గతంలో మతకల్లోలాలు రేకెత్తించాలంటే ఆవుని చంపి గుళ్లో పడేయడమో, పందిని చంపి మసీదులో పడేయడమో చేయాల్సి వచ్చేది. ఇప్పుడా శ్రమ లేదు. ఫేస్‌బుక్‌లో ఓ కామెంటు పెడితే చాలు, అగ్గి ముట్టించినట్లే. బెంగాల్‌లో యీ మధ్య యీ తరహా చేష్టలు ఎక్కువయ్యాయి. తాజాగా ఉత్తర 24 పరగణా జిల్లాలో ముస్లిములు ఎక్కువగా వున్న బసీర్‌హాట్ సబ్‌డివిజన్‌లోని బదూరియా గ్రామానికి చెందిన సౌవిక్ సర్కార్ అనే 17 ఏళ్ల విద్యార్థి ముస్లిములను కించపరుస్తూ జులై 2 న ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగు పెట్టాడు. మర్నాడు రాత్రి కల్లా దాదాపు వెయ్యి మంది ముస్లిములు అతని యింటి మీద పడ్డారు. సామానులు ధ్వంసం చేశారు, నిప్పుపెట్టారు. సౌవిక్‌ను రక్షించడానికిి వచ్చిన పోలీసులతో ఘర్షణ పడ్డారు. దాడి మొదట్లో కాస్సేపు ఏకపక్షంగా సాగింది. అ తర్వాత యిరుపక్షాలూ తలపడ్డాయి. చుట్టుపట్ల వున్న యిళ్లలో సామాను ఎత్తుకుపోయారు. పోలీసు స్టేషన్, 12 పోలీసు వాహనాలు పాక్షికంగా తగలబడ్డాయి, 20 మంది పోలీసులతో సహా 25 మంది గాయపడ్డారు. ఒకరు చనిపోయారు. జులై 8 నాటికి హింస తగ్గినా 11 వరకు గంభీర వాతావరణం నెలకొంది. గత నెలలో సోషల్ మీడియా పోస్టింగుల కారణంగా బెంగాల్‌లో వివిధ ప్రాంతాలలో ఏడు మతకలహాలు జరిగాయి. గత ఐదేళ్లగా గ్రామీణ బెంగాల్‌లో మొత్తం 16 జరిగాయి. బెంగాల్‌లో ఎలాగైనా ఎదగాలని బిజెపి దృఢసంకల్పం చేసుకున్ననాటి నుంచే వీటి జోరు పెరిగిందని, మతసామరస్యం వున్న బెంగాల్ సమాజంలో కావాలని బిజెపి, ఆరెస్సెస్ వర్గాలు చిచ్చు పెడుతున్నాయని, మతపరంగా ఓటర్లను చీల్చడానికే నిత్యం అల్లర్లు జరిగేట్లు చూస్తున్నారని మమతా బెనర్జీకి సందేహం.
దానికి తోడు యీ సంఘటనలపై బెంగాల్ గవర్నరు కేసరి నాథ్ త్రిపాఠి తనకు ఫోన్ చేసి స్వయంగా సంజాయిషీ అడగడంతో మండిపడింది. తనను అవమానించాడని, ఒక గవర్నరులా కాకుండా బిజెపి బ్లాక్ ప్రెసిడెంటులా వ్యవహరించాడని ఆరోపించింది. ''నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. ఆయనను కేంద్రం నామినేట్ చేసింది. ఆయన నాకు ఫోన్ చేసి అవమానకరంగా మాట్లాడాడు.'' అంది. హోం మంత్రికి ఫిర్యాదు చేసింది. రాజనాథ్ సింగ్‌కు గవర్నరు త్రిపాఠీ వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఫోన్ చేసి కాస్త నిదానించమని కోరాడని భోగట్టా. గవర్నరుకు కొన్ని మొహమాటాలుంటాయి కానీ పార్టీలకు ఏముంటాయి? కేంద్రం అదనపు బలగాలను పంపుతానని చేసిన ఆఫర్‌ను మమత తిరస్కరిస్తే ''ఈ అల్లర్లకు కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన జిహాదీలేనని అందరికీ తెలుసు. కేంద్ర బలగాలైతే ఆ జిహాదీలను పట్టుకుని పోలీసులకు అప్పగించేవారు. మమతకు యిది యిష్టం లేదు. ముస్లిములకు కోపం వస్తుందని ఆమె భయం.'' అన్నాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్. బంగ్లాదేశ్‌లో టెర్రరిస్టులు జమాత్-ఉల్-ముజాహిదీన్ పేర సంఘంగా ఏర్పడి పశ్చిమ బెంగాల్‌లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వం దృష్టికి తెచ్చిన విషయం ఏప్రిల్‌లో మీడియాలో కూడా వచ్చింది.
