సాగుబిల్లుల్లో మూడో దానిలో వున్న లోపం గురించి చెప్పటానికి పెద్ద స్పేస్ అవసరం లేదు. దానితో బాటు యితర విషయాలు కూడా ప్రస్తావిస్తాను. నిజానికి గత ఆరేళ్లలో మోదీ యిప్పటిదాకా ఎన్ని విమర్శలు వచ్చినా, తను వేసిన ఏ అడుగునూ వెనక్కి తీసుకోలేదు. అలాటిది సాగు బిల్లుల విషయంలో మాత్రం బిల్లులు రద్దు చేయరు కానీ మార్పులు చేయడానికి సిద్ధమైనట్లు తోస్తోంది. కోర్టు నియమించిన కమిటీ ప్రజల నుంచి సూచనలు అడుగుతోంది. ప్రభుత్వం పార్లమెంటు కమిటీ ఒకటి వేసి బిల్లులను పరిశీలించమని కోరవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇది శుభపరిణామం. పట్టుదలకు పోకుండా, లోపాలను సవరించాలని చూడడం హర్షదాయకం. ఈ పరిస్థితిలో కూడా భక్తులు బిల్లులు అద్భుతంగా వున్నాయి, లేశమంతైనా మార్చనక్కరలేదని వాదించడం వింత గొలుపుతోంది.
వీళ్ల వాదనలు ఎలా వున్నా ఇవాళే వెలువడిన పంజాబ్ మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సాగు బిల్లుల విషయం పునరాలోచిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైతులు గ్రామీణ ప్రాంతాలలో తమ ప్రభావాన్ని చూపగలుగుతారు కానీ మునిసిపల్ ప్రాంతాలలో మధ్యతరగతి వారు ఎక్కువమంది వుంటారు కాబట్టి బిజెపికి బలం వుంటూ వచ్చింది. కానీ యీసారి 1815 మునిసిపల్ వార్డులలో కాంగ్రెసుకు 67%, అకాలీదళ్‌కు 16%, బిజెపికి 2%, ఆప్‌కు 3% వచ్చాయి. 350 మునిసిపల్ కార్పోరేషన్ సీట్లలో కాంగ్రెసుకు 80% సీట్లు, అకాలీదళ్‌కు 9%, బిజెపికి 6%, ఆప్‌కు 2.5% వచ్చాయి. ఏడు కార్పోరేషన్లుంటే ఆరిటిలో కాంగ్రెసు గెలిచి, ఏడో దానిలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. హరియాణాలో కూడా బిజెపి పరిస్థితి బాగా లేదు. రెండేళ్ల క్రితం జరిగిన మేయరు ఎన్నికలలో 5 నగరాలలోనూ నెగ్గిన బిజెపి-జెజెపి కూటమి రైతు ఆందోళన ప్రారంభమైన తర్వాత 2020 డిసెంబరులో జరిగిన మేయరు ఎన్నికలలో మూడిటిలో ఒకటి మాత్రమే గెలవగలిగింది. పశ్చిమ యుపిలో కూడా యిలాటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవాలని బిజెపి తప్పకుండా అనుకుంటుంది.
ఆహారధాన్యాలను దాచడానికి గిడ్డంగులు లేకపోవడం తొలినుంచి వున్న సమస్య. డబ్బు దాచుకోవడానికి బాంకులు లేని పరిస్థితి వూహించుకోండి. ఎక్కడ పెడతారు? దొంగల నుండి ఎలా కాపాడతారు? డబ్బు కుళ్లిపోదు. పాడై పోదు. కానీ సరైన వసతి లేకపోతే ధాన్యం పాడై పోతుంది. అందుకే యిళ్లలో ధాన్యం దాచుకోవడానికి గాదెలు వుండేవి. అది సొంత వాడకానికే. పంట రాగానే గిడ్డంగుల్లో పెట్టగలిగితే రేటు పెరిగినప్పుడే రైతు అమ్ముకునేవాడు. కానీ యిప్పుడు పంట దిగుబడి రాగానే రేటు పడిపోతుంది. రైతు అమ్మేసుకున్నాక రేటు పెరుగుతుంది. ఎందుకంటే మిల్లరు దాన్ని దాచుకోగలుగుతున్నాడు. మార్కెట్లో కొరత వచ్చాక బయటకు తీసి అమ్మి లాభాలు గడిస్తున్నాడు. అందుకే ఆహారధాన్యాలను అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చి వాటిని స్టోర్ చేసే సామర్థ్యంపై పరిమితి విధించారు. చిన్నప్పటినుంచి యిలా దాచేసి, కరువు సృష్టించి, హెచ్చు రేట్లపై అమ్మే బ్లాక్ మార్కెటీర్లను దుష్టులుగా చూస్తూ వచ్చాం.
