సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు ‘తెలంగాణ తీర్మానం అమలు కాకుండా నిలిపివేశాం’ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. పళ్లంరాజు వంటి సౌమ్యులు మాత్రం ‘నిలిపివేశామని చెప్పను కానీ పునరాలోచించేట్లు చేశాం’ అంటున్నారు. తెలంగాణ నాయకులు ‘ఏమీ ఆగలేదు. మనం అనుకున్న రీతిలోనే కాబినెట్ నోట్ శరవేగంతో పరుగులు పెడుతోంది. మామూలుగా పట్టే టైముని తగ్గించుకుంటూ వస్తున్నారు.
అసెంబ్లీ గిసెంబ్లీ జాన్తానై, తెలంగాణ రావడం ఖాయం.’ అంటున్నారు. గురువారం కేబినెట్ సమావేశంలో నోట్ పెడతారట అంటూ బుధవారం న్యూస్. అబ్బే, ఇప్పట్లో ఏమవుతుంది? పీఠిక తయారుచేయడానికే తలలు పట్టుకుంటున్నారు అని కిరణ్ నోరు చప్పరించినట్లు ఆ పక్కనే ఇంకో న్యూస్. గురువారానికల్లా కేబినెట్ నోట్ ఆగిపోయిందని, శుక్రవారం సమావేశం ఎజెండాలో లేదని.. హెడ్‌లైన్స్. ‘నేను హోం శాఖలో అడిగితే నోట్ తయారుచేయమని మాకెవరూ చెప్పలేదు’ అని వెంకయ్యనాయుడు అన్నట్టు వార్త. మళ్లీ దానికిందే ‘రహస్యంగా తయారుచేసి ఎడిషినల్ ఎజెండా పంపిణీ చేస్తారు’ అని ఇంకో వార్త.
ఇలా ఇంత గందరగోళంగా వార్తలు, …సారీ లీకులు, వెలువడుతూ ఉంటే ఢిల్లీలోని అమ్మలగన్నయమ్మ సోనియమ్మ మాత్రం నోరు విప్పటం లేదు. తక్కుంగల నాయకమ్మన్యులు మాత్రం ‘కేబినెట్ నోట్ తయారైంది, వచ్చేస్తోంది..’ అని విభజనకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వెళ్లిన సీమాంధ్ర నాయకుల వద్ద ‘మూలపుటమ్మ సోనియమ్మ సమైక్యం అంటే మండిపడుతోంది. ఆ మాట మాత్రం ఎత్తకుండా ‘విభజన అంగీకరిస్తు న్నామనుకోండి, కానీ మా ఇబ్బందులు మాకుంటాయి కదా… అని మొరపెట్టుకుంటే కాస్తయినా వింటుంది.’ అని చెప్తున్నారు. సోనియా మూడ్ గమనించిన తెలంగాణ కాంగ్రెసు నాయకులు సోనియాను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడానికి ఇదే అదనని ‘తెలంగాణలో ఇంటింటికి వెళ్లి సోనియా మనకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేసిందని చెప్తాం.’ అంటున్నారు. ‘రేపు ఏ కారణం చేతనైనా ఇవ్వకపోతే మీరు అప్రతిష్టపాలై పోతారు సుమా’ అనే బెదిరింపు అందులో ఉంది.
ఆంటోనీ కమిటీ చేసినదేమైనా ఉందా?
