ఎమ్బీయస్‌: విచారణ అడ్డుకుంటున్న గడ్కరీ

        Advertisement   ఉత్తరాఖండ్‌ను కాంగ్రెసు పాలించే రోజుల్లో ఒక స్కామ్‌ జరిగింది. హరిద్వార్‌-బరేలీ మధ్య వున్న నేషనల్‌ హైవే 74 విస్తరణలో భాగంగా భూయజమానులకు నష్టపరిహారం యిచ్చి కొంత…

       

 

ఉత్తరాఖండ్‌ను కాంగ్రెసు పాలించే రోజుల్లో ఒక స్కామ్‌ జరిగింది. హరిద్వార్‌-బరేలీ మధ్య వున్న నేషనల్‌ హైవే 74 విస్తరణలో భాగంగా భూయజమానులకు నష్టపరిహారం యిచ్చి కొంత భూమి సేకరించవలసి వచ్చింది. వ్యవసాయ భూములకు యచ్చే పరిహారం కంటె వ్యవసాయేతర భూముల కిచ్చే పరిహారం దాదాపు 20 రెట్లు ఎక్కువ వుంటుంది. భూయజమానులకు ఎక్కువ పరిహారం యిప్పించి మధ్యలో తాము కమిషన్‌ కొట్టేద్దామనుకున్న అధికారులు పాత తేదీలతో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా చూపించి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే కుమావూ కమిషన్‌ వేశారు. రుద్రపూర్‌, కాశీపూర్‌, బాజ్‌పూర్‌, సితార్‌గంజ్‌ తహసీళ్లలో వున్న 11 గ్రామాల్లో యీ ఫ్రాడ్‌ జరిగిందని కమిషన్‌ తేల్చింది. దీనిపై ప్రతిపక్షంలో వున్న బిజెపి చాలా ఆందోళన చేసింది. ఎన్నికల ప్రచారంలో దీన్ని ఆయుధంగా వాడుకుంది. చివరకు ఎన్నికల ఫలితాలు మర్నాడు రాబోతాయనగా మార్చి 10న, తన ఓటమి తప్పదని గ్రహించిన కాంగ్రెసు ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ దీనిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయించాడు. భూస్వభావం మార్చగల అధికారం సబ్‌డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డిఎమ్‌)లకు వుంటుంది.  నష్టపరిహారం ఎంతో నిర్ణయించే అధికారం స్పెషల్‌ ల్యాండ్‌ ఎక్విజిషన్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎల్‌ఏఓ)కు వుంటుంది. ఈ పరిహారం లెక్కలను తనిఖీ చేసి, నిధులు విడుదల చేసే అధికారం కేంద్ర ప్రభుత్వపు రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎచ్‌ఏఐ) అధికారులకు వుంటుంది. ఎందుకంటే హైవేస్‌ను అభివృద్ధి పరచి, మేన్‌టేన్‌ చేసే పని ఎన్‌ఎచ్‌ఏఐ దే! అందువలన యీ మూడు స్థాయిల అధికారులకు వ్యతిరేకంగా యీ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడం జరిగింది. 

ఎన్నికలలో కాంగ్రెసు ఓడిపోయి బిజెపి నెగ్గి, త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రిగా వచ్చాడు. అవినీతి నిర్మూలనే నా లక్ష్యం అని చాటుకుని అధికారంలోకి వచ్చిన వారానికే మార్చి 25న ఐదుగురు ఎస్‌డిఎమ్‌లను, ఇద్దరు ఎస్‌ఎల్‌ఏఓలను సస్పెండ్‌ చేసేశాడు. ఎన్‌ఎచ్‌ఏఐ అధికారులు కేంద్ర పరిధిలోకి వస్తారు కాబట్టి వారిని సస్పెండ్‌ చేయలేదు కానీ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాడు. తన శాఖకు సంబంధించిన అధికారులపై కేసులు మోపడం కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీకి నచ్చలేదు. ఏప్రిల్‌ 5 న ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ ''మేము ఉత్తరాఖండ్‌లో రోడ్ల విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విస్తరణ పనులు చేపట్టాం. భూస్వభావం,  నష్టపరిహారం నిర్ణయించేది రాష్ట్ర అధికారులు మాత్రమే. దీనిలో కేంద్ర అధికారులను యిరికించడం వలన వారి నైతిక స్థయిర్యం దెబ్బ తింటుంది. ప్రాజెక్టులు నిర్వహించడం కష్టతరమౌతుంది. ఇలా అయితే మీ రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలా వద్దా అని పునరాలోచించుకోవలసి వస్తుంది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం వెతకండి.'' అని బెదిరింపు ధోరణి ప్రదర్శించారు. కానీ ముఖ్యమంత్రి రావత్‌ బెదరలేదు. పర్యవేక్షించి, స్క్రూటినైజ్‌ చేయవలసినవారు వారి బాధ్యత విస్మరిస్తే దండనీయులే, అవినీతి పట్ల మాది జీరో టాలరెన్స్‌ అని ప్రకటించి ముందుకు సాగాడు. 

