ఎమ్బీయస్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరో కుమారస్వామి?

ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోంది. రమణ్‌ సింగ్‌ 15 ఏళ్లగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2000 లో మధ్యప్రదేశ్‌ నుండి విడిపోయి రాష్ట్రం ఏర్పడినపుడు కాంగ్రెసు ముఖ్యమంత్రి అజిత్‌ జోగి ముఖ్యమంత్రి…

ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతోంది. రమణ్‌ సింగ్‌ 15 ఏళ్లగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2000 లో మధ్యప్రదేశ్‌ నుండి విడిపోయి రాష్ట్రం ఏర్పడినపుడు కాంగ్రెసు ముఖ్యమంత్రి అజిత్‌ జోగి ముఖ్యమంత్రి అయ్యాడు. 2003లో ఎన్నికలు వచ్చినపుడు, బిజెపి 39.3% ఓట్లు, 50 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెసుకు దాని కంటె 2.6% తక్కువ ఓట్లు, 13 తక్కువ సీట్లు వచ్చాయి. 2008 వచ్చేసరికి ఓట్లలో తేడా 1.7%, సీట్లలో తేడా 12 (50-38) అయింది.

2013లో ఓట్లలో తేడా 0.8%, సీట్లలో తేడా 10 (49-39) అయింది. అంటే ఒక్క 1% తేడా వచ్చినా ఫలితాలు అటూయిటూ అవుతాయన్నమాట. ఇన్నాళ్లూ బిజెపి, కాంగ్రెసుల మధ్యనే ముఖాముఖీ పోటీ గానీ యీసారి 2016 జూన్‌లో కాంగ్రెసు నుండి బయటకు వచ్చేసి 'జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌' (జెసిసి) పేర సొంత పార్టీ పెట్టుకున్న అజిత్‌ జోగీ కూడా రంగంలో ఉన్నాడు. ఎవరి ఓట్లు, ఏ మేరకు చీల్చుతాడో తెలియదు. ఎవరు నెగ్గినా అతను కింగ్‌మేకర్‌ అవుతాడని, లేదా కర్ణాటక తరహా పరిస్థితి వస్తే కుమారస్వామిలా ఏకంగా కింగే అయిపోతాడని అనుకుంటున్నారు.

రమణ్‌ సింగ్‌ మునిసిపల్‌ కౌన్సిలర్‌గా తన రాజకీయజీవితం ప్రారంభించి, 1990లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. 1993లో ఓడిపోయాడు కానీ 1999లో రాజనంద్‌గావ్‌ నుంచి ఎంపీగా గెలిచి, మోతీలాల్‌ ఓహ్రా వంటి కాంగ్రెసు ప్రముఖుణ్ని ఓడించినందుకు గాను వాజపేయి కాబినెట్‌లో జూనియర్‌ మంత్రి పదవి సంపాదించుకున్నాడు. 2003లో ఛత్తీస్‌గఢ్‌కు ఎన్నికలు వచ్చినపుడు అజిత్‌ సింగ్‌ వంటి అనుభవజ్ఞుడితో తలపడడానికి అడ్వాణీ యితన్ని పంపించాడు. రాష్ట్రాన్ని గెలిచిచూపించడమే కాక, ప్రతి ఎన్నికలో నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అతను వివాదరహితుడు. అందర్నీ కలుపుకుని వెళ్లే నాయకుడు. పార్టీలో అసమ్మతి లేకుండా జాగ్రత్త పడుతున్నాడు.

అతని పరిపాలనాకాలంలో ప్రభుత్వస్కూళ్లు 20 వేల నుంచి 60 వేలకు పెరిగాయి. మెడికల్‌ కాలేజీలు 2 నుంచి 10 అయ్యాయి. కాలేజీలు 116 నుంచి 214కు పెరిగాయి. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనా కింద రోడ్లు 1072 కిమీ.ల నుంచి 22,750 కిమీలకు పెరిగాయి. ఆల్‌-వెదర్‌ రోడ్లు 7 వేల కిమీ.లు పెరిగాయి. విద్యుత్‌ ఉత్పాదన 4732 మెగావాట్స్‌ నుంచి 22,764 మె.వాకు పెరిగింది. 97% గ్రామాలకు విద్యుత్‌ అందింది. హార్టికల్చర్‌ పంటలు ఆరు రెట్లు పెరిగాయి. శిశుమరణాలు వెయ్యికి 70 నుంచి 41కి తగ్గాయి. ప్రసూతి మరణాలు లక్షకు 379 నుంచి 221కు తగ్గాయి. ప్రభుత్వాసుపత్రులు 4500 నుంచి 6 వేలయ్యాయి. అయినా చేయడానికి యింకా ఎంతో ఉంది. 