సీమాంధ్రలో ఉద్యమం సాగిపోతూ.. ఉంది. దాని గురించి పట్టించుకున్నవాడు ఎవడూ కనబడటం లేదు. ఢిల్లీ మీడియాలో కూడా దీని గురించి పెద్దగా వార్తలు రావటం లేదట. ఎక్కడైనా గొడవ జరిగితే చాలు, కెమెరాలతో వాలిపోయే మీడియా దీని విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండడం వెనకాల ఏమైనా ప్లాను ఉందేమో తెలియదు. కేంద్ర నాయకులెవరూ ‘మీ ఆందోళన గుర్తించాం. మా మాట విని ఓ పదిరోజులు ఆపండి.’ అని బహిరంగంగా అనటం లేదు. సోనియా ఆవిడ గొడవల్లో ఆవిడ ఉంది. ఆంటోనీ కమిటీ చాలకపోతే కేబినెట్ కమిటీ వేస్తాం అని యదాలాపంగా అంది తప్ప ఆ దిశగా అడుగులు పడలేదు. ‘ఆంటోనీ కమిటీని సీమాంధ్రకు తీసుకువచ్చి ఆందోళనను ప్రత్యక్షంగా చూపిస్తాం’ అని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయినా ఆ కమిటీకి తీరిక చిక్కలేదు. వాళ్లు నివేదిక ఇచ్చేశాక ఇంకా వచ్చి ఏం చూస్తారో తెలియదు. నివేదికలో కూడా ఏమిచ్చారట? ‘సీమాంధ్ర నాయకులు బోల్డు సమస్యలు లేవనెత్తారు కానీ పరిష్కారాలు చెప్పలేదు. పరిష్కారం ఏమిటో మాకూ తోచలేదు. మీరే గట్టిగా ఆలోచించండి.’ అని చెప్పి చేతులు కడుక్కున్నారట. ‘అబ్బే, అది నివేదిక కాదు, ఫైనల్ నివేదిక ఇవ్వాలి, ఆంటోనీగారు కోలుకుని వచ్చాక ఇస్తారు’ అని మొయిలీ అన్నట్టు గురువారం పేపర్లో వచ్చింది.
అయ్యా ఆంటోనీ గారూ, వారు వచ్చి విభజన వలన వచ్చే సమస్యలు లేవనెత్తారు, కరేక్ట. అవి నిజమైన సమస్యలా కాదా మీరు చెప్పాలి. నిజమైనవే అయితే పరిష్కారాలు కూడా మీరే చెప్పాలి. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నది మీవాళ్లు. దానివలన వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో ముందే ఆలోచించి ఉంటారు కదా, .. ఉండాలి కదా. లేకపోతే రోడ్ మ్యాప్‌కి అర్థం ఏమిటి? డిప్యూటీ సిఎం గారు విభజించమన్నారు. సిఎం గారు వద్దన్నారు. ఇద్దరివీ చెరో రోడ్ మ్యాప్! ఈ సమస్యలన్నీ సిఎం గారి మ్యాప్‌లో వున్నాయి. డిప్యూటీ సిఎంగారి మ్యాప్‌లో యీ సమస్యలకు పరిష్కారాలున్నాయో లేదో చూసుకోవలసినది మీరు. లేకపోతే అవి కూడా చేర్చి పట్టుకుని రా అని చెప్పి ఉండాల్సింది. ఆయన చెప్పినది గంటసేపు ఆసక్తిగా విన్నారట కదా. అప్పుడు డౌట్సు ఏమీ రాలేదా? …పోనీ తరవాతైనా? మరి ఏమీ ఆలోచించకుండా నిర్ణయం ఎవడు తీసుకోమన్నాడు? తీసుకున్నాక, సమస్యలున్నాయంటూ సీమాంధ్రులు ఉద్యమిస్తే తప్ప స్పృహలోకి రాలేదంటే ఏ మత్తులో వుండి విభజన ప్రకటించినట్టు? గొడవొచ్చాక మీ కమిటీ వేశారు. ‘అది పార్టీ కమిటీ కాబట్టి మేం దాన్ని పట్టించుకోం’ అని మిగతా వాళ్లు అంటే ‘పోన్లే కేబినెట్ కమిటీ వేస్తాం’ అన్నారు. ఆ కేబినెట్ కమిటీ ఏదో ముందే వేయవచ్చుగా, కాలయాపన కాకపోతే! ఆంటోనీ కమిటీ చేతులెత్తేసినట్టు కనబడుతోంది. ఇక కేబినెట్ కమిటీ ఏం ఉద్ధరిస్తుందో చూడాలి.
