బొంబాయి – కర్ణాటక ప్రాంతం ఒకప్పుడు బొంబాయి ప్రాంతంలోని కన్నడిగ ప్రాంతాలతో ఏర్పడినది. బీజాపూర్ (విజయపుర), బెల్గాం (బెళగావి), బాగల్కోట్, ధార్వాడ, జిల్లాలున్నాయి. 40 సీట్లున్నాయి. మధ్య కర్ణాటకలోని హావేరి, గదగ్ జిల్లాలను కూడా యీ ప్రాంతంతో కొందరు కలుపుతారు. ఇక్కడ సాగునీటి కొరత ఎక్కువ. అందువలన రైతులు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు.
2017 డిసెంబరులో ఎడియూరప్ప, యోగి ఆదిత్యనాత్తో కలిసి యిక్కడ ఒక యాత్ర నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేకతను రెచ్చగొట్టాడు. ఆలమట్టి జలాశయం వెనుక జలాల నుంచి కొన్ని వందల చెరువులకు తాగునీటిని మళ్లించడం, సూక్ష్మ సాగు పద్ధతిలో వేయి ఎకరాల భూమికి నీటి సరఫరా చేశామనీ కాంగ్రెసు ప్రజలకు నచ్చచెపుతోంది. సిద్ధరామయ్య పెట్టిన అన్న భాగ్య, క్షీర భాగ్య, వంటి అనేక సంక్షేమ పథకాలు ఉత్తర కర్ణాటకలో పేదలను ఆకట్టుకున్నాయి.
మహదాయి నదీజలాల పంపకం విషయంలో గోవాతో తగాదా ఉంది. గోవాలో బిజెపి ప్రభుత్వమే ఉంది కాబట్టి తమను గెలిపిస్తే సమస్యను పరిష్కరిస్తామని బిజెపి హామీ యిచ్చింది. దాన్ని నమ్మవద్దని కాంగ్రెసు అంటోంది. పారిశ్రామికంగా ప్రగతి లేదు. నిరుద్యోగ సమస్య ఎక్కువే. ఎడియూరప్ప కులస్తులైన లింగాయతులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 2004, 2008లో ఎడియూరప్ప సారథ్యంలో యిక్కడ బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చాయి.
2013 వచ్చేసరికి ఎడియూరప్ప విడిగా విడిపోయి కెజెపి అనే వేరే పార్టీ పెట్టుకుని లింగాయతుల ఓట్లు తెచ్చుకుని 9.8% ఓట్లు చీల్చడంతో బిజెపికి బాగా తగ్గి, కాంగ్రెసుకు ఎక్కువ వచ్చాయి. ఈ సారి ఎడియూరప్ప బిజెపితో కలిసిపోయాడు కాబట్టి బిజెపికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా. దాన్ని నివారించడానికి సిద్ధరామయ్య లింగాయతుల అంశాన్ని ముందుకు తెచ్చాడు.
జనాభాలో 9.8% ఉన్న లింగాయతులు (వారిలో 20% ఉన్న వీరశైవుల్ని కలుపుకుని) రాజకీయాల్లో బహు చురుకు. ఏడుగురు ముఖ్యమంత్రులు లింగాయతులే. 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ముఖ్యంగా బొంబాయి-కర్ణాటక ప్రాంతంలో లింగాయతుల ప్రాబల్యం ఉంది. తొలి నుంచి కాంగ్రెసుకు మద్దతుదారులుగా ఉండేవారు. వీరేంద్ర పాటిల్ అనే లింగాయతు ముఖ్యమంత్రిని 1990లో రాజీవ్ గాంధీ అర్ధాంతరంగా తీసివేయడంతో అప్పణ్నుంచి ఆ పార్టీపై కోపం పెంచుకున్నారు.
1994లో జనతాదళ్ వైపు మళ్లారు. క్రమేపీ బిజెపి వారిని తమ పక్షాన తిప్పుకోగలిగింది. లింగాయతులకు సామాజికంగా, రాజకీయంగా ప్రత్యర్థులు ఒక్కళిగలు. దేవెగౌడ ఆ వర్గానికి చెందినవాడు. దేవెగౌడతో బాటు ఒక్కళిగుల ప్రాధాన్యత పెరగడంతో స్వయంగా లింగాయతు అయిన ఎడియూరప్ప లింగాయతులను బిజెపి వైపు మరలించాడు. అతను విడిగా వెళ్లినపుడు పెద్దగా ఓట్లు పడలేదు. ఎడియూరప్ప బిజెపిలో మళ్లీ చేరడంతో లింగాయతులు బిజెపికి వేస్తారని కురుబ కులానికి చెందిన సిద్ధరామయ్య లెక్క వేశాడు.
