జనసేన నాయకుడు , మెగా బ్రదర్ నాగబాబు దెబ్బకు ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. నాగబాబు రాకతో భయపడ్డ ప్రభుత్వం… వెంటనే రోడ్డును బాగుచేయడం చర్చనీయాంశమైంది. ముమ్మాటికీ ఇదీ నాగబాబుకే క్రెడిట్ దక్కుతుంది. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా వున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు చాలా వరకూ రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. కొన్ని చోట్ల కొత్త రోడ్లను వేశారు. ముఖ్యంగా రోడ్లపై జనసేన అప్పుడప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమిస్తోంది.
ఈ నేపథ్యంలో అనంతపురం కలెక్టరేట్ నుంచి తాడిపత్రి వెళ్లే వైపు చెరువుకట్టపై రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని జనసేన నాయ కుడు నాగబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాను కూడా స్వయంగా హాజరవుతానని ఆయన ప్రకటించారు. జనసైనికులు శ్రమదానం చేసి రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రాత్రికి రాత్రే చెరువుకట్టపై రోడ్డును బాగు చేశారు. చెరువుకట్టపై నిర్మాణ పనులు చేపట్టారు. చెరువుకట్టపై రోడ్డును నాగబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటనతో రోడ్డు బాగుపడుతుందంటే అంతకంటే సంతోషం ఏముంటుందన్నారు. రాష్ట్రంలో రోడ్లు ఉన్న రీతిలోనే జగన్ ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. ఇదిలా వుండగా పవన్‌కల్యాణ్ వారాహి యాత్రపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. యాత్రకు సంబంధించి తమ నాయకుడు పవన్‌కల్యాణే చెబుతారన్నారు.