కుటుంబనియంత్రణకు, ఎయిడ్స్ నిరోధానికి కండోములు వాడమని ప్రపంచమంతా ప్రచారం సాగుతోంది. అయితే ఆ తొడుగులు అసౌకర్యంగా వుంటాయనే భావనతో చాలామంది వాడటం లేదని గ్రహించిన బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు మలితరం కండోమ్స్ తయారుచేయడానికి ఆస్ట్రేలియాలోని వాలనగాంగ్ యూనివర్శిటీ వారికి నిధులు సమకూరుస్తామని యీ జూన్ 6 న ప్రకటించారు. కాంటాక్ట్ లెన్సుల్లో, షవర్ జెల్స్‌లో వుపయోగించే హైడ్రోజెల్ అనే ద్రవ పదార్థంతో తయారయ్యే యీ తొడుగు అతి పల్చగా వుండి వేసుకున్నట్టే అనిపించదట.
ఈ సందర్భంగా యిప్పటివరకు తయారవుతున్న కండోమ్స్ ఎన్ని, వాటిని ఎలా వాడుతున్నారు అనే దానిపై దృష్టి సారించారు కొందరు. ప్రపంచపు జనాభా 15 బిలియన్లు కాగా మన దేశపు జనాభా దానిలో 10%. అయితే ప్రపంచం మొత్తంలో తయారవుతున్న 750 మిలియన్ల కండోములలో మన వద్ద తయారయ్యేవి 2% మాత్రమే! మెడికల్ షాపులోకి వెళ్లి కండోమ్ కోసం అడిగి కొనుక్కోవడానికి భారతీయలు సిగ్గుపడతారని దూరాలోచన చేసి 21 కోట్ల రూ.లతో 22 వేల కండోమ్ వెండింగ్ మెషిన్సు ఏర్పాటు చేస్తే వాటిలో 90% మాయం! వాటి వినియోగం పెంచడానికి తయారీ ధర కంటె చాలా తక్కువ ధరకే ప్రభుత్వం విక్రయిస్తూంటే ప్రజలు దాన్ని అలుసుగా తీసుకుని వాటిని వేరే ప్రయోజనాలకు వాడుతున్నారని సర్వేలో తేలింది.
లక్షలాది కండోములకు రంగులు పూసి బుడగల్లా అమ్ముతున్నారు. పైగా కరిగించి వాటితో పిల్లల ఆటవస్తువులు తయారుచేస్తున్నారు. కాంట్రాక్టర్లు కాంక్రీటు, తారుతో కలిపి రోడ్లు వేస్తున్నారు. అలా వేస్తే రోడ్డు నున్నగా వస్తుందట. వర్షాకాలంలో డాబా కారకుండా వుండడానికి కండోములు బస్తాల కొద్దీ కొని డాబాపై పరిచి సిమెంటుతో ప్లాస్టరింగ్ చేస్తున్నారు. వారణాశిలో సాలెవాళ్లు రోజూ 2 లక్షల కండోములు కొని వాటిలో జిగురును జలతారు దారాలకు పట్టిస్తున్నారు. ఆర్మీలో వాటిని పెద్ద ఎత్తున కొని గన్, టాంక్ బారెల్స్ మూతులకు బిగిస్తున్నారు, దుమ్ము పడకుండా వుంటుందని! వాడకం యిలా వుంటే జనాభా తగ్గమంటే ఎలా తగ్గుతుంది?
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2014)