కోస్తా కర్ణాటకలో 19 సీట్లున్నాయి. దీనిలో దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాలున్నాయి. విదేశాలతో వ్యాపారాలు చేయడం వలన, యిక్కడి ప్రజలు విదేశాల్లో స్థిరపడి డబ్బులు పంపడం చేత యివి భాగ్యవంతమైన జిల్లాలగానే లెక్క. ఇక్కడ సిద్ధరామయ్య సంక్షేమ పథకాల కంటె మతపరమైన అంశాలకే ప్రాధాన్యత ఎక్కువ. ముస్లిం, క్రైస్తవుల జనాభా ఎక్కువ కాబట్టి బిజెపి హిందూత్వ సంస్థల హడావుడి యిక్కడే బాగా కనబడుతుంది. దానివలన బిజెపి రాజకీయ లాభం పొందింది కూడా. దానికి యిది అత్యంత బలమైన ప్రాంతం.
2013లో బిజెపి ఓట్లు చీలడం చేత కాంగ్రెసు 14 సీట్లు గెలిచింది. హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం యీ ఎన్నికలలో బిజెపి యోగి ఆదిత్యనాథ్ చేత ప్రచారం చేయించింది కాబట్టి ఇప్పుడు అవి తగ్గవచ్చు. ఇక్కడ మూడింట రెండు వంతుల స్థానాలు బిజెపి ఖాతాలో పడతాయని అంచనా. దక్షిణాదిన బిజెపికి అనుకూలమైన రాష్ట్రం కర్ణాటక ఒకటే. రామమందిరం అంశంలో అడ్వాణీ రథయాత్రకు దక్షిణాది నుంచి స్పందన వచ్చినది కర్ణాటకలో మాత్రమే. అప్పణ్నుంచి బిజెపి శ్రమిస్తూనే ఉంది. 1994లో హుబ్లి-ధార్వాడ్ ప్రాంతంలో జరిగిన మతకల్లోలాలు దానికి కలిసి వచ్చాయి.
బెంగుళూరులో కూడా బిజెపి బలపడింది. కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన జనతా పార్టీ పాతికేళ్ల వ్యవధిలో చీలికలు, పేలికలై పోవడంతో కాంగ్రెసు వ్యతిరేకులకు బిజెపి పట్టుకొమ్మగా తయారైంది. 2004 నుంచి కర్ణాటకలో అది బలమైన శక్తి. అయితే బిజెపి ముఖ్యమంత్రులు తమ దుష్పరిపాలనతో పేరు చెడగొట్టారు. అయినా 2004లో 18, 2009లో 19, 2014లో 17 పార్లమెంటు స్థానాలు వచ్చాయి. దాన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు తర్జుమా చేస్తే 132 వస్తుంది.
మోదీ ప్రాభవం 2014 తర్వాత యుపిలో, ఈశాన్య రాష్ట్రాలలో పెరిగినా చాలా చోట్ల తగ్గింది. నోట్ల రద్దు ప్రకటన సమయంలో 50 రోజులు ఓర్పు పట్టమన్నారు కానీ 500 రోజులైన కష్టాలు గట్టెక్కలేదు. అసంఘిత కార్మికరంగం కల్లోలంలో ఉంది. రైతులు కునారిల్లుతున్నారు. పెట్రోలు ధర యివాళ కూడా మళ్లీ పెరిగింది. మోదీ తన ఉపన్యాసాలతో బిజెపి అనుకూల పరిస్థితిని సృష్టించారని పత్రికల్లో రాస్తున్నారు. పెరుగుతున్న ధరలకు, జీవనవ్యయానికి కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని సామాన్యుడికి కూడా తెలుసు. జిఎస్‌టి సామాన్యులతో బాటు, వ్యాపారస్తుల నడ్డి కూడా విరిచింది.