మధ్యప్రదేశ్‌తో కలిసి ఉన్నపుడు తమ ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్న మిగులు విద్యుత్తంతా మధ్యప్రదేశ్‌ వాడేస్తోందని, ఎక్కువ భాగం గిరిజనులు, హరిజనులు ఉన్న తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళన చేసి ఛత్తీస్‌గఢ్‌ వేరే రాష్ట్రం కోరింది. రాష్ట్రం ఏర్పడి 17 ఏళ్లు అయినా ప్రజల ఆర్థికస్థితి బాగుపడలేదు. రంగరాజన్‌ ప్యానెల్‌ నివేదిక ప్రకారం రాష్ట్రజనాభాలో 48% మంది దారిద్య్రరేఖకు దిగువనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆ అంకె 44% మాత్రమే. ఈ అంకెలు ప్రతిపక్షాలకు ఉపయోగపడతాయి. మావోయిస్టు సమస్య యింకా పరిష్కారం కాలేదు.

రమణ్‌ సింగ్‌ అదృష్టమేమిటంటే కాంగ్రెసుకు బిజెపితో సమానమైన ఓటు బ్యాంకు ఉన్నా, ప్రముఖ నాయకుడు ఎవరూ లేరు. ఈ రోజుల్లో వ్యక్తిగతమైన యిమేజి చాలా ఓట్లు తెచ్చిపెడుతోంది. కాంగ్రెసు తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ దరిదాపుల్లో కనబడటం లేదు. అయితే సత్నామీ షెడ్యూల్‌ కులానికి నాయకుడైన అజిత్‌ జోగి పార్టీ జెసిసి ఎన్ని ఓట్లు చీలుస్తుందో తెలియకుండా ఉంది. షెడ్యూల్‌ కులాలు (2 %), షెడ్యూల్‌ తెగలు (32%) కలిపి జనాభాలో 50% ఉన్నారు. ఒబిసిలలో కొన్ని ఉపకులాలలో కూడా అజిత్‌కు బలముంది. షెడ్యూల్‌ తెగల రిజర్వ్‌డ్‌ సీట్లు 29 ఉంటే 2013లో బిజెపి 11 మాత్రమే గెలిచింది కానీ 10 షెడ్యూల్‌ కులాల రిజర్వ్‌డ్‌ సీట్లలో 9 గెలిచింది. ఎందుకంటే సత్నామీలు బిజెపికి ఓటేశారు. ఇప్పుడు అజిత్‌ దానికి గండి కొట్టేట్టున్నాడు. ఇంకో పక్క అగ్రవర్ణాల మాటా చెప్పడానికి లేకుండా ఉంది.

అజిత్‌ కాంగ్రెసు నాయకుడిగా ఉండగా అతను ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత యిస్తున్నాడన్న కారణంగా కాంగ్రెసుకు ఓటేయడం మానేసిన బ్రాహ్మణులు, ఠాకూర్లు, వైశ్యులు (జనాభాలో 7-10% ఉంటారు) అజిత్‌ నిష్క్రమణతో యీసారి కాంగ్రెసుకు ఓటేయవచ్చు. బియస్పీ పార్టీ అన్ని ఎన్నికలలోను 5% ఓట్లు గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు జాతీయస్థాయిలో కాంగ్రెసు-బియస్పీల మధ్య సయోధ్య కుదిరి, యిక్కడా సీట్ల సర్దుబాటు జరిగితే అదీ ముప్పు తెస్తుంది. బలాబలాలు యించుమించు సమానంగా ఉన్నపుడు 1% ఓటు కూడా ఫలితాలను తారుమారు చేస్తుంది కాబట్టి ప్రతి వర్గాన్నీ కాపాడుకోవాలి. 

ఈ పరిస్థితుల్లో బిజెపి హరిజనులపై ఆశ తగ్గించుకుని, గిరిజనులను ఆకట్టుకోవడానికి చూస్తోంది. గిరిజన భూముల అమ్మకాలను నిషేధించే చట్టాన్ని మార్చడానికి బిజెపి ప్రభుత్వం గతంలో ప్రయత్నించింది. ఇది గిరిజన వ్యతిరక చర్య అని ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో ఆగింది. కానీ ఆ మచ్చ మిగిలింది. దాన్ని పోగొట్టుకోవాలంటే గిరిజన హితైషిగా చూపించుకోవాలి కాబట్టి 2017 అక్టోబరులో తెండు ఆకులు కోసేవారికి అంటూ రూ.275 కోట్లు బోనస్‌గా ప్రకటించింది. వాళ్ల జీతం బస్తాకు రూ.1800 నుంచి 2500 కు పెంచింది. దీనివలన 13 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుంది. వరి బోనస్‌ గతంలో యిచ్చేవారు. 2014లో మోదీ సర్కార్‌ కేంద్రంలో ఏర్పడ్డాక దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి రమణ్‌ సింగ్‌ పునరుద్ధరింప చేశాడు. 

