2009 ఎన్నికలలో టిడిపి లెఫ్ట్ పార్టీలతో, తెరాసతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణాలోనే తప్ప ఆంధ్రప్రాంతంలో పెద్దగా ప్రభావం చూపలేదు. లెఫ్ట్ పార్టీలకు, తెరాసకు తెలంగాణలోనే సీట్లు దక్కాయి. 2004లో కాంగ్రెసు యివే పార్టీలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది కాబట్టి, తర్వాతిసారి తను ఆ పని చేయాలని టిడిపి అనుకుంది. కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నపుడు పెద్దగా చికాకులు రాలేదు. అందరూ కలిసి విజయం సాధించేశారు. ఆ తర్వాత కొట్టుకున్నారు. కానీ 2009 ఎన్నికలలో పొత్తు అంటూనే మహాకూటమి భాగస్వాములు దారుణంగా ఒకరినొకరు వంచించుకున్నారు, నిందించుకున్నారు. కెసియార్ ఓ అర్ధరాత్రి మీడియాకు ఫోన్ చేసి పొత్తు కాన్సిల్ అనేసి పడుక్కున్నారు. మళ్లీ మర్నాడు రాజీ అన్నారు. కార్యకర్తలకు ఎలాటి సంకేతం వెళ్లి వుంటుంది? అవతలిపార్టీకై సీటు వదులుకున్నాం అంటూనే తమ పార్టీవారికి బి ఫారాలు యిచ్చిన యీ కూటమి వైయస్‌ను ఎదిరించగలుగుతుందాని అందరూ సందేహించారు. కానీ ఏం ఫర్వాలేదని మీడియా హామీ యిచ్చింది. మొదట్లో వున్న విభేదాలు సర్దుకుపోయాయని, ఆ తర్వాత కూటమి ఫెవికాల్ వేసినట్టు అతుక్కుపోయిందని, మహాకూటమి మహావిజయం సాధించడం తథ్యమని హోరెత్తించేసింది. పత్రికలు, వెబ్‌సైట్లు మాత్రమే చదివినవారు ఆ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని చాలా నమ్మకాలు పెట్టుకున్నారు.
తీరా చూస్తే ఫలితాలు మరోలా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెసుకు తెలంగాణాలో అందరి కంటె ఎక్కువ సీట్లు వచ్చాయి. దాదాపు 45% సీట్లు వారివే. దీనికంతా కారణం తెరాస అని టిడిపి, టిడిపి అని తెరాస తిట్టిపోసుకున్నాయి. తెరాసతో పొత్తు పెట్టుకోవడం తను చేసిన ఘోరతప్పిదం అని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు యీ ఎన్నికలలో మరో ప్రహసనం ప్రారంభమైంది. బిజెపితో పొత్తు పెట్టుకోవడం ఘోరాతిఘోరమైన తప్పిదం, జన్మలో మళ్లీ అలాటి పని చేయను అని భీష్మప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు మళ్లీ బిజెపితో జతకట్టారు. పార్టీలు ఇలా మాట మార్చడం వింతేమీ కాదు. శాశ్వతమిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని ప్రతీ రాజకీయనాయకుడు నొక్కి వక్కాణిస్తాడు. ఏం చేసినా ప్రజల బాగుకోసమే, దేశసంక్షేమం కోసమే చేస్తున్నాం కాబట్టి, స్వప్రయోజనాలను పక్కకు పెడుతున్నాం కాబట్టి మీరు అలాటివి ఎత్తి చూపకండి అని సుతారంగా మందలిస్తారు. మాట మార్చే అవకాశం, అవసరం వుంటాయన్న ముందుచూపు వున్నపుడు మరీ అంత భీషణప్రకటనలు చేయకుండా వుంటే పోయేది కదా! ఇప్పుడు బిజెపితో ఎందుకు చేతులు కలుపుతున్నట్లు? మోదీని పార్టీలోంచి తీసేశారా? లేదే! 2002 కంటె యిప్పుడు మహా పటిష్టమైన స్థితిలో వున్నాడాయన. ఇప్పుడు ఆయనను కేవలం పరిపాలనాదకక్షుడిగానే మనం చూడాలని టిడిపి కోరిక. టిడిపికి జగన్ అవినీతి కనబడినట్లు, ఎడ్యూరప్ప అవినీతి కనబడదు. గాలి జనార్దనరెడ్డికి సన్నిహితుడంటూ జగన్‌ను దునుమాడుతున్న టిడిపికి అదే వ్యక్తికి స్నేహితుడైన, భాగస్వామి ఐన శ్రీరాములును పార్టీలో చేర్చుకున్న బిజెపి ప్రవర్తన ఎబ్బెట్టుగా కనబడదు.
