తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరడం వెనుక వారు వినిపించిన కారణాలు వాటిని నిర్ణయాత్మకమైన కేంద్రం ఆమోదించిన తీరు.. వీటిని గమనిన్తిోంటే.. దక్షిణ భారత దేశాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించాలటనే పోరాటం ఊపందుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. భారతదేశం అంటేనే భిన్న సంస్కృతుల సమ్మేళనం. ఒక సంస్కృతికి ఆదరణ లేనప్పుడు.. ఇక అవమానాల మధ్య ఉండాల్సిన అవసరం ఏంటి?
ఆర్యులు వేరు, ద్రావిడులు అల్పస్థాయి వారు అన్నట్లుగా దక్షిణాది వారిని కించపరుస్తున్నప్పుడు కలిసి ఎందుకు ఉండాలి. వేషభాషలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పరంగా ఏ మాత్రం పొంతనలేని ఆర్యులతో మనం ఎందుకు కలిసి ఉండాలి. అందుకే.. ద్రావిడ భాషలు మాట్లాడే నాలుగు రాష్ట్రాలను కలిపి ‘‘ ద్రవిడ నాడు ’’ అనే సరికొత్త దేశం ఏర్పాటు చేయాలనే డిమాండును మనం లేవనెత్తాలి. ఇదే ప్రస్తుత అవసరంగా, తరణోపాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుండడానికి వారు లేవనెత్తుతున్న ప్రధానమైన అంశాలు ఏమిటి?
1) మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం
2) మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
3) మాకు అవమానాలు ఎదురవుతున్నాయి. తెలంగాణ మేధావులకు, తెలంగాణ యోధులకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో మన్నన దక్కడం లేదు.
4) మా వనరుల్ని దోచుకుని.. అభివృద్ధి విషయంలో మాకు మొండి చేయి చూపిస్తున్నారు.
5) ఇంకా పరాయి వాళ్ల దోపిడీకింద బతకడానికి మా జాతి సిద్ధంగా లేదు. మా రాష్ట్రం మేమే ఏలుకుంటాం.
6) మీ దోపిడీ కింద మేం బతకలేం.. మేం విడిపోతాం బాబూ అని అంటూ ఉంటే.. కా కలిసి ఉండాల్సిందే అంటూ పట్టుకుంటారేంటి.. మీకు సిగ్గు లేదా?
7) స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఎక్కువ కాలం సీమాంధ్రులే పరిపాలించారు. ఏం మాకు పాలించే హక్కు లేదా?
.. ఇలాంటి అనేకానేక వ్యాఖ్యానాలను నినాదాలుగా మార్చి పదేపదే వినిపిస్తూ.. మొత్తానికి తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఇవాళ కల సాకారం అయ్యే పరిస్థితి వరకు తీసుకువచ్చారు.
కానీ ఇవే అంశాలను ఇలాంటి అంశాలను మనం దేశం యూనిట్‌గా పరిగణించి చూసినట్లయితే.. దక్షిణ భారతదేశంలోని ప్రస్తుతం 4గా ఉన్న రాష్ట్రాలను కలిపి ఒక ప్రత్యేక దేశంగా విభజించి ఇచ్చేయాలనే డిమాండ్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు పైన పేర్కొన్న ఏ అంశాల ప్రాతిపదికను అయితే కేంద్రం, సోనియా సర్కారు సమంజసంగా భావించినట్లు కనిపిస్తున్నదో.. అవే అంశాలు ఉత్తర భారతదేశం వారి చేతిలో.. దక్షిణ భారత దేశానికి వర్తిస్తాయి.
ఉత్తర భారతదేశం పీడన పాలనలో దక్షిణ భారత్ ఎన్నెన్ని అవమానాలకు , దోపిడీలకు గురవుతున్నదో మనకు తెలియని సంగతి కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ లేదా జయశంకర్ లేదా కోదండరాం ఏయే కారణాలనైతే చెప్పారో.. అవన్నీ యావత్ దక్షిణభారతదేశానికి కూడా వర్తిస్తాయి. ఇన్నేళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో దక్షిణాది నుంచి ఎందరు ముఖ్యమంత్రులు తయారయ్యారో… ఎంతకాలం ఏయే ప్రాంతాల వారు పరిపాలించారో లెక్కలు చూస్తే చాలా నీచంగా కనిపిస్తుంది. పైగా ఉత్తర భారతదేశంలో దక్షిణాది వారిని ఎంత అవమానకరంగా చూస్తారో కూడా తెలియని సంగతి కాదు.
