బిజెపి ఆధ్వర్యంలో ఉన్న కేంద్రం, టిడిపి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రం కలహించుకుని ఎవరి అంకెలు వాళ్లు చెపుతున్నారు. ఇద్దరిలో ఎవరు నిజం చెపుతున్నారో, ఎవరు దాస్తున్నారో కనిపెడతామంటూ బయలుదేరిన నిజనిర్ధారణ కమిటీ ఏం తేల్చిందో నాకు అర్థం కాలేదు. హోదాతో సమానమైన ప్యాకేజీ అంటారు, జేట్లే ఇఎపి( విదేశీ సంస్థల ఋణసహాయం) యిస్తామంటే బాబు నాబార్డ్ అంటారు, అబ్బే అదికాదు, ఎస్‌పివి (స్పెషల్ పర్పస్ వెహికల్) అని జేట్లే అంటారు.
2016 సెప్టెంబరు నుంచి యీ ఫిబ్రవరి దాకా చర్చలే నడుస్తున్నాయి. దానికీ, దీనికీ తేడా ఏమిటో, యీయన యిలా ఎందుకంటున్నాడో, ఆయన అలా ఎందుకంటున్నాడో నాకు బోధపడటం లేదు. కాస్త సమాచారాన్ని పోగేశాను కానీ అది కూడా నాకు తృప్తి నివ్వలేదు. అందువలన సంశయాలు, సందేహాలతోనే దీన్ని రాస్తున్నాను. దీనిలో సమాచారలోపం కానీ, నా అవగాహనాలోపం కానీ ఉంటే ఎత్తి చూప ప్రార్థన. అందరం కలిసి సత్యాన్ని అన్వేషిద్దాం.
మొత్తమంతా చదివే ఓపిక లేనివారి కోసం నా అనుమానాన్ని క్లుప్తంగా యిప్పుడే చెప్పేస్తాను. టిడిపితో సున్నం పెట్టుకున్నపుడు ఏం చూసుకుని బిజెపికి యీ ధైర్యం? అని ఆశ్చర్యపడ్డాను. ఇవాళ రైల్వే మంత్రి వైజాగ్ రైల్వే జోన్ కూడా లేదని కుండ బద్దలు కొట్టేశారు. టిడిపి ఎంపీలకు ఎపాయింట్‌మెంటు యివ్వకపోగా వైసిపికి యిచ్చారు. 'మొగుడు కొట్టినందుకు కాదు కానీ, తోటికోడలు నవ్వినందుకు..' అన్నట్లయింది టిడిపికి. బిజెపి యింత పెంకెగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఆంధ్రలో వాళ్లకు ఎటూ సీట్లు రావు కాబట్టి, వదిలేసుకుంది' అనే సమాధానం తృప్తి నివ్వదు.
ఈశాన్యభారతం మొత్తమంతా కలిపి 25 ఎంపీ సీట్లు. ఒక్క ఆంధ్రలోనే అన్ని సీట్లున్నాయి. ఈశాన్యంలో పాగా వేయడానికి మోదీ, అమిత్ నాలుగేళ్లగా శ్రమించి సాధించారు. అలాటిది ఆంధ్రను ఉత్తినే వదిలేసుకుంటారా? వైసిపి మద్దతు యిస్తుందని వారి ధీమా అనడం నవ్వు తెప్పిస్తోంది. ఉపయెన్నికలో వైసిపి తన బలాన్ని నిరూపించుకోలేక పోయింది. దాని నాయకులు టిడిపిలోకి చేరుతూనే ఉన్నారు. వైసిపి వద్ద ఏముందని చేతులు కలపాలి? బిజెపి ఎన్నికలలో విడిగా పోటీ చేయవచ్చనుకోవడానికి ఆస్కారం ఉంది.