నోట్లరద్దు, తదనంతర పరిణామాలు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాయి. రాజకీయంగా చూస్తే కాంగ్రెసు అవలక్షణాలన్నీ బిజెపి వంటబట్టించుకుని, యిప్పుడు ఆ గేమ్‌లో దాన్నే ఓడిస్తోంది. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారు బిజెపికి దూరమయ్యారని, మధ్యతరగతి ప్రజలలో మోదీ పట్ల వ్యామోహం తగ్గిందని గుజరాత్ ఎన్నికలు చెప్పాయి. కర్ణాటకలో ఏం జరుగుతుందో మే 15న తెలుస్తుంది. దేశదుస్థితికి కేంద్రప్రభుత్వ విధానాలే కారణమని ప్రజలకు నచ్చ చెప్పగల సామర్థ్యం స్థానిక నాయకులకు ఉంది.
మోదీ ఎంత అద్భుతమైన వక్త అయినా, స్థానిక భాషలో ప్రసంగించలేడు కదా. వీటి కారణంగా 2014 కంటె 5% నెగటివ్ స్వింగ్ వస్తే బిజెపి 91 దగ్గర ఆగిపోతుంది. కాంగ్రెసుకు 113, జెడిఎస్‌కు 20 వస్తాయి. బెంగుళూరు, మధ్య కర్ణాటకలలో మాత్రమే బిజెపి కాంగ్రెసు కంటె ఎక్కువ తెచ్చుకుంటుంది. బిజెపికి యీసారి ఎదురైన యిబ్బంది ఏమిటంటే టిక్కెట్ల పంపిణీ తర్వాత పేచీలు. ఒకప్పుడు కమ్యూనిస్టులు, బిజెపి వారు సిద్ధాంతాల ప్రకారం నడిచేవారు అనుకునేవారు. ఇప్పుడు బిజెపి అవన్నీ గాలికి వదిలేసింది.
నెగ్గగల సత్తా ఉన్న అభ్యర్థిగా భావించిన ఏ నాయకుణ్నైనా సరే ఏ పార్టీలో నుంచైనా సరే గుంజుకుంది. మే 15 తర్వాత ఆంధ్రలో మా తడాఖా చూపిస్తాం అంటున్నారు. అంటే అక్కడా యిదే చేయబోతా రనుకోవచ్చు. ఆ పార్టీలో చేరిపోతే ఐటీ దాడులు ఉండవు, కేసులుండవు, పాతకాలపు ఆరెస్సెస్ సిద్ధాంతపరమైన ఒత్తిళ్లూ ఉండవు. ఎప్పణ్నుంచో అలవాటు పడిన రాజకీయ సంస్కృతి (కాంగ్రెసు సంస్కృతిగా పేరుబడినా, యిప్పుడు అన్ని పార్టీలలోనూ యిదే పద్ధతి నడుస్తోంది) వదులుకోనక్కరలేదు. అందువలన అందరూ బిజెపికి క్యూ కడుతున్నారు.
అయితే పార్టీకి వస్తున్న చికాకు ఏమిటంటే గతం నుంచి పార్టీలో ఉన్నవాళ్లు నిరాశపడుతున్నారు, తిరగబడుతున్నారు. కొందరు పార్టీ విడిచి వెళుతున్నారు. కాంగ్రెసు, బిజెపి, జెడిఎస్‌ల నుండి ఎన్నో పార్టీ ఫిరాయింపులు జరిగాయి. అసమ్మతివాదులు ఓట్లను ఏ మేరకు చీలుస్తారో తెలియదు. బిజెపి తరఫున ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసిన సదానంద గౌడ ప్రస్తుతం నిర్లిప్తంగా ఉన్నట్లు వార్త. కాంగ్రెసు కర్ణాటకలో ఒక వెలుగు వెలిగిన పార్టీ. ఇప్పటికీ హీనపక్షం 35% ఓట్లు తెచ్చుకుంటుంది.
