ఇన్నాళ్లూ కాస్త అణగి ఉన్న కోవిడ్ మళ్లీ తనను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తోంది. వైరస్ వివిధ రూపాలెత్తి ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపుతోంది. ప్రభావాల్లో తేడా రావడానికి అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్లు, రోగనిరోధక శక్తి, తీసుకున్న టీకాలు, కరోనా వైరస్‌కు, వాక్సిన్లకు వాళ్ల శరీరాలు స్పందించే విధానం.. యిలా అనేక అంశాలు కారణమౌతున్నాయి. వీటి గురించి పూర్తి డేటా ఉంటే తప్ప స్పష్టమైన రూపం తెలియదు. ఆ డేటా అందుబాటులో లేకపోవడంతో యీ లోపున ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్లు చేస్తున్నారు. చైనాలో మళ్లీ విజృంభించిందంటే మనమూ జాగ్రత్తపడాలి అని కొందరు, అక్కడి పరిస్థితులు వేరే, మన చోట వేరే అని మరి కొందరు అంటున్నారు. ఈ గందరగోళంలో నేను సేకరించిన సమాచారాన్ని, నాకు అర్థమైన రీతిగా మీతో పంచుకుంటాను. నేను వైద్యుణ్ని, సైంటిస్టునీ ఏమీ కానని మీ అందరికీ తెలుసు. సమాచార గ్రహణంలో అవగాహనాలోపం కూడా ఉండవచ్చు.
గత ఏడాది మధ్యలో ఒమైక్రాన్ దాని వ్యాప్తి గుణం ద్వారా కాస్త భయపెట్టింది కానీ అది ప్రాణహారి కాదనే ధైర్యం వచ్చింది. వాక్సిన్లు రోగం సోకకుండా ఆపలేక పోయాయి కానీ తీవ్రతను తగ్గించాయన్నారు. రోగం వలన వచ్చిన యిమ్యూనిటీ, వాక్సిన్ వలన వచ్చిన యిమ్యూనిటీ రెండిటినీ కలిపి హైబ్రిడ్ యిమ్యూనిటీ అన్నారు. దాని కారణంగా ఒమైక్రాన్ వలన ఆసుపత్రిపాలు కావడం, మృత్యువు వాత పడడం తగ్గాయన్నారు. కానీ రోగం వచ్చి తగ్గిన తర్వాత కూడా అనేక రుగ్మతలు దీర్ఘకాలం పీడిస్తున్నాయి. కొందరికి నీరసం, కొందరికి పొడి దగ్గు, కొందరికి ఒళ్లునొప్పులు, మరి కొందరికి హృద్రోగం, యింకొందరికి బ్రెయిన్ ఎఫెక్ట్ కావడం.. యిలా శరీరంలోని అనేక భాగాలను యీ వైరస్ ప్రభావితం చేస్తోంది. దీన్ని సింపుల్‌గా లాంగ్ కోవిడ్ అంటున్నారు.
‘‘ఇండియా టుడే’’ ఆగస్టు 15 సంచికలో కోవిడ్ బ్రెయిన్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తోందో ఒక ఆర్టికల్ వచ్చింది. కోవిడ్ వచ్చి తగ్గాక ఊపిరితిత్తులను మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే చాలని డాక్టర్లు అనుకున్నారట. కానీ శరీరంలోని అనేక భాగాలమీద, ముఖ్యంగా బ్రెయిన్ మీద దుష్ప్రభావం చూపుతోందని తేలుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ వారు లక్ష మంది మీద పరిశోధనలు చేసి దానిని 2022 మార్చి ‘‘నేచర్’’ పత్రికలో పబ్లిష్ చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని నాలుగున్నర నెలల తర్వాత చూస్తే రోగం రాని వారి కంటె 0.2 – 2% బ్రెయిన్లోని గ్రే మేటర్ పోగొట్టుకున్నారట. ఇది 20 ఏళ్ల వయసు పెరగడంతో సమానం. 10 ఐక్యూ పాయింట్లు తగ్గడంతో సమానం. 140 ఏళ్ల నాటి సైంటిఫిక్ జర్నల్ ‘‘జామా’’లో అక్టోబరు 2021లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం కోవిడ్ వచ్చినవారిలో నాలుగో వంతు మందిలో మతిమరుపు పెరగడం, మెమరీ ఎన్కోడింగులో అవరోధాలు, ప్రాసెసింగ్ స్పీడు తగ్గడం, మాటలో తడబాటు గమనించారు.
