గతంలో రాజకీయాల్లోకి న్యాయవాదులు, సంఘసేవకులు ఎక్కువగా వెళ్లేవారు. తర్వాత దక్షిణాదిన సినిమా తారలు వచ్చి చేరారు. పోనుపోను చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎన్నికలలో సమాజంలో అనేక వర్గాల వారు అభ్యర్థులుగా నిలబడుతున్నారు. ఐయేయస్‌లు, ఐపియస్‌లు గతంలో రాజకీయాల్లోకి పెద్దగా వచ్చేవారు కారు. ఈ సారి చాలామంది వచ్చారు. సత్యపాల్ సింగ్ ముంబయి పోలీసు కమిషనర్‌గా చేస్తున్న ఉద్యోగానికి ఫిబ్రవరిలో రాజీనామా చేసి రెండు రోజుల తర్వాత బిజెపిలో చేరాడు. సొంత రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో నరేంద్ర మోదీతో బాటు వేదికపై ఆసీనుడయ్యాడు. నాగపూర్‌లో పని చేసినప్పటినుండి అతనికి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధబాంధవ్యాలుండేవి. అందుకే నరేంద్ర మోదీ నిందితుడుగా భావింపబడిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో గుజరాత్ హై కోర్టు వేసిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)కి నాయకత్వం వహించమంటే నిరాకరించాడు. ఇప్పుడు ఏకంగా బిజెపిలో చేరిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతని సహచరుడు పి కె జైన్ రాజకీయనాయకులు పోలీసు ప్రమోషన్లలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ చేస్తూ తన ఎడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పదవికి రాజీనామా చేశాడు. త్వరలోనే ఆయనా బిజెపిలో చేరతాడని అంచనా. ముంబయి పోలీసు వ్యవస్థలో అసిస్టెంటు కమిషనర్‌గా పనిచేసిన షంషేర్ పఠాన్ 2012లోనే రాజీనామా చేసి, ముస్లిములకు, దళితులకు రాజకీయ ప్రాధాన్యత యివ్వాలని పోరాడుతా అంటూ అవామీ వికాస్ పార్టీ పెట్టాడు. ఇప్పుడది మహారాష్ట్రలోని 48 సీట్లలోనూ పోటీ చేస్తుందట.
పోలీసులే కాదు ఆర్మీవారికి, యింటెలిజెన్సువారికి కూడా ఎన్నికలలో రావాలన్న బుద్ధి పుట్టింది. రా (రిసెర్చి అండ్ అనాలిసిస్ వింగ్ అనే పేరుతో నడిచే ప్రభుత్వ గూఢచారి సంస్థ)కు 2010 డిసెంబరు నుండి రెండేళ్లపాటు అధినేతగా వున్న సంజీవ్ త్రిపాఠి ఫిబ్రవరి 25 న రాజీనామా చేసి బిజెపిలో చేరాడు. వారం తిరక్కుండా మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్ బిజెపిలో చేరాడు. అతనితో బాటు 30 మంది ఎక్స్ సర్వీస్‌మెన్ కూడా. మామూలుగా అయితే ప్రభుత్వోద్యోగం నుండి విరమించినవారు ఏదైనా ప్రయివేటు కంపెనీలో చేరాలంటే ఏడాది పాటు ఆగాలి. రాజకీయాల్లో చేరాలంటే అలాటి నిబంధన ఏమీ లేదు. అందుకని వీరందరూ పొలోమని వచ్చేస్తున్నారు. ప్రజలకు ఎంతోకొంత దూరంగానే మసలే పోలీసు అధికారులే రాజకీయాల్లో వస్తూ వుంటే నిత్యం జనంమధ్య మసలే జర్నలిస్టులు వూరుకుంటారా? నిజానికి గత 20 ఏళ్లగా జర్నలిస్టులు ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1970, 80 లవరకు సమాజాన్ని సంస్కరిద్దామని జర్నలిజంలోకి వచ్చినవారు కోకొల్లలు. క్రమేపీ పత్రికాధిపతులు జర్నలిస్టు నీతినియమాలకు కట్టుబడకుండా తమ యితర వ్యాపారాలను పెంచుకోవడానికి పత్రికలను ఉపయోగించుకోవడం, తామే రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తడం వీరిని మండించింది. స్వయంగా రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేయసాగారు. ఎక్కువమంది అపజయం పాలయ్యారు. ఇప్పుడు ఆప్ పార్టీ వారికి ఆశలు కొల్పుతోంది.