కేబినెట్ నోట్ గుడుగుడు గుంచం
ఈ కాలయాపన ఇలా జరుగుతూండగానే హోం శాఖలో కేబినెట్ నోట్ తయారయిపోతోందంటూ ప్రకటనలొకటి. నోట్ దారిన నోట్ తయారై పోతూ వుంటే ఇక ఆంటోనీ కమిటీతో మొరపెట్టుకోవడం దేనికి, కంఠశోష కాకపోతే? న్యాయశాఖకు కూడా వెళ్లి వచ్చేస్తోందంటూ లీకులు కూడా వచ్చాయి. ఇప్పుడు న్యాయశాఖ మాత్రమే కాదు ఇంకో పది శాఖల వద్దకు వెళ్లి రావాలని చెప్తున్నారు. ఒక్కోచోట ఎంతెంత టైము ఇస్తారో పేపర్లలో విపులంగా వచ్చింది. రాష్ట్రపతి వద్దకు వెళ్లేసరికి హీనపక్షం ఆరువారాలు పడుతుందట. కేబినెట్ రెండు వారాల్లో వస్తుంది అని దిగ్విజయ్ చెప్పారు. ఏడువారాలయ్యాక కూడా రెడీ కాలేదు. ఆంటోనీ కోలుకుని, సీమాంధ్ర పర్యటించి, ఆ తర్వాత నివేదిక ఇచ్చాక కేబినెట్ నోట్ తయారవుతుందనుకుంటే.. ఎప్పటికి తయారయ్యేను? ఇచ్చాక ఆరువారాలంటే.. ఈ లెక్కన ఆ ఆరు, పదహారు వారాలా?
ఇక్కడ ఇంకో చిక్కు ఏమిటంటే – ఈ నోట్ తిరగవలసిన శాఖల్లో కొన్ని సీమాంధ్ర మంత్రుల శాఖలు కూడా ఉంటాయి. వాళ్లు డిసెంట్ నోట్ రాయవచ్చు. దానికి సరైన సమాధానం చెప్పి మరీ ముందుకు కదలవలసి వస్తుంది. ఏదైనా క్వెరీ వస్తే సమాచారం కోసం రాష్ట్రానికి రాయాలంటే మాత్రం పెద్ద చిక్కే! ఇక్కడ కీలకమైన పదవిలో ఉన్న కిరణ్ కథ ముందుకు సాగకుండా నానారకాల అడ్డుపుల్లలు వేస్తూ కూర్చుంటారు. ఏమైందని గట్టిగా గద్దిస్తే సంబంధిత ఉద్యోగులు సమ్మె, సహాయనిరాకరణ అని చెప్పి తప్పించుకుంటారు. ముఖ్యమంత్రి ఇంత విముఖంగా వుంటే బిల్లు ముందుకు ఎలా సాగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే విభజనలో చాలా చిక్కులు ఉన్నాయని సామాన్యమానవుడికి కూడా అర్థం అవుతోంది.
సందేహాలు తీర్చే బాధ్యత లేదా?
ప్రభుత్వం తరఫున బాధ్యత గల వ్యక్తి ఎవరూ విభజన ప్రక్రియ గురించి ప్రజలలో నెలకొన్న గందరగోళాన్ని దూరం చేసే ప్రయత్నమే చేయడం లేదు. చట్టరీత్యా చేయవలసినది ఇది, దీనిలో ఉన్న ఇబ్బందులు ఇవి. వాటిని అధిగమించడానికి మేం చేస్తున్నది ఇది.. అని స్పష్టంగా చెపితే ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. ప్రభుత్వపరంగా వీళ్లు చేస్తున్నది బహుకొద్దిగా ఉంది. ఇదంతా కాంగ్రెసు పార్టీ అంతర్గత వ్యవహారం అన్న ధోరణిలో వ్యవహారం నడుపుతున్నారు. పోనీ పార్టీ అధికార ప్రతినిథి అయినా కొన్ని విషయాలపై క్లారిటీ ఇవ్వాలి. అదేమీ చేయకుండా ఎవరో విలేకరి ఏదో అడిగితే సమాధానం చెపుతున్నట్టు, ఛలోక్తి విసిరినట్టు మాట్లాడితే దానిపై మనం ఇక్కడ సంపాదకీయాలు రాసుకోవాల్సి వస్తోంది. శిలాశాసనాల మేధావి జయపాల్ రెడ్డి గారు చెప్పినా ఫర్వాలేదు, కొంత క్లారిటీ వస్తుంది.