ఎస్సెన్షియల్ కమోడిటీస్ (అమెండ్‌మెంట్) పేర వస్తున్న యిప్పటి చట్టం ఆ పరిమితిని తీసేసి, వాళ్లపై శిష్టులుగా ముద్ర కొడుతోంది. ఇప్పటివరకు పరిమితి లేకుండా దాచే హక్కు రైతులు, రైతు కోఆపరేటివ్‌లు, ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌కు మాత్రమే వుండేది. ఇప్పుడు కార్పోరేట్లకు, వ్యాపారులకు కూడా ఆ హక్కు దఖలు పడుతోంది. నిలవ ఉంచగలిగిన (నాన్-పెరిషబుల్) ధాన్యాల ధరలు గత సంవత్సరం కంటె 100% కంటె ఎక్కువగా పెరిగినప్పుడు, నిలవ ఉంచలేని (పెరిషబుల్) ధాన్యాల ధరల విషయంలో 50% కంటె ఎక్కువగా పెరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం కలగజేసుకుని వారిపై పరిమితి విధించవచ్చు. అంటే వాళ్లు మొదటి దానిలో 99% రెండో దానిలో 49% వరకు పెంచినా ప్రభుత్వం కిమ్మనదు. దీనివలన రైతుకు లాభం ఏమీ లేదు. చౌక ధరలో కొన్న వ్యాపారికి మాత్రమే లాభం.
రైతు యికపై మండీలో అమ్మవలసిన అవసరం లేదు. తన ప్రాంతం దాటి, రాష్ట్రం దాటి కూడా అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా అమ్మవచ్చు. అగ్రి-బిజినెస్ సంస్థలు, కార్పోరేట్లు, వ్యాపారస్తులు తమ సొంత మార్కెట్లు తెరిచి, లేదా ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా రైతుల నుంచి కొనేసి, డైరక్టుగా తమ గోదాముల్లో దాచివేసి, సరుకు మార్కెట్లోకి రాకుండా చేయవచ్చు. వాళ్ళని ప్రభుత్వం ఏమీ చేయలేదు. వ్యవసాయం రాష్ట్రప్రభుత్వ పరిధిలోకి వస్తుంది కానీ యీ బిల్లు కారణంగా తమ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులపై, వాటి నిల్వలపై రాష్ట్రానికి ఏ అధికారమూ వుండదు. తలచుకుంటే కొన్ని కార్పోరేట్ కంపెనీలు కుమ్మక్కయి, ఒక రాష్ట్రంలో కీలకమైన సమయంలో ఏ ఉల్లిపాయలో, పంచదారో లేకుండా చేయవచ్చు. ‘ఇలా అయితే ఎలా, రేపు మార్కెట్లో ఉల్లిపాయలు దొరక్కపోతే ప్రజలు మా పీక పట్టుకుంటారు, కేంద్రం వాళ్లకు దొరకదు కదా’ అని ముఖ్యమంత్రులు వాపోతున్నారు.
