ఇప్పుడు మోదీ నుంచి సాధారణ ఎమ్మెల్యే దాకా నాయకులందరూ స్మార్ట్ సిటీ మంత్రం పఠిస్తున్నారు. ఇది రాస్తూండగానే వెంకయ్యనాయుడు గారు నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తామని హామీ యిచ్చేశారు. ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్ర హోదా యిస్తామనగానే, అన్ని రాష్ట్రాల నాయకులూ మేమూ అది సాధిస్తాం అంటూ ప్రతిజ్ఞలు చేశారు. ఇప్పుడు ప్రతీ కౌన్సిలరూ తమ పట్టణానికి స్మార్ట్ సిటీ హోదా సాధించేదాకా నిద్రపోమని ప్రతిన పూనుతారు. కేంద్రం ఆలోచిస్తున్న 100 సిటీల నిర్మాణానికి కావలసిన యింధన అవసరాల గురించి వెంకయ్యనాయుడు ఆలోచించినట్లు కనబడటం లేదు.
అసలు యీ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ ఏమిటి? ప్రపంచమంతా ఆర్థికసంక్షోభంలో కూరుకుని పోయినపుడు 2008లో ఐబిఎమ్‌వారు యీ కాన్సెప్ట్‌పై వర్క్ చేశారు. దీని ద్వారా స్మార్ట్ ప్లానెట్‌ను సాధించాలని వారి బృహత్ప్రణాళిక. 2009 నాటికి అనేక దేశాల వారికి యీ కాన్సెప్టు తెగ నచ్చేసింది. దక్షిణ కొరియా, యుఎఇ, చైనా దీన్ని ఎలా సాధించాలో సమాచారం సేకరించి, రిసెర్చి చేయమంటూ కొన్ని నిధులు యీ ప్రాజెక్టుకై కేటాయించారు. ఈ ఐదేళ్లలో కొన్ని నగరాలలో దీన్ని అమలు చేసి చూపించారు కూడా. వియన్నా, ఆర్‌హాస్, ఆమ్‌స్టర్‌డామ్, కైరో, లియాన్, మలగా, మాల్టా, సీవోల్ వద్ద సాంగ్‌డో ఇంటర్నేషనల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ యిలా.. చాలా నగరాలను యిలా తీర్చిదిద్దారట. మన దేశంలో కేరళలో కోచి, గుజరాత్‌లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలో ఔరంగాబాద్, ఢిల్లీ దగ్గరున్న మనేసార్, రాజస్థాన్‌లోని ఖుశ్‌కేరా, ఆంధ్రలో కృష్ణపట్నం, కర్ణాటకలో తుమకూరులను స్మార్ట్ సిటీలుగా మారుద్దామని పథకాలు వేస్తున్నారు.
వీటిల్లో స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్స్ లేదా సెజ్‌లు పెట్టి, పన్నుల విషయంలో రాయితీలు, మినహాయింపులు యిచ్చి విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి. అంటే దీని అర్థం – అది చిన్నగానే వున్న ఒక అధునాతన, సాంకేతికంగా వున్నతమైన, సకలసౌకర్యాలతో కూడిన నగరం. నిరంతర విద్యుత్, నీటి సరఫరా, కమ్యూనికేషన్స్ పరంగా ఆప్టిక్ ఫైబర్ కనెక్టివిటీ, అంతరాయం లేకుండా ట్రాఫిక్ సాగేట్లు విశాలమైన రోడ్లు, పర్యావరణ రక్షణ, డేటా సెంటర్లు, ఎక్కడికెక్కడ సెన్సర్లు, టెక్నాలజీ ప్లాట్‌ఫారంలు, అక్కడి సంస్థల్లో పనిచేయడానికి మేధావులైన, సుశిక్షితులైన ఉద్యోగులు, వారి వసతి సౌకర్యం కల్పించడానికి సకల సౌకర్యాలతో యిళ్లు, వారి వినోదానికి రెస్టారెంట్లు, అక్కడ తయారైన సేవలు, వస్తువులు అమ్ముకోవడానికి స్వదేశీ, విదేశీ మార్కెట్లకు రవాణా సౌకర్యాలు, ఎయిర్‌పోర్టులు, వాణిజ్యం కోసం వచ్చే పర్యాటకుల విలాసం కోసం క్లబ్బులు… వేయేల, ఒక్క మాటలో చెప్పాలంటే అది ఒక మాయాబజారే! మాయాబజార్ అయితే మంత్రాలతో యిట్టే సృష్టించారు. మరి యిది తయారవాలంటే ఎన్నో కావాలి. సెజ్‌ల గురించి, జలయజ్ఞం గురించి కూడా యిలాటి హంగామాయే చేశారు. ఫైనల్‌గా ఏం జరిగిందో, ఏం జరుగుతోందో కళ్లారా చూస్తున్నాం.
