తనను కొడుకుగా ఎన్‌డి తివారి గుర్తించాలని చాలాకాలంగా కోర్టులో పోరాడుతున్న రోహిత్ శేఖర్ చివరకు సాధించాడు. డిఎన్‌ఏ పరీక్షలు తివారి పితృత్వాన్ని నిర్ధారించాయి. వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పు ఏప్రిల్ 4 న చెప్తానని కోర్టు అంది. ఈ లోపున మార్చి 3 వ తారీకున యిరుపక్షాల మధ్య రాజీ కుదిరింది. మర్నాటి పత్రికా సమావేశంలో తివారి శేఖర్ తన కొడుకే అని ఒప్పుకున్నాడు.
1970లలో తివారి తన రాజకీయ గురువు, అప్పటి కేంద్రమంత్రి ఐన షేర్ సింగ్ యింటికి తరచుగా వెళుతూ వుండేవాడు. ఆయన కూతురు ఉజ్జ్వలా శర్మ భర్తతో పొరపొచ్చాలు వచ్చి తండ్రి యింట్లో వుండేది. అప్పటికే ఆమెకు సిద్ధార్థ్ అనే కొడుకు. ''నీకు నీ భర్తతో పడదు, నాకు నా భార్యతో పడదు. పైగా మాకు పిల్లలు లేరు. నీ ద్వారా ఒక కొడుకుని కనాలని నా ఆశ. నా భార్యకు విడాకులు యిచ్చేస్తాను, నువ్వు నీ భర్తకు విడాకులు యిచ్చేయ్. ఇద్దరం పెళ్లి చేసుకుని సుఖంగా వుందాం.'' అంటూ తివారి వెంటపడ్డాడు. ''ఆయన నా కంటె 19 ఏళ్లు పెద్దవాడు. అలా ఆరేళ్లపాటు ప్రాధేయపడ్డాక నేను సరేనన్నాను.'' అంటుంది ఉజ్జ్వల. 1979లో శేఖర్ పుట్టాడు. విడాకులు యిస్తే రాజకీయజీవితానికి భంగం కలుగుతుందని తివారి భయపడ్డాడు. వీళ్లింటికి వస్తూ పోతూ వుండేవాడు. పుట్టినరోజుకి శేఖర్‌కు బహుమతులు తెచ్చేవాడు కానీ అతని అన్నకు తెచ్చేవాడు కాడు. ఇదంతా శేఖర్‌కు అర్థమయ్యేది కాదు. అతని 11 వ యేట తెలిసింది – తను తండ్రి అనుకునే వ్యక్తి తనకు నిజంగా తండ్రి కాదని, ఇంటికి వచ్చే 'అంకులే' తన తండ్రి అని. ఇదేమిటని తల్లిని అడిగితే 'ఇలాటివి జరుగుతాయిలే' అని చెప్పి ఆమె వూరుకోబెట్టింది. 1993లో తివారి భార్య పోయిన తర్వాత కూడా ఉజ్జ్వలతో పెళ్లి జరగలేదు. చివరకు ఆమె తన భర్తకు 2006లో విడాకులు యిచ్చింది. ఇచ్చినా పిల్లలకోసం ఆమె, భర్త ఒకే యింట్లో వేర్వేరు అంతస్తుల్లో నివసించారు.
ఇదంతా పెద్దవాళ్లు జీర్ణించుకున్నారేమో కానీ, పిల్లలకు వివాహవ్యవస్థ పట్ల ఏవగింపు కలిగింది. బ్రహ్మచారులుగా వుండిపోయారు. శేఖర్ డిప్రెషన్‌కు లోనయి ఆరోగ్యం చెడగొట్టుకున్నాడు. ఇప్పుడతనికి 35 ఏళ్లే కానీ యిప్పటికే గుండెపోటు కూడా వచ్చింది. డబ్బు, పలుకుబడి వున్నవాళ్లు యితర మహిళలతో ఎలా ఆడుకుంటున్నారో బయటపెట్టడానికి నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో తన అక్రమసంతానమని లోకానికి తెలిసినా ఫర్వాలేదని అనుకున్నాడు. తన చెడునడత అందరికీ చాటింపు అయిపోతుందని తెలిసినా తల్లి అతనికి అండగా నిలిచింది. ఇద్దరూ కలిసి తివారిని ముప్పుతిప్పలు పెట్టారు. తివారి డిఎన్‌ఏ పరీక్షకు అంగీకరించకుండా చాలా సతాయించాడు. గవర్నరుగా వున్నంతకాలం ఆ పదవి అడ్డుపెట్టుకున్నాడు. అది వూడాక మొరాయించాడు. చివరకు కోర్టు ఆదేశాలతో బలవంతంగా డిఎన్‌ఏ సేకరణ జరిగింది. వచ్చే నెలలో తీర్పు వస్తుందనగా అనారోగ్యంతో ఢిల్లీ వెళ్లాడు. ఉత్తరాఖండ్ సదన్‌లో బస చేశాడని తెలిసి ఒక రాత్రివేళ ఉజ్జ్వల అతన్ని కలవడానికి వెళ్లింది. రాత్రి చాలాసేపటిదాకా మాట్లాడుకున్నాక అతను హఠాత్తుగా మనం రాజీపడదాం, శేఖర్‌ను పిలిపించు అన్నాడు. ఈమె ఫోన్ చేసి అతన్ని రప్పించింది. తివారి కొడుకుని కౌగలించుకుని కాస్సేపు కన్నీరు కార్చాడు. ''వృద్ధుడైన నా తండ్రికి సేవ చేసుకుంటాను. హక్కులు ఏమీ కోరను.'' అంటున్నాడు శేఖర్. 'తివారి వంటి గ్రంథసాంగుడు నా తండ్రి అని చెప్పుకోవడానికి ఏళ్ల తరబడి పోరాటం సలపాలా, మౌనంగా వుంటే పోయేది కదా' అని లౌకిక దృష్టికి తోస్తుంది. కానీ ఎవరి మనోభావాలు వారివి అనుకుని వూరుకోవడం మేలు.
– ఎమ్బీయస్ ప్రసాద్