ఇదేంది స్వామీ.. పొద్దున్నే 5 గంటలకే రేషన్!

ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ చేయాలనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. రేషన్ షాపుల వద్ద క్యూలైన్లు లేకుండా, రెక్కాడితే డొక్కాడని బీదా బిక్కీ  ఓ పూట అంతా పని మానుకుని షాపుల ముందు…

ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ చేయాలనేది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. రేషన్ షాపుల వద్ద క్యూలైన్లు లేకుండా, రెక్కాడితే డొక్కాడని బీదా బిక్కీ  ఓ పూట అంతా పని మానుకుని షాపుల ముందు పడిగాపులు పడకుండా ఉండటానికి ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన పథకం ఇది.

అయితే అధికారుల అత్యుత్సాహం దీన్ని అభాసుపాలు చేసేలా కనిపిస్తోంది. టార్గెట్లు రీచ్ కావడం కోసం ఒకే వీధిలో రేషన్ ట్రక్ నిలబెట్టి లబ్ధిదారులతో క్యూ కట్టిస్తున్నారు. ఎండలోనే నిలబెడుతూ విసుగు తెప్పిస్తున్నారు. ఇక సిగ్నల్ సమస్యలు ఉండనే ఉన్నాయి. 

దీనికితోడు.. ఎన్నికల కమిషన్ కారణంగా గ్రామాల్లో కాస్త ఆలస్యంగా రేషన్ సరకుల పంపిణీ మొదలు కావడంతో జిల్లా అధికారులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉదయాన్నే 5 గంటలకల్లా రేషన్ ట్రక్ ఊరిలో ఉండాలని, 5గంటల 10 నిమిషాలకి తొలి కార్డుకి బియ్యం ఇవ్వాల్సిందేనని టార్గెట్లు పెట్టేశారు.

5 గంటలకి రేషన్ అంటే నవ్వుతారేమో..

ఉదయాన్నే ఆరు గంటలకి పింఛన్ సొమ్ము అవ్వా తాతలకి ఇచ్చారు కదా, 5 గంటలకి రేషన్ సరకులు ఇస్తే ఇంకాస్త మంచిపేరు వస్తుందేమోనని అధికారులు తాపత్రయ పడుతున్నారు. ఊరిలో 5 గంటలకి ఇంటిముందుకొచ్చి రేషన్ సరకులు ఇస్తాం బయటకు రండి అంటే అది ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎవ్వరూ 5 గంటలకు లేవడం లేదు. అలాంటి టైమ్ లో ఇంటింటికెళ్లి తలుపు కొడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. రోజువారీ కూలికి వెళ్లే వారి ఇళ్లల్లో కూడా ఉదయం 6-7 గంటల మధ్య రేషన్ ఇస్తే సరిపోతుంది. అలాంటిది అందరి ఇళ్లకు పొద్దున్నే రేషన్ అంటే కాస్త కామెడీగానే ఉంటుంది.

ట్రక్ డ్రైవర్ల పరిస్థితి ఏంటి..?

ఉదయాన్నే ఐదింటికి వెళ్లి రేషన్ సరకులు పంపిణీ చేయాలంటే ట్రక్ డ్రైవర్ సరంజామా ఎప్పటినుంచి సిద్ధం చేసుకోవాలి? రేషన్ డీలర్ ఇంటిలో సరకు దించుకోవడం, ట్రక్ లో వేసుకోవడం, అక్కడినుంచి ఊరిలోకి వెళ్లడం.. ఇవన్నీ తెల్లవారుఝామున 3గంటలకి మొదలు పెట్టాల్సి ఉంటుంది. దీన్ని పని ఒత్తిడి అంటారా లేదా? ఇలాంటి ఒత్తిడి వల్లే ఇటీవల వాలంటీర్లు జీతాలు పెంచాలంటూ రోడ్డెక్కారు. అధికారుల అత్యుత్సాహమే వాలంటీర్ల ఆందోళనకి ప్రధాన కారణం.

ఇప్పుడు కూడా ట్రక్ డ్రైవర్ల వ్యవహారంలో ఇదే అత్యుత్సాహం అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది. కరువుకాటకాల రోజుల్లో టార్గెట్లు పెట్టి మరీ పనిచేయమంటే అదో లెక్క.. కానీ ఎలాంటి ఉపద్రవాలు లేని సాధారణ పరిస్థితుల్లో కూడా ఐదింటికే రేషన్ పంపిణీ అంటే కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది. 

రేషన్ పంపిణీ చేసే సిబ్బందే కాదు, తీసుకునే లబ్ధిదారులు కూడా సిద్ధంగా లేని సమయం అది. ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయాలపై అధికారులు పునరాలోచిస్తే మంచిది.

ఎవరి సత్తా ఏమిటో తెలిసే రోజులొస్తున్నాయ్

చంద్రబాబుకు బుర్ర‌ చెడినట్టుంది