బిసిల సామాజిక వెనకబాటుతనం అనేది నేను అర్థం చేసుకోలేని విషయం. నాకు చిన్నప్పటి నుంచి ఆ కులాల స్నేహితులుండేవారు. అది తక్కువ కులం అని వాళ్లు కానీ, తక్కినవాళ్లు కానీ ఎన్నడూ భావించలేదు. మీరెంతో మేమూ అంతే అన్నట్లుండేవారు. ఈ బిసి క్లాసిఫికేషన్ వచ్చాక, చెప్పుకోవడానికి వారికీ సిగ్గుగా వుంటోంది. రిజర్వేషన్ కోసం బిసి కార్డు వాడాలి తప్ప, వారి భావనలలో కానీ, ప్రవర్తనలో కానీ ఎక్కడా వెనకబాటుతనం కనబడదు. ఎస్సీ కులాల్లో డబ్బున్నవాళ్లు తక్కువగా కనబడవచ్చు కానీ, బిసి కులాల్లో డబ్బున్నవాళ్లు, అధికారులు, వ్యాపారస్తులు చాలామంది వున్నారు. ధనిక, పేద వ్యత్యాసాలుండడం అన్ని కులాల్లోనూ వుంది. పేదరికం ఆధారంగా సహాయం చేస్తానంటే ఎవరూ అభ్యంతర పెట్టలేరు. వాళ్లు ట్యూషన్లు పెట్టించుకోలేరు, అందుకని ప్రభుత్వమే వారికి ఉచితంగా ఎక్‌స్ట్రా క్లాసులు పెట్టి చదివించి, యితరులతో పోటీపడే స్థాయికి తెస్తుంది అంటే సరే, మంచిదే అంటారు తక్కినవాళ్లు. కానీ కులం పేరు చెప్పి డబ్బున్న వాళ్లకూ కట్టబెట్టేస్తూ వుంటే కడుపుమంట పెరుగుతోంది.
ఆ కడుపుమంటతోనే ‘వాళ్లేనేమిటి, మేం కూడా వెనకబడిన వాళ్లమే’ అనే నినాదాలు అందుకుంటున్నారు. విడిగా మాట్లాడితే ‘మీ గొప్పేమిటి, మాదీ పెద్ద కులమే’ అంటారు. కానీ రిజర్వేషన్ సౌకర్యం అనుభవించాలనే ఆశ పుడితే మాత్రం, సామూహికంగా ఉద్యమం లేవదీసి ‘మాది యితరుల కంటె వెనకబడిన కులం’ అని చాటి చెప్పుకుంటున్నారు. ఇది నాకు వింత గొలుపుతుంది. ఏ కులాలు వెనకబడ్డాయి అని తేల్చడానికి ఆర్థికంగా అయితే కొలబద్ద వుంది, కానీ సామాజిక గౌరవానికి కొలబద్ద ఏముంది? మీతో అవసరం వున్నవాడు మిమ్మల్ని గౌరవిస్తాడు. అవసరం తీరిపోయినవాడు, మీరు తనకు అడ్డు వస్తున్నారనుకున్నవాడు మీతో పాటు మీ కులాన్నీ తిడతాడు.
పైగా చేసే వృత్తిని బట్టి కూడా గౌరవం మారుతుంది. బ్రాహ్మణుడు పురోహితుడిగా వస్తే మీరంటాం, వయసులో చిన్నవాడైనా కాళ్లకు దణ్ణం పెడతాం. అతనే గుమాస్తాగానో, వంటవాడిగానో వస్తే పెట్టం. నువ్వు అంటాం. పాలేరు వృత్తిలో వున్నవాణ్ని రా, పో అంటాం. అదే కులానికి చెందిన ప్రొఫెసర్‌ను ‘సర్’ అంటాం. మీరు చిన్న కులం అనుకున్నవాడు కూడా ఆత్మగౌరవంతో, తన కులం పట్ల అభిమానంతో వుంటాడు. దాదాపు 5 వేల బిసి కులాలున్నాయి. వీరిలో మనకు యింటరాక్షన్ వున్నదెంతమందితో? వారి పట్ల, వారి కులం పట్ల గౌరవమో, అగౌరవమో ఏర్పరచుకునే సందర్భాలేముంటాయి? మరి వారందరినీ యితరులు చిన్నచూపు చూసేస్తున్నారని ఎలా అనగలరు?