పంటలనేవి సబ్బుబిళ్లల్లాటి వస్తువులు కావు. ఫ్యాక్టరీని 8 గంటలు పని చేయిస్తే 3 వేలు బయటకు వస్తాయి, 12 గంటలు చేయిస్తే 5 వేలు వస్తాయి అని లెక్కలు వేయడానికి. ఒక్కో ఏడాది బాగా పండుతాయి, మరో ఏడాది పంటంతా చెడిపోతుంది. వరదలు వచ్చినప్పుడు నది నీరును డామ్ కట్టి నిలవ వుంచి, వేసవికాలంలో కాస్త కాస్త నీరు వదిలినట్లు, పంట బాగా పండినప్పుడు రైతుకి నష్టం రాకుండా ప్రభుత్వమే కొని, గోడౌన్‌లలో దాచి వుంచి, మార్కెట్‌లో కొరత ఏర్పడినప్పుడు స్టాక్ విడుదల చేసి, మార్కెట్ రేటును నియంత్రిస్తూ వినియోగదారుడికి కష్టం కలగకుండా చూడాలి. ఇదే ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని. అయితే అది అవసరమైనన్ని గోడౌన్లు కట్టలేదు. పెట్రోలు ధరలు విపరీతంగా ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు అని అడిగితే బిజెపి నాయకులు పెట్రోలు నిల్వ చేసే సామర్థ్యం ఎన్నో రెట్లు పెంచడానికి టాంకులు బోల్డు కట్టేశామని చెపుతున్నారు. సంతోషం. మరి ఆ పని ఆహారధాన్యాల విషయంలో ఎందుకు చేయలేదు?
ఇప్పుడు కార్పోరేట్ల పరం చేస్తున్నారు కాబట్టి, వాళ్లు ఎడాపెడా గోడౌన్లు కట్టేసి, సరుకంతా అక్కడ దాచేసి, ధరలు పెంచేస్తే ప్రజలకు దిక్కూదివాణం లేదు. ఎంతైనా దాచుకో, దోచుకో అని ప్రభుత్వం వారికి లైసెన్సు యిచ్చేసింది కాబట్టి! అబ్బే అలా చేయరు అనడానికి లేదు. మనకు అవసరమైన వస్తువుకి కొరత వుందట అని వినగానే జనాలు ఎగబడతారు. అమ్మేవాళ్లు రేట్లు పెంచేస్తారు. కరోనా అనగానే మాస్కుల రేట్లు ఎలా పెరిగాయో చూశారా, ఆర్శినిక్ ఆల్బమ్ గోరంత సీసాల్లో పోసి ఏభయ్యేసి రూపాయలకు అమ్మేశారు. మెడికల్ షాపుల వాళ్లు యాంటీ బయాటిక్స్, వేపరైజర్లు లేవనేశారు. డిష్ వాషర్లయితే దొరకడం మానేశాయి. ప్రభుత్వానికైతే నిర్ణీతధరకి అమ్మాలన్న నియమం వుంటుంది కానీ ప్రయివేటు వ్యాపారికి ఏముంటుంది? డిమాండు వుంది కదాని ధర పెంచేస్తాడు.
హోర్డింగ్ లిమిట్ ఎత్తివేస్తే కన్స్యూమర్ మట్టికొట్టుకుపోతాడన్న భయానికి ప్రభుత్వం వద్ద సమాధానమేముంది? అబ్బే, కార్పోరేట్లు దయార్ద్రహృదయంతో పనిచేస్తాయి అని చెప్తారా? ఇప్పటిదాకా అలా చూపించిన సందర్బాలున్నాయా? మొత్తం ప్రయివేటైజ్ అయితే రైతుకి గిట్టుబాటు ధర యిచ్చి కొని వినియోగదారుడికి సరసమైన ధరకు అమ్ముతాడు అని వీరి వాదన. సూపర్ మార్కెట్లలో కూరలమ్ముతున్నారు, పప్పుధాన్యాలు అమ్ముతున్నారు. రైతులకు యితరుల కంటె ఎక్కువ ధర చెల్లిస్తున్నారా వీళ్లు? రైతు బజార్లలో కూరల కంటె నాణ్యతలోను, ధరలోను యివి తీసికట్టే. అందుకే సూపర్ మార్కెట్లలో కూరల బేరాలు అంతంతమాత్రం. వీళ్లు మంచి రేటే యిచ్చేమాటైతే, సమయానికి చెల్లింపుల చేసేమాటైతే రైతులు వేరెక్కడా అమ్మకుండా వీళ్ల గుమ్మాల దగ్గరే క్యూ కట్టేవారు. నిజానికి సూపర్ మార్కెట్లు తీసుకున్న సరుకుకి చెల్లింపులు చాలా ఆలస్యంగా చేస్తాయి. అందుకే అనేకం మూతపడి, వాటి కంటె పెద్ద గ్రూపులకు అమ్మేసుకోవలసి వచ్చింది. ఫ్యూచర్ గ్రూపు పరిస్థితి చూస్తున్నాం కదా!
