అక్కడకు వచ్చిన చిరంజీవి అభిమానులతో కాస్సేపు ఫోటోలు దిగితే తప్పేముంది…? అంటే మరి వేదిక మీద ఏదో కార్యక్రమం సాగుతోంది కదా! అసలక్కడ ప్రవచనం ఎవడు పెట్టమన్నాడు అంటున్నారు. ప్రవచనం కాకపోతే ప్రసంగం. గవర్నరు దత్తాత్రేయ గారే మాట్లాడుతున్నా రనుకుందాం. అప్పుడైతే చిరంజీవి చేసినది ఒప్పవుతుందా? ఆనాటి వీడియోలో గరికపాటి ప్రవచనం చెప్తూ ఉంటే వెనక్కాల సిపిఐ నారాయణ వాళ్లూ సరదాగా మాట్లాడుతూ కనబడ్డారు, ఎటెన్టివ్‌గా ఎవరూ లేరు. ఇలాటివి అవధానిగారికి అలవాటే అనుకోవాలి. అయితే డిస్టర్బెన్స్ అవేళ శ్రుతి మించి ఉంటుంది కాబట్టి ఆయన అసహనానికి గురయ్యాడు.
అభిమానుల సందడి చిరంజీవికే అలవాటే. చిన్న సైజు పబ్లిక్ ఫిగర్‌కు కూడా ఎంతో కొంత ఎటెన్షన్ ఉంటుంది. ఫోటోలు దిగుతామంటారు, సెల్ఫీలు వచ్చాక మరీనూ. సినిమా నటులంటే వేలం వెర్రి. మీద పడిపోతారు. చేతులు పట్టుకుని పిసికేస్తారు. కాళ్ల మీద పడిపోయి చుట్టేస్తారు. బాలకృష్ణ అభిమానిని కొట్టాడు, అభిమానంతో దగ్గరకు వస్తే అలాగేనా వ్యవహరించడం అంటే, ఉత్తినే కొడతాడా? మీద పడిపోతూ ఉంటే కొడతాడు. ముళ్లపూడి వెంకటరమణ గారి ‘‘సినీరమణీయం’’ రిలీజ్ ఫంక్షన్‌కి శ్రీదేవి ముఖ్య అతిథి. ఆవిడ వెళ్లిపోతూ ఉంటే మధ్యవయస్కురాలైన ఓ శ్రీమంతురాలు ఎక్కణ్నుంచో సుడిగాలిలా వచ్చి దారికి అడ్డం పడిపోయి, శ్రీదేవి పక్కన నిలబడి ఫోటో తీయించేసుకుంది. మేమంతా నిర్ఘాంతపోయాం. శ్రీదేవికి చెడ్డ చికాకు వేసి ఉరిమి చూసింది. కానీ అదంతా ఆవిడకు పట్టలేదు.
అభిమానులను కంట్రోలు చేయడం కూడా ఒక కళ. 2002లో ఎస్పీ బాలూ గార్ని తొలిసారి ప్రత్యక్షంగా లలితా కళాతోరణంలో కలిసే అవకాశం వచ్చింది. పక్కన ప్రోగ్రాం జరుగుతోంది. ఆయన మధ్యలో బయటకు వచ్చినపుడు మా ‘‘హాసం’’ ఎడిటరు రాజా నన్ను పరిచయం చేశాడు. ‘‘మీ గురించి బాపురమణల ద్వారా విన్నాను.’’ అన్నారు బాలూ. ‘‘నా గురించిన వివరాలు రాసి తెచ్చానండి. వీలున్నప్పుడు చదవండి.’’ అంటూ ఓ కాగితం ఆయన చేతిలో పెట్టి నమస్కరించి వచ్చేస్తూంటే, ఆయన ‘ఆగండి, ఇప్పుడే చదువుతాను.’ అంటూ గట్టు మీద కూర్చుని కాగితం తెరిచి, చదవ నారంభించారు. ఇంతలో ఒక అభిమాని ఆయన దగ్గరకు వచ్చి ఏదో అడగబోయాడు. ఆయన కాగితంలోంచి తలెత్తి, ఎర్రగా చూసి ‘‘చూస్తున్నారుగా, పనిలో ఉన్నాను.’’ అన్నారు. అతనికి భయం వేసి తొలగిపోయాడు. అప్పట్లో వాట్సాప్ వీడియోలు లేవు. లేకపోతే ఎవరో దాన్ని తీసేసి ‘అభిమానిని ఉరిమి చూసిన బాలూ’ అంటా సర్క్యులేట్ చేసేవారు.