ఆంధ్రులను యింత ఆరళ్లు పెట్టి వాళ్లను ఫేస్ చేయగలరా? చేయలేరా? సపోజింగ్, నియోజకవర్గాల్లో పలకుబడి ఉండి ఆర్థిక సత్తా ఉన్న టిడిపి నాయకులను తమ పార్టీలోకి గుంజుకుని ముందుకు వెళితే !? గమనించారో లేదో అనేక రాష్ట్రాలలో బిజెపి ఫిరాయింపుదారులతోనే నెగ్గుతోంది. నిన్ననే ఎస్పీ నుంచి నరేశ్ అగర్వాల్‌ను లాక్కుంది. యుపిలో అందరు ఎంపీలు, ఎమ్మేల్యేలు ఉండగా యీయనొకడు అవసరమా అని మనం అనుకోవచ్చు. అవసరమే, అవతలిపార్టీని నిర్వీర్యం చేయడానికి.. అని బిజెపి హైకమాండ్ అనుకోవచ్చు. కాంగ్రెసు నుంచి వైసిపికి, వైసిపికి టిడిపికి, కాంగ్రెసు నుంచి బిజెపికి, యిలా పలువురు ఆంధ్ర నాయకులు చిత్తం వచ్చినట్లు గోడ దూకేస్తూ వచ్చారు. గతంలో బాబు తన మనుష్యులనే బిజెపి ద్వారా నిలబెట్టారన్న వదంతీ ఉంది. ఇప్పుడు అమిత్ రివర్స్‌లో గేమ్ ఆడవచ్చు.
బిజెపి వాళ్లు ఎన్నికలకు ముందు టిడిపి మీద రాళ్లేయడం ఖాయమనిపిస్తోంది. ఏ విధంగా వేస్తారు? 'మేం నిధులు యివ్వడానికి సిద్ధపడ్డాం. కానీ బాబు వాటిని పక్కదారులు పట్టిద్దామని ప్రయత్నించారు, పనులేవీ పూర్తి చేయకుండా మీ నెత్తి మీద ఋణభారం పెడదామని చూశారు, అందుకే ఆపి పెట్టాం. మేం రాష్ట్రంలో కూడా గెలిస్తే అవన్నీ మేమే స్వహస్తాలతో సవ్యంగా ఖర్చు పెడతాం.' అనే నినాదంతో ముందుకు వెళతారని నా అంచనా. వాళ్లు తమ వాదనను ఎలా సమర్థించుకుంటారో చూద్దామని నా కుతూహలం. అదే యీ వ్యాసం రాయడానికి పురికొల్పింది.
పవన్ కళ్యాణ్ ఏర్పరచిన నిజనిర్ధారణ కమిటీ లక్ష్యం ఏమిటి? హోదా కింద యిస్తానన్న ప్రత్యేక ప్యాకేజీ ద్వారా, యితరత్రా రాష్ట్రానికి రావలసిన దెంత? వచ్చినదెంత? రాకపోతే ఎందుకు రాలేదు? ఎవరిది తప్పుంది? యివి చెప్తారని, వీటి వలన కేంద్ర వ్యతిరేక ఉద్యమానికి నైతికపరమైన నేపథ్యం అమరుతుందని ఆశించాను. అయితే కమిటీ నివేదిక (పూర్తిపాఠం దొరకలేదు) సారాంశమేమిటి? 'హోదా యిచ్చి ఉండాల్సింది. కేంద్రం ఆంధ్రకు రూ.74,542 కోట్లు పరిహారంగా యివ్వాలి. రాష్ట్రప్రభుత్వం యుసి (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) యివ్వాలి.' అని. యుసిలు యివ్వాలి అనడం థియరీ.
రాష్ట్రం యివ్వకపోవడం వలననే నిధుల విడుదల ఆగిపోయిందని కేంద్రం అంటోంది. ఆ మాట నిజమో కాదో చెప్పాలి కదా! డబ్బు ఖర్చు పెట్టాక పద్దు చెప్పకపోతే ఎలా? నిధులు లేక అల్లాడుతున్నాం అంటున్న రాష్ట్రం తమ మీద ఆ నింద లేకుండా చూసుకోవాలి కదా. ఇచ్చిందనో, యివ్వలేదనో, సగమే యిచ్చిందనో చెప్పకుండా ఈ కమిటీ 'ఇవ్వాలి' అని జనరల్ స్టేటుమెంటు యిస్తే ఎలా? నిజనిర్ధారణ కమిటీ ప్రకారం మొదటి ఏడాది లోటు 16వేల కోట్లూ కేంద్రమే భరించాలి.