పప్పులు వగైరాలైతే క్వాలిటీ బాగుంటుందని చెప్తూ సూపర్ మార్కెట్లో చిత్తమొచ్చిన ధర పెడుతున్నారు. అయినా మనం అడగం. అసలు అనేక వస్తువులపై ఎమ్మార్పీ విధానంలో స్పష్టత వుందా? చిన్న కంపెనీలు తయారు చేసే వస్తువుల విషయంలో పైన వేసిన ధరలో ముప్పావు రేటుకి కొన్ని షాపుల్లో అమ్ముతారు. సూపర్ మార్కెటులో మాత్రం పూర్తి ధర తీసుకుంటారు. పెద్ద కంపెనీల ఉత్పాదనల విషయంలో కూడా కిరాణా దుకాణంలో ఎమ్మార్పీపై 2-3% తగ్గిస్తారు. సూపర్ మార్కెట్లలో అదీ తగ్గించరు. ఇక వాళ్లు కన్స్యూమర్‌కు చేసే ఉపకారం ఏముంది? అసలు యివన్నీ చూస్తూవుంటే వస్తువు అసలు ధరకు, ఎమ్మార్పీకి సంబంధమే లేదన్న అనుమానం వస్తుంది. దానిపై నియంత్రణ ఏమైనా వుందా? ఇలాటి ప్రశ్నలడిగితే కన్స్యూమర్ కోర్టుకి వెళ్లమంటారు. ప్రభుత్వపక్షాన ఏదైనా అథారిటీ వుండి ఈ వస్తువుకి యింత రేటు పెట్టేవెందుకు అని అడిగే వ్యవస్థ వుందా?
వినియోగదారుడంటే ప్రభుత్వానికి ఎప్పుడూ లోకువే. ఈ మధ్య మరీ ఎక్కువైంది. 2014-15లో వంట గ్యాస్‌ను మార్కెట్ శక్తులకు వదిలేయాలని నిశ్చయించినపుడు సిలండర్ ధర 1000 వుండేది. దానిపై రూ.563 సబ్సిడీ యివ్వాలని నిశ్చయించింది. అంటే 437 పడింది మనకు. లాక్‌డౌన్‌కు ముందు సబ్సిడీ రూ.280కి పైన వుంటే యిప్పుడు 40.72 రూ.లు చేశారు. సిలండర్ ధర ప్రస్తుతం 771.50. అంటే మనకు ఫైనల్‌గా పడే ధర 671. ఇదీ మార్కెట్ శక్తులకు వదిలేస్తే వచ్చే లాభం. సబ్సిడీకై బజెట్ కేటాయింపులు 2020-21కి 41 వేల కోట్లయితే యీ యేడాది కేటాయింపులు 13 వేల కోట్లు. అంటే గ్యాస్ ధర మరింత పెరగవచ్చు. 2020 ఏప్రిల్ తర్వాత కేంద్రం సబ్సిడీ నిలిపివేసింది. ఆయిల్ కంపెనీలు యిచ్చే సబ్సిడీయే దక్కుతోంది. గ్యాస్ ధరలను నెలకోసారి మార్చేందుకు కేంద్రం సర్క్యులర్ యిచ్చింది. పెట్రోలు లాగానే యిదీ పరుగులు పెట్టవచ్చు. వారానికి ఓ సారి మారుస్తారని కూడా అంటున్నారు. నాకు యీ 3న ‘గ్యాస్ సిలండర్ వస్తుంది, 746.50 కట్టాలి’ అని మెసేజి వచ్చింది. ఆ రోజు రాలేదు. మర్నాడు వచ్చింది. కానీ 771.50 కట్టాలి అని మెసేజి వచ్చింది. అలాగే కట్టాను. బజెట్‌లో పన్నులు వేయలేదని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారు. మరో పక్క యిలా వుంది పరిస్థితి.