క్వింటాల్‌కు రూ.1550 రేటు కాగా అదనంగా రూ.300 యిస్తారు. దానివలన 16 లక్షల రైతులకు లాభం. 2013లో బిజెపి గెలవడానికి కారణం రాయపూర్‌, దుర్గ్‌, రాయగఢ్‌ వంటి నగర ప్రాంతాల వాసుల ఓట్లు. ఆ ఓట్లు చెదిరిపోకుండా మోదీ మ్యాజిక్‌ చేస్తాడని బిజెపి నమ్మకం. ఇక యువత మాటకు వస్తే, యీసారి 32 లక్షల మంది ఓటర్లు కొత్తగా చేరుతున్నారు. మొత్తం ఓటర్లలో వీళ్లు ఆరో వంతు కంటె ఎక్కువ. స్మార్ట్‌ ఫోన్లు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను చూపించి వీరిని బిజెపి ఆకట్టుకుంటోంది. బిజెపి బయటివాళ్లకు ఉద్యోగాలు యిస్తోంది కాబట్టే నిరుద్యోగం పెరుగుతోందని, తామైతే స్థానికులకే యిస్తామంటూ అజిత్‌ ప్రచారం చేస్తున్నాడు. తక్కినవి రెండూ జాతీయపార్టీలు, తనది ప్రాంతీయపార్టీ కాబట్టి ఛత్తీస్‌గఢ్‌ ఆత్మగౌరవం నినాదం ఎత్తుకున్నాడు. 

ఇక ఎన్నికలలో ముఖ్యంగా చర్చకు వచ్చే నినాదం – అవినీతి నిర్మూలన. రమణ్‌ సింగ్‌పై యింకా ఏ కేసూ రాకపోయినా, అతని ప్రభుత్వం అవినీతిమయమని, లంచాలు యివ్వందే ఏ పైలూ కదలదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. మూడేళ్లగా రమణ్‌ మీదా ఆరోపణలు వస్తున్నాయి. 2007లో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ అనే ఇటాలియన్‌ హెలికాప్టర్‌ కంపెనీ నుంచి ఆగస్టా 109 హెలికాప్టర్‌  కొనుగోలు చేసే విషయంలో అక్రమం జరిగిందని, దానిలో రమణ్‌ సింగ్‌ కుమారుడు అభిషేక్‌ లబ్ధి పొందాడని ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు.

పది సంస్థలు టెండర్లు వేసినా, అగస్టా కంటె తక్కువ ధర కోట్‌ చేసినా, రాష్ట్రప్రభుత్వం ఒకే టెండర్‌ ఉండేట్లా చూసి, ఆ డీలరుకు 30% కమిషన్‌ చెల్లించిందని అభియోగం. నల్లధనం దాచుకునేందుకు వెసులుబాటు కల్గించే (టాక్స్‌ హేవెన్‌) బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలండ్స్‌లో అభిషేక్‌ డైరక్టరుగా రెండు కంపెనీలు యీ చెల్లింపులు జరిగిన ఆర్నెల్ల లోపున వెలిశాయట. 2016 నాటి పనామా లీక్స్‌లో అతని పేరు బయటపడింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి రావచ్చు. 

దీనితో బాటు రూ.1.50 లక్షల కోట్ల పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌లో స్కాములో కూడా రమణ్‌ సింగ్‌ చాలా సమాధానాలే చెప్పవలసి ఉంటుంది. అది 2004 నుంచి చాలా సమర్థవంతంగా నిర్వహించబడుతున్న గొప్ప స్కీము అని, పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో విజయం సాధించామని 2008, 2013 ఎన్నికలలో బిజెపి గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది. అయితే 2014లో అవినీతి నిరోధక సంస్థ (ఎసిబి) సివిల్‌ సప్లయిస్‌ కార్పోరేషన్‌ అధికారుల యిళ్లపై దాడులు నిర్వహించినపుడు దొరికిన క్యాష్‌, డాక్యుమెంట్ల ద్వారా అధికారులకు, రాజకీయనాయకులకు (ముఖ్యమంత్రి పేరు కూడా ఉందంటారు) డబ్బు ముట్టినట్లు ఆధారాలు దొరికాయి.