ఇప్పుడు సిద్ధాంతాల గురించి రాద్ధాంతాలు చేసే సమయం కాదు. ఒకప్పుడు హరియాణాలో నాయకుల కప్పదాట్లు వినేవాళ్లం. ఇప్పుడు యిక్కడే చూస్తున్నాం. ఎవరు ఏ పార్టీలో వున్నారో తెలియకుండా పోయింది. వందలాది మంది పార్టీలు ఫిరాయిస్తున్నారు. సిపిఎం వాళ్లు తమ అభ్యర్థులు లేని చోట తెరాసకు మద్దతు యిస్తాననడం యింకా వింతగా వుంది. చిత్తూరు జిల్లాకు చెందిన సిపిఐ నారాయణ తన పార్లమెంటు సీటుకోసం తన కులస్తులు ఎక్కువగా వున్నారని ఖమ్మం రావడం దేనికి? అనుక్షణం తిట్టే కాంగ్రెసు మద్దతుకోసం వెంపర్లాడి వాళ్లతో పొత్తు పెట్టుకోవడం ఎంత హేయం! నిత్యం నీతులు వల్లించే నారాయణ వంటి నాయకుడే ఇలా వుండడంతో సిపిఐలోని యితర ఎమ్మెల్యేలు కూడా సీట్లకోసం తెరాసలోకి వెళ్లిపోతున్నారు. పైగా కాంగ్రెసు సిపిఐకు ఎలాట్ చేసిన సీటులో కూడా అభ్యర్థిని ప్రకటించి తికమక పెట్టింది. ఇలాటి పరిస్థితిని మరింత గందరగోళపరుస్తున్నది – బిజెపి-టిడిపి పొత్తు. స్థానిక కార్యకర్తలు వద్దువద్దంటున్నా జాతీయస్థాయిలో బిజెపి నాయకులను చంద్రబాబు ఒప్పించగలిగారు. అంతో యింతో క్రమశిక్షణ గల బిజెపిలో కూడా కేంద్రనాయకులు రాష్ట్ర నాయకులను అదుపు చేసే పరిస్థితి దాటిపోయింది. టిడిపి, బిజెపి శ్రేణుల్లో అడుగడుగునా నిరసనలే. ఇలాటప్పుడు పొత్తు కోసం వెంపర్లాట ఎందుకు అంటే 'కాంగ్రెసు-తెరాసల కూటమిని దెబ్బకొట్టడానికి' అంటున్నారు.
వాటి మధ్య ఎన్నికల ముందు పొత్తు కుదరలేదు. తర్వాత కుదురుతుందో లేదో ఎవరూ చెప్పలేరు. కెసియార్‌లకు సిద్ధాంతాలపై పట్టింపు లేదు. బిజెపిపై వ్యతిరేకత లేదు. కేంద్రంలో ఎన్‌డిఏ ఏర్పడితే మద్దతు యివ్వడానికి రెడీ అవుతారు. ఇస్తే పుచ్చుకోవడానికి బిజెపి వెనకాడదు. టిడిపి వాళ్లు ఫీలవుతారంటూ అడ్డు చెప్పదు. తెలంగాణలో టిడిపి కంటె తెరాసకు ఎక్కువ సీట్లు వస్తే (రావడానికే ఛాన్సుంది) మొహమాటానికి పోయి మద్దతు వద్దంటారా? ఇలాటి పరిస్థితిలో తెరాసను ఆపడానికి… అంటూ టిడిపి యీ పొత్తుకోసం తన కార్యకర్తలను వేదనకు గురి చేయడం దేనికి? ఇదే ప్రశ్న బిజెపి కూడా యింకోలా వేసుకోవాలి. 'టిడిపి విభజనకు వ్యతిరేకి. చివరిదాకా ఆపాలని చూసింది' అని తాము మనసారా నమ్మి, అదే ప్రచారం చేసి, యిప్పుడు వారిని పక్కన బెట్టుకుని ప్రచారానికి ఎలా వెళతామని కార్యకర్తలు అడుగుతూంటే నాయకులు ఏం సమాధానం చెప్తారు? విభజనకోసం విపరీతంగా శ్రమించిన కిషన్ రెడ్డి యీ రోజు పొత్తు వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకించరా? 7 జిల్లాల అధ్యకక్షుల చేత తిరుగుబాటు చేయించారంటే చేయించరా?
