నందన్‌కు ఆధార్ పనికి వచ్చేనా? బెంగుళూరు సౌత్ పార్లమెంటు నియోజకవర్గం మధ్యతరగతి కోట. అక్కడ అయిదుసార్లుగా బిజెపికి చెందిన అనంతకుమార్ గెలుస్తూ వస్తున్నారు. ఆయన జాతీయ స్థాయిలో బిజెపి జనరల్ సెక్రటరీ కూడా. తన నియోజకవర్గంలో 30 వేల మందిని పేరు పెట్టి పలకరించగలరంటారు. కావేరీ తాగునీరు ప్రాజెక్టు, మెట్రో రైలు, దేవనహళ్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు యిలాటివాటిలో తన సహకారం ఎంతో వుందని ఆయన చెప్పుకుంటారు. గత ఎసెంబ్లీ ఎన్నికలలో బిజెపి వ్యతిరేక హవా నడిచి, రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడినపుడు కూడా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో వున్న 8 అసెంబ్లీ స్థానాలలో 4 స్థానాలు బిజెపికి దక్కాయి. అలాటి అనంతకుమార్‌ను ఓడించే పని కాంగ్రెసు నందన్ నీలేకనికి అప్పచెప్పింది. ఆయన అనంత్‌కుమార్ కంటె నాలుగేళ్లు పెద్దవాడు. బెంగుళూరులోనే పుట్టి, అక్కడే నివసించి ఇన్ఫోసిస్ స్థాపకుల్లో ఒకడిగా అనేకమంది బెంగుళూరు వాసులకు ఉద్యోగాలు రావడానికి కారకుడయ్యాడు. ఎస్.ఎమ్.కృష్ణ ముఖ్యమంత్రిగా వుండగా బెంగుళూరు అజెండా టాస్క్ ఫోర్సు సభ్యుడిగా సిటీ యిమేజి పెరగడానికి దోహదపడ్డాడు. యుపిఏ ప్రభుత్వం ఆధార్ ప్రాజెక్టు ఆయనకు అప్పగించడంతో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగింది. ఆ పేరు ఎన్నికలలో నెగ్గడానికి దోహదపడుతుందని ఆయన ఆశ. కానీ ఆధార్ కార్డు ఎందుకు పనికి రాదని కోర్టులు తేల్చడంతో, దానిపై పెట్టిన డబ్బు, శ్రమ వృథా అయ్యాయి. బ్యాంకుల్లో ఖాతా తెరవడానికి కూడా ఆధార్‌ను ఒప్పుకోవడం లేదు. ఇలాటి ఆధార్ నందన్‌కు ఏ రకంగా ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
ఒకప్పటి బద్ధశత్రువులు యిప్పుడు భాగస్వాములు లోక జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ ఎన్‌డిఏలో భాగస్వామిగా వుండేవాడు. 2002 గోధ్రా అల్లర్లకు మోదీని నిందిస్తూ, మోదీని ముఖ్యమంత్రిగా తొలగించనందుకు నిరసనగా ఎన్‌డిఏనుండి 2002లో పాశ్వాన్ బయటకు వెళ్లాడు. ఎందుకంటే అతని సమర్థకుల్లో చాలామంది దళితులు, ముస్లిములే. 12 ఏళ్ల తర్వాత అదే మోదీని ప్రధాని చేయడానికి పాశ్వాన్ ఎన్‌డిఏలో చేరాడు. మధ్యలో కథ చాలా మలుపులు తిరిగింది. 2002లో ఎన్‌డిఏ నుండి అతను బయటకు వెళ్లిపోయిన తర్వాత 2004లో సోనియా అతని యింటికి వచ్చి యుపిఏలో చేరమని ఆహ్వానించింది. అతను సరేనన్నాడు. యుపిఏ1 ప్రభుత్వంలో కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిగా పనిచేశాడు. 2009 ఎన్నికలను యుపిఏ భాగస్వామిగానే ఎదుర్కున్నాడు. అయితే అతని పార్టీ ఒక్క పార్లమెంటు సీటు కూడా గెలవలేకపోయింది. పాశ్వాన్ తన సొంత నియోజకవర్గమైన హాజీపూర్‌లో ఓడిపోయాడు.
