కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఎగుస్తున్న యువకెరటం బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. వైసీపీ యువనేతగా, పంచ్ డైలాగ్‌లతో, ప్రవాహాన్ని తలపించే ప్రసంగాలతో బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. వైఎస్ జగన్‌కు ఇష్టుడైన యువనేతగా సిద్ధార్థ్ పేరు పొందారు.
పంచాయతీ ఎన్నికల్లో తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తనయ శబరితో నువ్వా, నేనా అనే రీతిలో తలపడి …చివరికి గెలుపు సొంతం చేసుకుని సొంతూళ్లో తన పట్టు ఏంటో లోకానికి చాటి చెప్పాడు. సొంత ఊళ్లో పెదనాన్న ప్రభావం ఏమీ లేదని తేల్చి చెప్పి, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని చావు దెబ్బ తీశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి బైరెడ్డి సిద్ధార్థ్ స్వస్థలం. బైరెడ్డి సిద్ధార్థ్ అబ్బ (నాయన తండ్రి) శేషశయనారెడ్డి మూడో తరం రాజకీయ వారసుడిగా సిద్ధార్థ్ వచ్చాడు. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి శేషశయనారెడ్డి (రెండుసార్లు కాంగ్రెస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థి) మూడుసార్లు, ఆయన తనయుడు రాజశేఖరరెడ్డి రెండుమార్లు టీడీపీ తరపున గెలుపొందారు. 1999లో చివరి సారిగా బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో గౌరు సుచరిత చేతిలో ఓడిపోయారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్‌డ్ కేటగిరీకి కేటాయించారు. దీంతో అగ్రవర్ణాల పెత్తనానికి చెక్ పెట్టినట్టైంది. ఈ నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి టీడీపీ నుంచి బయటికొచ్చారు. కొంత కాలం కాంగ్రెస్‌లో కొనసాగారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉంటున్నారు.
రాజశేఖరరెడ్డి కుమార్తె డాక్టర్ శబరి రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటున్నారు. బైరెడ్డి రాజశేఖరరెడ్డి వారసుడిగా, అనుచరుడిగా రాజకీయాల్లో వచ్చిన సిద్ధార్థ్‌రెడ్డి పెదనాన్నతో విభేదాల కారణంగా వేరే దారి చూసుకున్నాడు. బైరెడ్డి సిద్ధార్థ్ పుట్టి , పెరిగింది కడప. కానీ రాజకీయ వేదికగా తన స్వస్థలాన్నే ఎంపిక చేసుకున్నాడు.
రాజకీయంగా మన, తన అనే బేధాలు చూసుకోకుండా పెదనాన్నతో పాటు తన అక్క శబరిపై సందర్భోచితంగా విరుచుకు పడుతున్నాడు. అలాగే సిద్ధార్థ్ కూడా రౌడీ అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను బైరెడ్డి కుటుంబం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా బైరెడ్డి సొంత గ్రామానికి సంబంధించి రెండు పంచాయతీల్లో ఎన్నికలు ఇటు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, శబరితో పాటు సిద్ధార్థ్ కూడా సవాల్‌గా తీసుకున్నారు.
పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందడం విశేషం. ఈ రెండు చోట్ల కూడా భారీ ఆధిక్యతలు రావడంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి , ఆయన తనయ శబరికి సొంతూళ్లో పట్టులేదని తేలిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాత ముచ్చుమర్రి పంచాయతీ సర్పంచ్‌గా ఆంజనేయులు ఏకంగా 831 ఓట్లు, కొత్త ముచ్చుమర్రి సర్పంచ్‌గా రాధమ్మ 650 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే పాత ముచ్చుమర్రిలో 12 వార్డులకు గాను 11 వార్డుల్లో వైసీపీ మద్దతుదారులు , కొత్తముచ్చుమర్రిలో 10 వార్డుల్లోనూ వైసీపీ మద్దతుదారులే గెలుపొందడం విశేషం.
ఈ రెండు పంచాయతీల్లో పెదనాన్న రాజశేఖరరెడ్డి, అక్క శబరిపై పరోక్షంగా బైరెడ్డి సిద్ధార్థ్ విజయం సాధించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పెదనాన్న, అక్కపై తన పంతాన్ని సిద్ధార్థ్ నెగ్గించుకుని రాజకీయ ఊడలు మరింత బలోపేతం చేసుకుంటున్నాడని చెప్పక తప్పదు.