భార్యాభర్తల మధ్య ఒక 'వోహ్' వస్తూంటారు అప్పుడప్పుడు. వాళ్లను వదిలించుకోవడానికి ఏజన్సీలను సంప్రదిస్తున్న చైనా మహిళలు ప్రస్తుతం పడుతున్న వ్యథాకథనం యిది. చైనా మగవాళ్లు అంత రసికులా? అని ఆశ్చర్యపడడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా ఉండే ఒక జబ్బును మనం గమనించాలి. మగవాడికి అనుకోకుండా, అర్హత లేకుండా, అడ్డుదోవల్లో డబ్బు కానీ, అధికారం కానీ వచ్చిపడితే తన 'మగతనం' చూపించుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. మగతనం అంటే అలాటివాళ్ల దృష్టిలో వైవాహికేతర సంబంధం పెట్టుకోవడం! నడమంత్రపు సిరి అబ్బినకొద్దీ యిలాటి వికారాలు ఎక్కువవుతాయి. చాలామందికి ఎలా వచ్చిన డబ్బు అలాగే పోతుంది. ఇప్పుడు చైనాలో ప్రభుత్వాధికారులు, రాజకీయనాయకులకు యిలాటి అవినీతి సొమ్ము కుప్పలుగా వచ్చిపడుతోంది.
చైనాలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం చేత పార్టీ అధిష్టానానికి చేరువగా ఉండేవాళ్లు అక్రమమార్గాల్లో విపరీతంగా సొమ్ము చేసుకుంటున్నారు. మీడియాకు స్వాతంత్య్రం లేకపోవడం చేత యివి బయటకు రావటం లేదు. ఎప్పుడో ఒకప్పుడు అవినీతిపై కొరడా ఝళిపించామంటారు, కొందరిని పట్టుకుని, ఆస్తులు జప్తు చేసుకుని జైల్లో వేస్తారు. దశాబ్దాలుగా వాళ్లు దోచుకుంటూ ఉంటే మీ నిఘా సంస్థ ఏమైంది? అని అడిగేవాడు లేడు. అడిగితే తల ఎగురుతుంది. పోనీ వీళ్లకి కఠినశిక్ష పడింది కదాని, తక్కినవాళ్లు మానుతున్నారా? మళ్లీ యింకో ఏడాదికి అవినీతిపై ఉక్కుపాదం అంటూ యింకొంతమందిని పట్టుకుని జైళ్లకు పంపిస్తారు. చూడబోతే మనకు తోచేదేమిటంటే, పార్టీ అనగా ప్రభుత్వ పెద్దలతో పేచీ వచ్చేవరకు అవినీతి యథేచ్ఛగా సాగుతుంది. ఎక్కడో తేడా రాగానే బలి వేస్తూంటారు.
సరే దీనివలన దేశానికి జరిగే నష్టం మాట అలా వుంచండి. ఈ అడ్డగోలు సంపాదన వలన వారి నైతికత కూడా చెడుతోంది. సంసారబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. రెన్‌మిన్ యూనివర్శిటీ 2013లో చేసిన అధ్యయనం ప్రకారం అవినీతికి పాల్పడిన అధికారుల్లో 95% మందికి ఉంపుడుగత్తెలున్నారు. ఇలాటి వారి భార్యలు యీ పరిస్థితిని చక్కదిద్దడానికి పూనుకుంటున్నారు. భర్తకు నేరుగా చెప్తే వినడని, అతనికి తెలియకుండా ప్రియురాలిని దూరం చేసేందుకు మార్గాలు వెతుకుతున్నారు. విడగొట్టే వృత్తి చేపట్టిన నిపుణులకు హెచ్చు మొత్తాలలో ఫీజులు చెల్లించుకుంటున్నారు. చైనా అధికారుల్లో అవినీతి గురించి, వారి విలాసాల గురించి కొంతయినా చెప్పకపోతే యీ 'మిస్ట్రెస్ డిస్పెలింగ్' సర్వీసెస్ వారి చార్జీలు ఎందుకంత ఎక్కువగా ఉన్నాయో అర్థంకాదు.
