టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు భలే విచిత్రమైన క్యారెక్టర్. ఏం మాట్లాడుతుంటారో ఒక్కోసారి ఆయనకే తెలియదు. తాజాగా తనను తాను తిట్టుకున్నారు. తప్పులన్నీ చేసి, ఎదుటి వాళ్లపై రుద్దడం టీడీపీ నేతలకి వెన్నతో పెట్టిన విద్య. రాజధాని ఎంపికలో టీడీపీ చాలా తప్పులు చేసింది. రాజధాని ఎంపిక కోసం నాటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీని కాదని, సొంత కమిటీ నియమించుకుని అడ్డంగా దొరికిపోయింది.
కానీ తప్పుల్ని ఒప్పుకోడానికి టీడీపీ నేతలకు మనసు రావడం లేదు. ఇవాళ మూడు రాజధానుల ఏర్పాటుకు, గతంలో తమ ప్రభుత్వం చేసిన తప్పులే కారణమని టీడీపీ నేతలు గ్రహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అచ్చెన్నాయుడు శివరామకృష్ణన్ కమిటీపై పచ్చిగా బొంకడం విమర్శలకు దారి తీసింది.
ఆయన మీడియాతో మాట్లాడుతూ…అమరావతికి అసెంబ్లీ సాక్షిగా జగన్ మద్దతు ఇచ్చారన్నారు. నేడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జగన్ అండ్ కో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. శివరామకృష్ణన్ నివేదికను సిగ్గులేకుండా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణన్ నివేదికపై అచ్చెన్నాయుడు ఇంత పచ్చగా అబద్ధాలు చెప్పడమా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసలు ఆ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకుని వుంటే ఇప్పుడీ సమస్యలు ఉత్పన్నమయ్యేవే కాదు. వివిధ రంగాల్లో నిపుణులైన వ్యక్తులతో నాటి కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని వేసింది. దాన్ని కాదని నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి, ఇష్టానుసారం రాజధానిపై నిర్ణయం తీసుకోవడం వాస్తవం కాదా? శివరామకృష్ణన్ నివేదికను టీడీపీ ప్రభుత్వం ఎక్కడ పాటించిందో అచ్చెన్నాయుడు చెప్పగలరా? ఇప్పుడు సమస్య నుంచి తప్పించుకునేందుకు తప్పుడు మాటలు చెప్పడం అచ్చెన్నకే చెల్లింది.