అంతే కాదు, ఐదేళ్ల పాటు వచ్చే రెవెన్యూ లోటు కూడా భరించాలి. 9 సంస్థలకు గాను 11700 కోట్లు, విభజన తర్వాత కూడా కంపెనీ ప్రధాన కార్యాలయాలు తెలంగాణలో ఉండిపోవటం వలన టాక్స్ రెవెన్యూలో ఆంధ్ర నష్టపోయిన మొత్తం 3800 కోట్లు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కై 5 వేల కోట్లు గ్యాప్‌గా ఇవ్వాలి అంటూ ఏవో చేర్చి ఆ మొత్తం తేల్చారు. తమ ప్రకటనలలో కేంద్రానిదీ, రాష్ట్రానిదీ యిద్దరిదీ తప్పుంది అంటూనే కేంద్రాన్నే ఎక్కువ తిట్టారు. కమిటీని ఎవరూ సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు.
ఇక అంశాల వారీగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లే ముందు బిజెపి వారు చెపుతున్న లక్షల కోట్ల విషయమేమిటో ఒక్కసారి చూద్దాం. హరిబాబుగారి స్టేటుమెంటు ప్రకారం వివిధ ప్రాజెక్టులపై వచ్చే పెట్టుబడుల అంచనా అంటూ రూ.3.55 లక్షల కోట్లు చూపించారు. వాటిలో పెట్రోలియం రంగంలో 1.40 లక్షల కోట్లు, జాతీయ రహదారుల్లో 1.00 లక్ష కోట్లు, రైల్వే ప్రాజెక్టులపై 0.48 లక్ష కోట్లు,.. అంటూ చూపించారు. ఇవన్నీ కేటాయింపులు మాత్రమే. అంటే మబ్బుల్లో ఉన్న నీళ్లు. వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. గల్లా జయదేవ్ చెప్పిన ప్రకారం రహదారులపై ఖర్చు పెట్టింది రూ.5900 కోట్లేట! ఇలాగే మిగతావీ ఉంటాయి. వీటిల్లో కొన్ని ప్రాజెక్టులకు ఏ విధంగా యివ్వాలన్నదానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరటం లేదు. దాని సంగతి తర్వాత మాట్లాడదాం.
ఇక విడుదల చేసిన నిధులంటూ జేట్లే చెప్పిన మొత్తం రూ.12,477 కోట్లు. దీనిలో రెవెన్యూ లోటుకై 3980, రాజధానికై 2500, వెనకబడిన జిల్లాలకై 1050, పోలవరంకై 4947! హరిబాబు పోలవరానికి 4662, లోటుకి 3975, జాతీయ విద్యాసంస్థలకు 541, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 135, ఎయిమ్స్‌కు 55 అంటూ 12918 కోట్లు లెక్క వేశారు. వెనకబడిన జిల్లాలకు యిచ్చిన రొక్కం మీద తభావతు లేదు. ఇద్దరూ ఒకే అంకెలు చెప్తున్నారు. దేశంలో అనేక జిల్లాలకు యిచ్చినట్లే యిచ్చారని, బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ యివ్వలేదని రాష్ట్రం గునుస్తోంది. ఇచ్చిన సౌకర్యాలనే వినియోగించుకోలేక పోయారనీ, అయినా మేం యిచ్చేది మేం యిచ్చాం, తక్కినది మీరే యిచ్చుకోండి, ఎలాగూ జిడిపి అత్యధికంగా ఉన్న రాష్ట్రం కదా అని సెటైర్లేశారు జేట్లే.
