మధ్య కర్ణాటకలో 57స్థానాలున్నాయి. రాయచూరు, కొప్పల్, గదగ్, బళ్లారి, హావేరి, దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, చిక్‌మగళూరు దీని కిందకు వస్తాయి. బళ్లారి గనుల ప్రభావం వీటిపై చాలా ఉంది. గాలి కుటుంబమే కాదు, యీ ప్రాంతాల్లో పోటీ చేసేవారందరూ గనుల యజమానులే. వారిలో క్లీన్ యిమేజి ఉన్నవారు చాలా తక్కువ. డబ్బు కారణంగా వారిని అన్ని పార్టీల వారూ ఆదరిస్తున్నారు. అప్రతిష్ట పాలైన యిద్దరు గని యజమానులు ఆనంద్ సింగ్, బి నాగేంద్ర యిప్పుడు కాంగ్రెసులో చేరారు. గాలి సోదరుల వాళ్ల కారణంగా బిజెపి 2008లో యిక్కడ ఎక్కువ సీట్లు గెలిచింది. 2013 వచ్చేసరికి గాలి జనార్దన రెడ్డి అనుచరుడు శ్రీరాములు బిఎస్‌ఆర్ అని వేరే పార్టీ పెట్టడంతో ఓట్లు చీలాయి.
బిజెపికి నాలుగే వచ్చాయి. గాలి మళ్లీ బిజెపికి మద్దతుగా నిలిచాడు కాబట్టి ఈసారి అక్కడ బిజెపి సగమైనా గెలుస్తుందని అంచనా. తక్కిన సగం కాంగ్రెసు గెలవవచ్చు. తుంగభద్ర ప్రాజెక్టు వచ్చాక వ్యవసాయం చేయడానికి ఆంధ్ర కోస్తా జిల్లాల నుండి వెళ్లి సెటిలైన రైతులు కొప్పళ, రాయచూరు జిల్లాలలో ఉన్నారు. ప్రత్యేక హోదా అంశం వారిని ప్రభావితం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇప్పటివరకు తెలుగువారు అక్కడి మూడు ప్రధాన పార్టీలలోనూ మద్దతుదారులుగా, నాయకులుగా ఉండి పదవులు పొందుతున్నారు. అభ్యర్థుల బట్టే ఓట్లు పడతాయి తప్ప యితర రాష్ట్ర పరిణామాల ప్రభావం ఉండకపోవచ్చు.
కర్ణాటకలో బిజెపి అంటే ఎడియూరప్ప అనేటంతగా పార్టీ అతనితో ఐడెంటిఫై అయింది. శివమొగ్గకు చెందిన ఎడియూరప్ప లింగాయతు కులస్తుడు. 2004లో బిజెపికి అత్యధికంగా సీట్లు వచ్చినా, ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. కాంగ్రెసు, జెడిఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెసు వాడైన ధరమ్‌సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతని ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎడియూరప్ప 2005లో జెడిఎస్‌తో చేతులు కలిపాడు. కుమారస్వామి బిజెపితో చేతులు కలపడాన్ని నేను ఆమోదించటం లేదు అని దేవెగౌడ తెగ హడావుడి చేశాడు.
2006 జనవరి నుంచి 20 నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత ఎడియూరప్పకు పదవి అప్పగించాలని ఒప్పందం. 20 నెలలు పూర్తయి అధికారం అప్పగించేవేళ 2007 అక్టోబరులో కుమారస్వామి మొండికేశాడు. దాంతో బిజెపి ప్రభుత్వం నుంచి వైదొలగింది. నెల్లాళ్ల ప్రతిష్టంభన తర్వాత కుమారస్వామి సరే అన్నాడు కానీ 8 రోజుల తర్వాత మద్దతు ఉపసంహరించి, ఎడియూరప్ప ముచ్చటను ఎనిమిది రోజులకు కుదించాడు.
ఇదంతా కుమారస్వామి, అతని తండ్రి దేవెగౌడ కలిసి ఆడిన నాటకం అని ప్రజలకు తేటతెల్లం కావడంతో ఓటర్లకు వారిపై అసహ్యం, ఎడియూరప్పపై సానుభూతి కలిగి 2008 ఎన్నికలలో 34% ఓట్లతో 110 సీట్లు సాధించి, ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో ఎడియూరప్ప రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే త్వరలోనే ప్రభుత్వ భూములను కుటుంబ సభ్యులకు అప్పచెప్పిన విషయంలో, గనుల విషయంలో అవినీతి కారణంగా ఆ సానుభూతి యిగిరిపోయింది. బిజెపి అధిష్టానం పరిస్థితిని చక్కదిద్దలేక పోయింది. తమకు విజయాన్ని సమకూర్చిన గాలి సోదరుల ఆగడాలను బిజెపి సహించింది. వారిపై చర్య తీసుకోవడానికి వెనకాడింది.