బుధవారం తనను కలిసిన సీమాంధ్ర నాయకులతో అహ్మద్ పటేల్ పరిష్కారాలు చెప్పవలసిన భారం మీదే అన్నారట! వేళాకోళంగా ఉందా!? సమస్య పుట్టించినది వారు. మంచికో, చెడుకో మేం చేసిన ప్రకటన నుండి వెనక్కి వెళ్లలేం, వెళితే తెలంగాణలో ఉద్యమం వస్తుంది అంటున్నది వారు. పరిష్కారాలు చెప్పవలసినది వేరేవారా? డిసెంబరు 9 ప్రకటన చేసినప్పుడు ఇలాంటి కుంటిసాకులే చెప్పారు. ఇప్పుడు చేతిలో కృష్ణ కమిటీ నివేదిక వుంది. ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఏం చేయాలో పెద్దాయన మార్గనిర్దేశకాలు విపులంగా రాశారు. విభజన ఐదో ఆప్షన్ అనుకుంటే అంతకుముందు ఏం చేయాలో ఆయన రాసినది చదవకుండా సగంసగం పనులు చేసి ఇప్పుడు చేతులెత్తేస్తే ఎలా?
రాజ్యాంగ సవరణ అవసరమే అని గట్టిగా ఎందుకు చెప్పరు?
ఇంతకీ మనకి వచ్చే సందేహాలు ఏమిటంటే – జోనల్ సిస్టమ్ ఎత్తేయడానికి రాజ్యాంగ సవరణ అవసరమా కాదా? అసెంబ్లీ తీర్మానానికి వీళ్లు ఇచ్చే ప్రాధాన్యత ఎంత? రాజధాని విషయంలో – యూటీ అన్నా, ఢిల్లీ మోడల్ అన్నా, చండీగఢ్ మోడల్ అన్నా, ఉమ్మడి రాజధాని అన్నా, శాంతిభద్రతలు కేంద్రం చేతిలో పెట్టాలన్నా .. ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి రాజ్యాంగ సవరణ అవసరమా కాదా? సోనియా గాంధీ అన్న కేబినెట్ కమిటీ, కేబినెట్ నోట్ తర్వాతి ఘట్టంలో ఏర్పడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జిఓఎమ్) రెండూ ఒకటేనా, వేర్వేరా?
తక్కిన పార్టీలు ఏడ్చినా, మొత్తుకున్నా, కాంగ్రెసు, బిజెపి చేతులు కలిపితే చాలు సింపుల్ మెజారిటీతో తెలంగాణ బిల్లు పాసయిపోయి కొత్తరాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పేసుకుంటున్నారు. కానీ ఆర్టికల్ 371 డి ద్వారా ఏర్పడిన జోనల్ సిస్టమ్ కారణంగా, రాజధాని ప్రతిపత్తి గురించిన వివాదం కారణంగా రాజ్యాంగ సవరణ అవసరం అని కొందరు రాస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనగానే చాలా చిక్కులతో కూడుకున్నదని అందరికీ తెలుసు. అందువలన తెలంగాణ త్వరగా ఏర్పడాలని కోరుకునేవాళ్లు ‘అబ్బే రాజ్యాంగసవరణ అవసరం లేదు’ అని వ్యాసాలు రాస్తున్నారు. అనేక పత్రికలలో వ్యాసాలు చదువుతూన్న నాకు తొలిరోజుల్లో దిగ్విజయ్ రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడారని గుర్తుకు తెచ్చుకుంటే అది అవసరమనే తోస్తోంది. నేనేమీ న్యాయనిపుణున్ని కాను. సమైక్యవాదిని కాబట్టి వేర్పాటు ప్రక్రియ క్లిష్టం కావాలన్న ఆశాభావంతో పరిస్థితిని ‘మిస్‌రీడ్’ చేయడం లేదు. పోనీ నా అభిప్రాయం తప్పనుకున్నా, రాజ్యాంగ సవరణ అక్కరలేదని కూడా ఘంటాపథంగా ఎవరూ చెప్పలేరని ఎవరికైనా అర్థమవుతుంది. సవరణ అవసరం అంటూ ఎవరైనా కోర్టుకి వెళ్లినా అక్కడ వాదోపవాదాలు జరిగి ప్రక్రియ ఆలస్యం కావడానికి ఛాన్సుందన్న విషయం ఇక్కడ గుర్తించాలి.
జోనల్ సిస్టమ్ ఉంటుందా? ఊడుతుందా?
ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి జోనల్ సిస్టమ్ బాగా పనికి వచ్చింది. కానీ దానివలన ఉద్యోగాలు ఒకచోట, ఉద్యోగులు మరొకచోట ఉండడం సంభవించి పరిపాలనా సౌలభ్యం దెబ్బతింది. అందుకే కెసియార్ టిడిపిలో ఉండగా దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఉద్యమంలోకి దిగాక జోనల్ సిస్టమ్ ఉండి తీరాలని, అది సరిగ్గా అమలు కాకపోవడం వలన తెలంగాణ ఉద్యోగులు నష్టపోయారనీ వాదించసాగారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగ నాయకులు ‘తెలంగాణ ఏర్పడ్డాక జోనల్ సిస్టమ్ ఎత్తేస్తాం’ అంటున్నారు. ఎందుకంటే ఐదో జోన్‌లో నుండి హైదరాబాదుకి వచ్చి స్థిరపడినవారు వెనక్కు వెళ్లడానికి సిద్ధంగా లేరు. వారి కోసం ఇప్పుడు ఇలా వాదిస్తున్నారు. కానీ దానివలన కొన్నాళ్లకు ప్రాంతీయ అసమానతలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే రాజధాని హైదరాబాదులో పలుకుబడి ఉన్నవాళ్లు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలు చేజిక్కించుకోగలరు. అభివృద్ధి చెందిన జిల్లాలకు చెందిన వారు వెనకబడిన జిల్లాల వారి ఉద్యోగాలు హస్తగతం చేసుకోగలరు.
ఉద్యోగావకాశాలు బాగా ఉన్న హైదరాబాదులో ఏదో రకమైన ముల్కీ రూల్సు పెట్టకపోతే ఎవరు ఇక్కడివారో, ఎవరు బయటివారో నిర్ణయించలేరు. తెలంగాణ రాష్ట్రం సాధించి బావుకున్నదేమిటని నిరుద్యోగులు నిస్పృహ చెందుతారు. దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు. అది కేంద్రం నిర్ణయిస్తుందో, కొత్తగా ఏర్పడే రాష్ట్రం నిర్ణయిస్తుందో చూడాలి. వీళ్లు ఏం చేశారో చూసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటివే పాస్ చేస్తారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, కొత్త సంస్థలు అంటూ అక్కడ నిధులు వచ్చి పడి, పనులు మొదలవుతే అక్కడా సడన్‌గా ఉద్యోగాలు పుట్టుకుని వస్తాయి. వాటికోసం తెలంగాణ పౌరులు కూడా ప్రయత్నిస్తారు. హైదరాబాదులో మెరుగైన విద్య పొందిన అభ్యర్థులతో స్థానికులు పోటీ పడవలసి ఉంటుంది. అందువలన అక్కడ కూడా స్థానికతను నిర్వచించి స్థానికులకు ఉద్యోగాలు రిజర్వ్ చేయమని అడుగుతారు.
అసెంబ్లీ తీర్మానం అవసరమా? కాదా?
రెండో అంశం – అసెంబ్లీ తీర్మానం! దాన్ని పట్టించుకోరని తెలంగాణ ఉద్యమకారులు పదేపదే చెప్తున్నారు. తక్కిన విషయాలలో మెజారిటీదే నిర్ణయం అయినా ఈ విషయంలో అది చెల్లదని ఆంబేడ్కర్ ఆర్టికల్ 3 రూపొందిస్తూ చెప్పారని గుర్తు చేస్తున్నారు. మెజారిటీ వారి నిర్ణయం ఫైనల్ కాదని అన్నారు కానీ, వారి అభిప్రాయాలకు ఏ విలువా ఇవ్వనక్కరలేదని, వారి కష్టాలు, ఇబ్బందులు పరిష్కరించనక్కరలేదని, మైనారిటీ ప్రాంతం వాళ్లు, కేంద్రం కలిసి వాళ్ల చిత్తం వచ్చినట్టు చేసేయవచ్చనీ ఆంబేడ్కర్ ఉద్దేశం కాదు. అసెంబ్లీ సమావేశం జరగాలి, చర్చ జరగాలి, తీర్మానం పాస్ చేయాలి. అది కేంద్రం పరిగణనలోకి తీసుకుని బిల్లు రూపొందించాలి. అసెంబ్లీ తీర్మానంలో ఉన్నది తూచ తప్పకుండా చేయనక్కరలేదు కానీ, చర్చల సందర్భంగా లేవనెత్తిన సమస్యలపై దృష్టి సారించాలనే రాజ్యాంగకర్తల అభిప్రాయం అయి వుంటుంది. స్వాతంత్య్రం వచ్చాక ఇన్ని రాష్ట్రాలు ఏర్పరచారు. భిన్నాభిప్రాయాలున్నా, భేదాభిప్రాయాలున్నా ఇరు ప్రాంతాల నాయకులను కూర్చోబెట్టి, చర్చించి, విభజనకు అనుకూలంగా తీర్మానాలు చేయించి వాటి ప్రకారం ఆర్టికల్ 3 ఉపయోగించారు తప్ప ‘మీ అసెంబ్లీ అభిప్రాయంతో మాకేమిటి లెక్క’ అని ఎన్నడూ వ్యవహరించలేదు. ఇప్పుడు అలా చేయాలంటే చాలా మొండిగా వ్యవహరించాలి. అది ఎంతమంది జాతీయ నాయకులకు రుచిస్తుందో వేచి చూడాలి.