స్మార్ట్‌సిటీలకు కావలసిన వాటిలో ఒకటి – యింధన అవసరాల గురించి మాట్లాడితేనే యిన్ని సమస్యలు తట్టాయి, యింత గ్రంథం తయారైంది. వీటికి పరిష్కారాలు చూపించకుండా గాల్లో మాట్లాడితే అది బాధ్యతారాహిత్యమే అవుతుంది. కబుర్లు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించినట్లు అవుతుంది. నెల్లూరు లాటి పాత పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చడానికి ఎన్నేళ్లు పడుతుందో ఆలోచించండి. అంతమంది నాయకులను, పారిశ్రామిక వేత్తలను అందించిన ఆ నగరానికి నాలుగైదేళ్ల క్రితం దాకా స్మశానమే లేదు. మా వరప్రసాద్‌లాటి వాళ్లు కొందరు పూనుకుని కట్టించారు. తిక్కన మహాభారతం రాసిన చోటు వద్ద స్మారకసమావేశ మందిరం కట్టిద్దామని వంగూరి చిట్టెన్‌రాజుగారి లాటి వాళ్లు ప్రయత్నిస్తూంటే కలిసి వచ్చేవాళ్లు లేరు. వరప్రసాద్ తరఫున నేను పూనుకుని స్థానికులను సంప్రదిస్త్తే 'హాలు కట్టి సాహిత్యసమావేశాలు పెట్టుకోమంటే ఎవరూ రారు, చివరకు పేకాట నిలయంగా మారుతుంది. నిర్వహణ ఖర్చులైనా రావాలంటే అక్కడ మ్యారేజి హాలు కట్టించి, అంతగా కావాలంటే ఓ మూల తిక్కన విగ్రహం పెట్టండి.' అని సలహా యిచ్చారు కొందరు హితైషులు. నెల్లూరు వాళ్లపై విమర్శలు చేయడానికి యిది రాయటం లేదు. ప్రతీ వూరిదీ యించుమించు యిలాటి కథే. వీళ్లందరినీ స్మార్ట్ పీపుల్‌గా చేసి, ఆ వూళ్లను స్మార్ట్ సిటీలుగా మార్చడం భగీరథప్రయత్నం సుమా, అనేకకోణాల్లో పరామర్శించి ఆచితూచి మాట్లాడాలి, లేకపోతే నగుబాటు తప్పదు అని హెచ్చరించడానికే దీన్ని ప్రస్తావించాను.
ఇవన్నీ ఏకరువు పెట్టేసరికి 'పాత వూళ్లను మార్చడం కష్టం. పచ్చదనంగాని, విశాలమైన వీధులుకాని, సిటీ ప్లానింగ్ కానీ, రూల్సు ప్రకారం గృహనిర్మాణం కానీ లేవు. వాటిని కొత్తరకంగా మార్చాలంటే చాలా ఖర్చు. దానికి బదులు ఖాళీ ప్రదేశాల్లో కొత్తనగరాలు కట్టాలి' అని కొందరు ప్రతిపాదించవచ్చు. కొత్త చోట మనం అనుకున్న రీతిలో నిర్మించడానికి ఏ మాత్రం ఖర్చవుతుందో ఆలోచిస్తే యిది సాధ్యమయ్యే పనేనా? అని భయమేస్తుంది. కానీ ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి. ధన, యింధన పరిమితులను దృష్టిలో పెట్టుకుని నగరీకరణకు స్వస్తి చెప్పి, గ్రామాలను, పట్టణాలను పునరుద్ధరించాలి. స్మార్ట్ సిటీల మాట ఎలా వున్నా యింధనం తద్వారా ధనం మిగులుతుంది. దానితో పేదరికం తగ్గించవచ్చు. కానీ కెసియార్ చూస్తే హైదరాబాదును రెండు కోట్ల జనాభా గల అంతర్జాతీయ నగరంగా చేసి 200 కి.మీ. మెట్రో వేయిస్తానంటున్నారు. అటు చంద్రబాబు హైదరాబాదుని తలదన్నే నగరం కడతానంటున్నారు. రైల్వే క్రాసింగ్‌ల వద్ద ఉద్యోగులను నియమించే స్తోమత లేని రైల్వే శాఖ బుల్లెట్ ట్రెయిన్ల గురించి మాట్లాడుతోంది. ఇదిగో, ఈ బుడగల వ్యాపారమే ఆలోచనాపరులకు గుబులు పుట్టిస్తోంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)