అయినా మర్యాదో, అమర్యాదో అనేది బైటకి వెలువరించినప్పుడు కదా తెలిసేది. మనం మాటద్వారా అవమానిస్తే పరువునష్టం దావా వేసే సావకాశం ఎలాగూ వుంది. ‘అబ్బే, పైకి అనకపోయినా వాడి మనసులో మా కులంపై న్యూనతాభావం వుందండి. అందువలన మేం సామాజికంగా వెనకబడినవాళ్లమే’ అని వాదించి సాధిస్తున్నారు వీళ్లు. ఒకసారి జగ్‌జీవన్ రామ్‌ను అడిగారు రిజర్వేషన్లు ఎంతకాలం కొనసాగాలి? అని. ‘ఒక బ్రాహ్మణ వంటవాడు, తను దళిత కలక్టరు కంటె గొప్పవాణ్నని ఫీలవుతాడు. ఆ భావం పోయేవరకు రిజర్వేషన్ కొనసాగాల్సిందే’ అని జవాబిచ్చారు. ఆ ఫీలింగనేది వ్యక్తిగతం. ఎవడికి వాడు గొప్పవాడిగా ఫీలవకపోతే లోకమే నడవదు. ఇప్పుడున్న సినీహీరోలు నా ముందు దిగదుడుపు అనుకోకపోతే ఎవరైనా కొత్త హీరోలు వస్తారా? గ్రేటాంధ్రా ఛాన్సిస్తే ఎమ్బీయస్‌గాడి కంటె బాగా రాస్తాను అనుకోకపోతే కలం పట్టే ఉత్సాహం మీకు ఎప్పటికైనా కలుగుతుందా?
ఇతరులతో పోల్చుకునేటప్పుడు ఏదో ఒక విధంగా తను గొప్పవాణ్నని ప్రతీవాడూ అనుకుంటాడు. అక్షరమ్ముక్క రానివాడు ‘నాకు చదువు లేకపోయినా, సంస్కారం వుంది’ అనుకుంటాడు. డబ్బులేనివాడు ‘డబ్బుదేముంది? కుక్కను కొడితే రాలుతుంది’ అని అనుకుంటాడు. అందవిహీన ‘బ్యూటీ యీజ్ ఓన్లీ స్కిన్‌డీప్’ అని తీసిపారేస్తుంది. ‘‘అగ్నిసాక్షి’’ సినిమాలో నానా పటేకర్ డైలాగు గొప్పగా వుంటుంది. ‘‘మీరు గొప్పవారైనంత మాత్రాన నేను చిన్నవాణ్నయిపోను.’’ అని. బుడుగు చెప్పినట్లు ‘వాడంతటివాడు వాడు, నా అంతటివాడు నేడు.’! ఆ వంటవాడు తనను తాను హీనంగా చూసుకునే రోజు రావాలంటే అది ఎప్పటికీ రాదు. అందువలన ఎవరికి వారే, మా కులానికి వచ్చిన లోటేముంది? అనుకోవాలి తప్ప యితరుల మనసులో భావాలను బట్టి, మాది వెనకబడినది అనుకుని కించపరచుకోవడం అసమంజసం.
ఆర్థిక, వాణిజ్య, రాజకీయ రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తున్న జాట్లు, పటేళ్లు, మరాఠాలు మేం వెనకబడినవాళ్లం అని చెప్పుకుంటూ వుంటే చెయ్యి గిల్లి చూసుకోవలసి వస్తోంది. హీనంగా చూస్తే తాట తీయగల సత్తా వున్నవాళ్లు వీళ్లు. మన దగ్గర కాపులు మాత్రం! కాపులు వెనకబడిన వాళ్లేమిటండీ, ఊళ్లలో మునసబులుగా చేసేవాళ్లే వెనకబడినవాళ్లం అని చెప్పుకుంటే యిక మామూలు వాళ్ల మాట ఏం చెప్పాలి? అసలీ కాపు పదమే ఓ మిస్టరీ. రాయలసీమ రెడ్లలో చాలామంది కాపులే. వాళ్లూ వెనకబడ్డారంటూ రిజర్వేషన్ యిచ్చేస్తే యిక నిజమైన చిన్న కులాల వారికి దక్కేదేముంది? రిజర్వేషన్‌పై నా ఆర్టికల్ చదివి ఒకాయన ‘చిన్న కులం’ అని రాయకండి అని మెయిల్ రాశారు. అగ్రకులానికి ఆపోజిట్ నిమ్నకులం. దాని బదులు పెద్ద, చిన్న అని రాశాను.