జిన్‌పింగ్ 2012 నుంచి అవినీతిపై పోరాటం చేస్తూన్నాననే అంటున్నాడు. 2015 ఒక్క సంవత్సరంలోనే 2,80,000 మంది అధికారులను అవినీతి ఆరోపణలపై పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు ఉన్నతాధికారుల ఆస్తులు, వారికి ఉన్న ఉంపుడుగత్తెల సంఖ్య చూసి జనం విస్తుపోయారు. ఉదాహరణకి కమ్యూనిస్టు పార్టీ పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడైన ఝౌ యాంగ్‌కాంగ్ తన బంధుమిత్రులకు, ఉంపుడుగత్తెల వ్యాపారాలకు ఆర్థికలాభం చేకూరేట్లు తన పదవిని ఉపయోగించాడు. పదవిని చూపించి అనేకమంది స్త్రీలను అనుభవించాడు. 400 మందితో సంబంధం ఉందని ఒక అంచనా. లియు ఝిజున్ అనే రైల్వే మంత్రి, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు తన ఉంపుడుగత్తెకు, ఆమె తన కుటుంబసభ్యులతో సహా నిర్వహిస్తున్న పదిమంది కంపెనీలకు లాభం చేకూర్చాడు. అతని ఉంపుడుగత్తెల సంఖ్య 18 ట.
ఒక రాష్ట్రపు లాండ్ రిసోర్సెస్ బ్యూరోకు డిప్యూటీ హెడ్‌గా ఉన్న లూ యింగ్‌మింగ్ కు 47 మంది ఉంపుడుగత్తెలు, 63 అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. అతను పట్టిన లంచాల విలువ 450 మిలియన్ డాలర్లు. మరో ప్రాంతపు కనస్ట్రక్షన్ బ్యూరోకు అధినేతగా ఉన్న క్సూ కియావోకు 140 మంది ఉంపుడుగత్తెలున్నారు. వారిలో తల్లీ-కూతురూ కూడా ఉన్నారు! చిత్రం ఏమిటంటే మా జియాన్ అనే ఇంటెలిజెన్సు ఉన్నతాధికారి, అంతర్గత భద్రతాశాఖలో ఉపమంత్రి కూడా పట్టుబడ్డాడు. అతనికి ఆరు భవనాలున్నాయి. వాటిలో ఒక్కొక్కరు చొప్పున ఆరుగురు ఉంపుడుగత్తెలున్నారు, వారి ద్వారా యిద్దరు కొడుకులున్నారు. ఆ ఆరుగురిలో యిద్దరు అతని మంత్రిత్వశాఖలోనే పనిచేస్తున్నారు. చైనాలో పార్టీ సీనియర్లలో, ప్రభుత్వాధికారుల్లో వ్యభిచారం సర్వసాధారణం. అది చైనా చట్టం ప్రకారం నేరం కాదు. కానీ పార్టీ నియమాలకు మాత్రం విరుద్ధం.
నేరతీవ్రత బట్టి శిక్ష ఉంటుంది. చిన్నదే అయితే వార్నింగు యిచ్చి వదిలేస్తారు. ఇంకా పెద్దదైతే పార్టీ పదవులనుంచి తొలగించి కొంతకాలం పరిశీలనలో పెడతారు. మరీ పెద్దదైతే పార్టీ పదవుల్లోంచి తీసేస్తారు. మిలటరీ అధికారుల భార్య/భర్తతో అక్రమసంబంధం పెట్టుకోవడం మరీ నేరం. మిలటరీ అధికారితోనే పెట్టుకుంటే ఆ నేరం పెద్దదో కాదో స్పష్టత లేదు. ఈ వివరాలతో స్పష్టమయ్యేదేమిటంటే అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో అవినీతి బాగా పెరిగింది, దాంతో అక్రమ సంబంధాలూ పెరిగాయి. అవినీతిపై జరుగుతున్న యుద్ధంలో చాలామంది అధికారులు పట్టుబడడంతో తక్కినవారికి భయం వేస్తోంది. కొన్ని సందర్భాల్లో వాళ్లు డబ్బు ఎక్కడ దాచారో మాజీ ఉంపుడుగత్తెలే సమాచారాన్ని యిచ్చారు.
తనపై మోజు తీరిపోయి యింకోళ్లను చేపట్టాడన్న అసూయతో వాళ్లు పట్టించారు. ఇది తెలిసి కొందరు ఉంపుడుగత్తెల్ని తమంతట తామే వదుల్చుకుంటున్నారు. అయితే విజయం సాధించిన ఎంట్రప్రెనార్లలో, మధ్యతరహా వ్యాపారస్తుల్లో కూడా వైవాహికేతర సంబంధాల జాడ్యం అంటుకుంది. ఫర్నిచర్ కోసం, యితర వస్తువుల కోసం చైనాకు వెళ్లిన మనవాళ్లు గమనించే ఉంటారు – అక్కడ ఆడవాళ్లే ముఖ్యపాత్ర తీసుకుని బేరసారాలు సాగిస్తూన్నారు. మగవాళ్లకు పని తక్కువై రికామీగా కూర్చుంటున్నారు. ఖాళీ సమయం దొరకడంతో మనసు మళ్లుతోంది. ఇలా కాపురాల్లో చొరబడే వారిని 'లిటిల్ థర్డ్' అనే పేరుతో పిలుస్తున్నారు. భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఏర్పడిందని తెలిసిన చైనా మహిళలు ఏం చేయాలా అని ఆలోచనల్లో పడుతున్నారు. అలా పడిన ఒక మహిళ కథ తెలుసుకుంటే తక్కినవాళ్ల కథలు ఊహించవచ్చు.
