ఇంత భారీ, అంత భారీ అని చెప్పుతూ, వార్తల్లో వుంటూ వస్తున్న ఇండియన్ కామెరాన్ గా పేరుతెచ్చుకున్న శంకర్ సినిమా మనోహరుడుకు మాత్రం తెలుగునాట బయ్యర్లు కరువయ్యారు. ఆస్కార్ రవిచంద్రన్ కోట్ చేస్తున్న రేటు చుక్కల్లో వుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రెండునెలల నుంచి ఈ సినిమాను ఎవరైనా కొంటారా అని వాకబులు జరిగాయని తెలుస్తోంది. దీనికి కోట్ చేసిన ధర 20 కోట్లు. ఇది చిన్నా చితకా మొత్తం కాదు. నిజానికి తెలుగు సినిమా టాప్ హీరోల సినిమాలకు ఇంతకన్నా మూడు రెట్లు విలువ వుంది అన్నది వాస్తవం. కానీ మనోహరుడు అంత మొత్తం పెట్టడానికి తెలుగు నిర్మాతలు వెనకడుగు వెస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. 20
కోట్లు హక్కులకే అంటే కనీసం మరో రెండు మూడు అదనంగా ఖర్చవుతుంది. విక్రమ్ కాకుండా మరే హీరో అయినా ఇదే మంత పెద్ద మొత్తంగా భావించేవారు కాదేమో? ఈ ఏడాది తెలుగునాట తమిళ హీరోల మార్కెట్ ఘోరంగా పడిపోయింది. సూర్య సినిమా సికిందర్ అతి కష్టం మీద 13 కోట్లు పలికింది. కానీ ఇప్పుడు బయ్యర్లు నిర్మాత దారుణంగా దెబ్బ తిన్నారు. ఎంత భారీ సినిమా అయినా క్రౌడ్ పుల్లింగ్ అన్నది హీరో, హీరోయిన్లపైనే ఆధారపడి వుంటుంది తెలుగునాట. సూర్యకే 13 కోట్లు హెవీ అయినపుడు విక్రమ్ కు 20 కోట్లు అంటే నిర్మాతలు అమ్మో అంటున్నారు. ఇక ఎమీ జాక్సన్ సంగతి సరేసరి. ఆమె ప్రధానపాత్ర పొషించిన సినిమాలు హిట్ అవడం అన్నది ఇంతవరకు జరగలేదు. మదరాసు పట్టణం, హిందీ ఏమాయ చేసావే పెద్ద ఉదాహరణలు.
విక్రమ్, జగపతి బాబులతో చేసిన తాండవం సంగతి తెలసిందే. చిన్న పాత్ర అయినా ఎవడు ఒక్కటే రిలీఫ్. విక్రమ్, ఎమీజాక్సన్, సంతనం తప్ప తెలుగువారికి తెలిసిన మొహం ఒక్కటి లేదు అందులో. అందుకే నిర్మాతలు 20 కోట్ల ఇచ్చి గేమ్ ఆడేందుకు జంకుతున్నారు. ఇక ఈ సినిమాకు మిగిలని ఒకే ఒక ఆశ దర్శకుడు శంకర్. ఆయన సామర్థ్యంపైనే నమ్మకం. అందుకే ఆస్కార్ రవిచంద్రన్ తో కాస్త పరిచయం వున్న తెలుగు నిర్మాత ఒకరు, కేవలం పంపిణీ వ్యవహారాలు చూస్తానని, వారు అనుకున్న మొత్తం వచ్చిన తరువాత ఎంతో కొంత తమకు ఇమ్మని ఓ ప్రతిపాదన చేసారని వినికిడి. కానీ ఈ ప్రతిపాదన అలాగే వుండిపోయింది. అందుకే నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ కొత్త మార్గం ఆలోచించినట్లు కనిపిస్తోంది.
సినిమావిడుదల తేదీ లోగా కాస్త హైప్ తీసుకువస్తే, కనీసం అనుకున్న మొత్తానికి కాస్త అటు ఇటుగా ఎవరైనా వస్తారని ఆలోచిస్తున్నారు. సాధారణంగా మీడియాకు దగ్గరగా రాని రవిచంద్రన్, తొలిసారి బోలెడు డబ్బులు ఖర్చు చేసి మరీ తెలుగు మీడియాను చెన్నయ్ పిలిపించి, విశేషాలు వివరించారు. ఆ విధంగానైనా సినిమాకు మార్కెటింగ్ హైప్ తేవాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. బహుశా 15 కోట్ల దగ్గరలో అయితే ఎవరైనా రిస్క్ చేసి ముందుకు రావచ్చేమో కానీ 20 అంటే కాస్త కష్టమే. ఎవరైనా ధైర్యం చేస్తే తప్ప.