మోహన : ఈల వేస్తే తప్పా అని జిపి రావు నడిగా…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement ఈల వేస్తే తప్పా అని జిపి రావు నడిగా…  సర్వీసెస్‌కు సెలక్టయిన వారికి మసూరిలో ట్రెయినింగ్‌ యిస్తారు. మాకు హాస్టళ్లు, మెస్‌ అన్నీ…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

ఈల వేస్తే తప్పా అని జిపి రావు నడిగా… 

సర్వీసెస్‌కు సెలక్టయిన వారికి మసూరిలో ట్రెయినింగ్‌ యిస్తారు. మాకు హాస్టళ్లు, మెస్‌ అన్నీ వుంటాయి. 

ఒక రోజు పొద్దున్న మెస్‌లో బ్రేక్‌ ఫాస్ట్‌ టైములో, మేమంతా బ్రేక్‌ఫాస్ట్‌ కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం. నేనూ నా టేబుల్‌ దగ్గర యింకొంతమందితో కూర్చుని వెయిట్‌ చేస్తున్నాను. ఏదో పాట గుర్తుకు వచ్చింది. ఈల వేయసాగాను. 

నాకు సైగల్‌ నుండి కిశోర్‌ కుమార్‌ దాకా అనేకమంది యిష్టమైన గాయకులున్నారు. ఆశా భోంస్లే పాటలంటే చాలా యిష్టం. పోస్టు గ్రాజువేషన్‌ చేసేటప్పుడు హైదరాబాదులో వుండగా 'సాజ్‌ ఔర్‌ ఆవాజ్‌' అని మ్యూజిక్‌ ట్రూపు నడిపిన నేపథ్యం వుంది. ఆ రోజు వుదయం చాలా ఆహ్లాదంగా వుంది. హుషారుగా యీల వేస్తున్నాను. చుట్టూ చాలామంది ఆడ, మగ విద్యార్థులు వున్నారు. వాళ్లూ ఎంజాయ్‌ చేస్తున్నారోలేదో తెలియదు కానీ ఎవరికీ అభ్యంతరం లేదు.

''స్టాప్‌ విజిలింగ్‌'' అని ఓ ఉరుము వినబడింది.

ఈల వేయడం ఆపకుండానే అటు చూశా. మా బ్యాచ్‌ అతనే. పేరు జిపి రావో ఏదో వుండాలి. తెలుగువాడే. పెద్దగా పరిచయం  లేదు. 

''ఎందుకాపాలి? దీనిలో తప్పేముంది?'' అన్నట్టు హావభావాలతో ప్రశ్నించి నా విజిలింగ్‌ కొనసాగించా.

అలా ఈల వేయడం తప్పా? అంటే తప్పనే చెప్పాలి. సరిగ్గా చెప్పాలంటే అది బ్యాడ్‌ మానర్స్‌. ఆ సమయంలో, బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ దగ్గర ఆడవాళ్లు సమీపంలో వుండగా యీల వేయడం సభ్యత కాదు. 

ఇది నాకు తెలియక కాదు. అయినా యిదేమైనా క్లాస్‌రూమా? ఈయనేమైనా టీచరా?  పైగా నేను మెస్‌ సెక్రటరీగా  ఏకగ్రీవంగా ఎన్నికైనవాణ్ని! ఏదో సరదాగా కాలక్షేపానికి విజిల్‌ వేస్తూంటే ఎవడికీ లేని అభ్యంతరం యీయన కెందుకు? ఎవరైనా అమ్మాయి వద్దంటే మానేయవచ్చు. ఈయనెవడు మధ్యలో నాకు చెప్పేది? అని నాకు రోషం.

ఆయన మిలటరీలో పని చేసి సర్వీసెస్‌కు వచ్చాడు. మిలటరీ వాళ్లకు మ్యానర్స్‌ గురించి పట్టుదల ఎక్కువ. అక్కడున్న మిస్‌ల పట్ల నా 'మిస్‌'బిహేవియర్‌ సహించలేకపోయాడు. 

''ఇఫ్‌ యూ డోంట్‌ స్టాప్‌.. యు కమ్‌ ఔట్‌. ఐ విల్‌ పుల్‌ యువర్‌ టీత్‌ ఔట్‌.'' (ఆపకపోతే పళ్లు రాలగొట్టేస్తాను) అని అరిచాడు.