అవేళ చుట్టూ ఎవరూ పెద్దగా లేరు కాబట్టి సరిపోయింది. సభావేదిక మీదనే యిది జరిగి ఉంటే ఏమయ్యేదో తెలియదు. జగన్ పదేళ్ల ప్రస్థానం గురించి నేను రాసిన పుస్తకం అమెరికాలో ఓ వేదిక మీద జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించ బడింది. దాని వీడియో చూస్తే ఒక ప్రహసనంలా కనబడుతుంది. వేదికంతా జనం. జగన్ చుట్టూ జనం. అంతకుముందు జరిగిన కార్యక్రమాల తాలూకు జనం వేదిక దిగడం లేదు. పుస్తకావిష్కరణ ఎనౌన్స్‌మెంట్ వస్తోంది. కానీ ఒకావిడ మీ నాన్నగారు నాకు తెలుసు అంటూ జగన్‌ను వదలటం లేదు. అంతా మైకులో వస్తోంది. జగన్ సరేసరే అని తల ఊపుతున్నాడు తప్ప ఇక చాల్లేవమ్మా, దిగు అని అనలేక పోతున్నాడు. ఈ గందరగోళం మధ్య ఎవరో పుస్తకం ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఆవిష్కరించేశాడు!
చిరంజీవి స్వతహాగా మొహమాటస్తుడు. 2005లో ‘‘హాసం’’ తొలి పుస్తకాల ఆవిష్కరణ సభలో ఆయనతో వేదిక పంచుకున్నపుడు, తర్వాత ఒక పార్టీలో ఆయనతో పాటు కాస్సేపు టేబుల్ పంచుకున్నపుడు దగ్గరగా చూశాను. చాలాచాలా మర్యాదస్తుడు. ఎవరితోనూ పరుషంగా ఉండలేడు. ఓ సారి ఓటు వేయడానికి వెళ్లినపుడు అక్కడున్న స్టాఫెవరో మీరు క్యూలో నిలబడితే జనం మూగుతారు, మీరు ముందుగా వచ్చేయండి అన్నారు. ఈయన వెళ్లబోతూ ఉంటే ఒక కుర్రవాడు ‘మీరు క్యూ ఎలా జంప్ చేస్తారు?’ అని ప్రశ్నించాడు. చిరంజీవి వెంటనే సారీ, సారీ అంటూ క్యూలో నిలబడ్డారు తప్ప ఆ కుర్రాడిపై కన్నెర్ర చేయలేదు. గరికపాటి ఉదంతంలో కూడా చిరంజీవి తన పొరపాటు తెలుసుకుని, వెళ్లి అవధానిగారికి ప్రణమిల్లి, యింటికి ఆహ్వానించారు తప్ప నువ్వెవ్వడివి తప్పెంచడానికి అని అహంకరించలేదు.
