చైనాలో 1970ల వరకు భారతీయ సినిమాలు ఆడుతూండేవి. రష్యాలో లాగే రాజ్ కపూర్, 'ఆవారా హూఁ' పాట చైనాలో కూడా చాలా పాప్యులర్. అప్పట్లో చైనా విదేశీ సినిమాలను దిగుమతి చేసుకోనిచ్చేది కాదు. ఇండియన్ సినిమాలకు మాత్రం మినహాయింపు యిచ్చింది. ఎందుకంటే ఇండియన్ సినిమాల్లో ఆటా, పాటా, రంగుల దుస్తులు, భారీ సెట్టింగులు చైనీయులకు నచ్చుతాయి. 1990లలో అమెరికాతో దోస్తీ పెరిగాక చైనావాళ్లు హాలీవుడ్ నుండి కూడా సినిమాలు దిగుమతి చేసుకోసాగారు. ఏడాదికి 24 విదేశీ సినిమాలు అనుమతిస్తామని పరిమితి విధించారు. హాలీవుడ్ సినిమాల ముందు మరే సినిమాలూ ఆనవు కాబట్టి యిరవై నాలుగూ హాలీవుడ్ సినిమాలనే దిగుమతి చేసుకునేవారు. అనుకోకుండా మన ''త్రి ఇడియట్స్'' సినిమా రెండేళ్ల తర్వాత అక్కడ రిలీజయి సక్సెసు కావడంతో వారికి మనపై దృష్టి పడింది. చైనా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఆ సినిమా గురించి తెలుసుకుని హాల్లో రిలీజైనప్పుడు వచ్చి చూశారు. ఆమిర్ ఖాన్‌పై అభిమానం పెంచుకున్నారు. అది చూసి అతను ముఖ్యపాత్ర ధరించిన ''ధూమ్ 3''ని కూడా చైనాలో బాగా ఆడుతుందని అందరూ అనుకున్నారు.
చైనాలో సినిమా పంపిణీ అంతా ప్రభుత్వ అజమాయిషీలో నడిచే చైనా ఫిల్మ్ గ్రూప్ చూస్తుంది. వాళ్లు యీ సినిమాను కొనడమైతే కొన్నారు కానీ దాన్ని ప్రమోట్ చేయడానికి, మార్కెట్ చేయడానికీ ఏమీ శ్రద్ధ తీసుకోలేదు. ట్రైలర్స్, టీజర్ పోస్టర్లు, ప్రమోషనల్ కాంపెయిన్లు, స్టార్లను తీసుకుని వచ్చి ప్రివ్యూ ఏర్పాటు చేయడాలు ఏమీ చేయలేదు. వాళ్లు యీ సినిమా కొనడానికి పెద్దగా పెట్టుబడి పెట్టకపోవడం ఒక కారణమట. సినిమా నిర్మాతలైన యశ్‌రాజ్ ఫిల్మ్స్ వారు కూడా పట్టించుకోలేదు. ఇవన్నీ చాలనట్లు సినిమాకు చైనీస్ భాషలో పేద్ద పేరు పెట్టారట. దానికి ఇంగ్లీషులో అర్థం – 'ద మాజికల్ కార్ గాడ్, ద మాజిక్ థీఫ్స్ పేషన్'. ఇది జులై 25 న రిలీజైంది. అదే రోజు 2 పెద్ద ఒరిజినల్ చైనీస్ సినిమాలు రిలీజయ్యాయి. దాంతో యీ సినిమా కలక్షన్లు చాలా ఘోరంగా వున్నాయి. రిలీజైన మొదటివారంలో కేవలం 2.65 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అదే రోజు రిలీజైన తక్కిన రెండు చైనీస్ సినిమాలు 59, 65 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, అంతకు వారం ముందు రిలీజైన సినిమా 79 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ రకమైన నిర్లక్ష్యధోరణి వలన హిందీ సినిమాలకు చైనీస్ మార్కెట్ దెబ్బ తింటుంది. ''త్రీ ఇడియట్స్''తో వచ్చిన గుడ్‌విల్ యీ సినిమాతో ఆవిరై పోయింది.
-ఎమ్బీయస్ ప్రసాద్