కర్ణాటక రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే దాన్ని ఆరు ప్రాంతాలుగా విడగొట్టి విశ్లేషించాలి. దశాబ్దాలుగా అధ్యయనం చేసిన పరిశీలకులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన రాజకీయ వాతావరణం, ఒక్కో తరహా ఓటింగు ధోరణి వున్నాయని గమనించారు. ఇవన్నీ కలిపి చూస్తేనే సమగ్రరూపం తేలుతుంది. ఈ ప్రాంతాలను ఐడెంటిఫై చేయడంలో పరిశీలకులందరూ ఒక్క తాటిపై లేరు. కొన్ని సరిహద్దు జిల్లాలను కొందరు ఒక ప్రాంతంలోకి వేస్తే, మరి కొందరు పక్క ప్రాంతంలో వేస్తున్నారు. ఏది ఏమైనా స్థూలంగా చూస్తే – హైదరాబాదు కర్ణాటకలో లింగాయతులు, మైనారిటీలు, దళితులు బలంగా ఉన్నారు.
కాంగ్రెసు, బిజెపి సమాన బలంతో ఉన్నాయి. బొంబాయి కర్ణాటకలో లింగాయతులకు, బిజెపికి బలం ఎక్కువ. మధ్య కర్ణాటకలో లింగాయతులు, ఒక్కళిగలు బలంగా ఉన్నారు. కాంగ్రెసు, బిజెపి, జెడిఎస్ మూడు బలంగానే ఉన్నాయి. కోస్తా కర్ణాటకలో మైనారిటీలు, హిందూత్వ శక్తులు బలంగా ఉన్నాయి. బిజెపికి బలం ఉంది. దక్షిణ కర్ణాటక (పాత మైసూరు) ప్రాంతంలో ఒక్కళిగలు బలంగా ఉన్నారు. జెడిఎస్‌కు ప్రధాన కార్యస్థానం. కాంగ్రెసుకు కూడా ఉంది కానీ బిజెపికి బలం లేదు. బెంగుళూరు నగరం కాంగ్రెసు, బిజెపిల మధ్య ఊగుతూ ఉంటుంది. జెడిఎస్‌కు 1,2 మించి రావు. ఇప్పుడు వీటి గురించి విపులంగా తెలుసుకుందాం. సందర్భం బట్టి స్థానిక అంశాలను ప్రస్తావిస్తాను. రేపు ఉదయంలోపున యివన్నీ చదివేయగలిగితే ఫలితాలు ఎందుకలా వచ్చాయో అర్థం కావటం సులభం.
హైదరాబాద్ కర్ణాటక
ఒకప్పుడు నైజాం ఏలుబడిలో వుండి కర్ణాటకలో కలిసినదే 19 స్థానాలున్న హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం. బీదర్, కలబురిగి (గుల్బర్గా), యాదగిర్ జిల్లాలున్నాయి. బాగా వెనుకబడిన ప్రాంతం. పొరుగునే ఉన్న రాయచూరు, కొప్పల్, బళ్లారి జిల్లాల (వీటిని మధ్య కర్ణాటకలో భాగంగా లెక్క వేస్తున్నారు కొందరు)ను కూడా వీటిలో కలిపి కొందరు వ్యవహరిస్తారు. కాంగ్రెసు దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే యిక్కడివాడే. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లిములు, దళితులు, గిరిజనులు, కాంగ్రెసుకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఒక అధ్యయనం ప్రకారం 2013 ఎన్నికలలో ఎస్సీ ఎస్టీల ప్రాబల్యం ఉన్న 54 సీట్లలో కాంగ్రెసు 28, బిజెపి 9, జెడిఎస్ 11 గెలిచాయి. ఇతరులకు 6 వచ్చాయి.
మైనారిటీల ప్రాబల్యం ఉన్న 14 సీట్లలో కాంగ్రెసు 9, జెడిఎస్ 2 గెలిచాయి. ముస్లిములు జనాభాలో 12.5% ఉన్నారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో, ముంబయి-కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నా రాష్ట్రంలో అన్ని చోట్లా ఉన్నారు. 15%, అంతకంటె తక్కువగా 174 స్థానాల్లో, 16-20%గా 35 స్థానాల్లో 20% కంటె ఎక్కువగా 15 స్థానాల్లో ఉన్నారు. వీళ్లల్లో ఎక్కువమంది కాంగ్రెసు మద్దతుదారులు. కొందరు జెడిఎస్‌కు మద్దతు పలుకుతారు. 8 మంది ముస్లిములకు టిక్కెట్లు యిచ్చిన కుమారస్వామి తాము నెగ్గితే ముస్లిముకు ఉపముఖ్యమంత్రి పదవి యిస్తానన్నాడు.
బిజెపి ఒక్క ముస్లిముకూ టిక్కెట్టు యివ్వలేదు. ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ఛోటా పార్టీల చేత ముస్లిం అభ్యర్థులను నిలబెట్టి వాళ్ల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెసుకు పడకుండా జాగ్రత్తలు పడుతోందట. కాంగ్రెసును ముస్లిం పక్షపాత పార్టీగా చూపించడానికి మాటిమాటికి 2015 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న టిప్పు జయంతి గురించి మాట్లాడుతోంది. నిజానికి ప్రభుత్వం నిర్వహించే జయంతులు అనేకం ఉన్నాయట.