వీటిలో రాజధానికి యిచ్చినది 2500 కోట్లలో 1000 కోట్లు విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ యిచ్చినది అని యిరువర్గాలూ చెపుతున్నాయి. దాన్ని రాజధానికి యిచ్చినట్లు లెక్క వేయకూడదని రాష్ట్రం వాదన. రాజధానికి యిచ్చినట్లే అని కేంద్రం వాదన. గల్లా జయదేవ్ రాజధాని నిర్మాణానికి ప్రాథమిక అంచనా రూ.1.20 లక్షల కోట్లు అన్నారు. (నాలుగైదు లక్షల కోట్ల నుంచి నాలుగోవంతుకి దిగారన్నమాట) రాజ్‌భవన్, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్ నిర్మాణాలతో బాటు భూమి అభివృద్ధి పనులకై రూ.42,935 కోట్లు అవుతుందని, ఏడాదికి 10 వేల కోట్లు చొప్పున నాలుగైదేళ్లు యివ్వాలని పార్లమెంటులో అడిగారు. వీళ్లు పంపామంటున్న డిపిఆర్ విషయమే తేలలేదు.
ఈ లోపున తాత్కాలిక భవనాలు డుతున్నామంటున్నారు. తామిచ్చిన 1500 కోట్లకు యుసిలు లేవని కేంద్రం అంటోంది. 1500 మాత్రమే కాదు, 'మేం ఇచ్చిన 12 వేల కోట్లకు యుసిలు ఇవ్వలేదు. ఇచ్చేవరకు కొత్తవి విడుదల చేయం.' అని కూడా జేట్లే అన్నాడు. అంటే కేంద్రం యిచ్చిన దానికి దేనికీ రాష్ట్రం యుసిలు యివ్వలేదా!? ఇంత నింద పడ్డాక ఏ చీఫ్ సెక్రటరీయో వెంటనే ఓ స్టేటుమెంటు యివ్వవద్దా? ప్రభుత్వంతో సంబంధం లేని రాజకీయ నాయకులు టీవీల్లో చెప్పిన మాటలకు విలువ లేదు. దీనికి అఫీషియల్ క్లారిఫికేషన్ యివ్వాల్సిందే.
'పోలవరానికి యిచ్చిన డబ్బు ఏ మూలకు సరిపోతుంది, కేంద్రం చేసిన కొత్త భూసేకరణ చట్టంతో పునరావాస వ్యయం 33 వేల కోట్లకు చేరింది. అది కేంద్రం భరించాలి. దానిపై అది మౌనంగా ఉంది' అంటుంది రాష్ట్రం. అది కేంద్రం చేపట్టవలసిన ప్రాజెక్టు. కాంట్రాక్టులపై ఆసక్తితో కాబోలు చంద్రబాబు మేమే చేపడతాం అని తీసుకున్నారు. ఇలాటి అదనపు వ్యయాలన్నీ నెత్తిన పడుతున్నాయి. 'కాంట్రాక్టుల గురించి కాదు, కేంద్ర ప్రాజెక్టులంటే కనీసం పదేళ్లు పడతాయి, రాష్ట్ర ప్రయోజనాల పట్ల శ్రద్ధతో త్వరగా పూర్తి చేయాలని తీసుకున్నారు' అని కొందరు వాదించవచ్చు. తక్కిన ప్రాజెక్టుల విషయంలో ఇఎపి ద్వారా నిధులిస్తామంటే, అవి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి వస్తుంది అంటూ బాబు వెనకడుగు వేస్తున్నారెందుకు అనే ప్రశ్నకు వాళ్లు సమాధానం చెప్పాల్సి వుంటుంది.