ఇంతకీ వైరస్ బ్రెయిన్లో డైరక్టుగా ప్రవేశించదట. వాపు కలగచేసి క్లాట్స్ ద్వారా బ్రెయిన్‌కు రక్తసరఫరాలో అంతరాయం కలిగిస్తుంది. కోవిడ్ ఎదుర్కోవడానికి శరీరం తయారు చేసే యాంటీబాడీలు బ్లడ్-బ్రెయిన్ బేరియర్ను భంగం చేసి, బ్రెయిన్ సెల్స్‌ను పాడు చేస్తాయి. దానివలన అలసట, డిప్రెషన్, బ్రెయిన్ ఫాగ్ కలుగుతున్నాయి. బ్రెయిన్ ఒక్కదాన్నే కాదు, గుండెకు కూడా కోవిడ్ అపాయం కలిగిస్తోంది. గుండెపోటు వచ్చే అవకాశాలను రెట్టింపు చేస్తోంది. ఆ ఆర్టికల్ సారాంశమిది.
అసలు కోవిడ్‌ను ఎలా నిర్వచించాలో కూడా తెలియకుండా పోయింది. వారం పది రోజులుండి తీవ్రత తగ్గిపోతే కోవిడ్ పోయింది అనడానికి లేకుండా ఉంది. పైన చెప్పిన లక్షణాలు వైరస్ వలన వచ్చాయో, వాక్సిన్ వలన వచ్చాయో తెలియకుండా పోయింది. వాక్సిన్ రెండు డోసులు వేసుకుని ఆపేస్తే సరిపోదు, బూస్టర్ డోసు వేసుకుంటే తప్ప ప్రస్తుతం వస్తున్న వేరియంట్‌ను తట్టుకోలేము అంటున్నారు. అసలు వాక్సిన్లు మనకు మేలు చేశాయో, కీడు చేశాయో తెలియని అయోమయంలో ఉన్నాం మనం. వైరస్ స్వరూపం సరిగ్గా తెలియకుండానే, రోగం వస్తే దాని చికిత్సావిధానం యిది అని నిర్ధారించకుండానే, వాడాల్సిన మందులను తరచుగా మారుస్తూ డాక్టర్లే గందరగోళపడిన అవస్థలో అన్నిటికంటె ముందు వాక్సిన్లు తయారు చేసి జనాలకు పొడిపించేశారు. టీకాల దారి టీకాలది, రోగం దారి రోగానిది అయింది.
ఒక డోసు వేసుకున్నా రోగం వచ్చింది, రెండు డోసులు వేయించుకున్నా వచ్చింది, బూస్టర్ వేయించుకున్న వాళ్లకీ వస్తోంది. మరేమిటి ప్రయోజనం? అని అనుకుని జనాలు బూస్టర్ డోసుకి ముందుకు రావడం మానేశారు. పోనీ పనిచేసినా పని చేయకపోయినా పడి ఉంటుంది, వేయించుకోవచ్చుగా అనుకున్నవాళ్లు కూడా కరోనా అనంతరం కలుగుతున్న యిబ్బందులు చూసి వెనకాడారు. ఎందుకంటే యీ యిబ్బందులు వాక్సిన్ల వలన రాలేదు అని ఎవరూ కచ్చితంగా చెప్పలేక పోయారు. వాక్సిన్లలో కల్లా ఉత్తమమైనదని చెప్పుకున్న ఫైజర్ వాక్సిన్ వైరస్ వ్యాప్తిని అరికడుతుందని చెప్పుకోలేక పోయింది. యూరోపియన్ పార్లమెంటులో ఫైజర్ ప్రతినిథిని వ్యాప్తి అరికట్టే సామర్థ్యంపై టెస్టులు చేశారా అని అడిగితే ‘మాకు టైము లేకపోయింది’ అని జవాబిచ్చాడతను. మరి అలాటప్పుడు విమానం ఎక్కాలంటే వాక్సిన్ వేయించుకుని తీరాలనే నిబంధన అర్థరహితమన్నమాట. ఇదంతా 2022 అక్టోబరులో బయటకు వచ్చింది.