ప్రణబ్ ముఖర్జీ అసెంబ్లీ తీర్మానంపై పట్టుదలగా ఉన్నారని వినికిడి. ఉండవల్లి వెళ్లి మాట్లాడితే రాజ్యాంగం ప్రకారం, గత ఉదాహరణల ప్రకారం నడుచుకుంటానని అన్నారట. గత ఉదాహరణల్లో అసెంబ్లీ తీర్మానాన్ని విస్మరించడం ఎన్నడూ జరగలేదు. విస్మరించే పక్షంలో ఫలానా కారణం చేత విస్మరించాం.. అని రికార్డు కావాలనవచ్చు. ఇక అద్వానీ కూడా అనుకూలమైన అసెంబ్లీ తీర్మానం వుండి తీరాలని, విభజన అన్ని ప్రాంతాలకూ ఆమోదయోగ్యంగా ఉండాలనీ స్పష్టపరిచారు. తాము అలాగే చేశామని గుర్తు చేశారు. మోడీయైతే అంత స్పష్టంగా చెప్పలేదు కానీ విభజనలో అన్ని ప్రాంతాలూ మిఠాయిలు పంచుకోవాలి తప్ప, కత్తులు దూసుకోకూడదన్నారు. విభజన వలన కాంగ్రెసు లాభపడుతుందని స్పష్టమవుతున్నకొద్దీ బిజెపికి ఇలాంటి ఆలోచనలు మరిన్ని వస్తాయి. ఈ మధ్య సుష్మా స్వరాజ్ ఆంతరంగిక సంభాషణల్లో ‘కాంగ్రెస్ ఇంట్లో పెళ్లయితే మేమెందుకు బాజాలు వాయించాలి?’ అన్నారట.
బిజెపి-టిడిపి దగ్గరైతే..?
బిజెపిలో ప్రముఖ నాయకుల అభిప్రాయాలు ఇలా బయ టపడడం యదాలాపమా, లేక పద్ధతి ప్రకారం జరుగుతోందా అన్నది తేలాలి. ఎందుకంటే తెలంగాణ తీర్మానం హఠాత్తుగా తెరపైకి తెచ్చి తనను జెల్లకాయ కొట్టడంతో మండిపడిన చంద్రబాబు కాంగ్రెసును ఎదురుదెబ్బ తీయడానికి బిజెపితో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నారన్న వార్తలు చాలా వస్తున్నాయి. అలా జరిగినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే బాబును సమర్థించే ఆయన సామాజికవర్గంలో చాలామంది సమైక్యవాదులే. మేధావి ఐన బాబు ఎలాగోలా చక్రం అడ్డేసి, విభజన ఆపుతారన్న నమ్మకంతో వాళ్లు ఇన్నాళ్లూ ఉన్నారు. తెలంగాణ పక్షాన లేఖ ఇచ్చినా పోనీలే, ఎత్తుల్లో అదొక భాగం అని ఊరుకున్నారు. కానీ అది బెడిసికొట్టింది. బాబు లేఖ వలనే తెలంగాణ ఇచ్చారని సీమాంధ్రలో ప్రచారం జోరుగా సాగుతున్న కొద్దీ టిడిపికి ఆదరణ తగ్గిపోతోంది. ఆ మేరకు తెలంగాణలో పెరగడం లేదు. ఈ సారైనా టిడిపి గెలవకపోతే బాబు స్థానం బాగా దిగజారిపోతుంది. సమైక్య రాష్ట్రం నిలిస్తేనే టిడిపికి ఆ సమర్థకులు మిగులుతారు. నిలపాలంటే టిడిపికి ఉన్న ఏకైక మార్గం బిజెపితో చేతులు కలిపి గతంలోలాగ విభజనకు అడ్డుపడడం!
