ప్రస్తుతం తమిళనాడులో వన్నియార్-దళిత కులాల పోరు సాగుతోంది. వన్నియార్ కులం వారు పెట్టుకున్న పిఎంకె పార్టీ నాయకులు హింసకు తలపడి, జైళ్లకు వెళ్లారు. ‘2016లో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎడిఎంకె గెలవడం కష్టం – ప్రభుత్వ వ్యతిరేకత వుంటుంది కాబట్టి! డిఎంకె గెలవడం కష్టం – కరుణానిధి అనంతరం కుటుంబం చీలిపోతుంది కాబట్టి! ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా మనం ఎదగాలి.’ అనే విధానంతో పిఎంకె అమలు చేస్తున్న పథకం యిది. దానికి అది ఎంచుకున్న మార్గం – దళితవ్యతిరేకత, కులాంతర వివాహవ్యతిరేకత !
వన్నియార్ కులం సామాజికంగా దళితుల కంటె కాస్త ఎక్కువ స్థాయిలో వున్న మోస్ట్ బ్యాక్‌వర్డ్ కాస్ట్ (ఎమ్‌బిసి) వర్గంలోకి వస్తారు. ఉత్తర తమిళనాడు జిల్లాలో అధిక సంఖ్యలో వున్నారు. బ్రాహ్మణ వ్యతిరేకత అంటూ కులపరంగా పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చి స్థిరపడిన ద్రవిడ పార్టీల నుండి స్ఫూర్తి పొందిన ఎస్.రామదాసు అనే నాయకుడు వన్నియార్ కులాల ఓట్లను సమీకృతం చేసేందుకు 190లో ‘వన్నియార్ సంఘం’ స్థాపించారు. అప్పటిదాకా ఆ ఓట్లన్నీ డిఎంకెకు వెళ్లేవి. ‘‘మా జనాభాకు తగిన నిష్పత్తిలో మాకు రిజర్వేషన్ ఫలాలు దక్కలేదు. బిసిలలో వర్గీకరణ చేసి మాకు ప్రత్యేక రిజర్వేషన్ యివ్వండి.’’ అనే నినాదంతో రామదాసు హింసాత్మక ఆందోళనలు చేసి డిఎంకె, ఎడిఎంకెలను వణికించారు. ఆ ఆందోళనలు ఎంత దుర్మార్గంగా సాగాయంటే 197 సెప్టెంబరు లో వారికి ప్రాబల్యం వున్న జిల్లాలలో వేలాది చెట్లు నరికేసి హైవేలపై పడేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దుకాణాలను దోచారు, వాహనదారులను , పాదచారులను కొట్టారు. పోలీసులు చర్య తీసుకోక తప్పలేదు. కాల్పుల్లో 1 మంది చనిపోయారు. అనేకమంది గాయపడ్డారు. 199 అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించి, వన్నియార్ ఓట్లు వన్నియారేతరులకు వేయం అని బ్యానర్లు కట్టి ప్రదర్శించారు. పోటీ చేసే పార్టీల బ్యానర్లు చింపి పారేశారు.
ఇలా తొమ్మిదేళ్లపాటు ఆందోళనలు చేసి 199లో చివరకు పాట్టాళి మక్కళ్ కచ్చి (శ్రామికజన పక్షం) – పిఎంకె అనే పేరుతో పార్టీ ఏర్పరచారు రామదాసు. ఈ మధ్య కెసియార్‌లాగానే ఆయనా తను కానీ తన కుటుంబసభ్యులు కానీ ఎన్నికలలో పోటీ చేయం, రాజకీయ పదవులు ఆశించం అంటూ ప్రకటించి పార్టీ అధ్యక్షుడిగా వేరేవాణ్ని పెట్టాడు. (తర్వాత 15 ఏళ్లకు, 2004లో డాక్టరుగా పనిచేస్తున్న తన కొడుకు అన్బుమణిని హఠాత్తుగా రాజకీయాల్లోకి తెచ్చి ఎన్నిక కూడా కాకుండానే కేంద్ర ఆరోగ్యమంత్రిగా చేశాడు) వన్నియార్లందరూ రామదాసు చెప్పిన వాళ్లేక ఓటేయసాగారు. వాళ్లకు సుమారు 16, 17 లక్షల ఓట్లు వుంటాయి. 199 లోకసభ ఎన్నికల్లో పిఎంకె ఒక సీటు గెలిచింది. అది ప్రారంభం. 1991, 1996 అసెంబ్లీ ఎన్నికలల్లో పిఎంకెకు 3% ఓట్లు గుత్తగా పడుతున్నాయని తేలింది. 1950లలో డిఎంకె ఎలాటి లక్ష్యాలతో పోరాడిందో 40 ఏళ్ల తర్వాత పిఎంకె అంతకంటె తీవ్రమైన లక్ష్యాలతో పోరాడింది. తమకు బలం వున్న ఉత్తర తమిళనాడుని వేరే రాష్ట్రంగా ప్రకటించమంది. స్థానికులేక ఉద్యోగాలు యిమ్మనమంది. తమలాటి వెనకబడిన కులాలకు అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెట్టింది. తమతో విభేదించినవారిని చావగొట్టి చెవులు మూసింది.