నాకు ఒళ్లు మండిపోయింది. నేనేదో లేతగా, సన్నగా వున్నాననా యీ రుబాబు? విజిల్‌ ఆపేసి కుర్చీ తంతూ ''అదీ చూద్దాం, కమ్‌ ఔట్‌'' అని లేచాను.

మధ్యలో వుంటారుగా శాంతిబోధకులైన మధ్యవర్తులు! వాళ్లంతా మా యిద్దరి మధ్యా అడ్డుపడ్డారు. ''మనలో మనకెందుకు, యీ గొడవలు పొద్దున్నపొద్దున్నే..'' అంటూ… మధ్యాహ్నమైతే ఫర్వాలేదన్నట్టు!

నా పళ్లు నా దగ్గరే వున్నాయి. రావు పళ్లు పటపటలాడించి వూరుకున్నాడు. 

నేను క్యాంటీన్‌ నుండి క్లాస్‌ రూమ్‌దాకా కసికొద్దీ యీల వేసుకుంటూ వెళ్లాను.

xxxxxx

ఇన్‌స్టిట్యూట్‌లో యిలాటి కొట్లాటలు కూడా వుంటాయా అని ఆశ్చర్యపడకండి. యువరక్తం అలాటిది. మేం చేరడానికి కొన్నేళ్లకు ముందు మరీ గొడవలు వుండేవిట. ట్రెయినింగ్‌ యివ్వవలసినవాళ్లు పట్టించుకునే వారు కాదుట. డిసిప్లిన్‌ పూర్తిగా నశించిపోయి అరాచకం ఏలేదిట. అప్పడు ఇన్‌స్టిట్యూట్‌ను ఓ దారిలో పెట్టడానికి పిర్‌పూట్‌కర్‌ అనే ఆయన్ను యిన్‌చార్జిగా తెచ్చారు. ఆయన టీచర్లు, ట్రెయినీస్‌, స్టాఫ్‌ అందర్నీ గడగడలాడించాడు. 1965, 66, 67 – యీ మూడు బ్యాచ్‌ లనుకుంటా, మిలటరీ డిసిప్లిన్‌తో నడిచాయి. ఈ సక్సెస్‌ చూశాక ఆయనను విజిలెన్సు కమిషనర్‌గా వేశారు. అక్కడా అదరగొట్టాడు. అధికారులు, రాజకీయనాయకులు అందరూ ఆయన పేరు చెపితే వణికేవారు.

యువరక్తం అంటే ఓ సంఘటన జ్ఞాపకం వస్తోంది. మా బ్యాచ్‌లో ఒకతను ఒక అమ్మాయి అంటే యిష్టపడేవాడు. ఇద్దరూ కలిసి షికార్లు కొట్టేవారు. ఆ సమయంలో ఢిల్లీ నుండి ఒకాయన విజిటింగ్‌ స్పీకర్‌్‌గా వచ్చారు. ఐయేయస్‌లో ఆయన మా కంటె సీనియర్‌ బ్యాచ్‌. ప్రపంచబ్యాంకులో పని చేస్తున్నారు. ఆయన వచ్చాక యీ అమ్మాయి ఆయనను ఆరాధించసాగింది. మా బ్యాచ్‌మేటును వదిలేసి ఆయనతో షికార్లు కొట్టసాగింది.

మా బ్యాచ్‌మేటు ఘొల్లుమన్నాడు. పాఠాలు చెప్పడానికి వచ్చి తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఎగరేసుకుని పోయిన సీనియర్‌కు శాపనార్థాలు పెట్టాడు. అయినా యీ అమ్మాయికి మాత్రం బుద్ధి వుండనక్కరలేదా అని మా దగ్గర వాపోయాడు.

మేం ఓదార్చబోయాం – ''ఆయన వరల్డ్‌ బ్యాంకులో పని చేస్తున్నాడు కదా, అందుకని ఆ గ్లామర్‌లో పడిపోయి వుంటుంది పాపం'' అని.

ఇంతలో ఒకడికి సందేహం వచ్చింది – ''అవునూ, యీయన అక్కడ ఏం పని చేస్తూంటాడు?'' అని.

మా భగ్నప్రేమికుడు కసిగా అన్నాడు – ''పనా? టోకెన్లు యిస్తూ వుండివుంటాడు''!