కాంగ్రెసు రూ.36 వేల కోట్ల అవినీతి జరిగిందని, దాన్ని బిజెపి హెడ్‌క్వార్టర్స్‌కు, ఆరెస్సెస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు పంపారని ఆరోపించింది. ఎసిబి 15 మంది అధికారులను అరెస్టు చేసి 2015లో హైకోర్టులో కేసు పెట్టింది. కేసు విచారణ రాష్ట్ర పోలీసుల చేతిలోనే ఉంది కాబట్టి దర్యాప్తు చాలా నెమ్మదిగా సాగుతోంది. కోర్టు విచారణలో ప్రభుత్వం పట్టుబడిన అధికారులను తప్పుపట్టక పోగా, కేసు వేసినవారినే నిందించింది. 2016 ఆగస్టులో ఒక అభిడవిట్‌ వేస్తూ స్కాము జరిగిందని అనడం అబద్ధమని, ఆధారంలేని ఊహాగానాలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారని వాదించింది. పైగా జైల్లో ఉన్నవారు బెయిల్‌ గురించి అప్లయి చేసుకుంటున్నపుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం లేదు.

తాజాగా 2017 నవంబరులో మరొకడు బెయిలుపై బయటకు వచ్చాడు. ఇదే కాకుండా 2006లో జరిగిన ప్రియదర్శిని మహిళా నాగరిక్‌ సహకారీ బ్యాంక్‌ స్కాములో కూడా రమణ్‌ సింగ్‌ పేరు బయటకు వచ్చింది. కాంగ్రెసు విడుదల చేసిన సిడిలో కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకు అధికారులు రమణ్‌ సింగ్‌కు, యిద్దరు సీనియర్‌ కాబినెట్‌ మంత్రులకు కోటి రూ.ల చొప్పున యిచ్చానని చెప్పాడు. తాజాగా బృజ్‌మోహన్‌ అగర్వాల్‌ అనే మంత్రి కుటుంబం మహాసముంద్‌ జిల్లాలో 4.12 హెక్టార్ల అటవీభూమిని అక్రమంగా కొనేసి, పక్కనున్న ప్రభుత్వభూమిని ఆక్రమించాడని ఆరోపణ వచ్చింది. 

2014 తదనంతరం బయటపడిన స్కాముల కారణంగా రమణ్‌ సింగ్‌ పలుకుబడి ఏ మేరకు దెబ్బ తిందో తెలియదు. గట్టి ప్రయత్నం చేస్తే ఓడించవచ్చనే ఆశ కాంగ్రెసుకు ఉండడం సహజం. అయితే ప్రభుత్వవ్యతిరేక ఓటు అజిత్‌ పార్టీకి, తమకు మధ్య చీలిపోతే రమణ్‌ మళ్లీ గట్టెక్కేయవచ్చు. దాన్ని నివారించాలంటే అజిత్‌తో రాజీ పడాలి, పొత్తు కుదుర్చుకోవాలి. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెసు ఆలోచనాధోరణిలో మార్పు వస్తోందంటున్నారు. 2019 పార్లమెంటు ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని 370 సీట్లకు పరిమితమైతే మంచిదని భావిస్తోందట. 2014 ఎన్నికలలో 464 సీట్లలో పోటీ చేసి కేవలం 44 అంటే 10% కంటె తక్కువ సీట్లు గెలిచింది. ఇంత ఘోరపరాజయం యింతకు ముందెన్నడూ లేదు.

పివి నరసింహారావు పాలన తదనంతరం జరిగిన 1996 ఎన్నికలలో 127 స్థానాల్లో, ఆ తర్వాత జరిగిన 1998 ఎన్నికలలో 153 స్థానాల్లో డిపాజిట్లు పోయాయి. 2014లో ఏకంగా 178 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014లో బిజెపితో ముఖాముఖీ పోటీలు జరిగిన చోట్ల కాంగ్రెసు ద్వితీయస్థానంలో ఉన్న నియోజకవర్గాలు 220. వాటిలో మళ్లీ పోటీ చేస్తూ, మిత్రపక్షాలు, ప్రాంతీయపార్టీల సహకారంతో మరో 150లో పోటీ చేస్తే చాలని అనుకుంటోందిట. కాంగ్రెసు పరిశీలిస్తున్న ప్రాంతీయపార్టీలలో ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగి పార్టీ కూడా ఉందని వార్తలు. ఎన్నికలు దగ్గర పడేటప్పటికి స్పష్టత వస్తుంది. (ఫోటో – రమణ్‌ సింగ్‌, అజిత్‌ జోగి) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]