అల్లర్లకు కారణం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సంఘవ్యతిరేక శక్తులని మమత అంటూనే, ఇంటెలిజెన్సు వైఫల్యం జరిగిందంటూ సీనియర్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. ఎడిషనల్ డైరక్టర్ జనరల్ (ఇంటెలిజెన్సు) గంగేశ్వర్ సింగ్, ఇన్‌స్పెక్టరు జనరల్ (సౌత్ బెంగాల్), జిల్లా సూపిరింటెండెంట్ ఆఫ్ పోలీసులను బదిలీ చేసింది. ఇంటెలిజెన్సు విభాగంలో సీనియర్ అధికారులు గంగేశ్వర్ సింగ్ పొరపాటు ఏమీ లేదని వాదిస్తున్నారు. 'మాల్డా, వర్ధమాన్, ముర్షీదాబాద్, హౌడా, ఉత్తర 24 పరగణాలలో జమాత్ కార్యకలాపాల గురించి విపులంగా రిపోర్టులిచ్చారాయన. ఇక అల్లర్లు ఏ ముహూర్తంలో జరుగుతాయనేది ఏ యింటెలిజెన్సు అధికారీ చెప్పలేడు. విషపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసి పెట్టారు వాళ్లు. తగలేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. సోషల్ మీడియా ద్వారా ఆ అగ్గిపుల్లలు గీస్తున్నారు.' అంటున్నారు వాళ్లు. ప్రస్తుత కేసులో సోషల్ మీడియాలో పోస్టు పెట్టినతను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. అతను పేదవాడు, ఒక మేస్త్రీ కొడుకు. తొమ్మిదో క్లాసు చదువుతున్నాడు. అతని మావయ్యలిద్దరు పోలీసు డిపార్టుమెంటులో వున్నారు. అతను పోస్టు పెట్టి వుండకపోవచ్చని కూడా అతని స్నేహితులు అంటున్నారు. అతని పేర రెండు ఎక్కవుంట్లు వున్నాయట. ఇప్పుడు రెండూ మూతబడ్డాయి. ఎవరో అతని ఖాతాను వాడుకుని వుండవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం హిందూ-ముస్లిం ఐక్యతకు పెట్టింది పేరు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత కూడా అక్కడ అల్లర్లు చెలరేగలేదు. ఇప్పుడు కూడా కొందరు ముస్లిములు అల్లర్లలో నష్టపోయిన హిందువులకోసం విరాళాలు సేకరిస్తున్నారు. ఈ కలహాలు తన కొంప ముంచుతాయని మమతా బెనర్జీ భయం. రాష్ట్రంలో బూత్ స్థాయిలో 60 వేల శాంతి కమిటీలను ఏర్పాటు చేసి నిత్యం పరిస్థితి పర్యవేక్షించాలని సంకల్పించింది. సైబర్ సర్వయిలెన్స్ టీముకు సర్వాధికారాలు యిచ్చి యిటువంటి పోస్టులు పెట్టేవారిని తీవ్రంగా శిక్షించాలని కూడా యోచిస్తోంది.