గతంలో ఫార్వార్డ్ కాస్ట్‌ను ఎఫ్‌సి అని రాసేవారు. తర్వాత దాన్ని ఒసి (అదర్ కాస్ట్‌స్) అని మార్చారు. మరి బిసిల విషయంలో తెలుగులో వెనకబడిన కులాలు అని రాస్తూ పోవాలి. హిందీలో పిఛ్డే.. అనే రాస్తారు. దాని కంటె ‘చిన్న’ పదం బెటర్ కాదూ! గతంలో ఇండియా వంటి దేశాలను బాక్‌వర్డ్ కంట్రీస్ అనేవారు. మనవాళ్లు ‘అది బాగాలేదు, డెవలపింగ్ కంట్రీస్’ అనండి అని మార్పించుకున్నారు. ఇప్పుడీ బిసిలు కూడా ‘డెవలపింగ్ కాస్ట్‌స్’ అని మార్పించుకుంటే అదే వాడవచ్చు. కానీ డెవలపింగ్ అనే పదం ఒప్పుకుంటే, కొన్నాళ్లయిన తర్వాత డెవలప్ అయిపోయారు కదా, రిజర్వేషన్ తీసేస్తాం అంటారేమోనని బిసి నాయకులు ఆ పదం వాడనివ్వరు. 30 ఏళ్లలో ఏ కులమైనా మేం బాక్‌వర్డ్ నుంచి ముందుకు వచ్చేశాం, యిప్పుడు మేం ఫార్వార్డ్ అయ్యాం అని అన్నదా చెప్పండి.
కొన్ని కులాలకు రిజర్వేషన్ యివ్వాలని నిర్ణయించడంతో బాటు ఎంత శాతం యివ్వాలి అనేది ముఖ్యమైన ప్రశ్న. జనాభా ప్రాతిపదికన యివ్వాలి అనే రూలు పెట్టుకున్నారు. దీనిలోనే ఒక పేచీ వుంది. ఆర్థిక పరమైన పెరామీటరు కూడా వున్నపుడు ఆ కులం జనాభాలో ఆర్థికంగా వెనకబడినవారి శాతం యింత అని నిర్ణయించి, ఆ ప్రకారం యివ్వాలి కదా! అసలు దానిదాకా పోనిస్తే కదా! ఒక కులం జనాభా యింత అని తేలనివ్వడానికే పార్టీలు ఒప్పుకోవటం లేదు. సెన్సస్ తీసుకున్నపుడు అన్ని వివరాలూ సేకరిస్తే అప్పుడు సమాజస్వభావం గురించి ఒక ఐడియా వచ్చి భవిష్యత్ ప్రణాళికలు దానికి అనుగుణంగా రూపొందించవచ్చు. కానీ ఎవరికీ ఆ ఉద్దేశం లేదు. ఏ కులానికి ఆ కులం మేము జనాభాలో యింత శాతం అని చెప్పేసుకుంటున్నారు. ఇతర కులాల వారిని కూడా కలిపేసుకుని, వాళ్లు మా ఉపకులమే అని చెప్పుకుని నంబరును బూస్ట్ చేస్తున్నారు. అలా కొన్ని కులాలు మూడు, నాలుగు కులాల జాబితాల్లో కనబడవచ్చు. ఓ సారి ఎమ్జీయార్ యిలాగే బిసి నాయకులందరినీ ఒకరొకరిగా రప్పించి, లెక్కలు చెప్పమన్నాడు. వాళ్లిచ్చిన అంకెలన్నీ కూడితే ఒక్క బిసిలే 200% దాటిపోయారు.
