ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది కేవలం అమరావతిలో మాత్రమే ఉండాలి.. రాజధాని అనే ట్యాగ్‌లైన్ కింద జరిగే అభివృద్ధి ఏదైనా ఉంటే అది మొత్తం అమరావతిలో మాత్రమే జరగాలి.. మరెక్కడా జరగడానికి వీల్లేదు అనే ఎజెండాతో కొంతమంది ప్రస్తుతం అక్కడినుంచి అరసవెల్లి దాకా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పైకి చెప్పుకున్నంత వరకు.. ఈ అరసవెల్లి యాత్రకు ఎన్ని రంగులు అయినా పులమవచ్చు గాక.. ఈ యాత్ర వెనుక ఉన్న అసలు రంగు పచ్చదనం మాత్రమే అనే సంగతి అని అందరికీ తెలుసు.
ఆకుపచ్చ కండువాలు భుజాల మీద వేసుకుని నడిచిన ప్రతి ఒక్కరూ రైతు అయిపోరు. అలాగే.. కండువాలు వేసుకోకపోయినంత మాత్రాన వారంత తెలుగుదేశం పార్టీ తొత్తులు, పెయిడ్ ఆర్టిస్టులు కాకుండా పోరు! కానీ ప్రచారం మాత్రం ప్రతినిత్యం ‘అమరావతి రైతుల పాదయాత్ర’ అనే పేరుతో చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రచారం చేసేది కూడా పచ్చమీడియా మాత్రమే అనేది వేరే సంగతి.
ఈ పాదయాత్రను వెనుకనుంచి చంద్రబాబునాయుడు డైరక్షన్ లో తెలుగుదేశం పార్టీ దళాలే నడిపిస్తున్నాయనేది రాష్ట్రంలో పసిపిల్లవాడిని అడిగినా చెబుతారు. కానీ పైకి ఎక్కడా తెలుగుదేశం రంగు కనిపించదు. చంద్రబాబునాయుడు చాలా అరుదుగా మాత్రమే అమరావతి రైతుల ఉద్యమంలో పాల్గొంటారు. కానీ.. యాత్ర సాగుతోంటే.. ఎక్కడికక్కడ లోకల్ గా వారికి కావాల్సిన వసతి, తదితర ఏర్పాట్లు మొత్తం తెలుగుదేశం నాయకులే చేపడుతుంటారు.
పార్టీలు విధాన పరంగా నిర్ణయం తీసుకున్నాయి గనుక.. బిజెపి, వామపక్షాలు, జనసేన లాంటి వాళ్లు మొక్కుబడిగా ఒక బ్యానర్ పట్టుకుని వచ్చి కాసేపు యాత్రలో పాల్గొని, ఫోటోలు దిగి తరవాత ఇళ్లకు వెళ్లిపోతుంటారు. కానీ.. యాత్రకు అవసరమైన సకల ఏర్పాట్లు, ఖర్చులు చూస్తున్నది మాత్రం తెలుగుదేశం వాళ్లే. ఈ సంగతి స్థానికంగా పరిశీలించిన వారికి అర్థమవుతుంది. ఆ రకంగా.. తమ చేతికి మట్టి అంటకుండా, యాత్రకు తెలుగుదేశం రంగు అంటకుండా.. తెలుగుదేశం పార్టీ చాలా అతి తెలివిగా దీనిని నడిపిస్తూ ఉంది.
సదరు పాదయాత్ర ప్రస్తుతం తణుకు వరకు వెళ్లింది. తణుకులో నానా రభస అయిపోయింది. స్థానికులు యాత్రను వ్యతిరేకిస్తూ గుమికూడి నినాదాలు చేయడం. ప్లకార్డులు, బ్యానర్లు ఏర్పాటు చేయడం, నినాదాలు నిరసనలు జరిగాయి. స్థానిక ప్రజల మద్దతు లేకుండా ఇలాంటి నిరసనలు జరగవనేది నిజమే కావొచ్చు.. కానీ దానికి స్వయంగా వారు వైసీపీ రంగు పులుముకున్నారు.
ఏర్పాటు చేసిన బ్యానర్లలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఫోటో పెట్టి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం అంటూ క్లెయిం చేసుకున్నారు. నినాదాలు చేసే మహిళలు.. మధ్యమధ్యలో జై జగన్ అంటూ నినదించారు. ఈ తరహాలో జరిగే సరికి వ్యవహారం.. వైసీపీ ప్రేరేపిత నిరసనలాగా తయారైంది. జై జగన్ నినాదాలు, బ్యానర్ల మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు లేకపోతే చాలు.. ఇది స్థానిక ప్రజలు వెలిబుచ్చుతున్న నిరసనగా చెప్పుకోడానికి వీలుండేది. కానీ.. వైసీపీ వారికి అంత తెలివి లేకుండా పోయింది.
ఒకవైపు తెలుగుదేశం గుట్టుచప్పుడు కాకుండా.. అమరావతి యాత్రను మొత్తం స్పాన్సర్ చేస్తూ.. ముద్ర తమ మీద పడకుండా జాగ్రత్తగా ఉంటే, వైసీపీ మాత్రం చిన్న చిన్న కార్యక్రమాలకే పార్టీ రంగు పులుముతూ రాద్ధాంతం చేయడం.. వైసీపీ నాయకుల్లో తప్ప ప్రజల్లో యాత్ర పట్ల పెద్దగా వ్యతిరేకత లేదనే ప్రచారం పుట్టడానికి ఆస్కారం ఇచ్చేలా ఉంది.