మిసెస్ వాంగ్ అనే షాంఘై గృహిణి భర్త ఫోన్‌లో మెసేజులు చూసి, తన దగ్గర పనిచేసే ఒకమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని గ్రహించింది. కొన్ని రోజులు బాధపడి, భర్తతో పేచీ పడేకంటే వేరే మార్గం వెతికితే మంచిదని చైనా సెర్చ్ ఇంజన్ అయిన 'బైదూ'పై 'మిస్ట్రెస్ డిస్పెలర్' అని కొట్టింది. చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న కొద్దీ యిలాటి కేసులు పెరగడంతో అనేక నగరాల్లో దశాబ్దాలుగా యిటువంటి సర్వీసులు అందించే కంపెనీలు ఉన్నాయని తెలుసుకుంది. వివరాలు తీసుకున్నాక వాళ్ల తాలూకు ఉద్యోగి ఆ మూడోమనిషి జీవితంలో ప్రవేశిస్తారు. ఆమె యింటి ఎదురుగా ఉన్న ఫ్లాట్ అద్దెకు తీసుకునో, ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగం సంపాదించో, ఆమె వెళ్లే జిమ్‌లో తను కూడా చేరో, ఎలాగోలా స్నేహం పెంచుకుంటారు. ఆ తర్వాత సూటిగా కాకుండా నెమ్మదిగా, సుతారంగా హితబోధ మొదలుపెడతారు.
ఇలాటి వ్యవహారాల్లో వచ్చే తలనొప్పుల గురించి చెప్తూ పోతారు. సందర్భం కల్పించుకుని సదరు వ్యక్తికి అప్పులున్నాయనీ, పైకి చూపించేదంతా డాబనీ, తలిదండ్రులను చూసుకోవాల్సిన కుటుంబ బాధ్యతలున్నాయనీ, సంబంధం కొనసాగిస్తే నీకూ అవి తగులుకుంటాయనీ అడలగొడతారు. ఆమె బంధుమిత్రులలో యీమె గురించి ప్రచారం చేసి పరువు తీయడానికి చూస్తారు. కొన్ని సందర్భాల్లో వేరే ఊళ్లోనో, వేరే చోటో మెరుగైన ఉద్యోగం చూపిస్తారు. మరోప్పుడు యింకా అందగాడైన, ధనవంతుడైన ప్రియుణ్ని చూపిస్తారు. (అతను వివాహితుడైతే, అతని భార్య భవిష్యత్తులో తమ క్లయింటు కావచ్చు!) ఒక్కోప్పుడు కంపెనీ తరఫున అందమైన కుర్రాడు ఆమెను ప్రేమలో పడేసి, అవసరమైతే రతిలో పాల్గొని, క్లయింటు భర్త నుండి దూరంగా లాగేస్తాడు. అంతా దానంతట అదే జరిగినట్లు ఉంటుంది. భయపెట్టి, భ్రమపెట్టి చేసినట్లు ఉండదు. హింస జోలికి పోనే పోరు కాబట్టి కేసు ఉండదు.