గొడవలకు మూలకారణం మతం కాదని, బంగ్లాదేశ్ నుంచి పశువులను దొంగతనంగా తరలించే ముఠా ప్లాను చేసిన గలభా అని చాలామంది అభిప్రాయం. బంగ్లాదేశ్‌తో ఆ జిల్లాకు 100 కి.మీ.ల సరిహద్దు వుంది. రోజుకి రూ.40-50 కోట్ల రూ.ల విలువైన పశువుల స్మగ్లింగ్ వ్యాపారం జరుగుతోందని ఒక అంచనా. ''మా ప్రభుత్వం దాన్ని అరికట్టడానికి చూస్తోంది. అందుకనే ఆ స్మగ్లర్లు యిలా తెగబడ్డారు. దాడికి పాల్పడినవారు స్థానికులు కాదని గ్రామస్తులు చెపుతున్నారు.'' అంటున్నాడు ఆహారమంత్రి జ్యోతిప్రియ మల్లిక్. ఆరెస్సెస్ జనరల్ సెక్రటరీ జిష్ణు బాసు స్మగ్లింగ్ మాట ఒప్పుకుంటూనే స్థానిక తృణమూల్ నాయకులకు వాళ్లతో వాటా కుదరకే యీ పేచీ వచ్చిందని అంటాడు. ఈ స్మగ్లర్లతో హర్కత్-ఉల్-ముజాహిదీన్ అనే టెర్రరిస్టు గ్రూపు, ఆల్ ఇండియా సున్నత్ అల్ జమాయత్ చేతులు కలిపాయని ఆరోపించాడు. సమస్య యింత జటిలంగా వుండగా గవర్నరు సహకరించడం మానేసి మమతా బెనర్జీని నిలదీయడమేమిటని తృణమూల్ వారి అభ్యంతరం. దీని వెనక్కాల బిజెపి హస్తం వుందంటూ మమత ఒక మౌలికమైన ప్రశ్న లేవనెత్తింది – ''బంగ్లాదేశ్ నుంచి వచ్చి దాడులు జరిపారని తెలుస్తూనే వుంది. వారికి సరిహద్దులు తెరిచినవారెవరు? సరిహద్దులు కాపాడవలసినది కేంద్రమే కదా. ఇన్నాళ్లూ లేనిది, యిప్పుడు సడన్‌గా సరిహద్దుల్లో భద్రత ఎందుకు తగ్గింది?'' అని.
రామనవమి, హనుమజ్జయంతి ఊరేగింపులు విజయవంతం కావడంతో ఉత్సాహపడిన బిజెపి తర్వాత్తర్వాత నీరసించింది. కేవలం మతపరమైన ఉత్సవాలే కాకుండా ప్రజాసమస్యలపై కూడా ఉద్యమించాలని అమిత్ షా బిజెపి నాయకులకు ఉద్బోధించాడు. దానితో వాళ్లు మే 25న 'లాల్‌బజార్ అభియాన్' పేరుతో కలకత్తా పోలీసు హెడ్‌క్వార్టర్సును ముట్టడించే కార్యక్రమం పెట్టుకున్నారు. పెద్ద హంగుతో ప్రారంభమైనా జనం కలిసి రాకపోవడంతో అది చప్పగా ముగిసింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్, ఎంపీ రూపా గంగూలీ, జాతీయ నాయకుడు కైలాస్ విజయవర్గీయ అనారోగ్యం అని చెప్పి ఊరేగింపులోంచి తప్పుకుని అరెస్టయ్యారు. బెయిల్ తీసుకోకుండా ఆ రాత్రంతా కస్టడీలోనే గడిపారు. దానికి మూడు రోజుల ముందు లెఫ్ట్ పార్టీలు నిర్వహించిన ఊరేగింపు బ్రహ్మాండంగా సక్సెసయింది. నాలుగు గంటలపాటు ఊరంతా స్తంభించింది. దాంతో పోలిస్తే బిజెపిది మరీ ఫ్లాప్ షో అనిపించింది. కలకత్తా, మాయాపూర్, మహేశ్‌లలో ఇస్కాన్ వాళ్లు జరిపే రథయాత్ర సందర్భంగా జరిగిన ఊరేగింపులలో మళ్లీ బిజెపి పుంజుకుంటుందేమో అనుకుంటే వాళ్లెక్కడా కనిపించలేదు. 'ఇస్కాన్‌వాళ్లు మమ్మల్ని పిలవలేదు. ఎందుకంటే ఆ రథయాత్రల్లో తృణమూల్ వాళ్లే ప్రతీ ఏడూ రథాన్ని లాగుతూంటారు.' అన్నాడు ఓ బిజెపి నాయకుడు. బెంగాల్‌లో మమతకు దీటుగా మహిళా నాయకురాలిని నిలబెట్టాలని రూపా గంగూలీ, లాకెట్ చటర్జీలను బిజెపి ప్రయోగించి చూసింది కానీ సఫలం కాలేకపోయింది. ఇలాటి పరిస్థితుల్లో మతకలహాలు జరగగానే తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి బిజెపి గవర్నరు ద్వారా ప్రయత్నించిందని తృణమూల్ అభియోగం.