'ఇలా యిలా ఆలోచించకూడదు, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పొత్తు ఆవశ్యకం' అనుకుంటే అది కుదిరేట్లు శాయశక్తులా ప్రయత్నించాలి. ఆ విషయంలో టిడిపి, బిజెపి రెండూ దారుణంగా విఫలం చెందాయి. బిజెపి 60 అసెంబ్లీ సీట్లు, 9 పార్లమెంటు సీట్ల దగ్గర బేరం మొదలుపెట్టింది. ఇప్పటి అసెంబ్లీలో, పార్లమెంటులో వాళ్లకున్న సీట్లెన్ని? 4-0. అక్కణ్నుంచి ఏం చేస్తే యీ స్థాయికి పెరుగుతాయి? మాట్లాడితే మోదీ ప్రభంజనం అంటారు. మోదీ గురించి పట్టణప్రాంతాల్లో కొంత తెలిసి వుంటుంది తప్ప గ్రామీణప్రాంతాల దాకా ఎక్కడ పాకింది? ఎన్ని ఓట్లు పడతాయి? తెలంగాణ సెంటిమెంటు అని మరొకటి చేరుస్తారు. ఆ సెంటిమెంటు ఎన్ని పార్టీలకు పని చేస్తుంది చెప్పండి. ఉద్యమం చేశామంటూ తెరాస అదే అంటుంది, బిల్లు పాస్ చేశామంటూ కాంగ్రెసు అదే అంటుంది, మద్దతిచ్చాం అంటూ బిజెపి అదే అంటుంది, ఆరేళ్ల క్రితమే లేఖ యిచ్చాం కాబట్టి అని టిడిపి కూడా అదే అంటుంది. మధ్యలో సిపిఐ కూడా నేనూ వున్నానంటుంది. తెలంగాణ ఓటరు తన ఓటును ఐదు ముక్కలు చేసి తలా ఒక ముక్కా వెయ్యాలి. బిజెపి తన బలాన్ని విపరీతంగా అంచనా వేసుకుందని ఎవరికైనా అనిపిస్తుంది.
ఇక టిడిపి – పార్టీ నిర్మాణ వ్యవస్థ, బిసిల సపోర్టు విషయంలో తెలంగాణలో టిడిపికి ఎదురు లేదనే అందరూ అంటారు. కానీ తెలంగాణ సమస్య వచ్చిన దగ్గర్నుంచి టిడిపి భాగ్యరేఖ వక్రిస్తూ వచ్చింది. 2004లో ఓడిపోయింది. ప్రత్యేక తెలంగాణకు సై అన్నా 2009లో ఓడిపోయింది. తర్వాత వచ్చిన ప్రతీ ఉపయెన్నికలో ఓడిపోయింది. డిపాజిట్లు కోల్పోయింది. నాయకుల్నీ కోల్పోయింది. టిడిపి విడిచి తెరాసలో చేరినవారిని ఓటర్లు అఖండమైన మెజారిటీతో గెలిపించారు. టి-టిడిపి నాయకులు కెసియార్‌ను బండబూతులు తిట్టినా ఓటర్లు ఖాతరు చేయలేదు. విభజన జరిగినా, జరగకపోయినా యీ సారి ఎన్నికలలో టిడిపికి తెలంగాణలో ఛాన్సు లేదు అనుకునే సమయంలో విభజన బిల్లు వచ్చింది. 'సీమాంధ్రులకు సమన్యాయం దక్కలేదు' అనే జండా పట్టుకుని బాబు ఢిల్లీలో తెగ తిరగడంతో, యీయన ఏదో ఒక పేరుతో విభజన అడ్డుకోవడానికి ప్రయత్నించాడన్న భావం వేర్పాటువాదుల్లో కలిగిందనేది నిర్వివాదాంశం. వారి సంఖ్య ఎంత అనేది యిప్పుడు తెలియదు కానీ యీసారి తెలంగాణలో టిడిపి అధికారంలోకి వస్తుందని కాని, గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని గాని ఎవరూ అనుకోవడం లేదు. అందుకే ఆయన 'బిసి ముఖ్యమంత్రి' అనగానే 'గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం' అన్నట్టుందని వెక్కిరించారు. తన పార్టీలో బిసి నాయకులు ఎవరూ లేరన్నట్టు కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవడం కానీ, బహుశా ఆయనే సిఎం కాండిడేటు అన్న సంకేతాలు పంపడం కానీ చూస్తే తెలంగాణపై ఆశలు విడిచినట్లే కనబడింది.