మిసెస్ వాంగ్ 'వైకింగ్ ఇంటర్నేషనల్ మేరేజి హాస్పిటల్ ఎమోషన్ క్లినిక్ గ్రూపు' పేర 16 ఏళ్లగా నిర్వహించబడుతున్న యిలాటి కంపెనీకి వెళ్లింది. ఆ మూడో వ్యక్తికి వేరే ఊళ్లో ఉద్యోగం ఏర్పాటు చేసి మూణ్నెళ్లల్లో వాళ్లు పని ముగించారు. ఫీజు భారీగానే ఉండటంతో వాంగ్ తలిదండ్రులు కూతురికి డబ్బు సాయం చేశారు. తన వెనక్కాల ఏం జరిగిందో తెలియని భర్త వాంగ్ దగ్గరకు తిరిగి వచ్చాడు. సంసారం మామూలుగానే నడుస్తోంది. కంపెనీ చేస్తున్నది సులభమైన పని కాదు. మూడో వ్యక్తులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. వాళ్ల అవసరాలేమిటో, ఆలోచనలేమిటో తెలుసుకోవడానికి రహస్యపరిశోధన చేయాలి. అనుకున్నది సాధించడానికి మార్గాలు వెతకాలి. దానికోసం ఒక టీము పనిచేస్తుంది. ఒక సైకో థెరపిస్టు, ఒక లాయరు ఉంటారు. డిటెక్టివులు సరేసరి. లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి కుటుంబం, స్నేహితులు, చదువు, ఉద్యోగం, అలవాట్లు, అభిరుచులు, ఆశలు, దురాశలు.. అన్నీ స్టడీ చేస్తారు.
ఏ తరహావాళ్లు సలహా చెపితే వాళ్లు వింటారో అంచనా వేసి, అలాటివాళ్లను నియోగిస్తారు. వీటన్నిటితో బాటు భార్యకు కూడా కౌన్సిలింగ్ యిస్తారు. ''భర్తను ఎంత ప్రేమిస్తే, ఎంత విధేయంగా ఉంటే అంతగా అంటిపెట్టుకుని ఉంటాడనేది గతకాలపు చైనా భార్యల నమ్మకం. దానిలో నుంచి బయటకు రా. భర్తతో సరిసమాన స్థాయిలోనే ఉండు. అంతేకాదు, మన చైనా సంప్రదాయంలో మనోభావాలను దాచుకోవడం అలవాటు. ఆధునిక యుగంలో అది పనికి రాదు. నీ యిష్టాయిష్టాలు బాహాటంగా చెప్పు. నీ భర్తను ప్రేమిస్తూ ఉంటే పైకి చెప్పు. చెప్పమని అతన్నీ ప్రోత్సహించు. వ్యాపారంలో కాని, ఉద్యోగంలో కాని అతను పై స్థాయికి వెళ్లినపుడు బయటంతా అతన్ని రాజులా చూస్తారు. ఇంటికి వచ్చేసరికి నువ్వు తీసిపారేసినట్లు మాట్లాడితే అహం దెబ్బ తిని తనను బుజ్జగించేవాళ్లవైపు మళ్లుతాడు. అందువలన అతని అహాన్ని దెబ్బ తీయకు.'' అని చెప్తారు. అంతేకాదు, అందం విషయంలో, ఆకర్షణ విషయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తర్ఫీదు యిస్తారు.
వీటన్నిటికీ ఫీజు బాగానే అవుతుంది. సాధారణంగా 45-50 వేల డాలర్లు బేస్ ఫీగా తీసుకుంటారు. తర్వాత మూడో మనిషి స్థాయిని బట్టి, ఆమె పక్కనున్న అపార్టుమెంట్లో అద్దెకుండాలంటే ఎంతవుతుంది, ఆమెను యింప్రెస్ చేయాలంటే ఎంత ఖరీదైన కారులో తిరగాలి, ఎంత ఖరీదైన రెస్టారెంటుకి తీసుకెళ్లాలి అనే అంశాలపై ఆధారపడి ఫీజు పెరుగుతుంది. ఒక్కోప్పుడు లక్ష డాలర్లు కూడా దాటుతుంది. సగం అడ్వాన్సుగా తీసుకుంటారు. తక్కినది పని పూర్తయ్యాక తీసుకుంటారు. ఇంత చేసినా ఆ మూడో మనిషిని వదల్చలేకపోతే కంపెనీ సగం ఫీజు వదులుకుంటుంది. కానీ వాళ్ల సక్సెస్ రేట్ 90% ఉందని కంపెనీలు చెప్పుకుంటున్నాయి. ఒక్కో కేసు పరిష్కరించడానికి సరాసరిన మూణ్నెళ్లు పడుతుంది.
