ఎమ్బీయస్‌: ‘తల’పులలో చింతకు ‘నో వేకెన్సీ’

సాధారణంగా మనం దేని గురించైనా వర్రీ అవుతున్నామంటే ఆ ఆలోచన మన తలలో, తలపులలో సుడిగుండంలా తిరుగుతూ వుంటుంది. కూర్చున్నా, పడుక్కున్నా నిరంతరం అదే ఆలోచన సుళ్లు తిరుగుతూ, ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఆగుతుంది.…

సాధారణంగా మనం దేని గురించైనా వర్రీ అవుతున్నామంటే ఆ ఆలోచన మన తలలో, తలపులలో సుడిగుండంలా తిరుగుతూ వుంటుంది. కూర్చున్నా, పడుక్కున్నా నిరంతరం అదే ఆలోచన సుళ్లు తిరుగుతూ, ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఆగుతుంది. దానికి పరిష్కారం ఉంటే ఆలోచించవచ్చు. లేనప్పుడు ఏం చేస్తాం? ఒకతనికి ఐదేళ్ల కూతురు చచ్చిపోయింది. అయ్యో అని బాధపడుతూ వుంటే, పది నెలల తర్వాత దేవుడు వాళ్లకు మరో కూతుర్ని యిచ్చాడు. కానీ యీ సారి ఐదు రోజుల్లోనే తీసుకుపోయాడు. ఇక వారి దుఃఖం గురించి వేరే చెప్పాలా? మర్చిపోదామన్నా మర్చిపోలేని బాధ.

అయితే అతని నాలుగేళ్ల కొడుకు ఓ రోజు మధ్యాహ్నం అతని దగ్గరకి వచ్చి 'ఆడుకోవడానికి నాకు ఓ చెక్క పడవ తయారు చేసి పెట్టవా?' అని అడిగాడు. అతన్ని ఉసూరుమనిపించడం యిష్టం లేక ఓ బోటు తయారుచేయడం మొదలుపెట్టాడు. మూడు గంటలు పట్టింది. అంతా అయిన తర్వాత సింహావలోకనం చేసుకుని చూస్తే ఆ మూడు గంటలూ చనిపోయిన పిల్లల గురించి ఆలోచించలేదని, చాలా రోజుల తర్వాత తన మనసు ఆ కొద్దిసేపు శాంతించిందనీ అతను గుర్తించాడు. 

మనసు ఖాళీగా వుంటే చింత వచ్చి ఆక్రమించేస్తుంది. దానికి చోటు లేకుండా చేయాలంటే తక్కిన ఆలోచనలతో తల నింపేయాలి.  చోటు చాలక ఉక్కిరిబిక్కిరై చింత బయటకు పోతుంది. ఈ విషయం గ్రహించాక అతను యింట్లో గదిగదీ తిరిగి రిపేరు చేయాల్సిన వస్తువులూ, పనులూ ఏమిటాని తరచితరచి చూశాడు. తాళం కప్పల దగ్గర్నుంచి అట్టలూడిన పుస్తకాల దగ్గర్నుంచి కిటికీ అద్దాల దాకా మొత్తం జాబితా తయారుచేస్తే 242 ఐటమ్స్‌ తేలాయి. అవన్నీ సరి చేసేసరికి రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత కూడా ఖాళీగా వుండకుండా వయోజనులకు చదువు చెప్పే రాత్రిబడిలో టీచరుగా చేరాడు. వాళ్లకు పాఠాలు చెప్పడానికి తను చదువుకోవలసి వచ్చింది.

స్కూలు విస్తరణకై నిధులు సేకరించాడు, పనిలో పనిగా రెడ్‌క్రాసుకూ విరాళాలు పోగేశాడు. స్కూలు బోర్డుకి చైర్మన్‌గా వుండమన్నారు. దానాదీనా వర్రీ అవడానికి టైము లేకుండా పోయింది. నిజానికి టైముంటేనే వర్రీలు ఎక్కువవుతాయి. నాకు తెలిసిన ఒకావిడకు చిన్నతనంలోనే పెళ్లీ, పురుడూ అయి, పిల్లాడు అర్భకంగా పుట్టి వెంటనే చచ్చిపోయాడు. ఈవిడ దిగాలు పడితే భర్త చదువులో పెట్టాడు. ఆవిడ అలాఅలా చదువుకుంటూ పోయి మూడు ఎమ్మేలు సంపాదించింది. ముగ్గురు పిల్లలు పుట్టాక లెక్చరరయింది. రిసెర్చి చేసి డాక్టరేటు తీసుకుంది. అనువాదాలు చేసేది. రేడియోలో లెక్చర్లిచ్చేది. అనేక సంఘాల్లో చురుగ్గా వుండేది. 

ఉద్యోగస్తులు రిటైరయ్యాక అనారోగ్యం పాలవుతారు. పనిలో వున్నంతకాలం చురుగ్గానే వుంటారు. రిటైరయ్యాక జుట్టు ఊడిపోయిందని, ఒంటి మీద పొక్కులు వచ్చాయని, గోళ్లు చిట్లాయని, కొడుకుని కలవడానికి వచ్చిన అతని ఫ్రెండు తనను పలకరించలేదని, అడగ్గానే కోడలు కాఫీ యివ్వలేదని, ఊళ్లోకొచ్చినా అల్లుడు చూడడానికి రాలేదని.. యిలాటి విషయాల గురించి తెగ ఆలోచించి చింతాక్రాంతులవుతారు. ఉద్యోగంలో వున్నంతకాలం యిలాటివాటి గురించి పట్టించుకోవడానికి సమయమే వుండదు. ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు – చిన్నతనం ఆటల్లో, యవ్వనం భోగలాలసలో, వృద్ధాప్యం చింతలో గడిచిపోతుంది, దేవుణ్ని స్మరించడానికి ఎప్పుడూ సమయం చిక్కదు అని.

పాతవి నెమరేసుకుంటూ, 'అలా చేసి వుండాల్సింది, ఫలానా చోట యిన్వెస్ట్‌ చేసి వుండాల్సింది, ఫలానావాణ్ని క్షమించి వుండాల్సింది కాదు' వంటి ఆలోచనల్లో వృద్ధాప్యం గడపడం పొరబాటు. వాటివలన సైకోసొమాటిక్‌ రోగాలు చుట్టుముడతాయి. కొత్త విషయాల గురించి ఆలోచనల్లో తలమునకలయితే యీ వర్రీ వుండదు. ముసలితనంలోనే కాదు, మధ్యవయస్సులోనూ చింతల్లో మునిగేవాళ్లుంటారు. ఆఫీసుల్లో పనిచేసే మగాళ్లు 'బాస్‌ నన్ను చూసిన చూపులో అర్థమేమైనా ఉందా?' 'జుట్టు ఊడుతోందా?' 'పిల్లాడికి ఎమ్‌సెట్‌ ర్యాంకు వస్తుందా రాదా?'.. యిలాటి ఆలోచనల్లో పడి సిగరెట్లో, మందో తాగుతారు. ఆఫీసు పని బుర్రకు తగినంత పని కల్పించలేకపోతూ వుంటే ఏదైనా హాబీ అలవర్చుకుంటే మంచిది.

ఒకావిడ కొడుకు గల్ఫ్‌కు వెళ్లాడు. ఉద్యోగం దొరికిందో లేదో, దొరికినా ఉంటుందో లేదో, ఏదైనా నేరం మోపి చెయ్యో, కాలో తీసేస్తారేమో నన్న భయం ఆవిణ్ని తినేయసాగింది. ఏదైనా వ్యాపకం కల్పించుకుంటే మంచిదని యింట్లో పనిమనిషిని తీసేసి పనులన్నీ తనే చేసుకోసాగింది. అయితే కొన్నాళ్లకు గమనించిందేమిటంటే – ఆ పనులన్నీ అలవాటయినవే కాబట్టి యాంత్రికంగా చేసుకుపోతోంది. మెదడుకి వ్యాపకం లేక ఆ వర్రీ చుట్టే తిరుగుతోంది. బుర్ర పెట్టి శ్రద్ధగా చేయవలసిన పనుల కోసం వెతికింది. ఓ చీరల కొట్లో సేల్స్‌ ఉమన్‌గా చేరింది. వచ్చిన కస్టమర్లకు కావలసిన రంగులు, డిజైన్లు, మ్యాచింగ్‌ బ్లౌజులు వెతకడంలో వేరే దేని గురించి ఆలోచించడానికి టైమే వుండేది కాదు. ఇంటికెళ్లేసరికి పిక్కలు సలిపేసేవి.

వాటికి నూనె మర్దనా చేసి, పక్క మీద వాలేసరికి గాఢంగా నిద్ర పట్టేసేది. మన చేతిలో లేనిదాని గురించి వర్రీ అవుతూ కూర్చోవడం కంటె మనసును మళ్లిస్తేనే సుఖం. దేని గురించైనా పరిశోధన చేసేవాళ్లకు ఓ పట్టాన నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌ రాదట. ఎందుకంటే కొత్త విషయం తెలుసుకుంటున్న కొద్దీ మనసు ఉత్సాహభరితం అవుతూ వుంటుంది. చింత ఉన్నా గుర్తుకు రాదు. నాకు తెలిసిన ఒకాయన 70వ ఏట సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. మరో ఆయన జ్యోతిష్యం నేర్చుకున్నాడు. ఇంకో ఆయన ఉచిత వివాహవేదిక మొదలు పెట్టాడు. మరో ఆయన గుడికి ట్రస్టీ అయి కార్యక్రమాలు ఉధృతం చేశాడు.

సమాజానికి సేవ చేద్దామనుకుంటే ఎన్నయినా మార్గాలు కనబడతాయి. పిల్లలు అమెరికాకు వెళ్లి స్థిరపడిపోయాడని కాస్సేపు తిట్టుకుని, ట్రంప్‌గాడు తరిమేస్తే ఎలా అని యింకాస్సేపు తలపట్టుకుని, మనం ఛస్తే పిల్లాడు అమెరికానుంచి వచ్చేదాకా పక్కింటివాళ్లు శవజాగారం చేస్తారా లేదాని మరో కాస్సేపు బెంగ పెట్టుకుని.. యిలా కాలక్షేపం చేయడం కంటె హైస్కూల్లో అశ్రద్ధ చేసిన హిస్టరీ, జాగ్రఫీ పుస్తకాలు, కాలేజీలో ఛాయిస్‌లో వదిలేసిన లెక్కల చాప్టర్లు ముందేసుకుని కుస్తీ పడితే మంచిది. –

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]