ఇక అత్యంత వివాదాస్పదంగా మారిన 2014-15 తాలూకు రెవెన్యూ లోటు గురించి. దీనిని కాగ్ కూడా నిర్ధారించింది అని రాష్ట్రమూ, నిజనిర్ధారణ కమిటీ కూడా చెపుతున్నాయి. కాగ్ 2014-15 నివేదిక చూశాను. అలా ఏమీ కనబడలేదు. కేంద్రం నుంచి వీళ్లకు పరిహారంగా యింత రావాలి అనేది వాళ్ల పరిధిలోకి రాదనుకుంటాను. ఎకౌంటింగ్ ప్రొసీజర్‌లో ఉన్న పొరపాట్లను ఆడిటర్లు ఎత్తి చూపుతారు. అదే చూపారు. రూ.2838 కోట్ల ఖర్చుకు సంబంధించిన 55 వేల ఓచర్లు లేవని ఒక రిమార్కు కనబడింది. తర్వాత సెట్‌రైట్ చేసి ఉంటారనుకోండి.
రాష్ట్రం డెఫిసిట్ యింత అని చూపిస్తే కాగ్ వాళ్లు ఓహో అంటారు తప్ప యిది కేంద్రం భరించవలసినది అని చెప్పరు. విభజన తర్వాత ఆదాయం వచ్చే హైదరాబాదు తెలంగాణకు పోయింది కాబట్టి ఆంధ్రప్రాంతానికి మొదటి సంవత్సరం లోటు ఉంటుంది. అది భర్తీ చేస్తాం అంది కేంద్రం. వాళ్లు తీరుస్తారన్నారు కదాని ఉద్యోగుల జీతాలు పెంచేసి, వృద్ధాప్య పెన్షన్లు పెంచేసి, ఋణమాఫీలు చేసేసి, అదంతా యివ్వండివ్వండి అంది బాబు ప్రభుత్వం. తక్కువ పడితే యిస్తామన్నాం కదాని, మీరు ఎడాపెడా ఖర్చు పెట్టేసి అవి మామీద రుద్దితే ఎలా అంటోంది కేంద్రం.
కితం ఏడాది దాకా పప్పూచారుతో బతికి, మేం అన్నం పెడతామన్నాం కదాని బిర్యానీ లాగించేసి ఆ బిల్లు మా నెత్తిన వేస్తే ఎలా? మామూలుగా అయ్యే ఖర్చెంతో చెప్పండి, అది న్యాయంగా యిచ్చేస్తాం అని వాళ్ల వాదన. అందుకే జేట్లే ఏమన్నాడు? మేం యివ్వాల్సింది, 2014-15లో 2014 జూన్ నుంచి 2015 మార్చి వరకు పది నెలలకు! విభజనకు ముందు సంవత్సరమైన 2013-14లో12 నెలలకు జరిగిన ఖర్చుని బేస్‌గా తీసుకుని దాని ప్రకారం లెక్కేసి చూస్తే ఆ పది నెలలకు అయ్యే లోటు 4118 కోట్లు మాత్రమే అన్నాడు.
అబ్బే విభజన తర్వాత కొత్త రాష్ట్రం, కొత్త సెటప్ కాబట్టి ఖర్చులు పెరిగాయి అంటారా, ఆ పై సంవత్సరం 2015-16 తీసుకుందాం. 14వ ఫైనాన్సు కమిషన్ ఆ ఏడాది ఆంధ్ర రెవెన్యూ లోటును లెక్కించింది. దాన్ని బేస్‌గా తీసుకుంటే 2014 జూన్-2015 మార్చి మధ్య ఉన్న పది నెలలకు 5600 కోట్లు అవుతుంది. 2013-14 బేస్ ప్రకారం చూస్తే మేం యింకా రూ.138 కోట్లు మాత్రం యివ్వాలి. 2015-16 బేస్ ప్రకారం అయితే యింకో 1600 కోట్లు ఇవ్వాలి. అదివ్వడానికి సిద్ధం అని కూడా అన్నాడు జేట్లే.