59 నగరాల్లో బ్రాంచీలున్న వైకింగ్ కంపెనీకి కితం ఏడాది 8 వేలమంది క్లయింట్లుంటే, యీ ఏడాది 10 వేల మంది ఉన్నారు. రీయూనియన్ అనే కంపెనీకి రోజుకి 175 కాల్స్ వస్తాయట. రెండేళ్ల క్రితం 96 వచ్చేవి. ఈ కంపెనీ సర్వీసులు చైనీయులు వుండే పొరుగుదేశాలకు కూడా విస్తరించాయి. క్రమేపీ వాళ్లకు అర్థమైందేమిటంటే యీ సమస్యలు చైనావాళ్లకే కాదు, తక్కిన జాతులకూ వున్నాయని. అందువలన మలేసియాలోనో, ఫిలిప్పీన్స్‌లోనో ఒక కాల్‌సెంటర్ పెట్టి, ఇంగ్లీషు మాట్లాడే సిబ్బందిని నియమించి, యూరోప్, ఉత్తర అమెరికా వాసులకు కూడా సేవలు అందిద్దామని చూస్తున్నారు. వైకింగ్ కంపెనీ హేండిల్ చేసిన మరో కేసు గురించి. ఓసారి 50 ఏళ్ల మహిళ వచ్చి ఊక్సి అనే వూళ్లో తన భర్త ఫ్యాక్టరీ మేనేజర్ అని, లీ అనే వ్యాపారస్తురాలితో సంబంధం పెట్టుకున్నాడనీ, సంవత్సరాలుగా భరిస్తూనే ఉన్నాను కానీ యిప్పటికే ఆమెపై 30 వేల డాలర్లు తగలేశాడని, యిలా అయితే వృద్ధాప్యం గడవడం కష్టమని వాపోయి తన కేసు టేకప్ చేయమంది.
కంపెనీ యీ కేసును తన 300 మంది ఉద్యోగుల్లో ఒకడైన యూ అనే అతనికి అప్పగించింది. యూకి 42 ఏళ్లుంటాయి. అందంగా, పుష్టిగా ఉంటాడు యోగా నేర్పుతూంటానని చెప్పుకుంటాడు తప్ప యిలాటి కంపెనీకి పని చేస్తున్నానని ఎవరికీ చెప్పడు. లీ షాపుకి వెళ్లి చూశాడు. 40 ఏళ్లుంటాయి. వీర్యవృద్ధికి పనికి వచ్చే మూలికలు అమ్మే షాపు. 'మా స్నేహితుడికి సిగ్గెక్కువ, భార్యతో సెక్స్ అనుభవించ లేకపోతున్నాడు. మీ దగ్గర మందేదైనా ఉందా?' అంటూ అరగంటసేపు ముచ్చట్లాడి, మందు కొనుక్కుని వెళ్లాడు. ఇంకో వారం పోయాక మళ్లీ లీ షాపుకి వెళ్లాడు. 'మొన్న మాటల్లో యీ ఏరియాలో యీ మధ్యే ఫ్లాట్ కొన్నారని చెప్పారు కదా, నాకూ యిక్కడే కొనాలని ఉంది. ఎవరైనా ఏజంట్లని చూపిస్తారా?' అని అడిగాడు. సరేనని కొందరు ఏజంట్లను పరిచయం చేసి, కొన్ని యిళ్లు చూసి, అభిప్రాయం చెప్పడానికి తోడుగా వచ్చింది. ఆ సమయాల్లో యిద్దరూ కలిసి లంచ్ చేస్తూండేవారు, పిచ్చాపాటీ మాట్లాడుకునేవారు. మూడు నెలలు పోయేసరికి డిన్నర్‌లు కూడా కలిసి చేశారు.
ఆపై నెలలో ఓ రోజు 'వీకెండ్‌కు షాంఘై వెళుతున్నాను. మీరూ రాకూడదా?' అన్నాడు. మొదట్లో లీ అబ్బే వద్దు అంది కానీ తర్వాత మెత్తబడింది. నాతోబాటు యింకో లేడీ కూడా వస్తుంది, అలా అయితేనే వస్తా' అంది. 'నిక్షేపంలా..' అన్నాడు యూ. క్లయింటు డబ్బేగా, వాళ్లిద్దరినీ మంచి హోటల్లో పెట్టి, ఊరంతా తిప్పి చూపించి, అక్కడి స్పెషల్ డిషెస్ తినిపించి సంతోషపెట్టాడు. నదీవిహారం టైములో యూ ఆ యిద్దరు వనితలకు కలిపి ఫోటోలు తీశాడు, తర్వాత కెమెరా ఆ ఫ్రెండుకి యిచ్చి తనకు, లీకు కలిపి తీయమన్నాడు. తీసేటప్పుడు ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఆమెను కూడా తన భుజం మీద చేయి వేయమన్నాడు. స్పోర్టివ్‌గా ఉండాలి కదాని ఆమె వేసింది. షాంఘై నుంచి తిరిగి రాగానే ఆ ఫోటోలను లీ ప్రియుడు, తన క్లయింటు భర్త ఐన ఫ్యాక్టరీ మేనేజరుకి పంపించాడు. మామూలుగానే ఒక చిత్రం వంద మాటల పెట్టు అంటారు, అసూయాగ్రస్తుడు, తన కంటె కుర్రవాడైన అబ్బాయి దొరికితే ప్రేయసి వాడివైపు మొగ్గు చూపుతుందేమోనని అనుక్షణం అనుమానించేవాడు ఉన్నపుడు అది వెయ్యి మాటల పెట్టు. లీ ఏం చెప్పబోయినా వినకుండా అతనామెతో సంబంధం తెంపుకున్నాడు.