ఇతర కారణాల వలన కూడా బిజెపితో కలిస్తే టిడిపికి లాభాలున్నాయి. బాబు, మోడీలది ఇద్దరిదీ ప్రపంచబ్యాంకు సిఇఓ స్టయిలే. అభివృద్ధి గురించే మాట్లాడతారు. కార్పోరేట్ మద్దతు ఇద్దరికీ ఉంది. టిడిపికి బిసి ఓటు బ్యాంకు ఉంది. మోదీ బిసి. ఇద్దరూ కాంగ్రెసు వ్యతిరేకులే. టిడిపి పదేళ్లగా ప్రతిపక్షంలో వుంది కాబట్టి నిధులకు ఇబ్బంది వస్తుంది. బిజెపి వద్ద వాటికి కొరత లేదు. టిడిపికి వున్న ఏకైక ఇబ్బంది – ముస్లిం ఓటు పోతుందన్న భయం. అది తెలంగాణలో ప్రభావితం చేసినంతగా ఆంధ్రలో చేయదు. తెలంగాణలో టిడిపికి ఈసారి ఎటూ పెద్దగా ఛాన్సు లేదు. ఇక ఆంధ్రలో ముస్లింలు వైకాపావైపు మళ్లుతున్నారన్న వార్తలూ ఉన్నాయి. మజ్లిస్ ఆంధ్రలోనూ పోటీ చేస్తానంటోంది. ఈ పరిస్థితుల్లో కేవలం ముస్లిం ఓట్ల కోసం ఇన్ని లాభాలను టిడిపి వదులుకోకపోవచ్చు.
‘అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఆంధ్ర ప్రజాప్రతినిథులు ఏం మొత్తుకున్నా వినం, మా ఇష్టప్రకారమే చేస్తాం’ అని మన్‌మోహన్ సర్కారు అనగలదా? అంటే ఒకవేళ బిజెపి ఊరుకున్నా, తక్కిన పార్టీలు ఊరుకుంటాయా? పార్లమెంటులో గలభా సృష్టించవా? విభజనకు ఒప్పుకున్న పార్టీలు కూడా ‘అన్ని ప్రాంతాలను ఒప్పించి కార్యం సాధించాలన్న ఇంగితం కాంగ్రెసుకు లోపించింది’ అన్న ధోరణిలో తప్పుపట్టవా? వీటిపై కాంగ్రెసు అధిష్టానం స్పష్టత ఇవ్వవలసిన అవసరం వుంది.
ఉమ్మడి రాజధాని పితలాటకం
ఇక రాజధాని విషయం కూడా గందరగోళంగా వుంది. జులై 30 నాటి ప్రకటనలోని ‘ఉమ్మడి రాజధాని’ ఇప్పుడు ఇరు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా లేదు. సమైక్యం మెట్టు దిగాలంటే హైదరాబాదును కనీసం యూటీ చేయాలి అన్న డిమాండ్ కొందరు ఆంధ్ర నాయకుల నుండి వస్తోంది. యూటీ అనడానికి ఇబ్బందిగా ఉంటే కేంద్రం అజమాయిషీ అనే పేరుతోనైనా చేయండి, శాశ్వత ఉమ్మడి రాజధాని చేయండి – ఇలాంటి సూచనలున్నాయి. ఉమ్మడి రాజధాని అనే మాటే పనికిరాదు, ఆంధ్రకు తాత్కాలిక రాజధాని అనండి చాలు అని టి-జాక్ ఉద్యమిస్తోంది. 1956 నాటి పెద్దమనుష్యుల ఒప్పందం అమలు తీరు చూసినా, చండీగఢ్ విషయంలో హర్యాణా చేసిన పద్ధతి చూసినా ఈనాటి ఒప్పందాలు అమలవుతాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేకుండా ఉన్నారు. అమలు చేసి తీరాలి, లేకపోతే నేను ఊరుకోను అని కర్ర పట్టుకుని నిలబడడానికి యుపిఏ2 యే వుండబోవడం లేదు. బిల్లు పాస్ కావడానికి ఆరునెలలు పట్టేట్టు ఉంది. అప్పటికే ఎన్నికల ప్రకటన వచ్చేసిందంటే అమలు చేసే బాధ్యత, తర్వాతి ప్రభుత్వానిదే అవుతుంది. వాళ్లకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియదు.