ఇదన్నమాట టిడిపి, బిజెపి నాయకుల మధ్య కుదిరిన 6వేల కోట్ల పెద్దమనుషుల ఒప్పందం! 16వేల కోట్లు రావాలని కాగ్ చెప్పినా టిడిపి వారు 6 వేలకే ఎందుకు ఒప్పుకున్నారా అని ఆశ్చర్యపడ్డాను. కాగ్ యితమిత్థంగా చెప్పలేదు. వీళ్ల 16 వేల కోట్లలో 3 వేల కోట్లు ఋణమాఫీకి, రైతు సాధికార సంస్థకు 4 వేల కోట్లు, డిస్కమ్‌లకు 1500 కోట్లు, వృద్ధాప్య పెన్షన్లకు 3 వేల కోట్లు పోయాయి. ఇవన్నీ మాకు సంబంధం లేని కొత్త స్కీములు అని తీసేసి 4118 కోట్ల అంకెకు కేంద్రం చేరింది. దాంతో కంగు తిన్న టిడిపి ప్రభుత్వం పోనీ 2015-16 బేస్ చేసుకుని మరో 1600 కోట్లు యివ్వమని అడిగితే సరే యిస్తాం అన్నారు రాజీ కుదిర్చిన పెద్దమనుషులు. అదీ యివ్వటం లేదని యిప్పుడు రగడ.
ఇప్పుడిక హోదాకు బదులుగా బాబు తెచ్చుకున్న స్పెషల్ ప్యాకేజీ ప్రాజెక్టుల గురించి. అసెంబ్లీలో బాబు చెప్పిన దాని ప్రకారం రూ.20,010 కోట్ల విలువైన సహాయం రావాలి. కానీ జేట్లే చెప్పిన ప్రకారం రూ.16725 కోట్ల విలువైన 6 ప్రాజెక్టులు మాత్రం ఉన్నాయి. వాటిలో తాగునీటి కోసం 4500, రహదారుల కోసం 3200, పాఠశాలల కోసం 3341, భవనాల పునర్మిర్మాణం కోసం 3200, అమరావతిలో అడవుల అభివృద్ధి కోసం 1484, బాక్‌వర్డ్ ఏరియాలకై నాబార్డ్ సెంటర్‌కై 1000! వీటికి ఋణం ఎలా, ఎక్కణ్నుంచి యిప్పిస్తారన్నదానిపైనే చర్చ యింకా సాగుతోంది. నాకు అర్థం కాని విషయం ఒకటుంది.
మామూలుగా అయితే కేంద్రం స్పాన్సర్ చేసే ప్రాజెక్టుల్లో కేంద్రం వాటా 60, రాష్ట్రం వాటా 40. అదే హోదా ఉండే రాష్ట్రాలకు కేంద్రం యింకో 30% భారాన్ని అదనంగా మోస్తుంది. అంటే అది రాష్ట్రానికి గ్రాంటు అన్నమాట. హోదాకు బదులుగా యిస్తున్న ప్యాకేజీ అంటూ ఆంధ్ర విషయంలో కేంద్రం ఏమంటోంది? ఆ 30% మీకు ఎక్కణ్నుంచైనా యిప్పిస్తాం అంటోంది. అరుణ్ జేట్లే వాడిన మాట 'సెంటర్ హేడ్ కమిటెడ్ 90% ఆఫ్ ఫండ్స్'. బాబు 2017 డిసెంబరులో కేంద్రానికి రాసిన లేఖలో తేడా ఆ 30%ను గ్రాంట్‌గా పరిగణించమని అడుగుతున్నారు. అంటే ప్రస్తుతానికి అది అప్పే నన్నమాట.