ఇక ఏం చేయాలో పాలుపోక యింట్లో వున్నాడు. కేంద్రమంత్రిగా వుండగా అతనిపై ఆరోపణలు వున్నాయి. యుపిఏ మళ్లీ అధికారంలోకి వచ్చే సూచనలు లేవు. ఎన్‌డిఏ వచ్చి ఆ ఆరోపణలపై విచారణ జరిపిస్తుందని భయం వేసింది. అందుకని ఎన్‌డిఏతో చేతులు కలిపితే మంచిదనుకున్నాడు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై మోదీ గుర్రుగా వున్నాడు – తన సార్వభౌమత్వాన్ని అంగీకరించలేదని! నితీశ్‌ను పడగొట్టడానికి ఎవరు దొరికినా వారితో చేతులు కలపాలని నిశ్చయించుకున్నాడు. అందుకే తనపై గతంలో పాశ్వాన్ చేసిన ఘాటు విమర్శలను పక్కన బెట్టి పొత్తుకు సై అన్నాడు. అతని పార్టీకి బిహార్‌లో ఆరు సీట్లు కేటాయించారు. వాటిలో హాజీపూర్‌లో పాశ్వాన్ పోటీ చేస్తున్నాడు. జమూయీలో అతని కొడుకు చిరాగ్ పోటీ చేస్తున్నాడు. చిరాగ్ సినిమాల్లోకి వెళ్లి ''మిలే నా మిలే హమ్'' అనే సినిమాలో హీరోగా వేశాడు. అంబ పలకలేదు. సినిమాల కంటె రాజకీయాలనే నమ్ముకుంటే మంచిదనుకుంటున్నాడు. పాశ్వాన్ ఓటు బ్యాంక్ సజీవంగా వుందా, లేక బిహార్‌లో సాగుతున్న ఆర్థికప్రగతి కారణంగా సమీకరణాలు మారిపోయాయా అన్నది తెలుసుకోవాలంటే వేచి చూడాలి.
మోదీ రథం కింద నలుగుతున్నారు బిజెపిలో మోదీ రథయాత్ర సాగిపోతోంది. అడ్డువచ్చినవారు చక్రాల కింద నలిగిపోతున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సుష్మ లేవనెత్తిన అనేక అభ్యంతరాలను తీసిపారేశారు. ఎడ్యూరప్ప పార్టీతో ఎవరి నడిగి పొత్తు పెట్టుకున్నారు? శ్రీరాములు బిఎస్‌ఆర్ కాంగ్రెసును మళ్లీ చేరదీయడమేమిటి? కాంగ్రెసు నాయకుడు వినోద్ శర్మను చేర్చుకున్న హరియాణా జనహిత కాంగ్రెస్‌తో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? అని చెడామడా అడిగేసింది. మురళీ మనోహర్ జోషి కూడా ''వారణాశి సీటు నుండి మోదీ పోటీ చేస్తారని నాకు పత్రికల ద్వారా తెలియడమేమిటి? ఇదేమైనా పద్ధతిగా వుందా?'' అని అడిగాడు. వాజపేయికి సన్నిహితుడైన లాల్జీ టాండన్ ''నేను లక్నో నుండి సిటింగ్ ఎంపీ. మోదీ కావాలని అడిగితే తప్పుకుంటా. రాజ్‌నాథ్ సింగ్‌కైతే యివ్వను.'' అని హుంకరించాడు. గాంధీనగర్ నుండి పోటీ చేస్తే మోదీ కసిపెట్టుకుని ఓడిస్తాడేమో, నేను భోపాల్‌నుండి పోటీ చేస్తా అని ఆడ్వాణీ మొండికేశారు. ''నా బార్మర్ సీటు నా కివ్వాల్సిందే'' అని జశ్వంత్ సింగ్ పట్టుబట్టాడు. ఒక్కరి మాట కూడా చెల్లలేదు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ''మోదీ చెప్పినట్టే వినండి. బిజెపిలో విభేదాలు వున్నాయని బయటకు పొక్కడానికి వీల్లేదు.'' అని ఆదేశాలు జారీ చేసింది. మోదీ ప్రతినిథిగా ఉత్తర్ ప్రదేశ్‌లో పార్టీ వ్యవహారాలు చూస్తున్న అమిత్ షా స్థానిక నాయకులను పట్టించుకోవడం లేదు, సంప్రదించడం లేదు. సీనియర్లే కాదు, జూనియర్లు కూడా దీనిపై అలక పూనారు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. మోదీ-ఆరెస్సెస్ కలిసి ప్రత్యర్థుల మాట ఎలా వున్నా స్వంత పార్టీలోని నాయకులనే మట్టికరిపిస్తున్నారు.
-ఎమ్బీయస్ ప్రసాద్