ఎందుకంటే చిరంజీవికీ తెలుసు, తన మీటింగు జరుగుతూండగా అమితాబ్ బచ్చన్ వచ్చి చేతులూపి, జనాల ఎటెన్షన్ గ్రాబ్ చేస్తే తనకూ చికాకు కలుగుతుందని. జాతీయ చలనచిత్రోత్సవంలో హిందీ నటుల సరసన తగిన గౌరవం దొరకలేదని ఫీలయ్యే, ఆయన హిందీ సినిమాల్లో వేసి, అక్కడి వాళ్లకు కూడా తెలిసేట్లా చేసుకున్నాడు. అల్లు అర్జున్ ఉన్న ఓ సభలో పవన్ కళ్యాణ్ అభిమానులు గోల చేస్తే అర్జున్‌కు కూడా అసహనం పుట్టి, ఇక ఆపండి అన్నాడు. సభలో ప్రసంగించేవారికి శ్రోతలు తగిన ఎటెన్షన్ యిచ్చినా యివ్వకపోయినా, వేదిక మీద ఉన్న యితర వక్తలు గౌరవం యివ్వాలి. ఎవరో వక్త ఉపన్యసిస్తూ ఉండగానే కొందరు పక్కవాళ్లతో ముచ్చట్లు ప్రారంభించ బోతారు. మర్యాదగా వక్త వైపు చూపించి ఆపాలి. నేనూ అలా చేసిన సందర్భాలున్నాయి. అలా కాకుండా రెస్పాండ్ అయితే సభామర్యాద మీరినట్లే!
అలాగే వేదిక మీద కార్యక్రమం జరుగుతూండగా మధ్యలో వచ్చినవారు చడీచప్పుడు కాకుండా వచ్చి కూర్చోవాలి. మద్రాసులో ఉండగా వాణీ మహల్‌లో ఒక తెలుగు నాటకం జరుగుతూంటే ఎస్పీ బాలు మధ్యలో వచ్చారు. వెళ్లి వెనక్కాల కూర్చున్నారు. నిర్వాహకులు వచ్చి ముందు కూర్చోండి అని కోరారు కానీ ఆయన వద్దు, డిస్టర్బ్ అవుతారు అంటూ నిరాకరించారు. నేను గమనించాను. మనమూ వక్తగానో, ఆర్టిస్టుగానో ఉండే సందర్భంలో యిలాటి డిస్టర్బెన్స్ మన మూడ్ చెడగొడుతుందనే అవగాహన ఆయనకుంది. చిరంజీవికీ అది పుష్కలంగా ఉండి ఉంటుంది. అందుకే మెల్లగా వచ్చి కూర్చుందామనే చూసి ఉంటారు. వరప్రసాద్ యింట్లో జరిగే అనేక ఫంక్షన్‌లకు ఆయన వస్తాడు. ఏ హడావుడీ చేయడు. వచ్చినవాళ్లంతా ఎలిట్ క్రౌడ్ కాబట్టి చుట్టూ మూగరు. ఆయనకీ హాయి. కానీ అవాళ్టి ప్రోగ్రాంలో మహిళలు ఆ తరహా కాదు. అందుకని ఆయనను మొహమాట పెట్టేసి ఉంటారు. ఎప్పుడైతే గరికపాటి దాన్ని ఎత్తి చూపారో, చిరంజీవి వెంటనే సర్దుకుని, అవధానిగారికి సర్ది చెప్పారు.