మొన్న ఫైజర్ సిఇఓ దావోస్ వస్తే యిద్దరు జర్నలిస్టులు తగులుకుని ‘మీ వాక్సిన్ 100% ఎఫెక్టివ్ అని చెప్పుకున్నారు, తర్వాత 90 అన్నారు, తర్వాత 80, 70.. యిలా తగ్గించుకుంటూ వచ్చారు. చివరకు వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమయ్యారని తేలింది కదా. వాక్సిన్ వలన విపరీత పరిణామాలు వస్తే మీకే బాధ్యతా ఉండదంటూ దేశాల దగ్గర్నుంచి ఇండెమ్నిటీ బాండ్లు తీసుకున్నారు సరే, పోనీ కొంతైనా డబ్బు తిరిగిస్తారా? కనీసం క్షమాపణ చెప్తారా?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఆ సిఇఓ నోరు విప్పలేదు. ఆ వీడియో వైరల్ అయింది. ప్రపంచమంతా కీర్తించిన ఫైజర్ వాక్సిన్ అలా అఘోరించింది. ఇక మన దగ్గర తయారైన భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్ విషయంలోనూ వివాదం వచ్చింది. క్లినికల్ ట్రయిల్స్ విషయంలో భారత్ బయోటెక్ అడ్డదారి పడితే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ) కళ్లు మూసుకుందని 2022 నవంబరులో వార్తలు వచ్చాయి.
లాన్సెట్‌లో పబ్లిష్ చేసిన పేపర్లలో యిచ్చిన డేటా ఆధారంగా కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారి సంఖ్య విషయంలో తేడాలు వచ్చాయని కొన్ని పరిశోధక సంస్థలు కనిపెట్టాయి. ట్రయల్స్ దశలో కొందరికి ప్లాసెబో యిచ్చి వాక్సిన్ లేకుండా ఎలా రియాక్టవుతున్నారో కూడా చూడాలి. కానీ కంపెనీ ప్లాసెబో మార్గాన్ని పూర్తిగా వదిలేసి, అందరికీ వేర్వేరు డోసుల్లో వాక్సిన్ యిచ్చి పరీక్షలు చేసేసింది. వీళ్లేం చేసినా సిడిఎస్ఓ తలూపింది. మొదటి దశ పరీక్షలు పూర్తి కాకుండానే రెండోదశ పరీక్షలకు అనుమతి యిచ్చేసింది. రెండో దశ పరీక్షల ఫలితాలను పరిశీలించకుండానే మూడో దశకు అనుమతించింది. భోపాల్ అసుపత్రిలో మూడో దశ పరీక్షల్లో పాల్గొన్న ఒక వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం విచారణ జరిపింది కానీ నివేదికను బయట పెట్టలేదు. ఆ వ్యక్తి వాక్సిన్ తీసుకున్నాడో లేదో తెలపకుండానే, వాక్సిన్‌కు, చావుకీ సంబంధం లేదని ఒక్క ముక్క అనేసి కూర్చుంది. కంపెనీ కూడా అదే వల్లించింది.