మామూలు బ్యాంకుల్లా ప్రపంచబ్యాంకులో చలాన్లు కట్టడాలు, క్యాష్‌ కౌంటర్లూ, టోకెన్లు యివ్వడాలు… యిలాటివి వుండవని, ఒట్టి పేపరు వర్కేనని మా అందరికీ తెలుసు. అయినా మా వాడి ఆక్రోశం అలాటిది. ఈ మొహం అక్కడ యిలాటి చిల్లర పనేదో చేస్తూ వుంటాడని, కానీ వరల్డ్‌ బ్యాంకు పేరు చెప్పి తన ప్రేయసిని బుట్టలో పెట్టేసుకున్నాడని వాడి బాధ.

xxxxxx

ఆర్నెల్లు పోయాక మా యిన్‌స్టిట్యూట్‌లో ఓ పార్టీ జరుగుతోంది. ఐపియస్‌ వాళ్లు ఐయేయస్‌లతో కలిసి నాలుగు నెలలపాటు మాత్రమే మసూరీలో ట్రెయినింగ్‌ తీసుకుంటారు. ఆ తర్వాత మౌంట్‌ ఏబూకి వెళ్లి అక్కడ తక్కిన ట్రెయినింగ్‌ తీసుకుంటారు. అలా వెళ్లిపోయే వారిలో మిలటరీ నుండి ఐపియస్‌కు వచ్చిన వారి కోసం మిలటరీ నుండి ఐయేయస్‌కు వచ్చినవాళ్లు పార్టీ యిస్తున్నారు. రావుగారు కూడా మిలటరీ నుండి ఐయేయస్‌కి వచ్చినాయనే కాబట్టి పార్టీ యిచ్చేవాళ్లల్లో ఆయనా వున్నాడు. నేనూ అక్కడ వుండి అటూ యిటూ తిరుగుతూ కబుర్లు చెపుతున్నాను. పార్టీ ప్రారంభమయిన గంటా గంటన్నరకు వాతావరణం మంచి హుషారెక్కింది.  రావుగారి మూడ్‌ కూడా బాగున్నట్టుంది. ఏమనుకున్నాడో ఏమో నా దగ్గరకు వచ్చి ఆయనే పలకరించాడు.

నేనూ పలకరించాను. ఉన్నట్టుండి మా మధ్యనున్న దూరం తగ్గిపోయింది. అప్పటినుండి యిప్పటిదాకా ఆప్తమిత్రులుగా కొనసాగుతున్నాం. ఆయనంటే నాకు చాలా మర్యాద, గౌరవం. గురువుగారని పిలుస్తాను. కరీంనగర్‌ జిల్లా కలక్టరుగా, సింగరేణి కోలరీస్‌ చైర్మన్‌గా, ఢిల్లీలో డిఫెన్స్‌ మినిస్ట్రీలో ఆడిషనల్‌ సెక్రటరీగా, రూరల్‌ డెవలప్‌మెంట్‌ మినిస్ట్రీలో సెక్రటరీగా చేసి, మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్‌గా చేసి రిటైరయ్యారు. అందరి గౌరవాన్ని, ప్రశంసలను పొందారు. రాఘవేంద్రరావు గారి లాగే యీయనా ఆంధ్రా యూనివర్శిటీ నుండి వచ్చాడు. డ్రామాల్లో వేశాడు, స్టూడెంటు ఎన్నికల్లో ప్రెసిడెంటుగా పోటీ చేసి గెలిచాడు. మంచి పర్శనాలిటీ, గంభీరకంఠస్వరం. మిలటరీ వాడేమో మనిషి నిటారుగా నిలబడతాడు. డెబ్భయి ఏళ్లు దాటినా యిప్పటికీ టెన్నిస్‌ ఆడతాడు. హోమియోపతి, జ్యోతిష్యం ఆయనకు అభిమాన విషయాలు. ఆ హాబీలు కొనసాగుతున్నాయి.

నేను గవర్నర్‌ వద్ద సెక్రటరీగా పని చేసే రోజుల్లో ఆయన రాష్ట్రప్రభుత్వంలో జాయింటు సెక్రటరీగా వుండేవారు. అప్పట్లో ప్రధానకార్యదర్శిగా ఒకాయన వుండేవారు. ఆయన అందర్నీ అడలగొట్టేవాడు. ఆయన దగ్గరకి ఏ ఫైల్‌ పంపినా ఏదో ఒక క్వెరీ (సందేహం) పెట్టి వెనక్కి పంపేసేవాడు. అంతా కరక్టుగానే వుంది కదా సార్‌ అంటే ''నో, నో ఎ నోట్‌ మస్ట్‌ కంపెల్‌ ఎ డెసిషన్‌'' (ఫైల్లో ఏదైనా నోట్‌ రాస్తే, అదెలా వుండాలంటే ఎటువంటి అనుమానాలు లేకుండా నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కల్పించాలి.) అనేవాడు. పైకి యిలా చెప్పడమే కానీ, ఆయన నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఏదో తికమక పెట్టి తిరక్కొట్టేసేవాడు.