వైకింగ్ కంపెనీ స్థాపించిన షూ అనే అతను షాంఘైలో లెక్చరరుగా పనిచేసేవాడు. కొన్ని పత్రికలలో వైవాహిక సమస్యలపై సలహాలిచ్చే కాలమ్ రాస్తూండేవాడు. ఒక్కోప్పుడు కొందరు ఫోన్ చేసి, తమ సమస్యలు చెప్పి సలహాలు అడిగేవారు, యితను చెప్పేవాడు. 1998లో ఒకావిడ ఫోన్ చేసి దగ్గర్లో ఉన్న పార్కుకి వస్తారా, మీతో కాస్త మాట్లాడాలి అంది. వెళ్లి చూస్తే ఆమె సుమారుగా 35 సం.లు ఉన్న ఒక వివాహిత. ఇద్దరు పిల్లల తల్లి. ఫిట్‌నెస్ యిన్‌స్ట్రక్టర్. తైపేలో ఉంటుంది. తైవాన్ వ్యాపారస్తుణ్ని చేసుకుంది. అతనికి షాంఘైలో వ్యాపారం ఉంది. వెళ్లి వస్తూ ఉంటాడు. అక్కడో ఫ్లాట్ కూడా ఉంది. ఓసారి యీమె షాంఘైలో ఫ్లాట్‌కి వెళ్లినపుడు అక్కడ ఆడవాళ్లు వాడే సౌందర్యసాధనాలు కనబడ్డాయి. భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడని అర్థమైంది. 'ఆత్మహత్య చేసుకుందానుకుంటున్నాను' అందామె షూతో.
షూ నచ్చచెప్పాడు – 'అంటే నీ భర్తను ఆ మూడోమనిషికి చేతులారా అప్పగిస్తావా? వాళ్లు నీ పిల్లల్ని బాగా చూస్తారన్న నమ్మకమేమిటి? నువ్వు నీ భర్తతో బాటు అతని బిజినెస్ ట్రిప్పుల మీద తరచుగా వెళుతూ ఉండు. పెళ్లిళ్లకు, పార్టీలకు అతనితోపాటు వెళుతూ అందరిలో కనబడుతూ ఉండు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది – నీ భర్త నిన్ను విడిచిపెట్టేట్లా లేడు అని. తనే విడిచి వెళ్లిపోతుంది. ఈలోగా నీ భర్తని విసిగించడం మానేసి అతన్ని ఎమోషనల్‌గా బాగా హేండిల్ చేయి.' అని. గంటన్నర సంభాషణ తర్వాత లేచి వెళ్లబోతూ ఆమె ఒక కవరు అతని చేతిలో పెట్టింది. దానిలో వెయ్యి యువాన్లున్నాయి. అప్పట్లో అది అతని నెలజీతం. డబ్బు తీసుకుందామా వద్దా అని కాస్సేపు తటపటాయించాడు కానీ అప్పుడతనికి అర్థమైంది – కాస్సేపు మాట్లాడి సరైన సలహా యిస్తే సమస్య పరిష్కారమౌతుంది. సలహాల వలన డబ్బు కూడా వస్తుంది' అని. ఇలాటి వాళ్లు యింకెందరున్నారో అనుకున్నాడు. 2001లో చైనా ప్రభుత్వం విడాకుల చట్టంలో సవరణలు తెచ్చి, విడాకులు తీసుకోవడాన్ని సులభం చేశాక, మింగ్ అనే తన స్టూడెంటుతో కలిసి కంపెనీ నెలకొల్పాడు. వాళ్లు తామందించే సేవల ద్వారా చైనాలో తరాలుగా నెలకొన్న సాంప్రదాయ వైవాహిక వ్యవస్థను కాపాడుతున్నామని నమ్ముతారు.