ఇలాటి ప్యాకేజీని హోదా కంటె మెరుగైన ప్యాకేజీ అని టిడిపి వాళ్లు మనల్ని ఎలా నమ్మిస్తూ వచ్చారు? దీనిలో రాష్ట్రానికి వేరేదైనా ప్రయోజనం ఉంటే పాఠకులే చెప్పాలి. ఆ 30% అప్పు కేంద్రమే తీరుస్తానందా? జేట్లే 'మేం ప్రపంచ బ్యాంకు, ఏడిబి, జైకా వంటి విదేశీ ప్రాజెక్టుల (ఇఎపి) ద్వారా సర్దుబాటు చేస్తామన్నాం.' అన్నాడు. బాబు సరే ఎందుకనలేదు? ఈ ప్రతిపాదన 2016 సెప్టెంబరులో జేట్లే చేస్తే అబ్బే కాదు, నాబార్డు ద్వారా చేయండి అని 2017 డిసెంబరులోనే బాబు అడిగారు. ఎందుకలా అన్నారన్నది వేరే విషయం, యింత లేటుగా ఎందున్నారన్నది మొదటి ప్రశ్న. దిల్లీ 29 సార్లు వెళ్లామంటున్నారు.
ఇఎపి మీద స్పందించడానికి యింత టైము పట్టిందేం? సరే యీ ఏడాది జనవరిలో వారి వద్దకు యీ ప్రతిపాదన వచ్చాక జేట్లే ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రతినిథులతో సమావేశమై 'మీ ప్రతిపాదన వలన రాష్ట్ర ద్రవ్య లోటు పెరుగుతుంది. ఋణం పొందే సామర్థ్యం కూడా తగ్గుతుంది. కాదూకూడదంటే ఎస్పీవీ (స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేసుకుంటే దానికి యివ్వడానికి నాబార్డుకి 90% నిధులిస్తామని చెప్పాం.' అంటున్నాడు. దాని మీద రాష్ట్రం యింకా ఏమీ తేల్చి చెప్పలేదంటున్నాడు. ఓ పక్క బిజెపి ఏమీ చేయలేదని యిక్కడ హోరెత్తించేస్తూ యింత ఆలస్యంగా ప్రతిస్పందించడమేమిటో, దానికి కారణాలేమిటో బాధ్యులైన టిడిపి పెద్దలు చెప్పాలి.
ఇక ఇఎపి, నాబార్డ్, ఎస్‌పివి మధ్య దేన్ని ఎంచుకోవాలన్నదానిపై బాబు సందిగ్ధత గురించి – కేంద్రం చేసిన ఇఎపి (ఎక్స్‌టెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా ఋణం) ప్రతిపాదనను చంద్రబాబు ఎందుకు తిరస్కరించారో 2017 డిసెంబరు 1 నాటి ''ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్'' చదివితే తెలిసింది. అలా వచ్చిన డబ్బును పాత ఋణాలను చెల్లు వేయడానికి బాబు చేసిన అభ్యర్థనను కేంద్రం తిరస్కరించిందట. అలా తిరస్కరిస్తే మాకు ఒనగూడే తక్షణలాభం (ఇమ్మీడియేట్ బెనిఫిట్) ఏముంది అని బాబు అడిగారు. 'అంతేకాదు, ప్రస్తుతం ఉన్న ఎఫ్‌ఆర్‌బిఎమ్ (ఫైనాన్షియల్ రెెస్పాన్సిబిలిటీ అండ్ బజెట్ మేనేజ్‌మెంట్) పరిమితులకు లోబడే ఋణం యిస్తామని చెప్పడం మమ్మల్ని నిరాశకు గురి చేసింది.
కేంద్రమే ఆ ఋణం సమకూరుస్తోంది కాబట్టి, రాష్ట్రపు ఋణపరిమితిని ఆ మేరకు తగ్గించకూడదు. ఇఎపి కింద ఋణాలు తెస్తే ఐదేళ్లలో ప్రాజెక్టులపై ఖర్చు చేసి తీరాలి. అది సాధ్యపడేట్లు లేదు. అందువలన నాబార్డ్, హడ్కో, వాణిజ్య బ్యాంకుల వంటి స్వదేశీ సంస్థల నుండి తీసుకోనివ్వమని అడుగుతున్నాం. ఆ ఋణాలతో గతంలో తీసుకున్న ఇఎపిలో ఋణాల, యితర ఋణాల వడ్డీలు కట్టుకునేందుకు అనుమతించాలని కోరుతున్నాం.' అన్నారు.
