జనసేన పార్టీ తెలంగాణలో ఉందా? లేదా? తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో సమాధి కూడా పూర్తయిందా? లాంటి సందేహాలు ఇక్కడ ప్రజలకు తాజాగా కలుగుతున్నాయి. ఇందుకు సహేతుకమైన కారణాలు కూడా ఉన్నాయి.
మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు అసలు చప్పుడు చేయడంలేదు. కనీసం తమ అస్తిత్వం ఉన్న రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయనే సంగతే తెలియనట్టుగా నాటకాలాడుతున్నాయి. కానీ తద్వారా.. తమ అస్తిత్వాన్నే తాము కోల్పోతున్నామనే సంగతిని గుర్తించలేకుండా ఉన్నాయి.
ముందు జనసేన విషయానికి వద్దాం. తెలంగాణలో ఆ పార్టీకి నాయకత్వం కూడా ఉంది. కార్యవర్గమూ, కమిటీలూ కూడా ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే.. చాలా చాలా జాతీయ దినోత్సవాల సమయంలో విజయవాడ దాకా వెళ్లే ఓపికలేని పవన్ కల్యాణ్ తెలంగాణ పార్టీ ఆఫీసులోనే ఓ కార్యక్రమం నిర్వహించేసి చేతులు దులుపుకుంటూ ఉంటారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయాలనే ఉత్సాహం పార్టీ కార్యకర్తలకు కూడా ఉంది. కానీ.. పవన్ మాత్రం చప్పుడు చేయరు. తెలంగాణ పార్టీ మీటింగులు పెట్టినప్పుడు.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేద్దాం అని ఒక డైలాగు వేస్తారు.
నిజానికి పవన్ కల్యాణ్- జనసేన అనేది ఎన్డీయేలో భాగస్వామి పార్టీనా? లేదా, ఏపీలో మాత్రం బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీనా? అనే సందేహం కలుగుతుంది ఇలాంటి సందర్భాల్లో! ఎందుకంటే.. పవన్ మాత్రం.. తమ పార్టీ ఎన్డీయేలో భాగస్వామి అని చెప్పుకుంటూ ఉంటారు. అలాగైతే ఆ భాగస్వామ్యం తెలంగాణకు కూడా వర్తించాలి. అలా జరగడం లేదు.
ఇక్కడ జనసేనను బిజెపి గడ్డిపోచలాగా తీసిపారేస్తుంది. ఏపీలో అయినా నెత్తిన పెట్టుకుంటుందని చెప్పలేం. కానీ.. కనీసం మా భాగస్వామి పార్టీ అని అంటూ ఉంటుంది. అలాంటి జనసేన మునుగోడు ఎన్నిక విషయంలో చప్పుడు చేయడం లేదు.
ఇక తెలుగుదేశం సంగతి ఇంకా ఘోరం. ఆ పార్టీ తెలంగాణ సారథి బక్కని నర్సింహులు.. మునుగోడులో పోటీచేయడానికి ఉత్సాహపడుతున్న ఓ నాయకుడిని కూడా వెంటబెట్టుకుని వెళ్లి చంద్రబాబును కలిశారు. తెలంగాణలో తమ పార్టీకి అంతో ఇంతో దిక్కూ మొక్కూ ఉన్నదని చాటుకోవాలనే కోరిక ఉంటే.. అంతకంటె కావాల్సిందేముంది. అయినా చంద్రబాబు ఇప్పటిదాకా చప్పుడు చేయడం లేదు. ఈనెల 14తో నామినేషన్ల పర్వం ముగుస్తుంది.
చూడబోతే ఈ రెండు పార్టీలూ బిజెపి డైరక్షన్ లోనే నడుస్తున్నాయనే సంగతి ఎవ్వరికైనా అర్థమైపోతుంది. పోటీచేస్తే.. యాంటీ కేసీఆర్ ఓటు చీలి.. బిజెపి విజయావకాశాలపై ప్రభావం పడుతుంది గనుక.. వారు పోటీకి దిగడం లేదని తెలుస్తుంది. జనసేన ఆల్రెడీ బిజెపికి దాసోహం గనుక.. వారి సంగతి ఓకే.. చంద్రబాబుకు ఏమైంది.. ముందుముందు వారికి దాసోహం కావడానికి ఇప్పటినుంచే పోటీకి దిగకపోవడం ద్వారా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారా? అనే అనుమానమూ కలుగుతుంది.