ఆధునిక దృక్పథం ఉన్నవారికి యిదంతా వింతగా తోస్తుంది. తనను కాదని భర్త యింకొకరితో ఊరేగుతున్నపుడు, అతన్ని ఎడంకాలితో తన్ని విడాకుల కోసం అప్లయి చేయకుండా ఆమెను ఎప్పుడు వదిలేస్తాడా, మళ్లీ తనను ఎప్పుడు అక్కున చేర్చుకుంటాడా అని ఎదురు చూడడం, దాని కోసం డబ్బు ఖర్చు పెట్టడం ఒక స్త్రీకి అవమానకరం కదా అనిపిస్తుంది. చైనా సమాజాన్ని, చట్టాన్ని, ఆర్థికసంబంధాలను తెలుసుకుంటే తప్ప యిది అర్థం కాదు. మన దేశంలో మనువు చెప్పినట్లే చైనాలో కన్‌ఫ్యూషియస్ 'ఒక స్త్రీ బాల్యంలో తండ్రి మాట, యవ్వనంలో భర్త మాట, వృద్ధాప్యంలో కొడుకు మాట వినాలి' అని చెప్పాడు. కుటుంబపు ఆస్తి కూతుళ్లకు యివ్వరక్కడ. (ఇప్పటికి కూడా కొడుకులు లేని తలిదండ్రులు తమ ఆస్తిని కూతురికి యిచ్చే బదులు, తమ యింటిపేరున్న తమ్ముడి కొడుక్కో, అన్న కొడుక్కో యిస్తారు) అన్నీ ఎరేంజ్‌డ్ మారేజిలే.
మగవాళ్లు ఉంపుడుగత్తెల్ని పెట్టుకున్నా భార్యలు కిమ్మనే పరిస్థితి ఉండేది కాదు. వాళ్లకు చదువుసంధ్యలే అంతంతమాత్రం. 20 వ శతాబ్దపు తొలి దశకంలో స్త్రీలకు చదువు, స్వతంత్ర ఆర్థిక వనరులు ఉండాలనే ఆలోచన ప్రారంభమైంది. మావో మహిళల్లో చైతన్యం తెచ్చాడు. ఆకాశంలో సగం మీదే నన్నాడు. మగవాడితో సమానంగా వాళ్లు అన్ని రకాల పనులు చేయాలన్నాడు, చేయించాడు. విప్లవంలో, సైన్యంలో, పోలీసు వ్యవస్థలో భాగస్వాముల్ని చేశాడు. ఎరేంజ్‌డ్ మేరేజ్ చేసుకోవడం కంటె గొంతుకోసుకుని చావడం మంచిదన్నాడు. 1949లో విప్లవం సఫలమయ్యాక, 1950లో న్యూ మేరేజ్ లా అని చట్టం చేసి, ఎరేంజ్‌డ్ మారేజిలను, ఉంపుడుగత్తెలను ఉంచుకునే విధానాన్ని నిషేధించాడు. నచ్చని భర్తలకు విడాకులు యిచ్చే హక్కును ఆడవారికి యిచ్చాడు. వాళ్లు పని చేసే వర్క్ యూనిట్ అనుమతి ఉంటే చాలన్నాడు.
1976లో మావో మరణానంతరం డెంగ్ ఆర్థిక సంస్కరణలు తెచ్చాడు. 1981లో వివాహచట్టంలో మరిన్ని మార్పులు వచ్చాయి. విడాకుల మంజూరు సులభతరం చేశాడు. డబ్బు చలామణీ పెరగడంతో మావో కాలం నాటి ఆదర్శవిధానాలు మూలనపడి, పాతరోజుల్లా ఆడవాళ్ల స్థాయి మగవాళ్ల కంటె తగ్గింది. వేతనవ్యవస్థలో మగవాళ్లకే ఎక్కువ జీతాలివ్వసాగారు. ఆస్తులు మగవాళ్ల పేరే జమపడసాగాయి. కమ్యూనిజం పేరుతో నయా కాపిటలిజం చైనాలో బలపడిన కొద్దీ ఆస్తుల విషయంలో ఆడవాళ్లకు అన్యాయం జరిగి, పురుషాధిక్యత పెరిగింది. ఇళ్లు భర్తల పేరే రిజిస్టరవుతున్నాయి. 2010లో ఉమెన్స్ ఫెడరేషన్, నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ కలిసి నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఒంటరి చైనా మహిళల్లో 6.5% మంది మాత్రమే సొంత యిళ్లు కలిగివున్నారు. 2011లో సుప్రీం కోర్టు యిచ్చిన ఒక తీర్పు ప్రకారం విడాకులు జరిగినపుడు వివాహానికి పూర్వం ఆస్తి ఎవరి పేర ఉందో, వాళ్లకే మళ్లీ వెళ్లిపోతుంది.