ఒక ప్రవచనకర్త అలా ప్రవర్తించి ఉండవచ్చా? అని కొందరు తర్కిస్తున్నారు. ప్రవచనకర్త అంటే సన్యాసి కాదు, స్వామీజీ కాదు. దైవాంశ సంభూతుడు కాడు. రాగద్వేషాలకు అతీతుడు కాడు. ఆయన ఒక పండితుడు. తను బాగా చదువుకుని, అది సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించే ఒక ఉపాధ్యాయుడు. గరికపాటి ఉద్యోగిగా చేశారు. స్కూలు వ్యాపారం పెట్టి, దెబ్బ తిని ఉన్నారు. మామూలు గృహస్తే. ఆయనకు కోపతాపాలు ఉండకూడదని, చికాకు కలగకూడదని ఏ శాస్త్రమూ లేదు. మామూలుగానే ఆయనకు నోటి దూకుడు ఎక్కువ. చమత్కారంగా మాట్లాడుతున్నా ననుకుని, వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరం రాగానే వెనక్కి తీసుకోవడం గతంలోనూ జరిగింది. అయినా ఆ ఫంక్షన్‌లో కూడా కాస్సేపు ఓపిక పట్టాకనే చిరంజీవి గారు ఫోటో సెషన్ ఆపాలి అంటూనే ‘విజ్ఞప్తి చేస్తున్నాను’ అన్నారు. ఆయన హెచ్చరించకపోతే ఆ ఫోటో సెషన్ ఎంతసేపు సాగేదో ఎవరికీ తెలియదు. ఒకళ్ల తర్వాత మరొకళ్లు వస్తూనే ఉంటారు. అప్పటికే సెల్ఫీ తీసేసుకున్నవాళ్లు కూడా ఫోటోలో సరిగ్గా పడలేదు అనుకుంటూ మళ్లీమళ్లీ వచ్చేవారు.
‘‘శంకరాభరణం’’ సినిమాలో కచ్చేరీ జరుగుతూండగా ఓ జమీందారు వచ్చి కుర్చీ జరిపి ముచ్చట్లు పెడితే శంకరశాస్త్రికి కోపం వచ్చే సీనుంది. ఆ సీనులో మనం శంకరశాస్త్రిని తప్పు పట్టలేదు. అంకితభావం ఉన్న కళాకారుడిగా అభిమానించాం. అదే పని గరికపాటి చేస్తే క్షమాపణ చెప్పాలంటున్నాం. ఎందువలన? డిస్టర్బ్ చేసినవారు స్టార్ కాబట్టా? జనం మూగడం సహజం, వారిని వారించే బాధ్యత కూడా సెలబ్రిటీకి ఉంది. సభామర్యాద పాటించడం ఎవరికైనా అవసరమే. సభకు ముఖ్యమంత్రి వచ్చినా జనం చిరంజీవినే చూస్తారు. అది తెలిసిన చిరంజీవి సాధారణంగా ఫోకస్‌లోకి రాకుండా జాగ్రత్త పడతారు. ఆయనకి ఉన్నంత పాప్యులారిటీ అవధాని గారికి లేదు. అయినా చిరంజీవి ఉపన్యాసం యిస్తూ ఉంటే ఓ మూల ఆయన చుట్టూ పదిమందిని పెట్టుకుని ఛలోక్తులు విసురుతూ సభను డిస్టర్బ్ చేయవచ్చు. ఓ అవధానే కాదు, ఓ అందమైన అమ్మాయి సభలో నిలబడి, తన దుస్తులు ఒక్కొక్కటీ విప్పడం మొదలుపెడితే వేదిక మీద ఎంత పెద్ద స్టారున్నా, ప్రజల చూపు మరలుతుంది.
ఇవన్నీ చిరంజీవికి తెలుసు కాబట్టే వెళ్లి అవధాని గారికి సర్ది చెప్పుకున్నారు. అంతటితో స్వస్తి పలికారు. కానీ నాగబాబు రంగప్రవేశం చేశారు. గరికపాటిని డైరక్టుగా విమర్శించి ఉంటే సరేలే అనుకునేవాళ్లం. కానీ ఏ పాటి.. అంటూ కవిత్వం, దానిలో అసూయ అనే ఎలిమెంటు చొప్పించడం చేశారు. అసలు వాళ్లిద్దరి మధ్య అసూయ అనే ఫ్యాక్టర్ ఎలా వస్తుంది? చిరంజీవి అవధానాలు, ప్రవచనాలలోకి వెళ్లారా? గరికపాటి యాక్టింగులోకి దిగారా? నాగబాబు మంచి పాఠకుడని, విషయపరిజ్ఞానం ఉన్నవాడనీ చెప్పుకునేవారు. ప్రజారాజ్యం పెట్టబోయే ముందు ఆయన మేధావుల సదస్సులు కూడా నిర్వహించాడు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చిందో, ఆయన నిజస్వరూపమే యిదో తెలియదు. దేని గురించైనా ఏదైనా మాట్లాడతాడు, సర్దిచెప్పుకోలేక యితరులు యిబ్బంది పడాలి. ఇదంతా మెగా ఫాన్స్ తరఫున మాట్లాడుతూ మెగా ఫ్యామిలీని రక్షిస్తున్నానని ఆయన చెప్పుకుంటాడు.