ఏ కులం వాళ్లు ఎంత శాతం వున్నారో తెలియకుండానే యిన్నేళ్లూ బిసి రిజర్వేషన్ అమలు చేసేస్తూన్నారంటే వింతగా వుంటుంది కదా! ఎస్సీల విషయంలో అయితే సెన్సస్‌లో వారిని విడిగా గణిస్తున్నారు. బిసిలది మాత్రం ముసుగేసి వుంచుతున్నారు. ఇప్పటికైనా యీ ముసుగు తొలగించాలా వద్దా? ఎప్పుడో 70 ఏళ్ల క్రితం 1931లో బ్రిటిషు వారి హయాంలో కులవారీ జనగణన జరిగింది. దాని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో కలిసిన అవిభిక్త భారతంలో బిసిలు జనాభాలో 52% వున్నారు. ఆ తర్వాత కొన్ని వర్గాల్లో కుటుంబ నియంత్రణ పాటించారు, కొన్నిటిలో సరిగ్గా పాటించలేదు. అందువలన ఆ శాతాలు యిప్పటికీ అలాగే వున్నాయని అనుకోలేము. స్వాతంత్ర్యం వచ్చాక 1953లో కాకా కాలేకర్ కమిషన్ వేసి ఏయే కులాలను బిసిలగా పేర్కొనవచ్చు, వారి జనాభా ఎంత అని అంచనా వేయమన్నారు. ఆయన 2,399 కులాలను బిసిలుగా అనవచ్చు, వారి కోసం ప్రభుత్వోద్యోగాల్లో 70% రిజర్వేషన్ యిస్తే మంచిది అని సూచించాడు. అలా అయితే ఉద్యోగాలన్నీ ఎస్సీలకు, బిసిలకే యివ్వవలసి వస్తుంది. ఇతర మతస్తులకు, హిందువుల్లో యితర కులాలకు ఏమీ మిగలవు అని భయపడి ప్రభుత్వం ఆ నివేదికను అటక మీద పడేసింది.
1978లో మొరార్జీ ప్రధానిగా జనతా ప్రభుత్వం యిదే పని మీద బిపి మండల్ ఆధ్వర్యంలో మండల్ కమిషన్‌ను నియమించింది. ఆయన నివేదిక తయారుచేసి యిచ్చేసరికి 1980 వచ్చింది. జనతా ప్రభుత్వం పడిపోయి కాంగ్రెసు అధికారంలోకి వచ్చి, దాన్ని మూల పడేసింది. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినపుడు కపటమార్గంలో ప్రధాని ఐన విపి సింగ్, ప్రజల్లో తనకు బలం లేదు కాబట్టి, తనకంటూ ఒక ఓటు బ్యాంకుని నిర్మించుకోవాలని అనుకుని, ఏ చర్చా లేకుండానే యీ మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో దేశం భగ్గుమంది. మండల్ వ్యతిరేక ఆందోళనలు మిన్నుముట్టాయి. హిందువులందరూ బిసి, నాన్-బిసి వర్గాలుగా చీలిపోతూండడం చూసి వారిని సంఘటితం చేయకపోతే తమకు రాజకీయ భవిష్యత్తు లేదని బిజెపి రామమందిరం అంశాన్ని ముందుకు తేవడానికి రథయాత్ర మొదలుపెట్టింది. ఈ పోరాటాన్ని మండల్ వెర్సస్ కమండల్‌గా పిల్చారు.
ఇంతకీ మండల్ ఏం చెప్పాడు? దేశంలో 3,743 బిసి కులాలున్నాయి, వారి శాతం జనాభాలో 52 వుండవచ్చు. అయితే 52% రిజర్వేషన్ అంటే బాగుండదు కాబట్టి 27% యివ్వండి అన్నాడు. మండల్ తన నివేదన శాస్త్రీయంగా చేశారా లేదా అన్నదానిపై అప్పట్లో వ్యాసాలు వచ్చాయి. ఒక్కో రాష్ట్రంలో 2,3 రోజులుండి ఎవరేం చెప్తే దాన్ని రాసుకుని పోయాడట ఆయన. గుళ్లో పూజారులుగా పనిచేసే బ్రాహ్మణులు వైదికశాఖకు చెందివారై వుంటారు. నాకు గుర్తున్నంతవరకు ఆయన వాళ్లను కూడా బిసిలుగా సిఫార్సు చేశాడు. ఆయన ప్రకారం బ్రాహ్మణులు కూడా సామాజికంగా వెనకబడ్డారన్నమాట! శహభాష్! ఆర్థికంగా అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ సామాజికంగా కూడానా!? అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ వర్గానికి బిసి స్టేటస్ వుండి వుండదు. ఎందుకంటే ఎన్టీయార్ మురళీధరరావు అనే ఆయన నేతృత్వంలో వేరే కమిషన్ వేసి, దాని రిపోర్టును అంగీకరించినట్లు 1984లో ప్రకటించారు.