బిజెపి కున్న లింగాయతు బేస్‌ను చెదరగొట్టడానికి ఏడాదిగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తం అందరినీ కలిపి లింగాయతులని వ్యవహరిస్తున్నా లింగాయతులకు, వీరశైవులకు కొన్ని పోలికలున్నాయి, కొన్ని తేడాలున్నాయి. వీరశైవులు వైదిక, హిందూ ఆచారా విధానాల్ని పాటిస్తారు. విగ్రహారాధన చేయని లింగాయతులను శిక్ఖులు, జైనులు వంటి హిందూయేతరులుగా, మైనారిటీలుగా గుర్తించాలని సిద్ధరామయ్య వాదించసాగాడు.
కితం ఏడాది లింగాయతులు ఆరాధించే సంఘ సంస్కర్త బసవేశ్వరుడి చిత్రపటాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోను వేలాడేయాలని ఆదేశాలు యిచ్చాడు. బసవేశ్వరుడి అనుయాయి అక్క మహాదేవి పేరును విజయపురలోని మహిళా విశ్వవిద్యాలయానికి పెట్టాడు. బసవేశ్వరుడి సిద్ధాంతాలు ఆవిష్కరించిన అనుభవ మంటపాన్ని బీదరులో కట్టాడు. ఎన్నికలు దగ్గర పడుతూండగా సిద్ధరామయ్య సర్కారు లింగాయతుల్ని మైనారిటీగా ప్రకటించి, గుర్తింపు కోసం కేంద్రానికి సిఫార్సు చేసింది.
దీన్ని ఒప్పుకుంటే లింగాయతులు నిర్వహించే అసంఖ్యాకమైన విద్యాసంస్థలకు మైనారిటీ స్టేటస్ వచ్చి అనేక రాయితీలు లభిస్తాయి. అందువలన లింగాయతులకు యీ గుర్తింపు పట్ల సంతోషంగా ఉన్నారు. అయితే కేంద్రంలోని బిజెపి ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. మైనారిటీ హోదా యిస్తే సిద్ధరామయ్యకు క్రెడిట్ పోతుంది. ఇవ్వకపోతే లింగాయతులకు కోపం వచ్చి ఓట్లు వేయకపోవచ్చు. వీళ్లను మైనారిటీలుగా గుర్తిస్తే సంఖ్యాపరంగా హిందువుల సంఖ్య తగ్గిపోతుందని ఆరెస్సెస్ ఆందోళన పడుతోంది. అందువలన బిజెపి దీనిపై ఎటూ చెప్పకుండా కాలక్షేపం చేస్తోంది.
లింగాయతులకు కర్ణాటకలో చిన్నాపెద్దా 1200 మఠాలున్నాయి. వీటికి అపారంగా నిధులున్నాయి. వీళ్లు ఓటర్లను కూడా ప్రభావితం చేయగలరు. వీరశైవులకూ మఠాలున్నాయి కానీ, యిన్ని లేవు, పైగా యింత డబ్బున్నవీ కావు. లింగాయతులకు మైనారిటీ హోదా యిచ్చి తమను విడగొడుతున్నాడన్న కోపం వీరశైవులకు ఉంది. బిజెపి, కాంగ్రెసు నాయకులందరూ యీ మఠాల్నీ, మఠాధిపతులనూ దర్శించుకున్నారు. చివరకు ఎన్నికలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
కాంగ్రెసు 48 మంది లింగాయతులకు సీట్లిచ్చింది. ఒక్కళిగలకు 39, ముస్లింలకు 15, ఎస్సీలకు 36, ఎస్టీలకు 17, యితర వెనుకబడిన కులాలకు 52, బ్రాహ్మణులకు 7, క్రైస్తవులకు 2, జైనులకు 2 యిచ్చింది. ఒక అధ్యయనం ప్రకారం 2013 ఎన్నికలలో లింగాయతుల ప్రాబల్యం ఉన్న 50 సీట్లలో కాంగ్రెసుకు 29, బిజెపి 16, జెడిఎస్ 1 గెలిచాయి. ఈ సారి యిక్కడున్న సగానికి పైగా సీట్లు బిజెపి గెలుచుకుంటుందని, తక్కినవి కాంగ్రెసు, జెడిఎస్ పంచుకుంటాయని అంచనా.
-ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2018)
[email protected]