మహానటి సినిమాతో డైరక్టర్ నాగ్ అశ్విన్ పేరు మారుమోగిపోయింది. అంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సక్సెస్ తరువాత కూడా నాగ్ అశ్విన్ కు గుర్తింపు వచ్చినా, పెద్ద సినిమా టాకిల్ చేయగలరు అన్న టైపు టాక్ తీసుకురాలేదు. నాగ్ కూడా వేరే ప్రాజెక్టు పెట్టుకోకుండా మహానటి మీదకు వెళ్లిపోయారు.
అయితే మహానటి తరువాత అందరి దృష్టి నాగ్ అశ్విన్ మీదకు మళ్లింది. కానీ నాగ్ వేరే సంస్థకు సినిమాలు చేసే అవకాశం తక్కువ కాబట్టి నిర్మాతలు ఎవ్వరూ అటు దృష్టి పెట్టలేదు.
కానీ హీరోలకు మాత్రం నాగ్ అశ్విన్ మీదకు దృష్టి మళ్లింది. ముఖ్యంగా రామ్ చరణ్ కు నాగ్ అశ్విన్ తో ఒక సినిమా చేయించాలన్న ఆలోచన మెగాస్టార్ లో కలిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే నాగ్ అశ్విన్ తో షేర్ చేసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మరోపక్క దత్ ఫ్యామిలీకి దగ్గరగా వున్న మరో ఒకరిద్దరు హీరోలు కూడా నాగ్ అశ్విన్ తో పనిచేసేందుకు ఆసక్తిగా కనబర్చారని వినికిడి.
కానీ మరో ఏడాది వరకు సినిమా ఆలోచన అన్నది నాగ్ అశ్విన్ లో లేదని తెలుస్తోంది. ఏడాది పాటు ప్రశాంతంగా వుండి, ఆ తరువాత మళ్లీ సినిమాకు శ్రీకారం చుడతారట. ఈలోగా కనుక అద్భుతమైన ఆలోచన వస్తే అప్పుడు ఆలోచిస్తారట. లేదంటే వెయింటింగ్ అంట.
ఇదిలా వుంటే నాగ్ మూడో సినిమా కూడా గత రెండు సినిమాల మాదిరిగానే కొత్త, వైవిధ్యమైన ప్రయత్నంగానే వుంటుంది తప్ప, హీరోలను బట్టి, కమర్షియల్ ఫార్మాట్ లో ఎంతమాత్రం వుండదట.