బిసి కులాల సంఖ్యను చూడండి, 1953 నుంచి 1978 వచ్చేసరికి 1300 కులాలు కొత్తగా వచ్చి బిసిల్లో చేరాయి. 2006 వచ్చేసరికి అది 5013 అయ్యాయి. మన దేశప్రగతి దీనిలోనే కనబడుతోంది. కులాలనేవి కొత్తగా పుట్టవు కదా. ఉన్న కులాలే మేం వెనకబడ్డామంటే, మేమూ పడ్డాం అంటూ యీ జాబితాలో చేర్పించేసు కున్నాయన్నమాట. పరుగుపందెంలో ఎవరైనా ముందుకు పరిగెడతారు, కానీ దీనిలో వెనక్కి పరిగెట్టడం కనబడుతుంది. దీన్ని శాశ్వతం చేయడానికై 1993లో షెడ్యూల్ కాస్ట్స్ అండ్ ట్రైబ్స్‌కై కమిషన్ వున్నట్లే నేషనల్ కమిషన్ ఫర్ బాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్‌సిబిసి) అనే పేర ఓ పర్మనెంట్ స్టాచ్యుటరీ బాడీని ఏర్పాటు చేశారు.
1991లో సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లు 50%కి మించి వుండకూడదు అని క్యాప్ పెట్టింది. దాన్ని ఎత్తివేయాలని బిసి సంఘాలు ఆందోళన చేస్తూంటాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, తమ రాష్ట్రాలలో బిసిల సంఖ్య ఎక్కువ కాబట్టి ఆ పరిమితి తమకు వర్తింపచేయకూడదని వాదిస్తూ వుంటాయి. ఆ ఎక్కువ ఎంత ఎక్కువో, అసలు ఎక్కువ అవునో కాదో నిరూపించే ప్రయత్నాలు మాత్రం చేయవు. బిసిల ఓట్లు కావాలి కాబట్టి అడుగుతూనే వుంటాయి. తమిళనాడు తమ రిజర్వేషన్‌ను 69%కి పెంచి, దాన్ని యీ పరిధిలోకి రాకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించేసుకుంది. మరో నాలుగైదు రాష్ట్రాలు అవే పని చేశాయి. వాటిని చూపించి మీరూ అదే చేయవచ్చుగా అని తక్కిన రాష్ట్రాలలోని బిసిలు ఉద్యమాలు చేస్తూంటారు.
2001లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒబిసిలు ఎంతమంది ఉన్నారో సెన్సస్‌ద్వారా తెలుసుకుందాం అని ప్రతిపాదించాడు. కానీ అప్పటి వాజపేయి ప్రభుత్వం అది పడనివ్వలేదు. అప్పణ్నుంచి గత 20 ఏళ్లగా బిజెపి, కాంగ్రెసు, వాళ్ల ఎన్‌డిఏ, యుపిఏ కూటముల్లో భాగస్వామ్య పక్షాలూ యిదే డ్రామా ఆడుతూ వచ్చాయి. 2010లో యుపిఏ ప్రభుత్వం జనరల్ సెన్సస్ అక్కరలేదు కానీ సోషియో ఎకనమిక్ కాస్ట్ సెన్సస్ (ఎస్‌ఇసిసి) జరిపిద్దామంటూ చేయించింది. అనేక శాఖలు ఆ ప్రక్రియలో పాలుపంచుకున్నాయి. రిపోర్టు తయారయ్యాక దాన్ని యుపిఏ బయటపెట్టలేదు. 2014లో స్వయంగా బిసి ఐన మోదీ అధికారంలోకి వచ్చారు. 2015లో రిపోర్టులోని సోషియో-ఎకనమిక్ డేటా మాత్రం విడుదల చేశారు. కానీ కులాల గురించిన డేటా మాత్రం తొక్కిపెట్టేశారు, దానిలో డిస్క్రపాన్సీస్ (పొరపాట్లు) ఉన్నాయి, సరి చేయాలి అంటూ సాకు చెప్పారు. ఆ సరిచేయడం యిప్పటికీ కాలేదు. 2018లో హోం మంత్రి రాజనాథ్ సింగ్ ఒబిసి గణన చేయిస్తామన్నారు. కానీ 2021 సెన్సస్ వచ్చేసరికి అబ్బే చేయించం పొమ్మంటోంది బిజెపి ప్రభుత్వం. చేయించమని కోరినవారిలో ఎన్‌సిబిసి, ఒబిసి సంక్షేమంపై వేసిన పార్లమెంటరీ కమిటీ, సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ, రాజస్థాన్ ప్రభుత్వం, ఒడిశా, మహారాష్ట్ర అసెంబ్లీలు ఉన్నాయి. అయినా ససేమిరా అంటోంది కేంద్రం. ఎందుకు? 2011 నాటి కాస్ట్ డేటా బయటపెట్టడం లేదంటేనే దాని అర్థం – ఆ వాస్తవాలను అంగీకరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవనేగా!