ఇలాటి పరిస్థితుల్లో బిజెపితో పొత్తు కుదిరే అవకాశం కనబడినప్పుడు అయినకాడికి రాజీ పడకుండా సీట్ల సంఖ్య వద్ద తీవ్రంగా బేరాలాడడం విస్మయం కొలుపుతోంది. బిజెపికి 45 ఎసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటు సీట్లు చాలని టిడిపి అభిప్రాయపడింది. అంటే 74 ఎసెంబ్లీ సీట్లు, 9 పార్లమెంటు సీట్లు తమకు కావాలన్నమాట. '45 కంటె ఎక్కువ సీట్లు బిజెపికి యిస్తే వాళ్లు గెలవలేక, మా ప్రత్యర్థుల విజయానికి దోహదపడతారు. 2009లో తెరాసతో యిలాగే జరిగింది' అని టిడిపి నాయకులు వాదిస్తున్నారు. ఆశాభావంతో వుండడం మనిషికి అవసరం, నాయకుడికి మరీ అవసరం. తనను తాను నమ్మించుకుంటూ, కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ వుండాలి. అలా అని మరీ మోతాదు మించితే నేల విడిచి సాము చేసినట్లు అవుతుంది. గతంలో మహా కూటమి విషయంలో యిదే జరిగింది. తెలంగాణ తెచ్చిన సెంటిమెంటు వర్కవుట్ అవుతుందనుకుంటే తెరాస, కాంగ్రెసు లాభపడతాయి. ఎవరికి వారే ఆ లాభం తమకు చేకూరుతుందని అంచనా వేసుకున్నారు కాబట్టి, తెరాస-కాంగ్రెసు పొత్తు కుదరలేదు. అది అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ క్రెడిట్ ఏమీ లేని టిడిపికి, బిజెపికి యింతింత పట్టుదలలు అవసరమా? గతంలో కన్నా మేం యిప్పుడు బలపడ్డాం అని చెప్పుకుంటూనే 'ఫలానా సీటు మాకు వద్దు, మీరు తీసుకోండి' అంటూ అవతలివాళ్లకు తోసేయడం ఏమిటి? అంటే గెలిచే సీట్లు కొన్నే! అవీ తెలంగాణ సెంటిమెంటు బలంగా వున్న నియోజకవర్గాలే అని యిద్దరికీ తెలుసన్నమాట. వాటిని సమానంగానో, మరో లాగానో పంచుకుని, యితర సీట్లను ఎదుటివాళ్లకు యివ్వడంలో ఉదారంగా వ్యవహరిస్తే పోయేది కదా! అలా కాకుండా 45 అనీ, 50 అనీ, ఫైనల్‌గా 47 అనీ… యిలాటి చర్చలన్నీ బయటకు వస్తే కార్యకర్తలు కలిసి ఎలా పనిచేయగలుగుతారు?