''బిజెపి నాయకులు వెళ్లి ఫిర్యాదు చేయగానే ఆయన స్పందించాడు. మేం అనేక విషయాల్లో ఆయనకు లేఖలు రాశాం. కేంద్రానికి చెప్పి నిధులు విడుదల చేయించమన్నాం. అప్పుడు ఉలకలేదు, పలకలేదు కానీ యిప్పుడు మాత్రం మహా చురుగ్గా వున్నారు.'' అన్నాడు పార్థా చటర్జీ అనే మంత్రి. బదులుగా రాజభవన్ నుంచి ఒక ప్రెస్ నోట్ వెలువడింది. ''రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల సమస్య గురించి దృష్టి మరల్చడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆరోపణలు నిరాధారమైనవి, పశ్చిమ బెంగాల్ ప్రజలను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయాలని ఉద్దేశించినవి. ఇప్పటికైనా గవర్నరుపై ఆరోపణలు మానుకుని, కులమతభావనలకు అతీతంగా వ్యవహరించి, రాష్ట్రంలో శాంతి నెలకొల్పితే మంచిది.'' అని. గవర్నరు బిజెపి ఏజంటుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరేట్లు బిజెపి జాతీయ సెక్రటరీ రాహుల్ సిన్హా ''గవర్నరు మోదీవాహినిలో ఒక సైనికుడు'' అని ప్రకటన చేశాడు. తృణమూల్‌వాళ్లు దాన్ని ఎత్తిచూపడంతో బిజెపిలో బెంగాల్ వ్యవహారాలు చూసే కైలాశ్ విజయవర్గీయ 'అది అతని వ్యక్తిగత అభిప్రాయం. పార్టీకి సంబంధం లేదు.' అని ప్రకటించాడు.
అల్లర్లు ప్రారంభమయ్యాక కొందరు బిజెపి నాయకులు మరింత ఆజ్యం పోయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర నాయకులు కొందరు నిషేధాజ్ఞలు ఉల్లంఘించి కల్లోల ప్రాంతాలకు వెళ్లబోయారు. ఫేస్‌బుక్‌నైతే విచ్చలవిడిగా వాడుకున్నారు. విజేతా మాలిక్ అనే హరియాణా బిజెపి నాయకురాలు 'బెంగాల్‌లో పరిస్థితి హిందువులందరికి చింత కలిగిస్తోంది' అని పోస్టు చేసింది. నూపుర్ శర్మ అనే దిల్లీ బిజెపి నాయకురాలు 2002 గోధ్రా సంఘటనల ఫోటోను బసీర్‌హాట్‌లో జరిగినట్లు పోస్టు చేసింది. దాంతో కలకత్తా పోలీసు ఆమెపై కేసు పెట్టారు. ఎవరు పెట్టారో తెలియదు కానీ బంగ్లాదేశ్‌లోని కొమిల్లాలో జరిగిన సంఘటన వీడియోను, మరొకరు ఒక భోజపురి సినిమాలో ఒక మహిళపై జరిగిన అత్యాచారం దృశ్యాన్ని యిక్కడ జరిగినట్లు పోస్టు చేశారు. ''హిందూస్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. తృణమూల్‌లోని హిందువులారా! మీరు హిందువులేనా?'' అని కాప్షన్ పెట్టారు. మరొకరు గాయాలతో రక్తమోడుతున్న యిద్దరి ఫోటో పెట్టి వాళ్లు సౌవిక్ సర్కార్ తలిదండ్రులని రాశారు. నిజానికి అది ఏడాది క్రితం వేరే చోట జరిగిన సంఘటనలోది. ఇవన్నీ చూసి మమతా బెనర్జీ ''బిజెపి ఫేస్‌బుక్‌ను ఫేక్‌బుక్‌గా మార్చేసి మతకలహాలను రెచ్చగొడుతోంది.'' అని ఆరోపించింది. (ఫోటో – బసీర్‌హాట్ దృశ్యాలు)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2017)