ఇ.టి. ఆరాధకులు

ప్రపంచంలో యిప్పటికే చాలామంది దేవుళ్లున్నారు. వీళ్లు చాలనట్టు కొత్త దేవుళ్లను సృష్టిస్తున్నారు, రేలిస్టులు. వీరి దేవుళ్లు – ఇ.టి.లని మనం పిలుచుకునే గ్రహాంతర వాసులు. 1968 ప్రాంతంలో ''ఛారియట్స్‌ ఆఫ్‌ గాడ్‌'' అనే పుస్తకం…

ప్రపంచంలో యిప్పటికే చాలామంది దేవుళ్లున్నారు. వీళ్లు చాలనట్టు కొత్త దేవుళ్లను సృష్టిస్తున్నారు, రేలిస్టులు. వీరి దేవుళ్లు – ఇ.టి.లని మనం పిలుచుకునే గ్రహాంతర వాసులు. 1968 ప్రాంతంలో ''ఛారియట్స్‌ ఆఫ్‌ గాడ్‌'' అనే పుస్తకం వచ్చింది. ఎరిక్‌ వాన్‌ డానికెన్‌ అనే స్విజర్లండ్‌ దేశస్తుడు ఒక ప్రతిపాదన చేశాడు. మన పురాణాల్లో అద్భుతాలుగా కనబడే విషయాలు, పురాణపురుషులకు వున్న విశేషశక్తులు – యివన్నీ గ్రహాంతరవాసుల వలననే సంక్రమించాయని అతని వాదన. రోదసిలో నుండి చూస్తే తప్ప కనబడని భూగోళం మ్యాప్‌, గ్రహాంతర నౌక దిగేందుకు నిర్మింపచేసిన హెలిపాడ్‌, అప్పటి మానవులకు అందుబాటులో లేని విజ్ఞాన సంపద – యివన్నీ సాక్ష్యాలుగా చూపించి మానవజాతి దేవుళ్లుగా భావిస్తున్నది నిజానికి యితర గ్రహాల నుండి వచ్చిన వారేనని, వారు మనకంటె సాంకేతికంగా, శాస్త్రపరంగా చాలా అభివృద్ధి చెందినవారని అతను ప్రతిపాదించాడు. వారు ఆకాశం నుండి వచ్చారు కాబట్టే దేవుడు ఆకాశంలో వుంటాడని మనం అనుకున్నామని,  గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు అనే పేర్లతో పిలిచామని, వారికి భూలోకవాసులతో కలిగిన సంపర్కం వలననే కర్ణుడి వంటివారు సహజకవచకుండలాలతో పుట్టారని.. ఆగ్నేయాస్త్రం వంటివి వాళ్లు భూలోకవాసులకు యిచ్చిన అస్త్రాలనీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన యీ అనుబంధం మళ్లీ ఎందుకోగానీ కొనసాగలేదనీ .. – యివన్నీ అతను తన పుస్తకంలో చర్చించి 'నిజం కావచ్చు' అనిపించాడు.

అయితే క్రమేపీ దాన్ని ఒక మతంగా మార్చారు కొందరు మహానుభావులు. దాన్ని రేలిజం అంటున్నారు. ఈ ఉద్యమాన్ని 1973లో నెలకొల్పినది క్లాడ్‌ ఓరిహాన్‌ అనే ఫ్రెంచ్‌ పెద్దమనిషి. అతను ''ఆటో పాప్‌'' అనే ఆటోమొబైల్‌ మ్యాగజైన్‌ను ఎడిట్‌ చేసేవాడు. ''ఇంటెలిజెంట్‌ డిజైన్‌'' అనే పుస్తకంలో ఓరిహాన్‌ ఇ.టి.లతో తన భేటీల గురించి రాశాడు. ఫ్రాన్సులో ఓ పార్కులో ఒకసారి యావే అనే ఒక నాలుగు అడుగుల ఇ.టి. ఫ్లయింగ్‌ సాసర్‌ (ఎగిరే పళ్లాలు అని తెలుగులో అంటున్నారు) నుండి దిగి ఓరిహాన్‌కు సృష్టి ఆవిర్భవించిన క్రమం చెప్పాడట. 'ఎలోహిమ్‌ అనే దేవుడు మానవజాతిని సృష్టించాడు. మధ్యమధ్యలో తన దూతలుగా మోజెస్‌, జీసస్‌, మహమ్మద్‌ వంటి వారిని ప్రవక్తలుగా పంపాడు. ఈ కాలంలో నిన్ను ఎంచుకున్నాడు. మానవులు తమ సృష్టికర్తతో సంబంధం పెట్టుకోవాలంటే నువ్వు దూతగా వుండు. ఎలోహిమ్‌ కోసం ఒక ఎంబసీ (రాయబార కార్యాలయం) కట్టు. భక్తులను ఎలోహిమ్‌తో అనుసంధానింప చేయి. 1,44,000 మంది నిజమైన భక్తులు భూమండలంపై ఏర్పడినపుడు ఎలోహిమ్‌ తన సేనను పంపి మానవజాతికి చిరంజీవిత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ విషయం అందరికీ చెప్పు.' అని ఆ ఇ.టి. ఓరిహాన్‌కు చెప్పాడు. ఇక అప్పణ్నుంచి ఓరిహాన్‌ తన పేరును 'రేల్‌' (సందేశం అందించేవాణ్ని హీబ్రూలో రేల్‌ అంటారు)గా మార్చుకున్నాడు. యూరోప్‌, ఆఫ్రికా, అమెరికా, ఆసియాలలో వ్యాప్తి చేయసాగాడు. మైకేల్‌ జాక్సన్‌, హ్యూ హెఫ్‌నర్‌ (''ప్లేబోయ్‌'' ప్రచురణకర్త), జూలియన్‌ అసాంజే వంటి ప్రముఖులు యీ ఉద్యమంలో చేరారు. ఇప్పటికి 98 వేలమంది పోగడ్డారు. వారిలో భారతీయులు 70 మంది వున్నారు. ఇంకో 20 వేల మంది అప్లికేషన్‌ పెట్టుకున్నారు. 

