మహేష్ బాబు, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన దూకుడు సినిమా పదేళ్లు పూర్తిచేసుకుంది. ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. సంతోషంగా పోస్టులు పెడుతున్నారు, సరదాగా షేర్లు చేసుకుంటున్నారు. అయితే దర్శకుడు శ్రీనువైట్ల మాత్రం దూకుడు కష్టాల్ని నెమరువేసుకున్నాడు.
దూకుడు ఎప్పటికీ తనకు ఓ మధుర జ్ఞాపకం అంటున్న శ్రీనువైట్ల.. ఆ సినిమా షూటింగ్ టైమ్ లో ఒళ్లు గగుర్పొడిచే అనుభవాలు కూడా ఉన్నాయంటున్నాడు.
“దూకుడు ఫస్ట్ షెడ్యూల్ ఇస్తాంబుల్ లో పెట్టుకున్నాం. ఆరోజు సమంతకు షూట్ లేదు. సో.. ఆమెను ఊరికే సెట్స్ లో కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు. అందుకే వెళ్లి షాపింగ్ చేసుకోమన్నాను. ఆమె షాపింగ్ కు వెళ్లిన 10 నిమిషాలకే కాల్ చేసింది. దాదాపు ఏడుస్తోంది. ఎందుకంటే, ఆమె ఎదురుగానే ఆత్మాహుతిదాడి జరిగింది. హ్యూమన్ బాంబ్ ను ఆమె కళ్లారా చూసింది. ఆ షాక్ నుంచి ఆమె తేరుకోలేకపోయింది.”
ఇలా దూకుడు షూటింగ్ టైమ్ లో జరిగిన భయంకరమైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు వైట్ల. కేవలం అది మాత్రమే కాదని.. ఇంకా చాలా కష్టాలున్నాయని చెప్పిన శ్రీనువైట్ల, తన జీవితంలో తొలిసారి భూకంపం కూడా అక్కడే చూశానంటున్నాడు.
“పెద్ద హోటల్ లో మేమంతా దిగాం. మాకు 36వ అంతస్తు ఇచ్చినట్టు గుర్తు. ఆరోజు రాత్రి భూకంపం వచ్చింది. నేను పడుకున్నాను. అంతా ఊగినట్టు అనిపించింది. హోటల్ లో జనం అంతా బయటకు పరుగులు తీశారు. భూకంపం ఫీలింగ్ నాకు అదే ఫస్ట్ టైమ్. ఇక షూటింగ్ విషయానికొస్తే.. లొకేషన్ కు హోటల్ కు మధ్య దూరం తక్కువే. కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ. 4-5 గంటలు పట్టేది. ముంబయి ట్రాఫిక్ కంటే 5 రెట్లు ఎక్కువ. షూటింగ్ ఒక ఎత్తు, ట్రాఫిక్ లో హోటల్ కు చేరడం మరో ఎత్తు అనిపించింది.”
ఇలా తన ఇస్తాంబుల్ చేదు అనుభవాల్ని బయటపెట్టాడు శ్రీనువైట్ల. చివరికి ఇస్తాంబుల్ నుంచి ఇండియాకొచ్చేటప్పుడు కూడా పాస్ పోర్టులు మిస్సయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాంటి కష్టాలున్నప్పటికీ… దూకుడు షూటింగ్ ప్రతి రోజూ పండగ టైపులో జరిగిందన్నాడు వైట్ల.