ఇలాంటి జనసైనికులతో విజయమా?

ఓ పార్టీ విజయం సాధించాలంటే కార్యకర్తలు మూలం. నాయకులు కీలకం. నేత ఎవరన్నది ముఖ్యం. కానీ సదరు కార్యకర్తలు గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తే, ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్న చందంగా బిహేవ్…

ఓ పార్టీ విజయం సాధించాలంటే కార్యకర్తలు మూలం. నాయకులు కీలకం. నేత ఎవరన్నది ముఖ్యం. కానీ సదరు కార్యకర్తలు గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తే, ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్న చందంగా బిహేవ్ చేస్తే, ఆ పార్టీ వ్యవహారం ఎలా వుంటుంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యవహారమే ఇదంతా.

ఈ మధ్య ఓ దినపత్రిక ఎన్నికల సర్వే నిర్వహించింది. లగడపాటి రాజగోపాల్ కు కిలోమీటర్ దూరంలో కూడా ఏ సంబంధం లేకపోయినా, ఆయన తన సర్వేలకు వాడుకునే టీమ్ తో సర్వే చేయించారు కాబట్టి, ఆయన టీమ్ అని అడ్డగోలు అబద్దం ఆడి ఆ సర్వేను ప్రచారం చేసారు.

సరే, ఈ సర్వేలో జనసేనకు కనీసం అత్తెసరు మార్కులు కూడా రాలేదు. అప్పుడు కార్యకర్తలు ఏం చేయాలి. ఈ సర్వే ఎవరు చేసారు? ఎందుకు ఛేసారు? దాని నేపథ్యం ఏమిటి? చేయించిన వారి వైనం ఏమిటి? అన్నీ తెలుసుకుని, అప్పుడు దాని పై పోరాటం చేయాలి లేదా, సామాజిక మాధ్యమాల్లో దానిపై పోరు స్టార్ట్ చేయాలి.

అయితే జనసేన కార్యకర్తలకు ఎవరు చెప్పారో? ఎలా తెలిసిందో, ఈ ఫ్లాష్ టీమ్ వెనుక  ‘ఏలూరు శ్రీను’ అనే వ్యక్తి కీలకంగా వున్నాడని తెలిసింది. అయితే సదరు ఏలూరు శ్రీను ఎవరు? ఏం చేస్తుంటాడు? ఇవన్నీ కనుక్కోవాలి కదా? కానీ అలా చేయలేదు.

ఇక్కడే ఓ చిక్కు వచ్చింది. టాలీవుడ్ లో ఓ ఏలూరు శ్రీను వున్నారు. అతను సినిమాలకు పీఆర్వోగా షార్ట్ ఫిలిం డైరక్టర్ గా పనిచేస్తాడు. పైగా అల్లు అర్జున్ , గీతా ఆర్ట్స్ సినిమాలకు పీఆర్వోగా పనిచేస్తాడు. ఇతగాడే అతగాడు అని ఫిక్స్ అయిపోయి, వాట్సప్ ల్లో చలామణీలు స్టార్ట్ చేసారట. అసలు తనకు లగడపాటితో పరిచయం, సర్వే చేసేంత స్టామినా వుందా? అంటూ ఈ ఏలూరు శ్రీను మొత్తుకుంటున్నాడు. ఆ ఏలూరు శ్రీను ఎవరో తెలుసుకోకుండా ఈ ఏలూరు శ్రీను మీద వాట్సప్ పోస్ట్ లు చలామణీ చేస్తున్నారట.

ఇదిలా వుంటే, అర కాపులు, రెడ్లను, కమ్మలను చేసుకున్నవారు అంటూ ఆ వాట్సప్ పోస్ట్ ల్లో దుయ్య బట్టడం విశేషం. మరి చిరంజీవి, అల్లు అరవింద్ రెడ్లతోనే వియ్యం అందిన సంగతి ఈ జనసైనికులు మరిచారా? లేక వారిని కూడా పవన్ వ్యతిరేకుల్లో చేర్చారా? ఆ మాటకు వస్తే పవన్ తన తొలి భార్య కాపు అమ్మాయిని వదిలేసిన సంగతి వీరు మరిచారా?

ఇలా పూర్తిగా తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా హడావుడి చేసే జనసైనికులతో పవన్ ఏం సాధిస్తారో?