కేంద్రమే కాదు, రాష్ట్రాలలో కూడా యిలాటి మాయలు జరిగాయి. కర్ణాటకలో 2014లో సిద్ధరామయ్య కాంగ్రెసు ప్రభుత్వం బాక్‌వర్డ్ క్లాసెస్ కమిషన్ చేత ఎస్‌ఇసిసి జరిపించింది. 2016లో ఆ కమిషన్ రిపోర్టులో కొంతభాగం లీక్ అయింది, ‘రాజకీయంగా బలవంతులైన లింగాయతులు, వొక్కళిగల జనాభా శాతం వారు చెప్పినంత లేదుట’ అని. దాంతో వాళ్లు గొడవ మొదలుపెట్టారు. రిపోర్టు బయటకు వస్తే చాలా యిబ్బంది వచ్చేట్టుందని భయపడిన ప్రభుత్వం ‘అబ్బెబ్బే, మేం యింకా ఫైనల్ ఫిగర్స్ వర్కవుట్ చేయలేదు’ అని కమిషన్ చేత చెప్పించి, రిపోర్టుని దాచేసింది. అప్పుడు ప్రతిపక్షంలో వున్న బిజెపి కమిషన్ రిపోర్టు బహిర్గతం చేయాలి అని డిమాండ్ చేసింది. ఇప్పుడు తను అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా బయటపెట్టడం లేదు. మధ్యలో అధికారం చెలాయించిన జెడిఎస్ కూడా బయటపెట్టలేదు. ఈ ఏడాది మొదట్లో లింగాయతుల్లో ఉపకులమైన పంచమశాలి కులం వారు తమను బిసిల్లో 2ఎ కేటగిరిలో చేర్చాలని ఆందోళన మొదలుపెట్టారు. ఇలాంటి డిమాండ్లు వస్తూనే వుంటాయి. లెక్కలేవీ లేవు కాబట్టి వారు చెప్పిన అంకెను ప్రభుత్వం ఒప్పుకోవలసినదే.
బిసిలు ఎవరు అని తేల్చవలసినది ఎవరు అనే విషయం కూడా ఓ పట్టాన తేలటం లేదు. గతంలో రాష్ట్రాలు నిర్ణయించేవి. తర్వాత కేంద్రం ఆ హక్కును తన చేతిలోకి తీసేసుకుంది. ఇక అప్పణ్నుంచి రాష్ట్రాలు నాటకాలు ఆడడం మొదలుపెట్టాయి. మేం మీకు రిజర్వేషన్ యిచ్చేసి, కేంద్రానికి సిఫార్సు చేసేశాం. కానీ వాళ్లే అంగీకరించటం లేదు అని. ఆంధ్రలో కాపు రిజర్వేషన్ విషయంలో చంద్రబాబు యిలాగే చేశారు. మహారాష్ట్ర మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడంపై వేసిన కేసులో ఈ మే నెలలో సుప్రీం కోర్టు అది కేంద్ర పరిధిలో వున్న అంశం కదా, మీరెలా నిర్ణయిస్తారు? అని రాష్ట్రాన్ని అడిగి కేసు కొట్టి పారేసింది. ఇది కేంద్రం గమనించింది. రాష్ట్రాలు తమను దోషిగా నిలబెడుతున్నాయని గమనించి ఈ ఏడాది ఆగస్టులో రాజ్యాంగానికి 127వ సారి సవరణ చేసి, బిసి జాబితా తయారుచేసే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టేసింది. రాష్ట్రాల హక్కులను గుంజుకోవడానికి అలవాటు పడిన కేంద్రం, యీ విషయంలో మాత్రం వేరేలా ప్రవర్తించడానికి కారణం – ఒబిసి రిజర్వేషన్‌ల తలనొప్పి!