పెట్రోలు సంగతి చూడండి. పెట్రోలు, డీజిల్ ధర పెరిగితే వాహనదారులకు మాత్రమే భారం పడదు. రవాణా ఖర్చులు పెరిగి, సమస్త వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది అందరికీ తెలుసు. అందువలన ప్రతీవాళ్లూ పెట్రోలు ధరల బట్టి ప్రభుత్వపు పనితీరుని అంచనా వేస్తారు. 2012 మేలో ముడి చమురు ధర 14.5 % ఒక్కసారిగా పెరిగితే, పెట్రోలు 7.54 పెరిగితే యుపిఏ ప్రభుత్వం వైఫల్యమని గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ అన్నారు. 2014 మేలో పెట్రోల్‌పై ఎక్సయిజ్ డ్యూటీ 9.48. ఆరేళ్లలో దాన్ని 32.98కి తీసుకువచ్చిన ఘనత మోదీదే. ఆరేళ్లలో 12 సార్లు పెంచారు. పెట్రోలుపై అదనపు ఎక్సయిజ్ సుంకం గరిష్ఠ పరిమితి 10 రూ.లుంటే దాన్ని చట్టం మార్చి దాన్ని 18 చేశారు. డీజిల్ విషయంలో 4 వుంటే 12 చేశారు. డీజిల్ మీద 3.56 నుంచి 31.83కి తెచ్చారు. 2014 మేలో బారెల్ చమురు 110 డాలర్లు, 2015 జనవరికి 50, 2016 జనవరికి 27, 2020లో ఒక దశలో 11 డాలర్లు.
ఓ పక్క ప్రభుత్వానికి ఖర్చు మిగులుతోంది. అయినా మనల్ని బాదేస్తున్నారు. గత ఆరేళ్లలో యీ మూలంగా ఆర్జించినది దాదాపు 5 లక్షల కోట్లు! ఏమైనా అంటే మేమే కాదు, రాష్ట్రప్రభుత్వాలు కూడా పన్నులు వేసేస్తున్నాయి, మేమేం చేయగలం అంటోంది కేంద్రం. ముప్పాతిక మువ్వీసం రాష్ట్రప్రభుత్వాలు బిజెపివే కదా. పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ సగానికి సగం తగ్గిస్తారు కదా! వాళ్లని చూసి గతిలేక మిగతావాళ్లూ తగ్గిస్తారు. ఇంతకీ యిలా పెంచి సంపాదించిన డబ్బు ఏమౌతోంది అని అడిగితే కేంద్రం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు. దానికి మళ్లీ వేరే సెస్ వేస్తున్నారుగా!
అయినా సంస్కరణలు క్రమేపీ చేయాలి. ఒకేసారి బాదేయకూడదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నపుడు చంద్రబాబు దీర్ఘకాలిక విద్యుత్ అవసరాల కోసం సంస్కరణలు చేపట్టడం తెలివైన పనే. కానీ ఒకేసారి దూకుడుగా వెళ్లిపోయారు. దాదాపు ప్రతీ మూడునెలలకు రేట్లు పెరిగిపోతూ వచ్చాయి. జనమంతా గగ్గోలు పెట్టినా, పార్టీ కార్యకర్తలు వారించినా ఆయన వినలేదు. ప్రపంచబ్యాంకు నన్ను మెచ్చుకుందంటూ మురిసిపోయారు. ప్రజలు హాహాకారాలు చేశారు. అవతల ప్రత్యామ్నాయంగా కాంగ్రెసు ఉచిత విద్యుత్ హామీ యిచ్చింది. ఈయన్ని దింపేశారు. ఇప్పుడు మోదీ పని అలాగే వుంది. రోడ్లన్నీ ఒకేసారి వేసేయాలా? పెట్రోలు కారణంగా అన్ని వస్తువుల ధరలూ పెరిగి, జనం బాధపడతారన్న యింగితం లేకుండా, ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో లేదన్న ధీమాతో వెళుతున్నారు. ఈ రోజు రాజస్థాన్‌లో పెట్రోలు లీటరు ధర మూడంకెలకు చేరింది.