చివరకు లోకాయుక్త రిపోర్టు తర్వాత తీసుకుంటే వాళ్లు ఎడియూరప్పపై అలిగారు. ఎడియూరప్పపై కూడా కేసులు వచ్చేసరికి తప్పుకోమంటే ఎడియూరప్ప పార్టీపై 2010 నవంబరులో తిరగబడ్డాడు. ఆరునెలల తర్వాత లోకాయుక్త అభిశంసించాక దిగమన్నా ఓ పట్టాన దిగకుండా హిరణ్యాక్ష వరాలు కోరి సాధించుకుని 2011 జులైలో రాజీనామా చేశాడు. జగదీశ్ షెట్టార్‌ను ముఖ్యమంత్రి చేద్దామని పార్టీ అనుకుంటే కాదు, సదానంద గౌడను చేయమన్నాడు. రెండు నెలలు గడవకుండానే అతన్నీ దించేయమన్నాడు. ఏడాది గడవకముందే అతను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సారి జగదీశ్ షెట్టార్‌కు మద్దతిచ్చాడు. అదీ నాలుగు నెలల ముచ్చటే. బిజెపి అధిష్టానాన్ని తిట్టి, సోనియా గాంధీని పొగిడి 2012 నవంబరులో పార్టీ విడిచి వెళ్లి వేరే పార్టీ పెట్టుకున్నాడు.
ఎడియూరప్ప ఆగడాలు, ఆ ఆగడాలను అదుపు చేయలేని బిజెపి అసమర్థత ఓటర్లకు అసహ్యం పుట్టించింది. 2013 ఎన్నికలలో ఎడియూరప్ప పార్టీని, బిజెపిని రెండింటినీ ఓడించి కాంగ్రెసుకు అధికారం కట్టబెట్టారు. కాంగ్రెసుకు 37% ఓట్లతో 122 వస్తే బిజెపి, జెడిఎస్‌లకు చెరో 20% ఓట్లు, 40 సీట్లు వచ్చాయి. లింగాయతులు అధికంగా ఉన్న 30 సీట్లలో ఎడియూరప్ప బిజెపి అవకాశాలను చెడగొట్టాడు. ఎడియూరప్ప జైలుకి వెళ్లి వచ్చాడు కూడా. విడిగా వెళ్లి పార్టీలు పెట్టుకున్న ఎడియూరప్ప, అతని భాగస్వాములు గాలి సోదరులు మోదీకి ఆత్మీయులు కావడంతో పార్టీ పగ్గాలు మోదీ చేతికి రాగానే వాళ్లందరూ బిజెపిలోకి మళ్లీ వచ్చేశారు. ఎడియూరప్ప తనకు పదవులు అక్కరలేదని ప్రకటించి 2014 జనవరిలో పార్టీలో చేరాడు.
ఇప్పుడు అతను బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి. అతని అవినీతిని వెనకేసుకుని వచ్చే భారం బిజెపిపై, మోదీపై పడింది. అతనిపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అంటూ మోదీ నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులైన సోనియా, రాహుల్‌లకు వేలెత్తి చూపే అధికారం లేదన్నాడు మోదీ. ఆరోపణల్లో నిజముందని నమ్మకపోతే ఎడియూరప్పను అప్పటి బిజెపి అధిష్టానం తప్పించేదే కాదు, బయటకు పంపించేదే కాదు.
ఈ ఎన్నికలలో గాలి జనార్దనరెడ్డికి టిక్కెట్టు యివ్వకపోయినా, అతని అనుచరులు 8 మందికి టిక్కెట్లిచ్చారు. ముఖ్య అనుచరుడు శ్రీరాములుకి ఉపముఖ్యమంత్రి పదవి యిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలాటి వాళ్లను ముందు పెట్టుకుని, సిద్ధరామయ్యను 10% అని, మరోటని అనడానికి చాలా ధైర్యమే కావాలి. మోదీకి ఆ ధైర్యం ఉంది. బిజెపి కేంద్ర ఏజన్సీలన్నిటినీ దుర్వినియోగం చేస్తోందని యీ ఎన్నికలలో మరోసారి నిరూపితమైంది. పోలింగు ముందు రోజు వరకు కాంగ్రెసు మంత్రులు, యితర నాయకుల యిళ్లపై ఇన్‌కమ్‌టాక్స్ దాడులు జరిపించింది.
సిద్ధరామయ్య క్యాంప్ చేసిన రిసార్ట్‌పై కూడా కూడా దాడులు చేయించారు. కానీ ఒక్క బిజెపి నాయకుడిపైన కూడా యిలాటి దాడులు జరగలేదు. ఎడియూరప్పపై పెట్టిన కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దానిపై రాష్ట్రప్రభుత్వం వేసిన అప్పీళ్లు సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్నాయి. ఆ అప్పీళ్లు నెగ్గితే ఎడియూరప్ప 20 కేసులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏది ఏమైనా లింగాయతులు అధిక సంఖ్యలో ఉన్న షికారీపూర్ నుంచి ఎడియూరప్ప గెలుపు ఖాయం అంటున్నారు.
లింగాయతు ఓట్ల గురించే ఎడియూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి చూపిస్తోంది తప్ప అంతిమంగా అతనికి జెల్ల కొడతారన్న వాదన వినబడుతోంది. అతనికి 75 ఏళ్లు. ఆ వయసు వాళ్లకు పదవి యివ్వటం లేదన్న కారణం చూపించి, తప్పించవచ్చు. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో జెడిఎస్ మద్దతు తీసుకునేటప్పుడు వాళ్లకు ఆమోదయోగ్యుణ్ని ముందుకు తీసుకుని రావాలి. కుమారస్వామికి, ఎడియూరప్పకు గతంలో పంచాయితీ ఉంది కాబట్టి అనంత కుమార్ హెగ్డేను బిజెపి తరఫున ముఖ్యమంత్రిగానో, ఉపముఖ్యమంత్రిగానో తీసుకురావచ్చు. అప్పుడు ఎడియూరప్పకు కేంద్రమంత్రి పదవి యిచ్చి ఊరుకోబెట్టవచ్చు. రేపు బిజెపికి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై అంతా ఆధారపడి ఉంది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]