ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని ప్రకటించారు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మూడో విడతలో చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకోలేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటి వరకూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అంతా ప్రశాంతంగా జరిగినట్టుగా నిమ్మగడ్డ ప్రకటిస్తూ వచ్చారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అయితే అసలు చెదురుమదురు ఘటనలు కూడా జరగలేదని ఆయన ప్రకటించడం గమనార్హం. తొలి రెండు విడతల విషయంలో చిన్న చిన్న సంఘటనలు అయినా చోటు చేసుకున్నాయని పేర్కొన్న నిమ్మగడ్డ, మూడో విడతలో మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు.
పోలింగ్ విషయంలో ప్రజలను కూడా ఆయన అభినందించారు. భారీ శాతం పోలింగ్ తో ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థను విజయవంతం చేశారన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రజలను అభినందిస్తున్నట్టుగా ఆయన వివరించారు.
తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం నచ్చని స్పందన ఇది అని వేరే చెప్పనక్కర్లేదు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వాదిస్తోంది టీడీపీ. చంద్రబాబు నాయుడు అయితే.. తన సొంత నియోజకవర్గంలో చిన్న చిన్న వాళ్ల పేర్లను సైతం ప్రస్తావించారు.
ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఊర్లలో చోటామోటా పేర్లను ప్రస్తావించి, పలానా వాళ్ల వల్ల తన నియోజకవర్గంలో ఎన్నికలు అప్రజాస్వామ్యికం అయ్యాయంటూ.. కంప్లైంట్ చేయడం కామెడీగా ఉంది.
ఒక పంచాయతీకి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కంప్లైంట్ చేసిన తరహాలో చంద్రబాబు నాయుడు స్పందించారు. పంచాయతీ ఎన్నికల అభ్యర్థి తరహాలో ఆయన రియాక్ట్ అయ్యి, కొన్ని పేర్లను చెప్పడం ఈ ఎన్నికల వ్యవహారంలో హైలెట్.
పంచాయతీ ఎన్నికలకు మెనిఫెస్టోను విడుదల చేయడంతో కామెడీ మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు, కుప్పం పరిధిలోని కొంతమంది వ్యక్తుల మీద ఎస్ఈసీకి ఫిర్యాదు చేసి.. ఆ ఎపిసోడ్ ను కొనసాగించారు!