పిఎంకెను వన్నియార్లు ఆదరించడంతో ఉత్తర తమిళనాడు జిల్లాల్లో గట్టి దెబ్బ తగిలిన డిఎంకెకు వారిని మచ్చిక చేసుకోవడానికి ఎంబిసిలకు వేరే కోటా పెట్టింది. ఎన్నికలలో పొత్తు కుదుర్చుకుంది. వాళ్లను చూసి తర్వాతిసారి ఎడిఎంకె పెట్టుకుంది. స్థిరత్వం లేని పిఎంకె ఎప్పుడు ఏ కూటమిలో వుంటుందో ఎవరూ చెప్పలేరు. 1999లో ఎన్‌డిఏతో వుండి రెండు కేంద్రమంత్రి పదవులు పొందింది. 2004కి యుపిఏ వైపు మళ్లింది. మళ్లీ మంత్రి పదవులు. వారిలో ఒకరు తనయుడు అన్బుమణి. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు, తెలుగువాడు ఐన డా॥ వేణుగోపాల్‌తో పేచీ పెట్టుకుని ఆయన్ను అవమానకరంగా పంపించివేసినది అన్బుమణియే. 2009 వచ్చేసరికి యుపిఏతో తెగతెంపులు చేసుకుని ఎన్‌డిఏవైపు వెళ్లింది పిఎంకె. ఆ పాచిక పారలేదు. ఎడిఎంకెతో పొత్తు పెట్టుకుని 7 చోట్ల పోటీ చేస్తే ఏడుచోట్లా ఓడిపోయింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో డిఎంకెతో కలిసి 30 సీట్లలో పోటీ చేస్తే 3 చోట్ల మాత్రం గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో పార్టీ గుర్తింపు పోగొట్టుకుంది. ఎలాగైనా మళ్లీ ఎదగాలనీ, తనకంటూ ఒక పెద్ద ఓటు బ్యాంకు సృష్టించుకోవాలనే పట్టుదలతో వుంది ఆ పార్టీ. యుపిలో దళితులు ఆదరించే బహుజన సమాజ్ పార్టీకి, అగ్రకులస్తులు ఆదరించే బిజెపికి వ్యతిరేకంగా మధ్యకులస్తులను (బిసిలని వ్యవహరిస్తున్నారు) సమీకృతం చేసి విజయం సాధించిన ములాయంను ఆదర్శంగా తీసుకోదలచుకున్నాడు రామదాసు. మధ్యకులాల నన్నిటినీ ఒక కూటమిగా ఏర్పరచి, ఆ కులాలకు 20% రిజర్వేషన్ యిస్తామని మాట యిచ్చి, 2016 ఎసెంబ్లీ ఎన్నికల నాటికి ఆ కూటమి ద్వారా ఓ 50 సీట్లు తెచ్చుకోగలిగితే ప్రభుత్వాన్ని తన చెప్పుచేతల్లో వుంచుకోవచ్చని రామదాసు ఐడియా.
