సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈ డైలాగు తరచు చాలా కామెడీ షో ల్లో వినిపిస్తూ వుంటుంది. ఈ రోజు సోషల్ మీడియాలో మెగాస్టార్..పూరి జగన్నాధ్ కలిసి చేసిన డిస్కషన్ వింటుంటే ఎందుకో ఈ డైలాగు గుర్తుకు వచ్చింది. ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది. గాడ్ ఫాదర్ సినిమా ను అమ్మకుండా విడుదల చేయడం అనే టెక్నిక్ ద్వారా హిట్ అనిపించుకుని సేద తీరుతున్నారు మెగాస్టార్. లైగర్ సినిమా ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు పూరి జగన్నాధ్.
గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు తొలివారం తరువాత నిలువునా జారిపోయాయి. తీసుకున్నవి అడ్వాన్స్ లు కాబట్టి వెనక్కు ఇవ్వాల్సి వస్తుంది. అది సమస్య కాదు. కానీ అంతంత మాత్రం కలెక్షన్లు అంటే మెగా నామర్దా కదా? అందుకే సినిమాను లేపే ప్రయత్నాల్లో భాగంగా యూ ట్యూబ్ లో మెగాస్టార్..పూరి జగన్నాధ్ కలిసి కాస్సేపు ముచ్చట్లు పెట్టారు.
నిజానికి ఇలాంటి వ్యవహారాలు పూరికి అంతగా సరిపడవు. కానీ ఏదో మొహమాటం. ఒకటి రెండు ప్రశ్నలు అడిగిన తరువాత మెగాస్టార్ పక్క రూట్లోకి వచ్చారు. ఏం చేస్తున్నారు. కొత్త స్క్రిప్ట్ లు ఏమైనా చేస్తున్నారా? ఫెయిల్యూర్ కు కృంగి పోకూడదు. నన్ను చూడండి. ఆచార్య ఫెయిల్యూర్ రాగానే విదేశాలకు వెళ్లి ఫుల్ గా రిఫ్రెష్ అయి వచ్చాను. గాడ్ ఫాదర్ డైరక్టర్ ను, యూనిట్ ను కూర్చోపెట్టి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసాం. రీషూట్ లు చేసాం. సక్సెస్ కొట్టాం అంటూ చెప్పుకువచ్చారు.
పాపం పూరి కూడా ఓ సినిమా తీసి ఒకె అనిపించుకుంటే అప్పుడు మెగాస్టార్ మాదిరిగానే మాట్లాడేవారేమో? ప్రస్తుతానికి ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. ఫెయిల్యూర్ ను ఎక్కువ కాలం మోయనని, ఓ నెలలో రొటీన్ లోకి రావాల్సిందే అని చెప్పారు. ఫెయిల్యూర్ వల్ల వచ్చే సమస్యలు కూడా ఏకరవు పెట్టారు.
పనిలో పనిగా ఆటో జాని స్క్రిప్ట్ ఏమైంది..వుందా..చింపేసారా? అని అడిగారు మెగాస్టార్. అది పక్కన పెట్టేసాను అని, అంతకన్నా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో వస్తానని చెప్పారు పూరి. రండి ..వెలకమ్ అసలు అందుకే ఈ డిస్కషన్ కుదరిందేమో అని కూడా అన్నారు మెగాస్టార్.
చూస్తుంటే చేతిలో వున్న రెండు సినిమాల తరువాత సినిమాను పూరి తో చేయాలని మెగాస్టార్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది.