'శాసనమండలి అవసరమా?' అని జగన్ నిన్న అసెంబ్లీలో అడిగారు. దాని రద్దు అవసరమా? అని మనం అడగాలి. జగన్ చూపిస్తున్న కారణమేమిటి? దాని నిర్వహణకు రూ. 60 కోట్లు అవుతోంది. బీద రాష్ట్రానికి అంత ఖఱ్చు అవసరమా? అని. మానిఫెస్టోలో పెట్టని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామంటున్న జగన్ నోట యీ మాట రావచ్చా? జగనన్న.. పేరు తగిలించుకుని మరో పథకం యీ నెలలోనో, పై నెలలోనే వచ్చినపుడు 'ఇది మనకు అవసరమా? ముందు ఆదాయం సంగతి చూడు అని మనం అడగచ్చుగా! సెక్రటేరియట్‌ను అమరావతి నుండి వైజాగ్‌కు మార్చడానికి సిఫార్సు చేసిన హైపవర్ కమిటీ ఉద్యోగులకు యిచ్చే రాయితీలంటూ పెద్ద లిస్టు చెప్పింది. అది అవసరమా? హైదరాబాదు నుంచి అమరావతికి మార్చినపుడు బాబు వాళ్ల మీద బోల్డు తగలేశారు. అయినా ఎఫిషియన్సీ పెరిగిన దాఖలాలు ఏమీ లేవు. ఇప్పుడు మళ్లీ వాళ్లకు వైజాగ్‌లో యిళ్లస్థలాలు, హెచ్చు ఎచ్ఆర్ఏలు, వగైరాలు! బాబు చేసిన తప్పే జగనూ చేయబోతున్నట్లుంది. అలాటి ఖర్చులు పెట్టబోతూ అరవై కోట్ల దగ్గర బేరాలా?
ఆదాయం వచ్చే మార్గాలేమీ ఆనటం లేదు. గతంలో హైదరాబాదుని మించిన రాజధాని అమరావతి కడతానంటూ బాబు పూజలూ, పునస్కారాలకే కోట్లు తగలేశారు. ఇప్పుడు ఆ హైదరాబాదు సిండ్రోమ్ జగన్‌కూ తగిలినట్లుంది. సెక్రటేరియట్ వైజాగ్‌కు మారిస్తే పదేళ్లలో హైదరాబాదుతో పోటీ పడుతుందట! అంటే అన్నీ పట్టుకెళ్లి వైజాగ్‌లోనే పెడతారా? ఈ పదేళ్లలో హైదరాబాదు ఎదగకుండా కూర్చుంటుందా? ఇప్పుడు మూడు రాష్ట్రాలకు విస్తరించిన నైజాం రాజ్యాన్నంతా ఎండగట్టి రాజధాని హైదరాబాదులోనే నిజాం డబ్బు కుమ్మరించాడు. అది 400 ఏళ్లకు పైగా రాజధాని. ప్రకృతి వైపరీత్యాల తాకిడి లేని ప్రాంతం. నగరంలో అనేకం నిజాం భూములే కాబట్టి, దరిమిలా ప్రభుత్వభూములై ఏ సంస్థ పెట్టాలన్నా భూమి లభ్యంగా ఉంది. అలాటి సౌలభ్యం వైజాగ్‌లో ఉందా? అమరావతిలో ఉందా?
రాతినేల కాబట్టి, నిర్మాణవ్యయం తక్కువ. స్థానిక ప్రజలు బయటివారిని ఆహ్వానించే సహృదయం కలవారు. భాషపరంగా, ప్రాంతపరంగా బయటివారు యిబ్బందులు పడని ప్రదేశం. దేశానికి మధ్యలో ఉంది. భిన్న సంస్కృతులు మేళవించిన నగరం కాబట్టి మేలైన హ్యూమన్ రిసోర్సెస్ దొరికేందుకు అవకాశం మెండుగా ఉంది. మొన్నటిదాకా చౌకధరలకు భూమి దొరికేది. ఇలాటివి ఉన్న నగరం ఆంధ్రలో ఎక్కడుంది? ఈ విషయాన్ని మభ్యపరచి, మాటిమాటికీ హైదరాబాదును మించిన రాజధాని అంటూ ఆంధ్ర నాయకులు ప్రజలను మోసపుచ్చుతున్నారు. హైదరాబాదు కారణంగానే తెలుగువాళ్లు రెండుగా విడిపోయారు. ఇప్పుడు ఆంధ్రలో మరో మినీ-హైదరాబాదు తయారుచేయబోతే మూడుగా విడిపోతారు. మధ్యతరహా రాజధాని, అభివృద్ధిని ప్రతి జిల్లాకు పంచడం – యివే రాష్ట్రలక్ష్యాలు కావాలి.
అభివృద్ధి పంచాలంటే పరిశ్రమలు రావాలి. అవి ఉత్తినే రావు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. దానికి ఎన్ని వేల కోట్లూ చాలవు. దానిపై ఖర్చు పెట్టకుండా పప్పుబెల్లాల పంపిణీ మీదనే ఉంది జగన్ దృష్టంతా. సంక్షేమ పథకాలు అవసరమే. వాటి ద్వారానే ప్రజల చేతికి డబ్బు చేరుతుంది. వాళ్లకు డబ్బు చేరితేనే వారి కొనుగోలు శక్తి పెరిగి వస్తూత్పత్తి జరుగుతుంది. పరిశ్రమలు నిలబడతాయి. ఇందిరా గాంధీ కాలంలో అదే జరిగింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నదేమిటంటే డబ్బంతా కార్పోరేట్లకు పంచారు, జనం చేతిలో డబ్బు ఆడక, వస్తువులు అమ్ముడుపోక, దుకాణాలు, పరిశ్రమలు మూతబడుతున్నాయి. స్వల్పకాలిక సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక మౌలికవసతుల కల్పన మధ్య తూకం ఉండాలి. పైగా గతప్రభుత్వం ఆర్భాటాలు చేసి, నెత్తిమీద పెట్టిన అప్పుల బండ ఉంది. వడ్డీలు కట్టాలి, వాయిదాలు కట్టాలి. జగన్ యివేమీ ఆలోచిస్తున్నట్లు కనబడటం లేదు.
కానీ మండలి దగ్గరకు వచ్చేసరికి రూ. 60 కోట్లు చాలా ఎక్కువ మొత్తంగా తోస్తోంది. 1985లో ఎన్టీయార్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు కూడా యిలాటి వాదనే వినిపించారు – ఓ పక్క సంక్షేమ పథకాలకు డబ్బు ఖర్చు పెడుతూనే! ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలను మితిమీరిన స్థాయికి తెచ్చిన పాపం ఎన్టీయార్‌దే. ఇప్పటి జగన్‌లాగానే అప్పుడు ఎన్టీయార్‌కు కూడా తొందరెక్కువ. తను అనుకున్న సంస్కరణలు గబగబా చేసేయాలన్న తపనతో తనను విమర్శించిన వాళ్లను కూడా అడ్డు తగులుతున్నారని భావించి విరోధులుగా చూసేవాడు. ఆలోచన మంచిదే కావచ్చు కానీ అందర్నీ కలుపుకుని పోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా చర్చించినపుడే ఊహించని అనేక కోణాలు బయటపడతాయి. ఘర్షణ ఉన్నపుడు వేడి పుడుతుంది కానీ వెలుగు కూడా వస్తుంది.
ప్రజాస్వామిక లక్షణాలున్న నాయకుడు అనుచరులతో, బయట ఉన్న మేధావులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అన్నీ తనకే తెలుసునన్న అహంకారం బాబుది, తన మాటే చెల్లాలన్న పంతం జగన్‌ది. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్‌ను బలమైన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడానికి నిరాకరించి అయిదేళ్లలో అధికారం పోగొట్టుకున్నారు. ఋణమాఫీపై అబద్ధం ఆడలేక, కాస్తలో ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తిగా తనను తాను భావించుకుంటూ జగన్, బాబు ఆధిక్యతను గుర్తించడానికి ఒప్పుకోలేదు. ఓ పక్క అనుచరులను పోగొట్టుకుంటూ కూడా బాబు రాజకీయ చతురత (పోనీ కుటిలత)ను గుర్తించలేదు. అయిదేళ్ల అధ్వాన్న పాలన తర్వాత కూడా 39% ఓటు బ్యాంకు నిలుపుకోగలిగిన వ్యక్తిగా బాబును యిప్పటికైనా గౌరవించటం లేదు. అఖిలపక్షాన్ని గతంలో బాబు పిలవలేదు, ఇప్పుడు జగనూ పిలవటం లేదు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కెసియార్, ఆంధ్రలో బాబు లేదా జగన్ – అందరికందరే ఏకపక్షపు నిర్ణయాలలో!
ప్రతిపక్షాల పట్ల, పక్షపాతంతో వ్యవహరిస్తున్న మీడియా పట్ల వైయస్ చూపినంత ఔదార్యం కూడా జగన్ చూపటం లేదు. ప్రతికూలమైన టీవీ ఛానెళ్లు ప్రసారం కాకుండా చేయడం హేయమైన చర్య. వాళ్లు అసత్యప్రచారం చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి చట్టాలు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తామని హెచ్చరించారు కూడా. వాళ్ల ప్రచారాన్ని ఎదుర్కోవడానికి తగిన సాధనసంపత్తి ప్రభుత్వపక్షాన, పార్టీపక్షాన సమకూర్చుకోవాలి. అంతేకానీ నోరు నొక్కేస్తానంటే ఎలా? ఆంధ్రజ్యోతి ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. రాజధాని మార్పు విషయంలో చేవ చచ్చిందా? తిరగబడరేం? అంటూ మహా రెచ్చగొడుతోంది.
మేం రాజధానికై సేకరించిన మొత్తం 2.52 కోట్లు. 2014 అక్టోబరులో బాబుకి యిచ్చాం. అదేమైందని యిన్నాళ్లకు అడుగుతోంది. ఇన్నాళ్లూ అడగలేదేం? వేరేగా ఓ ఫండ్‌లో పెట్టారా? ఆ దాతల పేరు ఓ బ్లాకుకి పెట్టారా? లేక బాబు వాస్తు మార్పులకు, హోటల్ ఖర్చులకు అయిపోయిందా అని అడగవద్దా? ఆంధ్రజ్యోతే కాదు, ప్రభుత్వం కూడా నవ్యాంధ్రకు రాజధాని కట్టే ఖర్చుల కంటూ నిధులు వసూలు చేసింది, యిటుకలు అమ్మింది, విద్యార్థులను కూడా విరాళా లిమ్మనమంది. మరి బజెట్‌లో అదంతా చూపించారా? కేంద్ర నిధులకు యుటిలిటీ సర్టిఫికెట్లు యివ్వలేదన్న గోల ఎలాగూ ఉంది. ప్రజల విరాళాలకైనా లెక్క చెప్పకపోతే ఎలా? అమరావతిని వ్యవసాయ జోన్‌గా మార్చాలని బోస్టన్ కమిటీ సలహాను వెక్కిరిస్తూ ఆ మాత్రం వ్యవసాయం చేసుకోలేక రైతులు తమ భూములను యిచ్చారా? అని రాశారు. '86% మంది రైతులు చేసుకోలేక పోయారని ఆ పేపరే రాసింది. ఇప్పుడిలా! అమరావతిలో జిల్లేళ్లు మొలుస్తాయని శాపనార్థాలు ఒకటి పైగా!
ఇక ఈనాడు భలే జోక్స్ వేస్తోంది. 'ఆంధ్ర రాజధానిగా అమరావతి ఉంటే దౌత్యపరంగా భారతదేశం చైనాతో సహా అనేక దేశాలతో సన్నిహిత సంబంధాలు పెంపొందించుకోవచ్చు. అమరావతి రాజధాని అంటే ఆర్థిక సాయం చేయడానికి ఆ దేశాలు ముందుకు వస్తాయి. వేరే చోటకి మారిస్తే రాష్ట్ర ప్రయోజనాలు కాలరాసుకున్నట్లే..' అంటూ రాసిన వ్యాసాన్ని ఎడిట్ పేజీలో వేసింది. ఒక రాష్ట్రపు రాజధాని దౌత్యవిషయాలను ప్రభావితం చేస్తుందా వింత కాకపోతే! అలా అయితే బుద్ధుడికి జ్ఞానోదయం అయిన బుద్ధగయ ఉంది కదాని చైనా యిప్పటికే అక్కడ పెట్టుబడులు కుమ్మరించి వుండాలి. బౌద్ధదేశాన్ని టిబెట్‌ను కబళించి వేసి వాళ్ల హక్కులను హరించి వేసిన చైనాకు మతం ఒక ఫ్యాక్టర్‌గా ఉంటుందా? అలా అయితే బుద్ధవిగ్రహాన్ని పేల్చివేసిన తాలిబన్లపై చైనా యుద్ధాన్ని ప్రకటించి ఉండాల్సింది.
అమరావతిని నిలబెట్టడానికి యిలాటి తలాతోకా లేని వాదనలను ముందుకు తెస్తోంది ఈనాడు. మొన్న పవన్ కళ్యాణ్ దిల్లీ వెళ్లి నిర్మలా సీతారామన్‌కు కలిసి బయటకు వచ్చి, రాజధాని అమరావతి నుంచి మారిస్తే ఊరుకోం, రాష్ట్ర బిజెపి-జనసేన కలిసి పోరాటం చేస్తాం అని ప్రకటించారు. మర్నాడు ఈనాడు ఫ్రంట్ పేజీలో 'శాశ్వత రాజధాని అమరావతే' అని హెడింగ్ పెట్టి నిర్మలా సీతారామన్ ఫోటో వేశారు. చటుక్కున చూస్తే ఆ మాట ఆవిడే అన్నట్లు తోస్తుంది. 'ఇదెక్కడి జర్నలిజం?' అంటూ బిజెపి అధికార ప్రతినిథి టీవీ వేదికగా విసుక్కున్నారు. నేటి మీడియా నిష్పక్షపాతంగా ఉండటం లేదు. ఎవరి ప్రయోజనాలు వారికి ఉండి వాటికి అనుగుణంగా వార్తలను వక్రీకరిస్తున్నారు. వీటిని ప్రజాస్వామికంగానే ఎదుర్కోవాలి తప్ప బెదిరింపులకు, నిషేధాలకు దిగడం తగదు.
అలాగే మండలితో కూడా వ్యవహరించాలి. ఇప్పుడు ఇంగ్లీషు మీడియం చట్టం ఉంది. దాన్ని టిడిపి మండలిలో ఆపింది. దానికా హక్కు ఉంది, వినియోగించుకుంది. అంతిమంగా అసెంబ్లీ నిర్ణయమే నెగ్గుతుంది. వచ్చే ఎకడమిక్ ఇయర్ లోగా ఆ బిల్లు పాస్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ లోగా బాధెందుకు? పాలకపక్షానికి అసెంబ్లీలో విపరీతమైన మెజారిటీ వచ్చేసిన సందర్భాల్లో స్పీడు బ్రేకర్లుగా ఉండడానికి మండలి వ్యవస్థను ఏర్పరచారు. వాటిని సహించాలి, భరించాలి. అసహనం చూపి, వాటిని తవ్వేస్తానంటే స్పీడు ఓవరై వాహనం బోల్తా పడుతుంది.
అలాటి సహనం చూపకుండా ఎన్టీయార్ 1985లో మండలి ఎత్తేశారు. తప్పులు జరుగుతూంటే నిదానించమని చెప్పే వ్యవస్థ లేకుండా పోయింది. పాలనాపరంగా తప్పులు జరిగాయి. 1989 ఎన్నికలలో టిడిపి ఓడిపోయింది. 'పని లేని రాజకీయనాయకులకు ఆవాసం ఏర్పరచడానికే మండలి' అని ఎన్టీయార్ అనడంలో వాస్తవం లేకపోలేదు. కానీ ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గలేని నాయకులకు కూడా ఆవాసం కావాలి. లేకపోతే వాళ్లను హేండిల్ చేయడం కష్టం. పైగా ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గాలంటే మూకబలం, రూకబలం, ప్రజాకర్షణ ఉండాలి. అవి లేనివారిని, ఉన్నా చాలనివారిని ఎంఎల్సిలుగా, రాజ్యసభ ఎంపీలుగా ఎంపిక చేస్తారు.
మండలి రద్దు చేయడానికి పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాలి. అప్పట్లో ఎన్టీయార్‌కు రాజీవ్ గాంధీ సహకరించారు, కాంగ్రెసుకు ఉన్న పట్టు పోతుందని తెలిసినా! అందుకే సాధ్యమైంది. తర్వాత కాంగ్రెసు వాళ్లు వచ్చాక మండలిని పునరుద్ధరిద్దామని చూసినా ఓ పట్టాన కాలేదు. చివరకు వైయస్ 2007లో సాధించారు. దేశంలో ఆరు రాష్ట్రాలలో – తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బిహార్లలో మండళ్లు ఉన్నాయి. రాజస్థాన్, అసాం పెడదామనుకున్న ప్రతిపాదనలు పార్లమెంటులో పెండింగులో ఉన్నాయి.
ఎమ్మెల్సీల సంఖ్య ఎమ్మెల్యేల సంఖ్యలో మూడో వంతే ఉంటుంది. వాళ్లలో గత ప్రభుత్వపు ఛాయలుంటాయి. పార్లమెంటు విషయానికి వస్తే లోకసభ తాజాది, రాజ్యసభ పాతది. మోదీకి లోకసభలో ఎంత మెజారిటీ ఉన్నా, రాజ్యసభకు వచ్చేసరికి బిల్లులు ఆలస్యమై పోతున్నాయి, ఆగిపోతున్నాయి. వాటితో రకరకాలుగా వేగుతున్నాడాయన. అక్కడ నెగ్గుకు రావడానికి సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాడు. అదే డెమోక్రసీలోని బ్యూటీ. తెలంగాణలో కెసియార్‌కు కూడా మండలితో చిక్కులు వచ్చాయి. ఫిరాయింపులతో నెగ్గుకు వచ్చాడు. జగన్‌కు అది యిష్టం లేదు. మంచిదే.
కానీ ఓర్పుతో అందర్నీ కూడదీసుకుని వెళ్లాలి తప్ప, ఏకంగా రద్దు చేయడానికి చూస్తే నియంతగా ముద్ర పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ప్రతీ చర్యకు ఉద్దేశం ఎలా ఉన్నా, దురుద్దేశమే ఆపాదించబడుతుంది. ఇంగ్లీషు మీడియం బిల్లు ఆగిపోయినప్పుడు రాని మండలి రద్దు ఆలోచన యీ రాజధాని మార్పు విషయంలో ఎందుకు వస్తోంది అనే సందేహం వస్తుంది. వెనువెంటనే వైజాగ్‌లో ఏదో వెస్టెడ్ యింట్రస్ట్ ఉంది, ఆ ఇంట్రస్ట్ మూడు నెలలు ఆగలేదా? ఈ లోపునే ఏవైనా ఒప్పందాలు జరగాల్సి వుందా? అనే సందేహాలు కూడా! అమరావతి విషయంలో టిడిపిపై యిలాటి సందేహాలే వచ్చాయి. ఇప్పుడు వైసిపి వచ్చి 4 వేల ఎకరాల గురించి సందేహాలు తీర్చేసింది. ఇప్పుడు వైసిపికి ఉన్న తొందర విషయంలో సందేహాలు తర్వాతి ప్రభుత్వం తీరుస్తుందా?