స్థానిక మీడియా గడ్కరీ లేఖను బహిర్గతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లో ఎన్‌ఎచ్‌ఐఏ అధికారులైన రుద్రాపూర్‌ ప్రాజెక్టు డైరక్టరు, అతని అసిస్టెంట్ల పేర్లు చేర్చడంతో దాని చైర్మన్‌ వైయస్‌ మాలిక్‌ మే 26 న ఉత్తరాఖండ్‌ చీఫ్‌ సెక్రటరీకి 'మా వాళ్లకు ఏ సంబంధం లేదు కాబట్టి వాళ్ల పేర్లు చేర్చడం పొరబాటు. నష్టపరిహారం గురించి వివాదాలు లేవనెత్తితే అనవసరంగా జాప్యమవుతుంది కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోనక్కరలేదు అని మా మంత్రిత్వశాఖ నుండి ఆదేశాలున్నాయి కాబట్టి మా వాళ్లు అభ్యంతరాలు లేవనెత్తలేదు. మీరు కేసును మళ్లీ పరిశీలించి వాళ్ల పేర్లు తీసేయండి. లేకపోతే మీ రాష్ట్రంలో మా అధికారులను నియమించడం, కొనసాగించడం కష్టమవుతుంది.' అని లేఖ రాశాడు. చీఫ్‌ సెక్రటరీ జవాబివ్వకపోవడంతో ఎన్‌ఎచ్‌ఐఏ ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ఆ ఎఫ్‌ఐఆర్‌ను ఛాలెంజ్‌ చేస్తూ పిటిషన్‌ పడేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం రాష్ట్రాధికారులను నివ్వెరపరుస్తోంది. 'సిబిఐ విచారణకు ఆదేశించాం కదా. ఎన్‌ఎచ్‌ఐఏ అధికారులకు బాధ్యత లేదని తెలిస్తే వాళ్ల పేర్లు తీసేస్తారు. ఈ లోపునే అంత తొందరెందుకు? రాష్ట్రం-కేంద్రం మధ్య ఘర్షణగా చిత్రీకరించడమెందుకు?' అని అడుగుతున్నారు. 

ఎన్‌ఎచ్‌ఐఏ అధికారులు ఎన్నడూ అవినీతి యెరుగరని అనడానికి వీల్లేదు. అమెరికాలోని బోస్టన్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేసే సిడిఎమ్‌ స్మిత్‌ అనే కనస్ట్రక్షన్‌ ఇంజనీరింగు కంపెనీ కాంట్రాక్టులు పొందడానికి ఎన్‌ఎచ్‌ఐఏ అధికారులకు 2011-15 మధ్య రూ.7.59 కోట్లు లంచంగా యిచ్చినట్లు అమెరికన్‌ కోర్టులో ఒప్పుకుంది. 2014 మే వరకు కాంగ్రెసు ప్రభుత్వం వుంది. తర్వాత బిజెపి ప్రభుత్వంలో ఏడాది పాటు అవినీతి కొనసాగి, చివరకు 2015లో ఆ కంపెనీని బ్లాక్‌లిస్టు చేశారు. ఈ లంచాలపై స్వతంత్ర విచారణకు అప్పగించి వుండాల్సింది. కానీ నితిన్‌ గడ్కరీ డిపార్టుమెంటులో అంతర్గత విచారణకు మాత్రమే ఆదేశించాడు. గడ్కరీపై గతంలో అవినీతి ఆరోపణలు రావడం, వాటి కారణంగా బిజెపి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం కూడా జరిగింది. గడ్కరీ భాగస్వామిగా వున్న కంపెనీకి ప్రభుత్వం నడిపే కంపెనీ ఋణం యివ్వడాన్ని కాగ్‌ తన 2015 నివేదికలో తప్పు పట్టింది. ఇటువంటి నేపథ్యం గల గడ్కరీ యిప్పుడీ విచారణ అడ్డుకోవడాన్ని హర్షించని రావత్‌ అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకు వెళుతున్నాడు. (ఫోటో –  రావత్‌, గడ్కరీ)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2017) 

[email protected]