జగన్ ధ్యేయం విజయసాధనే

విజయసాధనే జగన్ ధ్యేయంగా పెట్టుకున్నట్లు, ఈ రోజు ఆయన విడుదల చేసిన అభ్యర్థుల జాబితా స్పష్టం చేస్తోంది. ఎవరు ఎమనుకుంటేనేం? ఎవరు లబ్ధిపొందితేనేం, అంతిమంగా వైకాపా వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అదే లక్ష్యంగా…

విజయసాధనే జగన్ ధ్యేయంగా పెట్టుకున్నట్లు, ఈ రోజు ఆయన విడుదల చేసిన అభ్యర్థుల జాబితా స్పష్టం చేస్తోంది. ఎవరు ఎమనుకుంటేనేం? ఎవరు లబ్ధిపొందితేనేం, అంతిమంగా వైకాపా వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అదే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. చాలా నియోజవర్గాల్లో అందరికీ తెలిసిన పేర్లే కనిపించాయి. ఆ సంగతి అలా వుంచితే చాలా కుటుంబాలకు ఒకటికి మించిన టికెట్ లు లభించాయి. ఇందులో శ్రీకాకుళంలో ధర్మాన కుటుంబం నుంచి కడపలో వైఎస్ కుటుంబం వరకు వున్నాయి. 

ఉత్తర కోస్తాలో పార్టీకి ఊపు తెచ్చేందుకు జగన్ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పోటీ చేస్తారని ముందు నుంచి అనుకుంటున్నదే. ముందుగా వైవి సుబ్బారెడ్డి పేరు వినిపించింది. ఆయన తాను విశాఖ వెళ్లనన్నారు. దాంతో షర్మిల పేరు వినిపించింది. ఆఖరికి ఇప్పడు విజయలక్ష్మి సీన్ లోకి వచ్చారు. జగన్ ఎంపీగా వున్నపుడు రాష్ట్రంలోవ్యవహారాలు చూసేందుకు విజయలక్ష్మి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు జగన్ అసెంబ్లీకి గురి పెట్టారు కాబట్టి, ఆమె లోక్ సభకు పోటీ పడుతున్నారు. 

నరసాపురం నుంచి తనను అంటి పెట్టుకు వున్న ప్రసాదరాజు కు టికెట్ ఇవ్వలేదు. ఇది దారుణమైన ద్రోహంగా అప్పుడే తెలుగుదేశం పార్టీ నెట్ లో సన్నాయి నొక్కులు ప్రారంభించింది. కానీ అక్కడ గెలుపు తప్పదన్న కొత్తపల్లి సుబ్బారాయుడి కోసం ప్రసాదరాజును జగన్ పక్కన పెట్టారు.  ఒక్క కొత్తపల్లి అనే కాదు, దక్షిణ కోస్తా, ఉభయగోదావరి జిల్లాల్లో పార్టీ విజయావకాశాలపై ప్రభావం కనబర్చే కాపుల పట్ల జగన్ కాస్త ఉదారంగానే వ్యవహరించారు. కాపులు మొత్తం తన వెంట వున్నారని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో, అదే కులానికి చెందిన నలుగురికి ఎంపీలుగా,  20 మందికి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చారు. కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్, ఏలూరు నుంచి తోట చంద్రశేఖర్, గుంటూరు నుంచి బాలశౌరి, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్ కు టికెట్ ఇవ్వడం ద్వారా కాపులను ఆకర్షించడానికి ప్రయత్నించారు. 

అయితే అనకాపల్లి నుంచి గుడివాడ కుమారుడు అన్న క్వాలిఫికేషన్ తప్ప మరేదీ లేని అమర్ నాథ్ , తెలుగుదేశం అభ్యర్ఢి అవంతి శ్రీనివాస్ ను ఢీకొనగలడా అన్నది సందేహం. అతగాడే కాదు, మరో నలుగురైదుగురు కూడా కాస్త బలహీనమైన అభ్యర్థులు వున్నారు. మరి సరియైన అభ్యర్థులు లభించకా లేక, మరే మొహమాటాలా అన్నది అర్థం కాదు.
అనకాపల్లిలో ఒకే ఒరలో ఇమడిన రెండు కత్తులు దాడి, కొణతాల ఇద్దరినీ పోటీకి దూరంగా వుంచారు. వారి వారసులకు సీట్లు ఇచ్చారు. నిజానికి అమర్ నాథ్ కన్నా కొణతాల అక్కడ సరైన అభ్యర్థి అయి వుండేవారు. మైసూరా కూడా పోటీకి దూరంగా వున్నారు.. కాపుల తరువాత ఓటింగ్ లో కీలక పాత్ర వహించే ఎస్సీలకు కూడా బాగానే సీట్లు ఇచ్చారు. 

చెప్పుకోదగ్గ సంగతి ఏమిటంటే, కేవలం రెడ్ల పార్టీ అని అందరూ విమర్శించే వైకాపా, కమ్మవారికి కూడా బాగానే టికెట్ లు ఇచ్చింది.  

మొత్తం మీద విజయసాధనే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ జాబితా సష్టం చేస్తోంది.

చాణక్య

[email protected]