కాంగ్రెసు ప్రభుత్వం ఆర్టికల్ 371 (జె) కింద యీ ప్రాంతాభివృద్ధికి బోర్డు పెట్టి రూ. 2500 కోట్ల నిధులు సమకూర్చడంతో బాటు మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కాలేజీల్లో 75% సీట్లు స్థానిక విద్యార్థులకు రిజర్వ్ చేయడం వలన కాంగ్రెసు పట్ల ఆదరణ ఉంది. ఆ ప్రతిపాదనను 2002 నాటి ఎన్డిఏ ప్రభుత్వం తిరస్కరించగా తర్వాత వచ్చిన యుపిఏ ప్రభుత్వం ఆమోదించింది. అందువలన గతంలో కాంగ్రెసు యిక్కడా బాగా గెలిచినా యీసారి బలహీనపడిందనే వాదన వినబడుతోంది.
ఎందుకంటే ఈ ప్రాంతంలో షెడ్యూల్ కులాలలో వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్న మాదిగలు, యితరులు వున్నారు. వర్గీకరణకు ఎజె సదాశివ కమిటీ ఆమోదం తెలిపినా, అమలు చేయనందుకు కాంగ్రెసుపై కోపగించుకున్న మాదిగలు బిజెపిని ఆదరించవచ్చంటున్నారు. పైగా ఇక్కడ అధికసంఖ్యలో ఉన్న లింగాయతుల మద్దతు బిజెపికి ఉంది. దానికి తోడు బిజెపికి అండగా నిలిచిన బళ్లారి మైనింగు వ్యాపారస్తులు గాలి సోదరుల ప్రభావం యీ ప్రాంతంపై కూడా ఉంది.
గాలి సోదరుల్లో జనార్దనరెడ్డి చిన్నవాడు. అన్నలు కరుణాకర్, సోమశేఖర్. కానీ అందరూ జనార్దన్ మాటే వింటారు. బళ్లారి వీళ్ల అధీనంలోకి రావడానికి కొంత నేపథ్యం ఉంది. 2000 సం. వరకు మైనింగులో భారీ లాభాలు లేవు. టన్ను ముడి యినుము తవ్వడానికి రూ.150 ఖర్చయితే, మార్కెట్ రేటు రూ.250 ఉండేది. వచ్చిన దానిలో రాయల్టీ కింద రూ.16.50 కట్టేవారు. బళ్లారి ఖనిజం క్వాలిటీ తక్కువ కాబట్టి అమ్మకాలూ అంత బాగుండేవి కావు. అయితే 2000 సం. తర్వాత యినుము కొనడానికి చైనా ముందుకు రావడంతో టన్ను రేటు రూ.600 నుంచి 1000 దాకా పెరిగింది.
కొన్నాళ్లకి ఏకంగా రూ.6 వేలైంది. ఇక గనుల యజమానులందరికీ భాగ్యం పట్టింది. దెబ్బకు జీవనశైలే మారిపోయింది. ఎలాట్ అయిన గనులే కాక, పక్క గనులు కూడా తవ్వడం మొదలుపెట్టారు. మాఫియా ప్రవేశించింది. బళ్లారి పరిసర ప్రాంతాల్లో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. అంటే మొత్తం స్థానాల్లో 10% అన్నమాట. గాలి సోదరులు బిజెపికి అండగా నిలిచి తమ ప్రాధాన్యతను పెంచుకున్నారు. సోనియాకు వ్యతిరేకంగా సుష్మా స్వరాజ్‌ను నిలబెట్టి ఆమె మా యింటి ఆడపడుచు అన్నారు.
ఎడియూరప్పకు అండగా నిలబడి అతను ముఖ్యమంత్రి అయ్యాక గాలి సోదరులిద్దరూ, అతని అనుచరుడు శ్రీరాములు మంత్రిపదవులు తీసుకున్నారు. వాళ్లపై ఎన్నో ఆరోపణలు, మరెన్నో కేసులు. చివరకు లోకాయుక్త నివేదిక ఆధారంగా గాలి సోదరులపై ఎడియూరప్ప ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వాళ్లు తిరుగుబాటు చేశారు. బిజెపి ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అలాటి వారినే యిప్పుడు బిజెపి మళ్లీ ఆశ్రయించింది.
ఇక్కడ తమ బేస్ పోగొట్టుకుంటే కష్టమని రాహుల్ తన కర్ణాటక ప్రచారాన్ని యిక్కడ నుంచి ప్రారంభించాడు. తమ వంతుగా బిజెపి రామ్ మాధవ్‌కు యీ ప్రాంత బాధ్యతలు అప్పగించింది. క్లిష్టమైన అనేక రాష్ట్రాలలో నెగ్గుకుని వచ్చిన రామ్ మాధవ్ యిక్కడ ఏ మేరకు సాధిస్తాడో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]