సాధారణంగా పెళ్లయ్యాక ఆడపిల్ల అత్తవారి యింటికి వస్తుంది కాబట్టి, ఆ ఆస్తి భర్త పేరే ఉంటోంది. ఈలోగా యిద్దరూ కలిసి దాన్ని ఎంత విస్తరింపచేసినా, విడిపోయినప్పుడు ఆమెకు భాగం దక్కటం లేదు. అందుచేత ఒక వివాహిత విడాకులు కోరితే ఆమెకు ఉండడానికి యిల్లు లేకుండా పోతుంది. 'ఎంతో కష్టపడి కట్టుకున్న నా యింటిని ఎవత్తో మూడో మనిషికి అప్పగించి నేను బయటకు వెళ్లి రోడ్డు మీద ఉండాలా? అంతకంటె దాన్నే మా ఆయన జీవితం నుంచి వెళ్లగొడతా' అంటున్నారు బాధిత మహిళలు. వేరేవారితో సంబంధం పెట్టుకున్నాక, భార్య విడాకులు అడగవచ్చనే అనుమానం తగలగానే మగవాళ్లు తమ ఆస్తులు దాస్తున్నారు, లేదా వేరే వాళ్ల పేర రిజిస్టర్ చేయిస్తున్నారు, తమ అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారు. కావాలని యింటి మీద ఎక్కువ వడ్డీ మీద ఋణాలు తీసుకున్నవాళ్లూ ఉన్నారు. భార్య ఆ యింటిని తీసుకుంటానంటే ఆ అప్పూ, వడ్డీ కూడా కట్టాలి.
వ్యాపారస్తుడైన భర్తకు అది సాధ్యమౌతుంది కానీ ఆమెకు కాదు. ఇంకో రకం కేసులున్నాయి. ఆస్తులు కొనడానికి అవివాహితులకు తక్కువ వడ్డీపై ఋణాలు లభిస్తాయి. 'అందువలన మనం ఉత్తుత్తినే విడాకులు తీసుకుందాం' అని భార్యను ఒప్పించి, విడాకులు మంజూరు కాగానే ఆస్తులు కొని, దానితో పాటే ఉంపుడుగత్తెను కూడా పెట్టుకున్న వాళ్లున్నారు. ఈ థీమ్‌పై ''ఐ యామ్ నాట్ మదాం బొవరీ'' అనే సినిమా వచ్చింది. చైనా మగవాళ్లు తమ వైవాహిక సమస్యలను కౌన్సిలర్ల వద్ద చర్చించడానికి యిష్టపడటం లేదు. ఇంకొకరి సలహా వినడానికి సిద్ధపడటం లేదు. ఆర్థిక సంస్కరణల కారణంగా వచ్చిపడుతున్న నడమంత్రపు సిరి వారిలో పాతకాలపు పురుషాధిక్య భావజాలాన్ని ఎగదోస్తోంది. దారి తప్పి చరించే స్త్రీల కంటె పురుషుల సంఖ్య 13 రెట్లు ఎక్కువ వుంటోందని సర్వే చెపుతోంది. ఇది భరించలేక విడాకులు తీసుకున్న స్త్రీని చైనా సమాజం యింకా గౌరవంగా చూడడం లేదు.
'ఆమె సెకండ్‌హ్యాండ్ కారు లాటిది, అదే మగాడైతే రిపేరు చేయించి, రంగులు వేయించిన యింటిలాటి వాడు' అన్నారు కొందరు. ఆమెకు మళ్లీ వివాహం జరిగే అవకాశాలు కూడా తక్కువే. ఇన్ని అవరోధాలు ఉన్నా, గత దశాబ్దంలో విడాకులు రెట్టింపయ్యాయి. విడాకుల కేసుల్లో సగానికి సగం సందర్భాల్లో ఉంపుడుగత్తె ఉంటోంది. మీడియాలో ''ఫైవ్-ఇయర్ ఇచ్'' కథనాలు (పెళ్లయిన ఐదేళ్లకు పక్కచూపులు చూస్తారనే కాన్సెప్ట్. గతంలో ఏడేళ్లనేవారు) చాలా వస్తున్నాయి. అవినీతి, ఆడంబరం, వ్యభిచారం పెరిగినకొద్దీ కుటుంబవ్యవస్థకు ముప్పు వస్తోంది. ఆ ముప్పు నివారిస్తున్నామంటూ ముందుకు వచ్చే మిస్ట్రెస్ డిస్పెలర్ కంపెనీలకు గిరాకీ పెరుగుతోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2018)
[email protected]