వీళ్ల ఐక్యతను చెడగొట్టడానికి కెసియార్ ఎలాగూ వున్నారు. తెలంగాణలో పోటీ చేస్తున్న పార్టీలు ఉద్యమంలోనైనా ఎప్పుడో ఒకప్పుడైనా కలిసి పని చేశాయి. మొదటినుండీ ఉప్పూ, నిప్పూగా వున్న పార్టీలు తెరాస-టిడిపిలు. టి-జాక్ నుండి టిడిపినుండి మెడపట్టుకుని గెంటేదాకా కెసియార్ నిద్రపోలేదు. వీలైతే ఒంటరిగా, లేకపోతే తెరాసతో కలిసి వెళదాం అనే భావన రాష్ట్ర బిజెపి నాయకుల్లో చాలామందికి వుంది. 'చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు కలిసి యీ పొత్తు మీ నెత్తిపై రుద్దారు చూసుకోండి. ఇదంతా ఆంధ్ర నాయకత్వం. ఇద్దరిదీ ఒకటే కులం.' అని కెసియార్ బిజెపి కార్యకర్తలను కిర్రెక్కిస్తున్నారు. తెలంగాణ రాజకీయరంగంలో ఆయన 'బుల్ యిన్ చైనా షాప్'లా తయారయ్యారు. ఎవరి మధ్యా పొత్తు కుదరనీయటం లేదు. విలీనం అనీ, పొత్తు అనీ కాంగ్రెసు నాయకులను కన్‌ఫ్యూజ్ చేసి, చివరిదాకా ఏదీ తేల్చకుండా ఏడిపించారు. టిడిపి నుండి, కాంగ్రెసు నుండి, సిపిఐ నుండి.. అన్ని పార్టీల నుండి తన పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహించి అందరి ఆగ్రహాన్ని మూటగట్టుకున్నారు. ఆయనపై కోపంతో కాంగ్రెసు కూడా కొందర్ని తమవైపు లాక్కుంది. దానితో అప్పటిదాకా జండా మోస్తూ వచ్చిన కార్యకర్తలకు ఆశాభంగం కలిగి తిరగబడుతున్నారు. అన్ని పార్టీల్లో యిదే పరిస్థితి.
ఈ గందరగోళంలో టిడిపి కొంతైనా పుంజుకుంటుందేమో, అది జరగకూడదని కెసియార్ కోరుకుంటున్నట్లు కనబడుతుంది. రేపు తమ అధికారంలోకి వచ్చాక యిప్పుడిస్తున్న హామీలు నెరవేర్చలేనపుడు ప్రభుత్వవ్యతిరేక ఆందోళనలు చేపట్టే సత్తా గల కార్యకర్తలు టిడిపికి వున్నారు. సీమాంధ్రలో టిడిపికి ఛాన్సుంది అంటున్నారు కాబట్టి, అక్కడ బలపడితే కొంతకాలానికి ఈ ఆందోళనల ద్వారా 2019 నాటికి యిక్కడా మళ్లీ ఒక ఫోర్స్‌గా ఎదగవచ్చు, ఎప్పటికైనా తమకు పోటీ రావచ్చు అనే అంచనా ఆయనది. ఇప్పుడే సాధ్యమైనంత అణిచేస్తే, యిక్కడెలాగూ లేదు కదాని నాయకత్వం సీమాంధ్రకు తరలిపోతే, ఒక బలమైన శత్రువు తొలగిపోయినట్లే కదా! ఈ వ్యూహంతో వున్న కెసియార్ బిజెపి-టిడిపి పొత్తు సవ్యంగా జరగకుండా సాధ్యమైనంత కృషి చేయవచ్చు. తాము ఓడిపోతామన్న భయం వున్నచోట క్షేత్రస్థాయిలో బిజెపికి లోపాయికారీ మద్దతు యిచ్చి వారిని ఆకట్టుకోవచ్చు. ప్రతిగా టిడిపికి బిజెపి ఓట్లు బదిలీ కాకుండా చేయాలన్న షరతు విధించవచ్చు. ఈ విధంగా చూస్తే తెలంగాణలో బిజెపి-టిడిపి పొత్తు మరో మహాకూటమి ప్రయోగం కాబోతోందనిపిస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)