కొందరిని ఓ పక్కకు చేర్చాలంటే వాళ్లకు ఎవరో ఒకరిని బూచిగా చూపించాలి. సామాజికంగా యీ కులాలు దళితుల కంటె ఒక్క మెట్టు మాత్రమే పైన వుంటాయి కాబట్టి అగ్రవర్ణాల కంటె వీరికే దళితులపై వైరం ఎక్కువ. మనం కలిసి వుండకపోతే దళితులు మనల్ని నాశనం చేసేస్తారని భయపెడుతూ రామదాసు యీ కులాలను ఏకీకృతం చేస్తున్నాడు. నిజానికి అయిదారేళ్లపాటు – ములాయం, మాయావతితో చేతులు కలిపినట్లే – దళితులతో చేతులు కలిపి పోరాటాలు చేశాడు. కానీ దళిత-వన్నియార్‌ల మధ్య పొసగలేదు. 2012 నుండి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది, ముఖ్యంగా ధర్మపురి జిల్లాలో. దళితులు ‘విడుదలై చిరుతైగళ్ కచ్చి’ (విసికె) పేర తిరుమావళవన్ నాయకత్వంలో ఒక పార్టీగా ఏర్పడి వన్నియార్లతో ఘర్షిస్తున్నారు. 2012 నవంబరులో ధర్మపురి జిల్లాలో నాయకన్‌కోట్టయ్ వద్ద మూడు దళిత కాలనీల్లో 23 యిళ్లను కాల్చివేశారు. దీనికి నేపథ్యం – ఒక కులాంతర వివాహం! దివ్య అనే 20 ఏళ్ల వన్నియార్ అమ్మాయి ఆ కాలనీల్లో ఒకదానిలో నివసించే ఇళవరసన్ అనే దళితయువకుణ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది అవమానంగా భావించిన ఆమె తండ్రి నాగరాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వన్నియార్లు ఆ కాలనీని, అటూయిటూ వున్న కాలనీలను దండించారు.
అంతటితో ఆగలేదు. కులాంతర వివాహాలను ప్రతిఘటించడానికి రామదాసు 9 మధ్యకులాలతో ‘‘ఆల్ కమ్యూనిటీస్ ఫెడరేషన్’’ అనే సంఘం ఏర్పరచాడు. ఈ ‘ఆల్..’ లో దళితులూ లేరు, అగ్రవర్ణాలూ లేరు. తమ ఆడపిల్లల్ని దళిత యువకులు ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకుని తమ కులాల పరువు తీస్తున్నారనే బాధతో కుమిలే కులాల ప్రతినిథులే వున్నారు. నిజానికి తమిళనాడులో కులాంతర వివాహాలు చాలా తక్కువని అమెరికాకు చెందిన ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. కేరళలో దళితేతర కులాంతర వివాహాలు 20% కాగా, తమిళనాడులో 1.3% ట! తమిళనాడులో 1000 వివాహాలు జరిగితే వాటిలో దళితులతో యితర కులస్తులు చేసుకునే వివాహాలు 12 మాత్రమేట! అయినా యీ ఫెడరేషన్ 2012లో చెన్నయ్‌లో ఏర్పరచిన సమావేశంలో వక్తలు ‘‘ఈ దళిత కుర్రాళ్లు జీన్స్‌వేసుకుని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని, సెల్‌ఫోన్లు పట్టుకుని, మోటార్ సైకిళ్లపై తిరుగుతూ మన యిళ్లల్లో అమ్మాయిలను వలలో వేసుకుంటున్నారు. ఒక దళిత పార్టీ దీని వెనక్కాల వుండి ఒక పథకం ప్రకారం నడిపిస్తోంది. మేం కులాంతర వివాహాలకు వ్యతిరేకం కాదు కానీ మన కులస్తులను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లాగడానికి ప్రేమ పేరిట జరిగే యీ నాటకాలకు వ్యతిరేకం. అమ్మాయిల పెళ్లి వయసును 1 నుండి 21 వరకు పెంచండి. అబ్బాయిలకు 23 చేయండి. దళితులపై అత్యాచార నిరోధానికి పెట్టిన చట్టం దుర్వినియోగం అవుతోంది. నాన్-బెయిలబుల్ కేసులు పెడుతున్నారు. వాటిల్లో బెయిలు యిచ్చేట్లా చట్టాన్ని మార్చాలి.’’ అని డిమాండు చేశారు. 2013 జనవరిలో మధురైలో మరో సమావేశం పెట్టి అక్కడా యిలాగే మాట్లాడారు.