సెన్సస్ మాత్రం కేంద్రం పరిధిలోనే వుంటుంది. అందుచేత ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఈసారి కులగణన చేయం అని జులై20న రాజ్యసభలో హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ప్రకటించారు. కారణం ఫలానా అని చెప్పలేదు కాబట్టి, ఎవరికి వారు కారణాలు వూహించుకుంటున్నారు. బిసిల సంఖ్య అనుకున్నంత లేదు అని తేలితే, యిదంతా అగ్రవర్ణాల కుట్ర అని బిసి సంఘాలు ఆందోళన చేసే ప్రమాదం వుంది. కుట్ర సాగనిచ్చినందుకు అధికారంలో ఉన్న పార్టీపై ఆగ్రహం చూపవచ్చు. అనుకున్నదాని కంటె సంఖ్య ఎక్కువుంది అని తేలితే, అయితే మా రిజర్వేషన్ శాతం పెంచాలి అని బిసి సంఘాలు ఆందోళన చేయవచ్చు. అప్పుడు అనవసరంగా తేనెతుట్ట కదిపారు అంటూ అగ్రవర్ణాలు అధికారంలో వున్న పార్టీపై కోపం తెచ్చుకోవచ్చు.
వచ్చే ఏడాది యుపిలో రాబోయే ఎన్నికలు బిజెపికి అతి కీలకం. అక్కడ అగ్రవర్ణాలలో బ్రాహ్మణుల దగ్గర్నుంచి, 54% మంది వున్న బిసిలలో యాదవకూర్మీల దగ్గర్నుంచి అందరూ కులరాజకీయపరంగా చైతన్యవంతులై వుంటారు. ఏ వర్గానికి కోపం తెప్పించినా అనర్థమే. అందుకని సమస్యను వాయిదా వేయాలని చూస్తోంది. ఎందుకంటే బిజెపికి అగ్రవర్ణాల మద్దతు ఎప్పుడూ వుంది. ఇప్పుడు బిసిల్లో కూడా మద్దతును పెంచుకోవడానికి కాబినెట్ విస్తరణలో చాలా కసరత్తే చేసింది. 27 మంది బిసిలను మంత్రులుగా తీసుకుంది. మెడికల్ సీట్లలో బిసిలకు కోటా కల్పించింది. ఇప్పుడీ కులగణనలో బిసి జనాభా అనుకున్నంత లేదని తేలితే వాళ్లకు కోపం వచ్చి, చేసినదంతా వ్యర్థమై పోతుంది. కానీ కేవలం బిసి ఓటు బ్యాంకుల మీదే రాజకీయం చేసే నీతీశ్‌కి యిదేమీ పట్టదు. కులగణన చేయాల్సిందే అని పట్టుబడుతున్నాడు. తన రాష్ట్రం నుంచి అఖిలపక్షాల డెలిగేషన్ పంపించాడు.
బిసిలలో సబ్ కేటగరైజేషన్ గురించి కూడా జెడియు పట్టుబడుతోంది. అంటే ఉన్న కోటాలోనే అన్ని కులాలకు సమానన్యాయం జరిగేందుకు సబ్ కోటాలు నిర్ణయించడం అన్నమాట. దాని గురించి 2017లో జస్టిస్ రోహిణి అధ్యక్షతన ఓ కమిషన్ వేసింది ఎన్‌డిఏ ప్రభుత్వం. బిసిల్లో కొన్ని కులాలే లాభపడుతున్నాయనీ, ఫలాలు బొత్తిగా అందని కులాలు వెయ్యి వరకు ఉన్నాయని కమిషన్ కనిపెట్టిందని లీకులు వచ్చాయి. దాంతో కంగారు పడిన కేంద్రం ‘నువ్వు యిప్పట్లో నివేదిక యివ్వనక్కరలేదం’టూ దాని గడువును పొడిగిస్తూ పోతోంది. జులైలో ఇంకో ఆర్నెల్లు అంటే 2022 జనవరి 31 వరకు పెంచింది. ఇలా గునపాన్ని నానబెట్టాలని ఎన్‌డిఏ చూస్తోంది. దానిలో భాగస్వామి అయినా జెడియు, తన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగులో రోహిణి కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలంటూ డిమాండు చేసింది.