ఈ దేశానికి ఒకటి రెండు సంవత్సరాలు ప్రధానిగా సేవలందించి ఉత్తరాతి నాయకులకు కూడా ఢల్లీిలో సమాధులు కట్టించడానికి స్థలం దొరికింది గానీ.. దేశానికి ఐదేళ్లపాటు పూర్తిస్థాయి ప్రధానిగా పనిచేసిన.. ఇప్పుడు ఏ గ్లోబలైజేషన్ ను చూసుకుని మనం మురిసిపోతున్నామో.. ఆ యావత్తు ఆధునిక ప్రపంచ పోకడలను మన దేశానికి పరిచయం చేసిన మహానుభావుడు పివి నరసింహారావు మరణిస్తే.. సాయంత్రానికి ఆయన శవాన్ని హైదరాబాదు పంపేశారు. కనీసం ఢల్లీిలో ఆయనకు సమాది లేకుండా చేశారు. ఇవన్నీ అవమానాలే కదా!
ప్రగతి ని డిసైడ్ చేయడంలో కీలకమైన రైల్వే వంటి కొన్ని ప్రభుత్వ శాఖలను ఈ అరవై ఏళ్లలో ఎన్నిసార్లు దక్షిణాది వారికి ఇచ్చారో కూడా మనం ఆలోచించాలి. ఇన్ని రకాల దోపిడీలకు గురవుతున్న సమయంలో ఏం మనం ప్రత్యేకంగా ద్రవిడనాడు డిమాండ్ చేస్తే తప్పేమిటి?
ఏ ప్రాతిపదిక మీద తెలంగాణ రాష్ట్రం సీమాంధ్రుల నుంచి విడిపోవాలని కోరుకుంటున్నదో.. అచ్చంగా అవే పరిస్థితులు ఉత్తరాది వెర్సస్ దక్షిణాది మధ్య కూడా ఉన్నాయి. మరి ఉత్తరాది వారి దోపిడీని, వారు చేసే అవమానాలను భరిస్తూ వారితో కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది? మన బతుకు మనమే బతుకుదాం.. అందుకే దక్షిణాది నాలుగు రాష్ట్రాలను ద్రవిడనాడు పేరిట ఒక ప్రత్యేక దేశంగా ఇచ్చేయమనే ఉద్యమాన్ని ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఉత్తరాది వారంతా ఆర్యులని, దక్షిణాది వారంతా ద్రావిడులని.. ద్రావిడులంటే రాక్షసులని.. ఆర్యులే మేధావులని.. వారు ఎన్నిరకాలుగా మనల్ని అవమానిస్తుంటారో మనకు తెలుసు. అందుకే తెలంగాణ డిమాండును సబబుగా పరిగణిస్తున్న ఈ ప్రభుత్వం ఎదుటకు అంతకంటె సమంజసమైన ప్రత్యేక దేశంగా ‘‘ ద్రవిడనాడు ’’ ఏర్పాటు డిమాండ్‌ను మనం తీసుకువెళ్లవలసిన అవసరం ఉన్నది. ఈ విషయంలో నాలుగు రాష్ట్రాల వారు కలసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉన్నది.
కావలిస్తే నాలుగు రాష్ట్రాలు మహా అయితే అయిదు రాష్ట్రాలు ఉమ్మడిగా సాగించాల్సిన ఈ పోరాటానికి కూడా కేసీఆర్‌ను నాయకుడిగా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆయన జాతిపితగా ప్రధాని మంత్రి కూడా కాగలరు. తెలంగాణ ఇవ్వడం సముచితం అయినప్పుడు… ద్రవిడనాడు ప్రత్యేక దేశం కూడా ఎంతో సముచితమైన డిమాండ్ అవుతుంది. మరి ఇలాంటి సహేతుకమైన అణగారిన వర్గాల, దోపిడీకి గురవుతున్న వర్గాల, వంచిత వర్గాల ప్రత్యేక దేశం డిమాండ్‌కు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
కపిలముని