ఈ ఉపన్యాసాలతో ఆపకుండా ప్రత్యక్ష చర్యకు దిగాలని నిశ్చయించుకుని ఏప్రిల్ 25, చైత్రపౌర్ణమి నాడు మహాబలిపురం వద్ద వన్నియార్ యువోత్సవం ఏర్పాటు చేశారు. ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరిల నుండి వన్నియార్ యువకులందరినీ వందలాది వాహనాల్లో కదలిరమ్మనమని పిలుపు నిచ్చారు. పాండిచ్చేరి నుండి మహాబలిపురం వచ్చే దారిలో హై వే కు కాస్త దూరంగా మరక్కణం కాలనీ అనే దళిత కాలనీ వుంది. 11 ఏళ్ల క్రితం 2002లో చైత్రపౌర్ణమి రోజునే ఆ కాలనీలో వన్నియార్ యువకులకు, దళితులకు కొట్లాటలు జరిగి ఇద్దరు వన్నియార్ కుర్రాళ్లు మరణించారు. ఇప్పుడు వేర్వేరు జిల్లాల నుండి వస్తున్న పిఎంకె కార్యకర్తలు మధ్యాహ్నవేళ హై వే కు పక్కగా యూకలిప్టస్ చెట్ల దగ్గర వాహనాలు ఆపి మందు కొట్టి భోజనానికి ఉపక్రమించారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదానిపై వివిధ కథనాలు వినబడుతున్నాయి. ‘వాహనాల వాళ్లు మా కాలనీకి చెందిన కుర్రాళ్లు మోటర్ సైకిళ్లపై వెళుతూ వుంటే డాష్ యిచ్చి పడేశారు. న్యాయం అడుగుదామని వెళితే పట్టుకుని కొట్టారు’ అంటారు దళిత నాయకులు. ఇంకో కథనం ప్రకారం – మోటార్ సైకిలు యాక్సిడెంట్లు ఏమీ జరగలేదు కానీ ఆ చోటు చూడగానే 2002 నాటి సంఘటన గుర్తుకు వచ్చి వన్నియార్ యువకుల రక్తం ఉడుకెత్తి అటుగా వచ్చిన దళితయువకులపై బియర్ బాటిళ్లు విసిరారు. దాంతో గొడవ ప్రారంభమైంది.
ఏది ఏమైతేనేం, పిఎంకె కార్యకర్తలు మరక్కణం కాలనీపై పడి గుడిసెలపై పెట్రోలు బాంబులు విసిరారు. 9 గుడిసెలకు ఒక పశువుల దొడ్డికి నిప్పు పెట్టారు. వస్తువులు దోచారు, గుడిని ధ్వంసం చేశారు. ‘‘ఇదంతా ప్లాను ప్రకారమే జరిగింది, రోడ్డు మీద వెళ్లేవాళ్లకు మా కాలనీ కనబడదు. వేర్వేరు జిల్లాల నుండి వచ్చినవాళ్లకు ఫలానా చోట 2002లో గొడవ జరిగిందని ఎలా తెలుస్తుంది? నిజానికి రెండు మూడు రోజుల క్రితం వన్నియార్ కులస్తులు వచ్చి మా యిళ్లు అవీ చూసుకుని వెళ్లారు’’ అంటారు దళిత నాయకులు. తమ కాలనీపై దాడి జరగగానే దళితులంతా వెళ్లి హైవే పై బైఠాయించారు. వన్నియార్ కులస్తులను తెచ్చే వాహనాలన్నీ ఆగిపోయాయి. వాళ్లు చైత్రపౌర్ణమి ఉత్సవానికి వెళ్లలేకపోయారు. ఆ ఉక్రోషంతో వాళ్లు బళ్లు దిగి అక్కడున్న షాపులను, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలను ధ్వంసం చేశారు. టోలు బూతులను, సిసిటివి కెమెరాలను ధ్వంసం చేశారు. రాళ్లు విసిరారు. ఇదంతా చూసి పోలీసులు వస్తే వాళ్లమీద రాళ్లేశారు. వాళ్లు గాలిలో తుపాకులు కాలిస్తే కొంతమంది పిఎంకె నాయకులు గాయపడ్డారు.