2021 మార్చిలో బ్రెజిల్ డ్రగ్ రెగ్యులేటర్ భారత్ బయోటెక్ వారి గుడ్ మాన్యుఫేక్చరింగ్ ప్రాక్టీసెస్ (జిఎంపి)పై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఏడాది పోయినా పరిస్థితి చక్కబడలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న చర్య తెలుపుతోంది. భారత్ బయోటెక్ జిఎంపి అనుసరించటం లేదు కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఏజన్సీస్‌కు కోవాక్సిన్ అమ్మకూడదు అంటూ 2022 ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. దాంతో మా తయారీ విధానంలో కొన్ని మార్పులు చేశామంటూ కంపెనీ జూన్‌లో నివేదించింది. అవి తృప్తికరంగా లేకపోవడం చేత కాబోలు సస్పెన్షన్ యిప్పటివరకు ఎత్తేసినట్లు లేదు. అమెరికాలో కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ యింకా సాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన రాగానే యుఎస్‌ఎఫ్‌డిఏ వారు రెండో, మూడో దశ ప్రయోగాలను సస్పెండ్ చేశారు. ఒక నెల పోయిన తర్వాత 2022మే లో నిషేధాన్ని ఎత్తివేసి ప్రయోగాలు చేసుకోమన్నారు.
ఇదంతా పేపర్లలో రావడంతో భారత్ బయోటెక్ నవంబరు 17న ఒక ప్రకటన చేస్తూ కోవాక్సిన్‌పై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అంది. రెండో దశ ఫలితాలు చూడకుండానే మూడో దశకు అనుమతి వచ్చినమాట నిజమేనని అంటూ, యానిమల్ ట్రయల్స్, మొదటి దశ ఫలితాలు చూసి యిచ్చారని చెప్పుకుంది. ప్రయోగాల దశలోనే కొందరికి 3 ఎంసిజి డోసు, మరి కొందరికి 6 ఎంసిజి డోసు యిచ్చామని కూడా ఒప్పుకుంది. ఇలా చేయడం ప్రజాహితం కోరే అని చెప్పుకుంది. పరీక్షితుల సంఖ్యలో వచ్చిన తేడా గురించి వివరణ ఏమీ యివ్వలేదు. అదే రోజున ప్రభుత్వం కూడా కోవాక్సిన్‌పై వస్తున్నది దుష్ప్రచారమేననీ, క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే 2021 జనవరిలో ఎమర్జన్సీ ఎప్రూవల్ యిచ్చినది ప్రజాహితం కోసమేననీ ప్రకటన జారీ చేసింది.
ఇక మన దేశంలో 80% కు పైగా తీసుకున్న కోవిషీల్డు అది తయారైన ఇంగ్లండులోనే ప్రభావం చూపలేక పోయింది, రోగవ్యాప్తిని ఆపలేక పోయింది. ఒమిక్రాన్ ఎదుర్కోవడానికి కోవిషీల్డు, కోవాక్సిన్ రెండూ చాలవని టైమ్స్ ఆఫ్ ఇండియా 2022 ఏప్రిల్‌లో ఒక కథనాన్ని యిచ్చింది. ఇలా వాక్సిన్లపై సాధారణ ప్రజలందరూ పెదవి విరిచే పరిస్థితి వచ్చింది. దుష్పరిణామాలు కలుగుతున్నాయన్న భయమూ, కరోనా నిష్క్రమించిందన్న ధీమా కలగడంతో తెప్పించిన టీకాలు మురిగిపోసాగాయి. ఇక అలాటప్పుడు బూస్టర్ డోసులు వేయించుకోవడానికి ఎవరు ఎగబడతారు? కొందరు రెండో డోసు కూడా వేయించుకోవడం మానేశారు. మన దేశంలో వేయించుకోవలసిన ఏజ్ గ్రూపులో 2022 డిసెంబరు నాటికి 87.7% మంది మాత్రమే రెండు డోసులూ వేయించుకున్నారు. పాక్షికంగా వేయించుకున్నవారు 94.6%. ప్రికాషనరీగా లేదా బూస్టర్ డోసు వేయించుకున్నవారు 20.5%.
బూస్టర్‌గా ఏది వేయించుకోవాలన్న ప్రశ్న ఉంది. మొదటి రెండు డోసులు వేయించుకున్న వాక్సిన్ కాకుండా మరో దాన్ని వేయించుకుంటే మంచిదని కొందరంటున్నారు. 80% మంది ఎడెనోవైరల్ వెక్డార్డ్ వాక్సిన్ ఐన కోవిషీల్డు వేయించుకున్నవారు కాబట్టి, వాళ్లందరూ బూస్టరుగా ప్రొటీన్ సబ్యూనిట్ వాక్సినో, ఎంఆర్ఎన్ఏ వాక్సినో వేయించుకోమని సలహా యిస్తున్నారు. కోవాక్సినో, స్పుత్నికో, జైకోవ్-డియో వేయించుకోవాలనుకున్నా వాటి ఉత్పత్తి ఎంత తక్కువంటే ఏ 20% మందికో సరిపోతుంది. తక్కినవారందరూ ఏం చేయాలి? బూస్టరుగా కూడా కోవిషీల్డే వేయించుకోవాలా? ఇలాటి సందిగ్ధంతో కొందరు ఆగారు. ఇప్పుడు తాజాగా కరోనా పునరుత్థానం వార్తలు వచ్చాక ఏసియన్ ఇన్స్టిట్యూట్ డా. నాగేశ్వర రెడ్డి బూస్టరుగా ప్రొటీన్ సబ్యూనిట్ వాక్సిన్ ఐన కోర్బివాక్స్ వేసుకోమంటున్నారు. మేం పరిశోధించి చూశాం, మంచి ఫలితాలు వచ్చాయన్నారు. కానీ దాన్ని 18 ఏళ్ల పైవాళ్లకు అనుమతించినట్లు చూడలేదు. ఎమర్జన్సీ యూజ్‌కి 2022 ఫిబ్రవరిలో అనుమతి యిచ్చారు.
ఈ బూస్టరు ఒకసారి వేయించుకుంటే చాలా? ఏటేటా వేయించుకోవాలా? అన్నదానిపై కూడా స్పష్టత లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్టుగా చేసిన సౌమ్యా స్వామినాథన్ అన్ని వయసుల వాళ్లకి మూడో డోసు తప్పనిసరి అని, రిస్కు ఎక్కువున్నవాళ్లు నాలుగోది కూడా తీసుకోవాలని అంటున్నారు. ఇది కూడా తన అభిప్రాయమే తప్ప దీన్ని సమర్థించే డేటా లేదని చెప్పారు. కొన్ని దేశాల్లో నాలుగు డోసులు యిచ్చి ఐదో డోసు కూడా యివ్వబోతున్నాయి. కొన్ని దేశాల్లో తొలి విడత వాక్సినేషనే పూర్తి కాలేదు. డోసుల సంఖ్యకు, కోవిడ్ వ్యాప్తికి లింకు లేకుండా ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించి, దీని గుట్టు కనిపెడతాం అని మన ప్రభుత్వం అంటోంది కానీ డేటా కలక్షన్ సవ్యంగా లేదట.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో లైఫ్ కోర్స్ ఎపిడమాలజీ హెడ్‌గా ఉన్న డా. గిరిధర బాబు చెప్పినదేమిటంటే – ఇండియన్ సార్స్ కోవిడ్2 జినామిక్స్ కన్సార్టియం వాళ్లు సేకరించిన నమూనాల్లో 25% మహారాష్ట్రవేనట. తక్కిన రాష్ట్రాల నుంచి చాలా తక్కువ శాంపుల్స్ వచ్చాయట. కోవిడ్ దేశదేశానికే కాదు, రాష్ట్రరాష్ట్రానికి ఒక్కోలా ప్రవర్తిస్తోంది. అలాటప్పుడు యిలాటి పాక్షికమైన సమాచారంతో పరిశోధన సాగించడం ఎలా? పరిశోధనే సరిగ్గా సాగనప్పుడు కరోనా భయానకమని గానీ, కాదని గానీ, దాన్ని ఫలానాదానితో నివారించవచ్చని కానీ.. ఎవరైనా చెప్తే నమ్మడం ఎలా? మొత్తమంతా తరచి చూస్తే మన శరీరంలో ఇమ్యూనిటీ అనేది ముఖ్యమని తేలుతుంది. చైనాలో జీరో కోవిడ్ పాలసీ కారణంగా ఇమ్యూనిటీ డెవలప్ కాకపోవడం చేత అక్కడ కోవిడ్ విలయతాండవం చేస్తోందని, మన దగ్గర హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేయడం వలన కోవిడ్ మరీ అంత ప్రభావం చూపటం లేదని అంటున్నారు. చైనాలో కోవిడ్ ఎందుకంత ఉధృతమైందో వేరే వ్యాసంలో రాస్తాను.
మనకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని జనరల్‌గా అనగలం కానీ ఇమ్యూనిటీ అనేది పూర్తిగా వ్యక్తిగతం. వర్షంలో పదిమంది తడిస్తే యిద్దరికి పడిశం పడుతుంది. తక్కినవాళ్లు మామూలుగానే ఉంటారు. అందువలన మనం రోగనిరోధకత పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. కోవిడ్ గురించి నిపుణులు చెప్పేవి రెండే వాక్యాలు – ఆందోళనా వద్దు, అశ్రద్ధా వద్దు అని. ఇదివరకు వచ్చినంత ఉధృతంగా ప్రస్తుతం లేదు, రేపు ఎలా ఉంటుందో తెలియదు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే కరోనా దాన్ని మరింత క్షీణింప చేస్తోందని అర్థమైంది. కరోనా విజృంభించిన రోజుల్లో చూడండి, చాలామంది కో-మార్బిడిటీస్ (యితర రోగాలు)తో పోయారన్నారు. కరోనా రోజుల్లో దాని భయం చేత ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోని వారు, ఇంట్లోనే ఉండిపోయి వ్యాయామం చేయనివారు, అమితంగా భుజించినవారు అందరూ యిప్పుడు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.
మనం ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండాలన్నా, వెళ్లినా త్వరగా బయటకు రావాలన్నా అనారోగ్య లక్షణాలను ముందుగానే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పరిశుభ్రత చాలా ముఖ్యం. కరోనా తగ్గిందనగానే అందరూ విచ్చలవిడిగా ఉండడం ప్రారంభించారు. కరోనా ఉన్నా లేకపోయినా, చేతులు కడుక్కోవడం, మనుషులకు మరీ దగ్గరగా మసలకపోవడం ముఖ్యం. పెళ్లిళ్లలో బఫేల దగ్గర చూస్తాను. కనబడినవారందరికీ షేక్‌హాండ్ యిచ్చి, భోజనానికి వచ్చేవాళ్లలో నాలుగో వంతు మంది మాత్రమే వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కుంటారు. ఎంత స్పూన్‌తో తిన్నా నాన్లాటివి తుంపడానికి, పానీపూరీ గొంతులో పడేసుకోవడానికి చేయి వాడతాం కదా! పరిశుభ్రతతో పాటు బిపి, సుగర్ల విషయంలో మొదటి నుంచీ జాగ్రత్తగా ఉండాలి. వాటి గురించి యీ మధ్యే వచ్చిన వ్యాసాల్లో అంశాలు చెప్పి దీన్ని ముగిస్తాను.
