టీడీపీ అధినేత చంద్రబాబుకు కంచు కోటలా ఉన్న కుప్పం కూసాలు కదిలిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి డేంజర్ బెల్ మోగించాయి. మూడో విడతలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో నిన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ ఫలితాలపై సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠం నెలకుంది.
చంద్రబాబు ఆందోళనే నిజమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహం ఫలించింది. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ మద్దతుదారులు 75 పంచాయతీల్లోనూ, టీడీపీ మద్దతుదారులు కేవలం 14 పంచాయతీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి 14, టీడీపీకి 75 స్థానాలుండేవి. ఏడేళ్లు తిరిగే సరికి సీన్ రివర్స్ అయ్యింది.
కుప్పం పంచాయతీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు రావడంతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. టీడీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. జగన్ సంక్షేమ పథకాలు ప్రజల్లో బలమైన ముద్ర వేశాయని చెప్పేందుకు కుప్పం పంచాయతీ ఫలితాలే నిదర్శనమని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి తీరుతామని వైసీపీ నేతలు శపథం చేస్తున్నారు.
1989 ఎన్నికలు మొదలుకుని చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన అక్కడి నుంచి ఏడుసార్లు గెలుపొందారు. 1989లో నియోజకవర్గ ఓట్లు 1,33,954 ఉండగా 99,605 పోల్ అయ్యాయి. అప్పట్లో ఆయన 24,622 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు ఆ ఓట్లు రెట్టింపు అయ్యాయి. 2014లో వైసీపీ అభ్యర్థి , ఐఏఎస్ అధికారి చంద్రమౌళిపై 47,121 ఓట్ల మెజార్టీతోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయనపైనే 30,722 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు గెలుపొందారు.
2014 నుంచి 2019కి వచ్చే సరికి చంద్రబాబు గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది. ఏకంగా 16,399 ఓట్లు తగ్గిపోవడాన్ని గమ నించొచ్చు. ఒకట్రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకపడి పోవడం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరిగినప్పటికీ, అవి బలపరిచిన అభ్యర్థులే రంగంలో నిలిచారు.
కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ బలంగా పాతుకుపోవడం టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించడంతో అధికార వైసీపీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.
ఇదే సందర్భంలో టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పడిపోయే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు చంద్రబాబు పార్టీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడంతో పాటు పీఏలకు బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది.
పీఏలు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తుండడం వల్లే ఈ రోజు ఇలాంటి ఫలితాలను చవి చూడాల్సి వచ్చిందని టీడీపీ నేతలు వాపోతున్నారు. మొత్తానికి కుప్పం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో వైసీపీ అద్భుతాలు సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.