ఈ మతంలో చేరడానికి ఓ రకమైన బాప్టిజం వుంది. చేరదామనుకున్నవారు స్థానికంగా వున్న గురువు దగ్గరకు వెళ్లాలి. గురువు శిష్యుడు చేతిని నీట్లో ముంచమంటాడు. తన కుడిచేతిని శిష్యుడి తల వెనక్కాల, ఎడమచేతిని అతని నుదురుపైన పెడతాడు. ఇతని శరీరం నుండి సంకేతాలు వెలువడి ఎలోహిమ్‌ యొక్క కంప్యూటర్‌ మదర్‌బోర్డుకు చేరిపోతుందట(!) 'తనను నిజమైన సృష్టికర్తగా శిష్యుడు నిస్సందేహంగా నమ్ముతున్నాడా లేదా' అని ఎలోహిమ్‌కు తెలిసిపోతుందట. నమ్మకం కుదిరితే గురువు ద్వారా అనుమతి ప్రసాదిస్తాడు. లేకపోతే తిరస్కరిస్తాడు. ప్రపంచంలోని అన్ని జీవరాశుల జెనటిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఎలోహిమ్‌ వద్ద భద్రపరచి వుందని రేలిస్టుల నమ్మకం. ఎలోహిమ్‌ రాయబార కార్యాలయం భూమి మీద కట్టాలి కాబట్టి, దానిలో ఇ.టి.లు దిగేందుకు పెద్ద హెలిపాడ్‌ కట్టాలి కాబట్టి ఆ ఖర్చు నిమిత్తమై రేలిస్టులు తమ సంపాదనలో 1%ను ఉద్యమానికి విరాళంగా యివ్వాలి. అంతేకాదు, పెళ్లి, పూజాపునస్కారం వంటి జంఝాటాలు వదులుకోవాలి. ఆల్కహాలు, పొగాకు మానేయాలి. వీరిలో ఏకలింగసంపర్కులు ఎక్కువట. టాప్‌లెస్‌ కార్నివాల్స్‌, కౌగలింతలు, పైజామా పార్టీలు.. జరుపుతూ తమ మతాన్ని వ్యాప్తి చేస్తూంటారు. ఇండియాలో మాత్రం వీళ్లు గుట్టలపై ధ్యానం చేస్తూ ఎలోహిమ్‌తో టెలిపతీలో సంభాషిస్తూ వుంటారు. భారతీయులందరినీ యీ మార్గంలోకి తీసుకు రావాలనే ప్రయత్నంలో రెండు పుస్తకాలను మరాఠీలోకి అనువాదం చేశారు. ఈ మతంలో చేరినా సందేహాలు వదలని ఒక ప్రొఫెసర్‌ గారు ''ఎలోహిమ్‌  దేవుడు అనడం వరకూ బాగానే వుంది. కానీ ఆయన తన దూతలుగా పంపినవారిలో ఒక్క హిందూ దేవుడు కూడా లేకపోవడం ఏమీ బాగాలేదు'' అని పెదవి విరిచాడు.  

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]