సాధారణంగా మనం 40, 45 సంవత్సరాలు వచ్చేవరకూ పని గట్టుకుని బిపి చూపించుకోము. జ్వరమని డాక్టరు దగ్గరకు వెళ్లి ఆయన చూస్తే తప్ప! ఒక్కోప్పుడు పక్కవాళ్లకు చూస్తూ ఉంటే మనమూ సరదాపడి చూపించుకుంటే హైపర్ టెన్షన్ ఉన్నట్లు తేలుతుంది. సుగరూ అంతే. ఉత్తి పుణ్యాన చూపించుకోము. దాని లక్షణాలు బయటపడేవరకూ తెలియనే తెలీదు. అప్పటికే లేటవుతుంది. ఒకసారి వచ్చాక వదలవు, శంఖుచక్రాల్లా చెరో భుజానికి అతుక్కుని ఉండిపోతాయి. మితిమీరకుండా మేన్‌టేన్ చేయడమే మనం చేయగలిగేది. బిపి మధ్యవయస్కుల సమస్య మాత్రమే అనుకుంటూ వచ్చాం కానీ చిన్నపిల్లల్లో కూడా వస్తోందని ఇండియన్ నేషనల్ హెల్త్ పోర్టల్ ఒక అధ్యయనంలో చెప్పింది. పెద్దల్లో (ఎడల్ట్) 30% మందికి బిపి ఉంటే (నగరవాసుల్లో 34% మందికి, గ్రామీణుల్లో 28% మందికి) 10-12 సం.ల వయసులోని పిల్లల్లో 35% మందికి, 13 ఏళ్ల పై బడిన తరుణవయస్కులలో (ఎడాలసెంట్) 25% మందికి హైపర్ టెన్షన్ ఉందని రాస్తే నమ్మబుద్ధి కాలేదు.
బిపి అనగానే యిది డబ్బున్న పిల్లలు కొని తెచ్చుకునేది అనుకోవడం కద్దు. కానీ పేదల్లోనే ఎక్కువ ఉంటోంది. స్థూలకాయులకే బిపి ఉంటుందనుకోవడం కూడా పొరపాటేట. సన్నగా, బరువు తక్కువగా ఉన్న 10-12 ఏళ్ల గ్రూపులో ఉన్నవారిలో 32% మందికి, 13-18 ఏళ్ల గ్రూపులో 22% మందికి బిపి ఉంది. ఈ తరుణవయస్కులలో రూరల్, అర్బన్ తేడా లేకుండా అందరూ ఒకేలా ఉన్నారు. గ్రామాల్లో అర్బనైజేషన్ పెరగడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, స్క్రీన్ టైమ్ పెరగడం, ఉప్పు ఎక్కువగా ఉండే డబ్బా (కేన్డ్) తిళ్లు తినడం యివన్నీ కారణాలట. తక్కిన రాష్ట్రాలలోని పిల్లల కంటె ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఈశాన్య రాష్ట్రాలలోని పిల్లలకు బిపి ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో సగటున రోజుకి 9 గ్రా.ల ఉప్పు తీసుకుంటారు. తక్కిన రాష్ట్రాల్లో 8 గ్రా.లే తీసుకుంటారు.
ఇక సుగర్ విషయానికి వస్తే – 2019-21 మధ్య చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం ఆంధ్ర, బెంగాల్, ఉత్తరాఖండ్, గోవా, త్రిపురలలో 35 ఏళ్ల లోపు (15-34 సం.లు) పురుషుల్లో 8% మందికి రేండమ్ సుగర్ (పరగడుపున, భోజనం తర్వాత అని కాకుండా ఏదో ఒక సమయంలో తీసుకునేది) 140కి పైన ఉంది. 140 కంటె తక్కువ ఉంటే నార్మల్ కింద లెక్క. 140 దాటారంటే సుగర్ ముగ్గులోకి అడుగిడినట్లే. బెంగాల్, త్రిపురలలో 35 ఏళ్ల లోపు స్త్రీలలో కూడా 8% మందిది యిదే పరిస్థితి. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలలో 35 ఏళ్ల లోపు పురుషుల్లో 6% మందికి 140 కంటె ఎక్కువుంది. 2015-16తో పోలిస్తే 35 ఏళ్ల లోపు సుగర్ ఉన్న వాళ్ల సంఖ్య 2.6% పెరిగితే, స్త్రీల సంఖ్య 3% పెరిగింది. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 29 రాష్ట్రాలలో 20 రాష్ట్రాలలో సుగర్ ఉన్నవాళ్ల శాతం పెరగగా, 9 రాష్ట్రాలలో తగ్గింది.