ఆహారధాన్యాల విషయానికి వస్తే యీ బిల్లు ద్వారా పరిమితి ఎత్తేసి ప్రభుత్వమే బ్లాక్‌మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ మాట చెప్పగానే, యిప్పటికే ఎఫ్‌సిఐ గోడౌన్లలో ధాన్యాలు ఎక్కువై పోయి, పాడై పోతున్నాయి అంటారు కొందరు. అదే నిజమైతే అలా మురగపెట్టినవారిని ఉరేయాలి. లాక్‌డౌన్ సమయంలో వందలాది మైళ్లు నడుచుకుంటూ పోయిన వలస కార్మికులకు దారి పొడుగునా గంజి కేంద్రాలు పెట్టలేక పోయారా? తర్వాత యిచ్చినపుడు కూడా 5 కిలోలు యిచ్చే బదులు, 15 యివ్వలేకపోయారా? 3 నెలలు యిచ్చే బదులు ఏడాది యివ్వలేకపోయారా? కరోనా రోజుల్లో ఉపాధి పోయి, నిరుద్యోగం పెరిగి అవస్థలు పడుతూన్న వాళ్లకు చౌకగా యివ్వలేకపోయారా? తక్కిన సమయాల్లో కూడా పేద ప్రజలకు పెన్షన్లు వగైరాలు యిస్తామనే బదులు, ఆహారధాన్యాలే యివ్వవచ్చుగా! ఉచిత రేషన్ యిస్తే, ఆ ఖర్చు మిగులుతుంది కాబట్టి, ఆ డబ్బును వేరే దానిపై వాళ్లు వినియోగించి, వస్తువులు కొంటే అవి తయారు చేసే ఫ్యాక్టరీలైనా కోలుకుంటాయి.
అబ్బే, అలా చేస్తే మార్కెట్లో ధరలు పడిపోయి, రైతుకి నష్టం వస్తుంది అని కొందరు వాదిస్తారు. రైతు అమ్మే ధరకు, మార్కెట్లో ధరకు పోలికే వుండటం లేదు. మార్కెటు ధర బట్టి రైతుకి రేటు యివ్వటం లేదు. అందుకే కనీస మద్దతు ధర వ్యవస్థ వుండాలంటున్నారు రైతులు. అది అతనికి దక్కిన తర్వాత మార్కెటు ధర తగ్గితే నష్టపోయేది దళారి తప్ప రైతు కాదు. ‘మనం మార్కెట్లో చెల్లించే ధరలో నాలుగో వంతే రైతుకి దక్కుతోంది, మధ్యలో దళారులు వుంటున్నారు. పద్ధతి మార్చేస్తే రైతుకి మొత్తం బెనిఫిట్ వచ్చేస్తుంది’ అని కొందరు మేధావులు వాదిస్తున్నారు. అసలు ఏ వస్తువైనా సప్లయి చైన్ లేకుండా వినియోగదారుడికి చేరుతుందా? సప్లయి చైన్‌కి ఖర్చవకుండా వుంటుందా? ఒక పుస్తకాన్ని ప్రచురించాలంటే దానికి అయిన ఖర్చుకి 3 రెట్లు ధరను కవర్ ప్రైస్‌గా పెట్టాలి. అది కూడా రచయిత దాని మీద బతకటం లేదు కాబట్టి, కేవలం హాబీగా వేస్తున్నాడు కాబట్టి! రైతైతే దాని మీద బతకాలి.