2014 పార్లమెంటు ఎన్నికలలో మోదీ హవా బలంగా వీచే రోజుల్లో కూడా బిజెపికి 43% వస్తే కాంగ్రెసుకు 42% వచ్చాయి. కులాల సమీకరణాలు కూడా కాంగ్రెసు జాగ్రత్తగా బాలన్స్ చేసుకుంటూ వస్తుంది. మైనారిటీలు కాంగ్రెసు పాలనలో సురక్షితంగా ఫీలవుతారు. అందువలన సిద్ధరామయ్య అహిందా (అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడిన తరగతులు, దళితులు) ఫార్ములాను నమ్ముకున్నాడు. ఎస్సీలు (18%), ఎస్టీలు (7%) కలిసి 25% మంది ఉన్నారు. వీళ్లు, ముఖ్యంగా వీళ్లలో ఆర్థికంగా బాగుపడినవారు కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్నారు.
ఎస్సీలలో మాదిగలను మచ్చిక చేసుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం 2013 ఎన్నికలలో ఒబిసిల ప్రాబల్యం ఉన్న 32 సీట్లలో కాంగ్రెసు 27, బిజెపి 3, జెడిఎస్ 2 గెలిచాయి. దీన్ని తిప్పికొట్టడానికి బిజెపి కాంగ్రెసు ఏలుబడిలో హిందూమతం ప్రమాదంలో పడిందనే నినాదం ఎత్తుకుంది. సిద్ధరామయ్యను ముస్లిం అభిమానిగా, హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించబూనింది. సిద్ధరామయ్య తను హిందువునే కానీ, సెక్యులరిస్టు హిందువునని చెప్పుకుని బిజెపిని నిలవరించడానికి చూస్తున్నాడు. అతను ఎత్తుకు పై యెత్తులు వేయడంలో సిద్ధహస్తుడు.
బిజెపి జాతీయతావాదాన్ని రెచ్చగొడితే యితను ఉపజాతీయతావాదాన్ని రెచ్చగొట్టాడు. కన్నడ భాష గురించి అక్కడ ముందు నుంచి చాలా ఎవేర్‌నెస్ ఉంది. అందుకని యీసారి ఏకంగా కన్నడ జండా అనేశాడు. గుజరాత్ ఆత్మగౌరవం గురించి మోదీ గుజరాత్ ఎన్నికలలో మాట్లాడాడు. అదే కాపీ కొట్టి సిద్ధరామయ్య కన్నడతనం గురించి మాట్లాడుతున్నాడు. 15 వ ఆర్థిక సంఘం సిఫార్సులు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయనే సంగతి కూడా బాగా చర్చకు వచ్చింది.
బిజెపి నాయకులనేకమంది దక్షిణాది వారిని చులకనగా చూసే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బిజెపిపై ఉత్తరాది ముద్ర పడిందంటే అది ఎన్నికలలో దెబ్బే. తాము కేంద్రానికి యిచ్చే దానిలో అతి తక్కువే తిరిగి వస్తోందని, ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెడుతోందని అంకెలతో సహా చెప్పాడు. బిజెపి మతాల వారీగా ప్రజల్ని విడగొడితే, అతను కులాల వారీగా విడగొట్టాడు. అతను హిందువే కాదన్నట్లు అమిత్ షా ప్రచారం చేయబోతే, అసలు నువ్వు జైనుడివి కదా, హిందువునైన నా మీద ఆ మాటలేమిటి? అని అడిగాడు.
రాహుల్ సరేసరి, 'నేను గుడికి వెళ్లినప్పుడల్లా వాళ్లకు కడుపులో తిప్పుతోంది' అన్నాడు. అమిత్ షా తిరుపతికి వస్తే జైనుడివి, నీకు యిక్కడేం పని అని ఎవరూ అడగలేదు కదా. మనం చర్చికి వెళ్లినా ఎవ్వరూ అడగరు కదా.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]