ఇప్పుడున్నవాళ్ల చిత్తశుద్ధి కూడా అంతంత మాత్రంగా ఉంది. ముఖ్యమంత్రి సమైక్య ఉద్యమం పట్ల తన పక్షపాతాన్ని బాహాటంగా చాటుకుంటున్నా కేంద్రం కానీ, పార్టీ కానీ అతన్ని అదుపు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి రాజధాని అంటే విభజనవాదులు భయపడతారు. అదేసమయంలో ఆంధ్రప్రాంతీయులకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్లు ఇక్కడ ఉండడం అంటే అసాధ్యం అనే భయం ఉంది. మొన్న ఒక్క మీటింగు పెట్టుకోవడానికే చచ్చే చావైంది. ప్రతిదినం అన్నిటికీ తెలంగాణ రాష్ట్ర దయాధర్మంపై ఆధారపడుతూ, మాటలు పడుతూ ఉండడం మాటలు కాదు. ప్రభుత్వంలో ఉన్నవారు సంయమనం పాటించినా ప్రతిపక్షంలో ఉన్నవారు తప్పకుండా పరుషంగా మాట్లాడతారు. ప్రభుత్వం నడిపేవారు ఆంధ్రులతో కుమ్మక్కయి, వారికి మేలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తారు. అందువలన ఉమ్మడి రాజధాని నడిచే ప్రతిపాదన కాదు.
ఇక యూటీ కానీ తత్సమానం కానీ, ఢిల్లీ, చండీగఢ్ తరహా కానీ ఏమీ లేకపోయినా కేంద్రం అజమాయిషీ కానీ కావాలన్నా రాజ్యాంగ సవరణ కావాలి. దానికి ఇతర పార్టీలతో బాటు, బిజెపి కూడా అడ్డుపడవచ్చు. పైగా దేశంలోని సగం రాష్ట్రాల అనుమతి తెచ్చుకోవడం మాటలు కాదు. ఈ రెండు ఆప్షన్లూ లేకపోతే మిగిలినది – హైదరాబాదుతో కూడిన తెలంగాణ విడగొట్టేసి, పదేళ్ల ఉమ్మడి రాజధాని కూడా జాన్తానై అనడమే. ఇది జులై 30 ప్రకటన కంటె ఎక్కువ హానికరమని, 50 రోజుల ఉద్యమం చేస్తే ఇదివరకటి కంటె వెనక్కి వెళ్లిందనీ ఆంధ్ర ప్రాంతం మరింత భగ్గుమంటుంది. పోతేపోయింది ఆంధ్ర ప్రాంతం అనుకుందామంటే అక్కడ 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అందువలన జులై 30 కంటె ముందుకు వెళ్లాల్సిందే తప్ప వెనక్కు వెళ్లలేరు. వెనక్కు వెళితే తెలంగాణలో ఉద్యమం వస్తుంది. మరీ ముందుకు వెళ్లినా ఉద్యమం వస్తుంది. దానికే కొన్ని కాస్మెటిక్ ఛేంజెస్ చేయాలన్నా పైన చెప్పిన ఇబ్బందులున్నాయి. అందువలన కాంగ్రెసు మైకేల్ జాక్సన్‌లా మూన్‌వాక్ మొదలుపెట్టింది. కాస్సేపు ముందుకూ, కాస్సేపు వెనక్కీ కదలిక ఉంటుంది. అతను కదులుతాడో, కింద వేదికే కదులుతుందో తెలియదు. మొత్తానికి అక్కడక్కడే తిరిగి వినోదం కలిగిస్తాడు. నెలా, రెండు నెలలంటే ఫర్వాలేదు కానీ కాంగ్రెసు ఈ డాన్సు ఇంకో ఆర్నెల్లపాటు చేయగలదా? వేచి చూడాల్సిందే.
-ఎమ్బీయస్ ప్రసాద్