ఉత్తరాంధ్రాలో గర్జన పేరుతో ఉద్యమానికి రంగం సిద్ధం అయింది. విశాఖ రాజధాని కావాలని ఆయా జిల్లాలలో వెనకబాటుతనం పోవాలని జనాలు కోరుకుంటున్నారు. దాంతో వికేంద్రీకరణ దిశగా జనాలు ఆలోచనలు నెమ్మదిగా మళ్ళుతున్న నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేస్తోంది.
ఈ నెల 15న విశాఖ గర్జన జరుగుతూంటే అదే రోజు అర్జంటుగా అచ్చెన్నాయుడు ఆద్వర్యాన ఉత్తరాంధ్రా టీడీపీ మీటింగ్ పెట్టడం వెనక ఆంతర్యం ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. చంద్రబాబు అయితే సేవ్ ఉత్తరాంధ్రా అంటూ పిలుపు ఇచ్చారు. ప్రజల తరఫున నిలబడాలని ఆయన ఉత్తరాంధ్రా పార్టీ నేతలను కోరుతున్నారు.
అయితే సేవ్ ఉత్తరాంధ్రానా లేక సేవ్ టీడీపీనా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మరో వైపు అయితే ప్రాంతీయ చిచ్చు వైసీపీ రాజేస్తోంది అని అచ్చెన్నాయుడు అంటున్నారు. అమరావతి రాజధానిని కడితే ఎక్కడ చంద్రబాబుకు పేరు వస్తుందో అన్న అక్కసుతోనే జగన్ సర్కార్ ఇలా మూడు ముక్కలాట ఆడుతోందని ఆయన ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
అయితే ఉత్తరాంధ్రాలో ఉద్యమ అలజడిని చూస్తే అచ్చెన్నలో ఈ రకమైన ఆక్రోశం బయటకు వస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్రాకు తమ హయాంలో చేసిందేమీ లేని టీడీపీ ఇపుడు మాత్రం విశాఖ రాజధాని మీద విమర్శలకు దిగుతోందని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఉత్తారాంధ్రా మీద టీడీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. కంచుకోట లాంటి జిల్లాలు విశాఖ రాజధానికి జై అంటే సైకిల్ పార్టీకి బహు కష్టమే సుమా అంటున్నారు.