వెనకటికి ఒకడు మంచి బలం ఉంది కదాని ఓ కోతిని తన రక్షణకు పెట్టుకున్నాట్ట. అది ఒక దుడ్డుకర్ర పట్టుకుని ఎవరు అతని దగ్గరగా వచ్చినా చావబాదేదట. ఓ రోజు ఓ యీగ అతని ముక్కు మీద వాలసాగింది. కోతి విదిలించి చూసింది. ఈగ వదలకుండా అక్కడే తిరగసాగింది. చివరకు కోతికి కోపం వచ్చి దుడ్డుకర్రతో ముక్కు మీద ఉన్న ఈగకు ఒక్కటిచ్చుకుందట! అలా ఉంటుంది నాగబాబు రక్షణవిధానం. ఆయన జనసేన నాయకుడు కూడా. గోడ్సే గురించి చేసిన వ్యాఖ్యల్లాటివి చేసి పార్టీని యిబ్బందుల్లోకి నెడుతూంటాడు. పవన్‌ని, చిరంజీవిని కూడా యిరకాటంలో పెడుతూంటాడు. ఇప్పుడీ ట్వీట్ ద్వారా అభిమానులను రెచ్చగొట్టి, చిరంజీవికి ఆక్వర్డ్ పొజిషన్ తెచ్చిపెట్టాడు.
అప్పుడు బ్రాహ్మణ సంఘం తరఫున అంటూ ఒకాయన దిగాడు. సంఘం అనకుండా ఒకాయన అనడానికి కారణమేమిటంటే, ఆ సంఘం అసలుందో లేదో, తక్కిన ఆఫీసు బేరర్స్ ఎవరో, యీ ప్రకటన విడుదల చేసేముందు సర్వసభ్య సమావేశం తీర్మానం, లేదా కార్యనిర్వాహకవర్గం తీర్మానం జరిగిందో లేదో ఏమీ తెలియదు. ఒక లెటర్‌హెడ్ ఉంటే చాలు పత్రికా ప్రకటన పంపించేయవచ్చు. ఈ రోజుల్లో అయితే కంప్యూటర్ ప్రింటవుట్ చాలు. ఈ బ్రాహ్మణసంఘం పేరు ఎందుకు వాడబడాలన్నదే నాకు అభ్యంతరకరం. అసలు గరికపాటి కులం ఎందుకు ఫోకస్‌లోకి రావాలి? ఆయన్ని తిడితే బ్రాహ్మణ్యాన్ని తిట్టినట్లా? రేప్పొద్దున్న యిద్దరు బ్రాహ్మణ ప్రవచనకర్తల మధ్య పేచీ వస్తే అప్పుడీ సంఘం వాళ్లు ఏం చేస్తారు? ‘‘దేనికైనా రెడీ’’ విషయంలో అయితే బ్రాహ్మణకులాన్ని, పౌరోహిత్య వృత్తిని కించపరిచారు కాబట్టి ఆందోళన చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి నోటిదురుసుతనం గురించి వివాదం చెలరేగితే దానికి కులం రంగు పులమడం దేనికి? గరికపాటి స్కూలు పెట్టినప్పుడు అన్ని కులాల వారినీ, మైనారిటీలను కూడా ఉద్యోగాల్లోకి తీసుకున్నానని చెప్పుకున్నారు. ఆయనకు బ్రాహ్మణ గుర్తింపు ఏమీ లేదు.