బెంగాల్, త్రిపురలలో తప్ప తక్కిన చోట్ల పురుషుల కంటె స్త్రీల సుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. ఈ గ్రూపులోనే 30 ఏళ్లు దాటినవారిని విడగొట్టి చూస్తే పురుషుల్లో 11.3% మందికి, స్త్రీలలో 9% మందికి సుగర్ ఎక్కువగా ఉంది. వారిలో కొంతమంది అప్పుడే సుగర్ మాత్రలు వేసుకోవడం మొదలుపెట్టారు కూడా. దేశం మొత్తం మీద చూస్తే దక్షిణాది రాష్ట్రాలు (ఆఁధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ), తూర్పు రాష్ట్రాలు (బెంగాల్, ఒడిశా), ఈశాన్య రాష్ట్రాలు (త్రిపుర, అసాం, మిజోరాం, మేఘాలయ)లో సుగర్ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. ఏతావతా చెప్పేదేమిటంటే బిపి, సుగర్లను చిన్న వయసునుంచే ఏటేటా చెక్ చేయించుకోవడం మంచిది. కిటికీల్లోంచి యింట్లోకి దూరి, తలుపులు తెరిచి బందిపోట్లకు దారి సుగమం చేసే బాలచోరుల్లాటివి అవి. చడీచప్పుడు లేకుండా శరీరంలో ప్రవేశించి, తక్కినవాటికి రాచబాట వేస్తాయి.
వీటికి తోడు యీ మధ్య తరచుగా వినబడుతున్నవి – విటమిన్ సి, డి, బి 12ల లోపాలు. వీటికోసం మాత్రలు వేసుకోవడం కంటె ఆహారవిహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటారు. ఎందుకంటే వాటిని యిముడ్చుకునే శక్తి శరీరానికి లేకపోతే వేసుకున్న మాత్రలు వ్యర్థంగా మూత్రంలో పోతాయట. హోమియోపతిలో అయితే శరీరానికి ఆ శక్తి సమకూరుస్తాయంటూ టిస్యూ (బయోకెమిక్) సాల్ట్స్ అమ్ముతారు. ఇవి మందుల లాటివి కావు. గోడ పడిపోతే యిటుకలు పేర్చినట్లు, యివి క్రమేపీ సెల్స్ నిర్మిస్తాయట. కనీసం మూడు నెలలు వేసుకోవాలి. తినే తిండిలోంచి శరీరమే తనకు కావలసినంత తీసుకుంటూ ఉంటే అంతకంటె మనకు కావలసినదేముంది?
రోజూ మొదటి ముద్దగా ఉసిరికాయ పచ్చడి తినడం సి విటమిన్‌ను అందిస్తుంది. చ్యవనప్రాశ కూడా సి విటమిన్‌తో పాటు రోగనిరోధక శక్తి పెంచుతుంది. ముందురాత్రి అన్నంలో పాలు తోడుపెట్టుకుని పొద్దున్న పెరుగన్నం తినడం బి12 సమకూరుస్తుంది. ఇక డి విటమిన్ అంటారా? అందరికీ తెలుసు. రోజంతా యింట్లోనే మగ్గిపోకుండా బయట ఎండలో తిరగాలి. ఇవన్నీ తరతరాలుగా పెద్దలు చెపుతున్నవే. మనం మానేయడంతో లైఫ్‌స్టయిల్ డిసీజెస్ పేర సకల రోగాలు వీరవిహారం చేస్తున్నాయి. కోట దృఢం చేసుకుని పెట్టుకుంటే కరోనా ఎన్ని వేషాలు మార్చుకుని వచ్చినా దడవనక్కరలేదు. (ఫోటో – దావోస్‌లో ఫైజర్ సిఇఓపై జర్నలిస్టులు ప్రశ్నలు కురిపించిన దృశ్యం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2023)