గతంలోనే రాజకీయాల్లోకి వచ్చిన జర్నలిస్టుల్లో ఎం జె అక్బర్, శ్రీకాంత్ వర్మ, ఉదయన్ శర్మ, సీమా ముస్తఫా, రాజీవ్ శుక్లా, చందన్ మిత్ర వంటివారున్నారు. సీమా ముస్తఫా 1989లో జనతా దళ్‌లో చేరి రెండుసార్లు యుపి నుండి పోటీ చేసి ఓడిపోయి, మళ్లీ జర్నలిజంలోకి వచ్చేసింది. చందన్ మిత్ర బిజెపి తరఫున రాజ్యసభ ఎంపీగా వున్నాడు. ప్రస్తుతం లోకసభకు పోటీ చేస్తున్నాడు. గతంలో కాంగ్రెసు ద్వారా ఎంపీ అయిన ఎంజె అక్బర్ యిప్పుడు బిజెపిలో చేరవచ్చని పుకారు వుంది. 1980లలో శ్రీలంకలో ఎల్‌టిటిఇ స్థావరాల మధ్య సైకిలుపై తిరిగి వాస్తవాలు సేకరించి రిపోర్టు చేసిన ''టైమ్స్ ఆఫ్ ఇండియా'' జర్నలిస్టు అనితా ప్రతాప్ యిప్పుడు కోచి నుండి ఆమ్‌ఆద్మీ అభ్యర్థిగా నిలబడుతోంది. ''అమర్ ఉజాలా'' రిపోర్టరుగా ఎన్నో కుంభకోణాలు బయటపెట్టిన ముకుల్ త్రిపాఠి ఫరూకాబాద్‌లో సల్మాన్ ఖుర్షీద్‌కు వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. ''ఆసాం ప్రతిదిన్'' జర్నలిస్టు అయిన మనోరమ్ గొగొయ్ కూడా ఆమ్ ఆద్మీ తరఫున జోర్‌హట్‌లో పోటీ చేస్తున్నాడు. న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ తరఫున నిలబడుతున్న అభ్యర్థుల్లో మోదీ 'స్నూప్‌గేట్' బయటపెట్టిన అశీష్ ఖేతాన్, సిఎన్‌ఎన్-ఐబిఎన్ యాంకర్‌గా చేసిన అశుతోష్ వున్నారు. గుజరాత్‌లో బిజినెస్ జర్నలిస్టు అయిన నచికేత దేశాయ్ ''ఇక్కడ గుజరాత్‌లో కార్పోరేట్ రంగం, మీడియా, నాయకులు కలిసికట్టుగా మోదీ గురించి ప్రచారం చేస్తూ ప్రజల్ని ఎలా మభ్యపెడుతున్నారో చూస్తున్నాను. అందుకే ఆమ్ ఆద్మీలో చేరాను. అప్పట్లో జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. ఈ సారి ఎన్నికలలో పోటీ చేయడం లేదు కానీ పార్టీకై ప్రచారం చేస్తున్నాను.'' అన్నాడు.
సినిమాతారల విషయానికి వస్తే ఓటర్లు వారిని ఉత్సాహంగా ఆహ్వానించినా, వారితో ఫోటోలు దిగడానికి ఉబలాటపడినా ఆ నియోజకవర్గంలో వున్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. రంగస్థలం, టీవీ, సినిమాల ద్వారా సుప్రసిద్ధురాలైన కిరణ్ ఖేర్ బిజెపి అభ్యర్థిగా చండీగఢ్‌లో నిలబడడానికి మార్చి 18 న అక్కడకు వెళ్లగానే స్థానిక బిజెపి కార్యకర్తలు నల్లజండాల ప్రదర్శన జరిపి, కుళ్లిన కోడిగుడ్లు విసిరారు. 'అమె ఎక్కణ్నుంచో వచ్చి దిగింది. ఇన్నాళ్లూ జెండా మోసిన మాకు టిక్కెట్టు యివ్వలేదు' అని వారి కోపం. ఆమె రెండో భర్త అనుపమ్ ఖేర్ కశ్మీరీ కావడం వలన ఆ సందేహం వచ్చింది కానీ ఆమె పంజాబీ. పంజాబ్ యూనివర్శిటీలో చదివింది. మొదటి భర్త, కొడుకు పంజాబీలే. 'పైగా నేను మునిసిపల్ ఎన్నికలలో బిజెపి తరఫున ప్రచారం చేశాను.' అంటుందామె. సినిమా గ్లామర్‌లో కూడా ఆమెకు పోటీ వుంది. ఆమె కంటె దాదాపు 23 ఏళ్ల్ల చిన్నదైన నటీమణి గుల్ పనాగ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అదే నియోజకవర్గంలో పోటీ చేస్తోంది. ఆమె అత్త ఊరేగింపుల్లో ''షహీద్'' సినిమాలోని 'మేరా రంగ్ దే బసంతీ చోలా..' పాట పాడి ప్రజలను ఆకర్షిస్తోంది. ఎవరీమె అని తలతిప్పి చూస్తే గుల్ కనబడుతోంది.
వీళ్లిద్దరూ పోటీ చేస్తున్నది పవన్ కుమార్ బన్సల్ అనే కాంగ్రెస్ ఎంపీపై. అతను నాలుగుసార్లగా వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. యుపిఏ 2 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా పని చేసి, అతని రైల్ గేట్ స్కామ్‌లో యిరుక్కుని పదవి పోగొట్టుకున్నాడు. అతని మేనల్లుడు రైల్వేలో ఉద్యోగాలు, ప్రమోషన్లు యిప్పిస్తానని చెప్పి లంచాలు పట్టినట్టు చార్జిషీటు దాఖలైంది కానీ యితనికి సిబిఐ క్లీన్ చిట్ యిచ్చింది. దానిని ఎవరూ నమ్మటం లేదు. చండీగడ్ ధనికులు, ఎగువ మధ్యతరగతి వుండే నగరం కాబట్టి వీరికే ఛాన్సుంటుంది అనుకుంటాం. అయితే ఆ నగరంలో కూడా లేబర్ కాలనీలున్నాయనీ, వారి అవసరాలు తీరటం లేదని గ్రహించిన బహుజన్ సమాజ్ పార్టీ జన్నత్ జహాన్ అనే అభ్యర్థిని పోటీలోకి దింపింది. వీరందరిలో ఎవరు ప్రజాదరణ పొందుతారో వేచి చూడాలి.
-ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2014)