ఈ మధ్యలో అనంత శ్రీరామ్ ఎందుకు మాట్లాడాలో నాకు అర్థం కాదు. ఆయన చెప్పిన గరిక కథకు సందర్భశుద్ధి ఏముంది? గరికపాటిని గరికతో పోల్చాను చూశారా అని మెగా అభిమానులను అలరించే ప్రయత్నం తప్ప! గరికపాటి స్వయంకృషితో పండితుడైన వ్యక్తి. ఎవరో మంత్రిస్తే పండితుడు కాలేదు. అనంత్ శ్రీరామ్‌కైనా అది వర్తిస్తుంది. ప్రతిభ ఆయన సంపాదించుకున్నదే. సినిమాలో పాట రాసేందుకు అవకాశం యిచ్చినవాళ్లు ఆయనను కవిని చేయలేదు. అనంత్ శ్రీరామ్, గరికపాటి, చిరంజీవి.. ఎవరి విద్వత్తు వారిదే, ఒకరి వలన మరొకరికి ఖ్యాతి రాలేదు. సమాజానికి వీళ్లందరూ కావాలి. గరికపాటి క్షమాపణ చెపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారని చదివాను. చిరంజీవి అప్పటికప్పుడే సామరస్యంగా వ్యవహరిస్తే, గరికపాటి యిప్పుడు వ్యవహరించారు.
ఇలా ప్రతీ సమస్యా ఏదో ఒక విధంగా సమసిపోతుంది. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నవాళ్లందరూ లౌక్యులే, అనవసరమైన పేచీలలో పడి సమయం వృథా చేసుకోరు. ఎలాగోలా వివాదంలోంచి బయటపడి, వేరే పని చూసుకుందా మనుకుంటారు. మధ్యలో కులసంఘాలు దూరకూడదు. గతంలో వెంగళరావు గారు ప్రతిపక్షాల ఐక్యత గురించి ‘గుడిపూడి జంగాల లాటివాళ్లు’ అని సామెత ప్రయోగిస్తే జంగాలను కించపరచారని అభ్యంతరం తెలుపుతూ జంగాల సంఘం వాళ్లంటూ ఎవరో ఓ ప్రకటన యిచ్చారు. చెప్పానుగా లెటర్‌హెడ్ ఉంటే చాలు. పబ్లిసిటీ వచ్చేస్తుంది. విజయా నిర్మాత చక్రపాణి తన పత్రికలో ‘‘పనిలేని మంగలి’’ పేరుతో ఒక శీర్షిక నిర్వహించేవారు. ఇప్పుడైతే అది కుదిరేది కాదు. ఆ కులసంఘాల వాళ్లు నిరసన తెలిపేవారు. పోనుపోను యిలాటివి ఎక్కువై పోతున్నాయి. వీటిని అరికట్టాలి.
అసలీ సంఘాల స్టాండింగు ఏమిటో ప్రకటన ప్రచురించేముందు పత్రికలు, టీవీ ఛానెళ్లు నిర్ధారించుకోవాలి. పది మంది సభ్యులు కూడా లేని కులసంఘాలు సందట్లో సడేమియాలా దూరి గుర్తింపు కోసం తాపత్రయం పడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నాగబాబు కూడా ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేస్తే ఎలా? ఆయన గుర్తింపుకేమైనా కొదవా? మెగా బ్రదర్ కావడమే కాదు, స్వయంగా నటుడు, సినీరచయిత, నిర్మాత, ఓ నటుడికి తండ్రి, రాజకీయ నాయకుడు. ఇన్ని గుర్తింపులుండి ఆయన కింకా యీ పబ్లిసిటీ యావ ఏల? తాజా వివాదంలో చిరంజీవిని అందరూ హర్షిస్తూనే, యాగీ చేశాడంటూ నాగబాబును తప్పుపట్టారు. అవసరమా యిది ఆయనకు?
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)