ఒక ఫైల్‌ యిలాగే జిపి రావుకి, ఆయనకూ మధ్య తిరుగుతోంది. రావుకి విసుగెత్తింది. ఎన్నిసార్లు పంపినా యీయన ఏదో ఒకటి అభ్యంతర పెడుతున్నాడే, యీ సారి పక్కాగా పంపాలని నిశ్చయించుకున్నాడు. సెక్రటేరియట్‌లో బెస్ట్‌ డ్రాఫ్ట్‌స్‌మెన్‌గా పేరు బడిన పదిమందిని పోగేసి, వాళ్లందిరికీ 'ఇదిగో యిదీ విషయం, రాయాల్సిన నోట్‌ యిలా వుండాలని నేను అనుకుంటున్నాను' అని చెప్పి విడివిడిగా అందర్నీ రాయమన్నాడు. ఆ తర్వాత అవన్నీ తన ముందేసుకుని వాటిల్లోంచి ఉత్తమంగా వున్నవన్నీ ఏరుకుని వాటిని సరి చేసి పంపించాడు. 

ప్రధాన కార్యదర్శిగారు ఆ నోట్‌ కక్షుణ్ణంగా చదివారు. ఎక్కడా ఏ పొరబాటూ లేదు. క్వెరీ వేయడానికి ఆస్కారమే లేనంత  పెర్‌ఫెక్ట్‌గా వుంది. ఇక గతిలేక నోట్‌ ఎప్రూవ్‌ చేశారనుకుంటున్నారా? అబ్బే! ''వై వజ్‌ సచ్‌ ఏ గుడ్‌ నోట్‌ నాట్‌ పుట్‌ అప్‌ ఎర్లియర్‌?'' (ఇంత మంచి నోట్‌ యింతకుముందే ఎందుకు పెట్టలేదు?) అని రిమార్కు రాసి ఫైలు వెనక్కి పంపేశాడు!

xxxxxx

సీనియర్‌ ఆఫీసర్లందరూ యిలా వుండరు. శంకరన్‌ గారి లాటి మహానుభావులూ వుంటారు. అసలు నోట్‌యే అక్కరలేకుండా నోటిమాట మీదనే నిర్ణయం తీసేసుకుంటారు, దానికి కట్టుబడతారు. 

నేను గుంటూరు జిల్లా కల్టెకర్‌గా వున్నపుడు శంకరన్‌ గారు సెక్రటరీ ఫర్‌ సోషల్‌ వెల్ఫర్‌. బలహీనవర్గాల సంక్షేమ పథకాల కింద పంచిపెట్టడానికి గుజరాత్‌ నుండి పాడి గేదెలను తెప్పిస్తున్నాం. 240 గేదెలకు సోషల్‌ వెల్‌ఫేర్‌ వారి నుండి శాంక్షన్‌ తెప్పించేసుకున్నారు. ఆఖరి నిమిషంలో ఎవరో మీటింగులో పాయింటు లేవనెత్తారు – గేదెలు వస్తున్నాయి కానీ వాటి సంతతి పెంచడానికి దున్నపోతులు కూడా లేకపోతే ఎలా? అని. ప్రతీ 8 గేదెలకు ఒక దున్నపోతు కావాలి. ఆ లెక్కన 30 దున్నపోతులు కూడా వీటితో బాటు తెప్పించాలి. వాటికి అనుమతి లేదు.

ఏం చేయాలో తోచక శంకరన్‌ గారికి ఫోన్‌ చేసి విషయం చెప్పాను.

''అవును దున్నపోతులు లేకపోతే ఎలా? మరి వాటికి ఎంతవుతుంది?'' అని అడిగారు.

''ఒక్కోటి 8 వేల రూపాయలు. 30 దున్నపోతులకు 2.40 లక్షల రూపాయలు.'' అన్నాను నేను. అది ఆ రోజుల్లో (1975) చాలా పెద్ద మొత్తం. ఫైలు మీద చాలా తతంగం నడిస్తే తప్ప శాంక్షన్‌ కాని వ్యవహారం.

''ఓకే శాంక్షన్‌డ్‌'' అనేశారు శంకరన్‌గారు. ఒట్టి నా నోటిమాట మీదే.

