త్వరలోనే కోలీవుడ్ ఎంట్రీ ఉంటుందని గతేడాది లాక్ డౌన్ టైమ్ లోనే ప్రకటించాడు హీరో రామ్. అతడి స్టేట్ మెంట్ తో పాటే పుకార్లు కూడా ఊపందుకున్నాయి. లింగుసామి దర్శకత్వంలో రామ్ సినిమా ఉంటుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం నడుస్తోంది. ఇప్పుడదే నిజమైంది.
లింగుస్వామి దర్శకత్వంలో తన తొలి స్ట్రయిట్ తమిళ సినిమాను ప్రకటించాడు రామ్. తెలుగు-తమిళ భాషల్లో ద్విభాషాచిత్రంగా రాబోతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నాడు.
ప్రస్తుతానికైతే ఇదే మేటర్. సినిమా జానర్ ఏంటి? టైటిల్ ఏంటి? హీరోయిన్ ఎవరు? లాంటి విషయాలు ఇంకా బయటకురాలేదు. కాకపోతే ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి షెట్టి హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరోవైపు ఈ సినిమాపై మరో ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. గతంలో బన్నీతో ఇలానే బై-లింగ్వల్ సినిమా ప్లాన్ చేశాడు లింగుసామి. ఆ సినిమాను అప్పట్లో ఘనంగా ప్రకటించారు కూడా. కానీ అది కాస్తా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో రామ్ హీరోగా లింగుసామి సినిమా సెట్ చేశాడనే టాక్ నడుస్తోంది.