వాళ్లు రాకుండానే మహాబలిపురంలో చైత్రపౌర్ణమి ఉత్సవం జరిగింది. వేదిక నుండి రామదాసు గర్జించారు – ‘‘మా వన్నియార్లను ఎవరూ ఆపలేరు. ప్రభుత్వం రాత్రి 10 గంటల వరేక అనుమతి యిచ్చింది. ఇప్పుడు 11.30 అయింది. నేను ఉపన్యసిస్తూనే వున్నాను. దమ్ముంటే కేసు పెట్టుకోండి’ అని. దమ్మున్న ముఖ్యమంత్రి జయలలిత ఆయనను అరెస్టు చేయించింది – నియమాలు ఉల్లంఘించారంటూ. ఆ కేసులో మే 2 న బెయిల్ లభిస్తే, ‘2004 ఏప్రిల్ లో రజనీకాంత్ అభిమానులపై మీ సెక్యూరిటీవాళ్లు దాడి చేసిన కేసులో మిమ్మల్ని యిప్పుడు అరెస్టు చేస్తున్నామంటూ’ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆయనతో బాటు పిఎంకె నాయకులు అనేకులను అరెస్టు చేశారు. ఈ అరెస్టుల కారణంగా పిఎంకె కార్యకర్తలు హింసను మరింత పెంచారు. ఏప్రిల్ 25 నుండి మే 6 లోగా, 500 పబ్లిక్, ప్రయివేటు బస్సులను నష్టపరచారు. 13టికి నిప్పుపెట్టారు. రేషన్ షాపులు, లిక్కరు షాపులు ధ్వంసం చేశారు. 160 చెట్లు కొట్టేశారు, 20 చింత చెట్లను కాల్చేశారు. ఓ రాజస్థానీ ట్రక్కు డ్రైవరును చావగొట్టేసి అతని చావుకు కారణమయ్యారు. మహాబలిపురంలో సముద్రపు ఒడ్డున్న వున్న గుడిని పాడుచేశారు. ఎడిఎంకె ఆఫీసులపై దాడి చేసి ఒక ఎమ్మెల్యే యింటికి వెళ్లి చావగొట్టారు. ఎందుకిదంతా అంటే ‘ఏప్రిల్ 25 న మరక్కణం సంఘటన తర్వాత దళితులు కక్షతో వివేక్, సెల్వరాజ్ అనే యిద్దరు వన్నియార్ కుర్రవాళ్లను రోడ్డు మీద చంపేశారు. దానికి ప్రతీకారంగా యీ హింస ప్రజ్వరిల్లింది’ అంటున్నారు రామదాసు, అన్బుమణి. ‘వాళ్లిద్దరు గొడవల్లో కాదు రోడ్డు యాక్సిడెంట్లో పోయారు’ అంటున్నారు పోలీసులు.
ఇంత ధన, ప్రాణ, మాన నష్టం జరిగితే ‘మానవీయ దృక్పథంతో రామదాసును జైలు నుండి విడుదల చేయాల’ని కరుణానిధి జయలలితను కోరారు. రాజకీయాలకోసం పచ్చని చెట్లను నరికివేసే యీ దుర్మార్గుల పట్ల కరుణ చూపితే భూమాత మనల్ని క్షమిస్తుందా? తక్కిన రాజకీయ పక్షాలు కూడా రామదాసును విడుదల చేయాలని కోరాయి. ఇంత జాలి ఎందుకంటే – వన్నియార్‌లకు కోపం తెప్పిస్తే తమకు వాళ్ల ఓట్లు రావేమోనన్న భయం. కులాల పేరుతో ఓట్లు అడగనారంభిస్తే చివరకు యిటువంటి పరిణామాలే సంభవిస్తాయని పొరుగున్న వున్న మన తెలుగు నాయకులు చూసైనా నేర్చుకోవాలి.
ఎమ్బీయస్ ప్రసాద్