బాబు డిసెంబరులో చేసిన అభ్యర్థనను కేంద్రం నిరాకరించింది. ఎందుకంటే బాబు అప్పులు తీసుకుని దానితో ప్రాజెక్టులు మొదలుపెట్టి సకాలంలో పూర్తి చేసే ఉద్దేశంలో లేరు. అప్పు రాగానే పాత అప్పులు తీరుద్దామని చూస్తున్నారు. దాంతో కొత్తవి ఆలస్యమవుతాయి. రాత్రింబగళ్లు సైట్‌లోనే కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేయిస్తాను అని మనకు చెప్తారు కానీ కేంద్రానికి రాతపూర్వకంగా రాసినపుడు పూర్తి చేయలేం అంటున్నారు.
ఇఎపి ఋణం తెస్తే యిలాటి చేష్టలు కుదరవు. దానికి చాలా షరతులు ఉంటాయి. డబ్బులు ఆషామాషీగా రాలవు. నాబార్డ్, బ్యాంకులు, హడ్కో అయితే దేశీయమైనవే కాబట్టి డబ్బు తీసుకుని పులుసులో పడేసుకుని చంద్రన్న కానుకలంటూ పంచిపెట్టేసినా అడగరు కాబోలు. అందుకే ఈయన నాబార్డ్ నాబార్డ్ అంటున్నాడు. అయితే జేట్లేకి యీయన ఉద్దేశం తెలుసు కాబట్టి యీయన 2018 జనవరిలో యీ ప్రతిపాదన చేయగానే ఫిబ్రవరిలో 'అదేం కుదరదు, నాబార్డు నుంచి మీ ప్రభుత్వానికి డైరక్టుగా యివ్వం. ఎస్‌పివి పెట్టండి. దానికి యిప్పిస్తాం' అంటున్నాడు.
ఎస్‌పివి అంటే ప్రత్యేకలక్ష్యంతో ఏర్పరచిన కార్పోరేషన్. దానికి యిచ్చిన డబ్బు యితరత్రా ఖర్చు పెట్టడానికి వీలులేదు. ఆ విధంగా ప్రాజెక్టుల పేర యిచ్చిన డబ్బు వేరు మార్గాల్లో కారిపోవడానికి వీల్లేకుండా కట్టుదిట్టం చేద్దామని జేట్లే ఆలోచన. దానికి బాబు ఔననటం లేదు. ఇప్పటికీ జేట్లే ఇఎపి లేదా ఎస్పీవీ అంటున్నాడు. బాబుకి యిది రుచించలేదు. బిజెపిని మరింత జోరుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదీ నా కర్థమైన సినేరియో. పొరపాటుంటే చెప్పాలి.
హోదా యివ్వకుండా బిజెపి ఆంధ్రకు అన్యాయం చేసిందన్నదాంట్లో సందేహం లేదు. అనేక విధాలుగా నాన్-కోఆపరేషన్ చేస్తోందన్నదాంట్లో సంశయం లేదు. కానీ నిధుల విడుదల విషయంలో మాత్రం బాబుకు కళ్లెం వేయడంలో రాష్ట్రానికి ఒక విధంగా మేలు చేస్తోందనే చెప్పాలి. లేకపోతే బాహర్ షేర్వాణీ, ఘర్‌మే పరేశానీ అన్నట్లున్న బాబు బడాయిలకు అంతూపొంతూ లేకుండా ఉంది. పాత అప్పులకు వడ్డీ కట్టే ఠికానా లేదు కానీ, సింగపూరులా చేస్తాం, జపాన్‌లా చేస్తాం అంటూ బ్రోషర్లు, పబ్లిసిటీపై కోట్లకు కోట్లు ఖర్చు. ప్రతీదీ ఆడంబరమే. ఈయన తానాకు కేంద్రం తందానా అని ఉంటే రాష్ట్రం యీ పాటికే అప్పుల ఊబిలో మునిగిపోయేది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]