బిసిలకు కేంద్రం 27% మాత్రమే యివ్వాలని చెప్పినా, బిహార్ ఒబిసిలకు 12%, ఇ(ఎక్స్‌స్ట్రీమ్‌లీ)బిసి లకు 12%, మహిళలకు 3% యిస్తోంది. ఇప్పటికే ఆ పరిమితి అధిగమించింది. కులగణన జరిగితే ఆ శాతాన్ని యింకా పెంచి, తమ బిసి ఓటు బ్యాంకు విస్తరించుకోవాలని నీతీశ్ తాపత్రయం. అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతలూ కులగణన జరగాలని డిమాండు చేస్తున్నారు. కానీ బిజెపి పట్టించుకోవటం లేదు. మైనారిటీలకు వ్యతిరేకంగా హిందువులను సంఘటితం చేయడమే బిజెపి ఎజెండా. హిందువులు కులపరంగా ఓడిపోతే బిజెపికి నష్టం. అలా అని బిజెపికి కులాలకు అతీతంగా రాజకీయం చేయదు. లేటెస్టుగా కర్ణాటక, గుజరాత్‌లలో ముఖ్యమంత్రుల మార్పే దానికి నిదర్శనం. పైగా అది కులరాజకీయాలు చేసే పార్టీలను దెబ్బ తీయడానికి ఆ యా కులాలలో చీలిక తెస్తుంది. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్‌లో బిసిలను యాదవ, యాదవేతర కులాలుగా చీల్చింది. లేటెస్టుగా బెంగాల్ ఎన్నికలలో మటువా కార్డును వాడింది.
ఈ రాజకీయాలను సాగించాలంటే పెర్‌సెప్షన్ (భావన) ముఖ్యం. మనం జనాభాలో ఎక్కువమంది వున్నా, మనకు ఆ నిష్పత్తిలో ఫలాలు దక్కటం లేదు, తక్కినవాళ్లు ఎత్తుకుపోతున్నారు అనే భయాన్ని కొన్ని కులాల వారిలో కలిగించి, దాన్ని ఓట్లగా మార్చుకుంటున్నాయి పార్టీలన్నీ! కులగణన చేస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. దానితో బాటు వారి స్థితిగతుల గురించి అసలు సమాచారం తెలిసిపోయిందంటే, వెనకబడి లేరనీ తెలిసిపోవచ్చు. అందువలన మసిపూసి మారేడుకాయ చేసి, పబ్బం గడుపుకుందామనే ప్రతీ పార్టీ చూస్తోంది. వాస్తవాలు బయటపెట్టేస్తే తమను నిందిస్తారని అధికారంలో వున్న పార్టీ భయపడుతుంది. ప్రస్తుతం బిజెపి అధికారంలో వుంది కాబట్టి అది కులగణనను నిరాకరిస్తోంది.
చివరగా నా అభిప్రాయంలో, జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్ వుండాలనే కాన్సెప్టే తప్పు. కులగణన జరిగి, రిజర్వేషన్ కోటాలు సవరించవలసిన అవసరం పడితే, తక్కువ జనాభా వున్న కులాల నాయకులు ‘చూశారా, మనవాళ్లు కుటుంబ నియంత్రణ పాటించబట్టే యీ అనర్థం జరిగింది. మనమంతా జనాభా పెంచాలి’ అనే పిలుపునివ్వడం తథ్యం. అందరూ కులాల వాళ్లూ తెగబడి సంతానోత్పత్తికి ఉద్యమిస్తే అది మన దేశాన్ని మరింత వెనక్కి తీసుకుపోతుంది. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి సమాజంలో అన్ని వర్గాల, కులాల స్థితిగతులు తెలుసుకోవడానికి కులగణన అవసరమే. కానీ ఆ తర్వాత చేదోడు అవసరం పడే కుటుంబాల సంఖ్య బట్టి ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్ (అంతకంటె సౌకర్యాలు యిస్తే మేలని నా అభిప్రాయం) కల్పించవచ్చు తప్ప, ఒక కులంవారు 10% మంది వున్నారు కాబట్టి, వారిలో అందరూ ధనికులున్నా వారికి ఆ శాతంలో రిజర్వేషన్ యివ్వకూడదు. (ఫోటోలో ఉన్నది నిత్యానంద రాయ్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2021)