మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల్లో.. కుప్పం ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఆ నియోజకవర్గం పరిధిలోని 89 పంచాయతీలకు గానూ.. 74 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనే వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం పరిధిలో టీడీపీ మద్దతుదారులు పంచాయతీ ప్రెసిడెంట్లుగా ఎన్నికైనది కేవలం 14 పంచాయతీల్లో అని, మరో పంచాయతీలో తటస్తుడు ఎన్నికైనట్టుగా సమాచారం.
కుప్పంలో చంద్రబాబు నాయుడి ప్రభ చాలా వరకూ తగ్గిపోయిందనేది మాత్రం సార్వత్రిక ఎన్నికలతోనే స్పష్టం అయ్యింది. ధీటైన అభ్యర్థి ఎదురుగా లేనప్పటికీ చంద్రబాబు నాయుడి మెజారటీ గత ఎన్నికల్లోనే ఆవిరైంది. అది కూడా ఆయన సీఎం హోదాలో ఎన్నికలను ఎదుర్కొంటే… తను ప్రధాని కాబోయే స్థాయిలో ప్లాన్లు వేసుకుంటే.. కుప్పంలో రెండో రౌండ్ లో ఆయన వెనుకబడ్డారు! ప్రతిపక్ష నేత అయ్యాకా చంద్రబాబు నాయుడి ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యిందే తప్ప పెరిగింది ఏమీ లేదు.
ఈ క్రమంలో కుప్పంలో తెలుగుదేశం కూసాలు పూర్తిగా కదిలిపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అంతే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చి, చంద్రబాబు తీరును వైఎస్ జగన్ ప్రభుత్వం చాటి చెప్పింది. అన్నేళ్లు సీఎంగా ఉంటూ.. కనీసం సొంత నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మార్చలేని రీతిలో చంద్రబాబు నాయుడు వ్యవహరించారని స్పష్టం అయ్యింది.
గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి కుప్పం సరైంది కాదని స్పష్టం అవుతోంది. త్వరలోనే కుప్పం మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాంటి ఫలితాలు వస్తాయనే దాన్ని బట్టి.. మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక ఇదే సమయంలో.. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంపై వరస కంప్లైంట్లు చేస్తున్నారు. ఒక సీఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పని చేశారని ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. అయినా ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో.. ఒక సీఐ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పని చేస్తే, ఒక రౌడీ షీటర్ బయట ఉన్నంత మాత్రాన ఫలితాలు మారిపోతాయా? ఈ కంప్లైంట్లతో చంద్రబాబు నాయుడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న చోట తను ఎంత వీకో చాటుకోవడం కాదా?