ఈ మేధావి చెప్పే మాటలు మనకు చేరాలన్నా సప్లయి చైన్ వుండాలి. ఆయన టీవీ స్టూడియోకి వచ్చేందుకు కారుకి పెట్రోలు, డ్రైవర్, స్టూడియో నిర్వహణ, సాంకేతిక సిబ్బంది, యాంకర్ జీతాలు, మన యింట్లో కరంటు, టీవీ కనక్షన్ చార్జీలు.. యిలా ప్రతీచోటా ఖర్చులవుతాయి. రైతు ఉత్పాదనల దగ్గరకి వచ్చేసరికే యీ లెక్కలు వేస్తున్నారు. హోటల్లో మసాలా దోసెకు రూ.100 యిస్తున్నాం. దాని అసలు ఖర్చు 10 రూ.లు కూడా వుండదు కదా! ఇంకొందరి వాదన ఏమిటంటే రైతులకు యిప్పటికే ఇన్‌కమ్ టాక్స్‌లో బెనిఫిట్స్ యిచ్చేసి నష్టపోతున్నాం. ఇప్పుడు కార్పోరేట్లతో ఒప్పందం కుదుర్చుకుంటే దాని మీద జిఎస్‌టి వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అని. రైతులకు యిన్‌కమ్ టాక్స్ బెనిఫిట్ అంటారు. 85% మంది బక్క రైతులు అయినప్పుడు వాళ్లకు యిదెలా ఉపయోగపడుతోంది? రైతుల పేర ఆదాయపు పన్ను మినహాయింపులు పొందుతున్నవారెవరు? ఫామ్‌హౌస్ చూపించి, టాక్స్ బెనిఫిట్ పొందుతున్న ధనికులు. కెసియార్ రైతుట! ఏటా కోటి రూపాయల ఆదాయమట!! నమ్మాలా?
ఈ స్కీము వలన లాభపడేది బ్లాక్‌మనీని అగ్రికల్చర్ యిన్‌కమ్‌గా చూపించే ధనికులు, రాజకీయనాయకులు. మధ్యతరగతిని చావగొట్టే బదులు, ఆర్థికమంత్రి యీ స్కీము ఎత్తివేసి ఆదాయపు పన్ను వసూలు చేయవచ్చుగా! యుకెలో రైతు కాకపోతే సాగుభూమి కొనలేరట. ఇక్కడా అలాటి రూలు పెడితే మంచిది. బోగస్ రైతులు ఉండరు. లేకపోతే నాలుగు పూలమొక్కలు వేసి, నెలకు లక్ష ఆదాయం అని చూపించేయగలుగుతున్నారు. ఇదే కాదు, బజెట్ వచ్చినపుడు నాకు తెలిసింది. ఇపిఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాలో కోట్లకు కోట్లు దాచుకుని ఇన్‌కమ్ టాక్స్ తప్పించుకుంటున్నారట. 1.23 లక్షల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యుయల్స్ తమ ఖాతాల్లో 2018-19 సం.లో దాచుకున్న మొత్తం రూ. 62,500 కోట్లట. పై వరుసలో వున్న 20 మంది ఖాతాల్లో బాలన్స్ రూ. 825 కోట్లు.
ఒక వ్యక్తి ఖాతాలో రూ. 103 కోట్లు బాలన్స్ వుంది. సగటున చూస్తే వీళ్లకి దాదాపు రూ. 6 కోట్ల బాలన్స్ వుంది. దాని మీద ఏటా రూ.50 లక్షల వడ్డీ వస్తోంది. కానీ వీటి మీద ఆదాయపు పన్ను పడటం లేదు. ఇప్పుడు యీ బజెట్‌లో ఇపిఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ. 2.50 లక్షల కంటె ఎక్కువ డిపాజిట్ చేసినా టాక్స్ బెనిఫిట్ వుండదని ప్రతిపాదించారు. ఇలాటి రూలు యిప్పుడా, యిన్నాళ్లకా రావడం? ఎప్పుడో నెత్తిమీద మేకు కొట్టద్దూ? అపర ధనికులకు ప్రతీ ప్రభుత్వం యిటువంటి మేళ్లు ఎన్ని చేస్తోందో మన దాకా ఎప్పుడూ రావు. వీటి మీద ఆదాయం పోతూన్నా ప్రభుత్వం పట్టించుకోదు కానీ మా ఖర్చులకు సరిపోలేదంటూ, మనందరం వాడే గ్యాస్ సిలిండర్ మీద సబ్సిడీ మాత్రం కోసేస్తూంటుంది. ధనికులకూ, పేదలకూ మధ్య అంతరం పెరిగిపోతోందంటే పెరగదూ!
బిల్లుల గురించి చర్చించడం పూర్తయింది. ఈ సందర్భంగా చదివిన వాటి ద్వారా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమాచారం కొంత పోగుపడింది. అది అప్పుడప్పుడు మీతో పంచుకుంటాను.
ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2021)
[email protected]