వైసిపి అభివృద్ధి వికేంద్రీకరణ గురించి చెప్తూ వచ్చింది తప్ప రాజధాని మార్పు గురించి మానిఫెస్టోలో కూడా చెప్పలేదు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అధికార వికేంద్రీకరణ చేస్తున్నారని టిడిపి ఘోషిస్తోంది. అది కూడా మీరు నేర్పిందే కదా! మండల వ్యవస్థ, ప్రజల వద్దకు పాలన వంటివి టిడిపి కాన్సెప్టేగా అని వైసిపి గుర్తు చేస్తోంది, నిజమే అధికారం కూడా నాలుగు చోట్లకు పంచాలి. కానీ దానికి సమయం పడితే యింత అసహనం దేనికి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండానే ఎన్టీయార్ మునసబు, కరణాల వ్యవస్థ రద్దు చేశారు. దాంతో రికార్డులన్నీ గల్లంతై పోయాయి. ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 55కు తగ్గించేశారు. తర్వాతి రోజుల్లో కోర్టు దాన్ని చట్టవిరుద్ధమనడంతో వారందరి వద్దా ఏ పనీ తీసుకోకుండా మూడేళ్ల జీతాలు యివ్వాల్సి వచ్చింది. తొందరపాటు అనర్థదాయకమని యివి నిరూపించాయి.
రాజధాని మార్పు విషయంలో కోర్టు రైతుల అభ్యర్థనలు వినడానికి యిచ్చిన సమయం పూర్తి కాకుండానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబడింది. అది కోర్టు ధిక్కారం కింద వస్తుందేమో చూడాలి. సెలక్టు కమిటీ రిపోర్టు వచ్చేదాకా చూద్దామని హైకోర్టు అంటోంది. ఈలోగానే జగన్ మండలి చైర్మన్ ప్రవర్తన బాగాలేదు కాబట్టి మండలిని రద్దు చేసేస్తామంటున్నారు. 'రూల్స్‌కు అనుగుణంగా లేనందున, సెలక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదని అంటూనే నా విచక్షణాధికారాలు ఉపయోగించి, సెలక్టు కమిటీకి పంపుతున్నా' అని అనడాన్ని ఆక్షేపిస్తున్నారు. మండలి చైర్మన్ ప్రవర్తనలో లోపాలుంటే కోర్టుకి నివేదించవచ్చు. రాజ్యాంగం విచక్షణాధికారం యిచ్చాక దాన్ని ఎలా ఉపయోగించాలో ఆయన యిష్టం.
ఏం? అసెంబ్లీలో స్పీకరు తన విచక్షణాధికారాన్ని పలుమార్లు ఉపయోగించటం లేదా? మంత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్న కోడెల స్పీకరయ్యాక తన పదవిని దుర్వినియోగం చేసినట్లు కనబడింది. సభ బయట ప్రతిపక్ష పార్టీపై రాజకీయ వ్యాఖ్యలు చేసి ఔచిత్యం పాటించలే దనిపించుకున్నారు. ఇప్పటి స్పీకరు సభలో మరీ అంత అన్యాయంగా ప్రవర్తించకుండా ప్రతిపక్షానికి మైకు యిస్తున్నా, మధ్యమధ్యలో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సభ బయట రాజకీయ వ్యాఖ్యలు చేసి పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నారు. ఇవన్నీ కారణాలుగా చూపి కేంద్రం ఆంధ్ర అసెంబ్లీని రద్దు చేద్దామని ఆలోచిస్తే జగన్ హర్షిస్తారా? చైర్మన్ తప్పు చేశారు, ప్రతిపక్ష నాయకుడు గ్యాలరీకి వచ్చి కూర్చుని డైరక్షన్ యిచ్చారు (చెప్పేదేదో ముందే చెప్పి వుంటారు) లాటి కారణాలు చెప్పి మండలిని రద్దు చేస్తే నియంతృత్వానికి మొదటి అడుగు పడినట్లే!
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2020)
[email protected]