నేను వెంటనే కొనేయండి అని రాసి యిచ్చేశాను. అవి వచ్చేశాయి కూడా.

పదేళ్ళ తర్వాత నేను రిజిస్ట్రార్‌ ఆప్‌ కో-అపరేటివ్‌ సోసైటిస్‌గా వున్నప్పుడు, శంకరన్‌గారు మళ్లీ సోషల్‌ వెల్‌ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కు వచ్చారు. ఈ సారి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా వచ్చారు. సంఘసేవ మహా యిష్టం కదా, ఆయనకి ఆ డిపార్టుమెంటు అంటే అంత మక్కువ! ఓ రోజు ఆయనను చూడడానికి వెళ్లాను. 

''నీ అడిట్‌ అబ్జెక్షన్‌ ఇవాళే కరెక్టు చేసానయ్యా'' అన్నారు.

''ఏమిటి సార్‌?'' అని అడిగాను.

''అదే, అవేళ దున్నపోతులు కొనడానికి గుంటూరు జిల్లా కలక్టరుగా నువ్వు పర్మిషన్‌ అడిగావు గుర్తుందా?'' అని గుర్తు చేశారు.

''అవును, దానిలో ఆడిట్‌కు అబ్జక్షన్‌ ఏమిటి?'' కుతూహలంగా అడిగాను.

''శాంక్షన్‌ చేసిన ఆర్డర్‌ యిర్రెగ్యులర్‌ (సక్రమంగా లేదు) అని ఆడిట్‌లో ఎత్తి చూపారు. వ్యవహారం పదేళ్లగా పెండింగులో వుండిపోయింది. నేను యీ డిపార్టుమెంటుకి తిరిగి వచ్చాక చూస్తే దానిమీద పెద్ద గ్రంథం నడుస్తోంది. ఇవాళే ఫైలు నా దగ్గరకు వచ్చింది. 'దీన్ని ఫోన్‌లో శాంక్షన్‌ చేసినది నేనే. దీన్ని రెగ్యులరైజ్‌ చేసి ఆడిట్‌ అభ్యంతరం తీసేయండి' అని రాశాను.''

ఇదీ శంకరన్‌గారి గొప్పతనం. పదేళ్ల తర్వాత కూడా గుర్తు పెట్టుకుని తన మాటపై నిలబడిన మనిషి. రెగ్యులరైజ్‌ చేసేముందు నాకు ఫోన్‌ చేసి యిలా చేస్తున్నాను అని కూడా చెప్పలేదు. అవేళ అనుకోకుండా ఆయన వద్దకు వెళితే విషయం తెలిసిందంతే!

xxxxxx

ఇలాటి నిక్కచ్చితనమే వికె రావుగారిలోనూ వుంది. (ఈ మధ్యే 99 వ పుట్టినరోజు జరుపుకున్నారు) మనం కరక్టుగా పని చేసినపుడు ఎవరికీ భయపడనక్కరలేదనే తత్వం ఆయనది. చెన్నారెడ్డిగారు పరిశ్రమల మంత్రిగా వుండగా ఆయన ఇండస్ట్రీస్‌ సెక్రటరీగా వుండేవారు. ఓ సారి చెన్నారెడ్డిగారు 'ఈ విషయంపై ఫలానా రోజున మీటింగు పెడదాం' అని ఒక ఫైలుపై రాశారు.

కానీ అది సెలవు రోజు. అందువలన రావుగారు 'మంత్రిగారు గమనించినట్టు లేదు, ఆ రోజు సెలవు రోజు. అందువలన మీటింగు తేదీ మార్చాలని కోరుతున్నాను' అని రిమార్కు రాశారు.

చెన్నారెడ్డిగారు మొండి మనిషి. పట్టుదలకు పోయారు. ''నేను చెప్పిన రోజే, నేను చెప్పిన టైముకే మీటింగు జరగాలి.'' అని రాశారు. 

''సరే అయితే, నేను లేకుండా మీటింగు జరుపుకోండి. ఆ రోజు సెలవు రోజు. నాకు సెలవుల్లో ఆఫీసుకి వచ్చే అలవాటు లేదు. మన్నించండి.'' అని రావుగారు రాసి తిప్పి పంపించేశారు. 

ప్రభుత్వ సర్వీసెస్‌లో రకరకాల అధికారులు వుంటారు సుమా అని చెప్పడానికి యీ ఉదాహరణలు చాలు!

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version