గాంధీగారు బతికి వుండగా ‘హాఫ్ నేకెడ్ ఫకీర్’ అని ఈసడించిన బ్రిటిషు నాయకులు ఈ రోజు భారతదేశంతో పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా వారి పార్లమెంటు ప్రాంగణంలో గాంధీగారి కంచు విగ్రహాన్ని పెడదామని నిర్ణయించారు. ప్రపంచంలో కల్లా అతి పురాతనమైన ప్రజాస్వామ్య సంస్థ అయిన ఈ పార్లమెంటు ప్రాంగణంలో ఇప్పటికే 12 గురు దిగ్గజాల విగ్రహాలున్నాయి. తమ దేశానికి ప్రధానులుగా పని చేసిన బెంజమిన్ డిజ్రాయిలీ, విన్‌స్టన్ చర్చిల్ వంటి వారితో బాటు అబ్రహాం లింకన్, నెల్సన్ మండేలాలవి కూడా.. ! వాటికి ఇప్పుడు గాంధీ విగ్రహానికి చేరుస్తున్నారు. ఇంగ్లండుకు చెందిన అనేకమంది ప్రముఖులు ఎందరో వుండగా బ్రిటిషు సామ్రాజ్యాన్ని వ్యతిరేకిస్తూ పోరు సాగించిన గాంధీ విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చుతో పెట్టాలా? – పైగా పార్లమెంటుకు రెండు మైళ్ల దూరంలో టావిస్టాక్ స్క్వేర్‌లో ఇప్పటికే ఆయన విగ్రహం వుండగా..!? అని కొందరు ైబ్రిటన్ పౌరులు అభ్యంతరం తెలపడంలో ఆశ్చర్యం పెద్దగా లేదు కానీ, మన భారతీయ సంఘాల్లో కొన్ని వాటితో గొంతు కలపడం విచిత్రం.
బ్రిన్‌లో పని చేసే సిఖ్ ఫెడరేషన్ ప్రచారం కోసం చేసే తన వింత వింత ప్రకటనలతో ఇప్పటికే వార్తల్లోకి ఎక్కింది. దానికి ప్రస్తుతం చైర్మన్‌గా వున్న అమ్రీక్ సింగ్ బ్రిటన్ కల్చర్ సెక్రటరీకి ఉత్తరం రాస్తూ ‘‘గాంధీ ఒక వర్ణవివక్ష పాటించే వ్యక్తి. (తెల్లవారికి వ్యతిరేకంగా పోరాడాడన్న భావమేమో), విపరీతశృంగారాన్ని ఆచరించిన వ్యక్తి, చిన్నపిల్లలను చెడగొట్టినవాడు (బ్లేటెంట్ రేసిస్ట్, సెక్సువల్ వియర్డో, చైల్డ్ అబ్యూజర్), అంతేకాదు యుకెలో ఇప్పుడు నిషేధించిన కులవ్యవస్థపై విశ్వాసం కలవాడు. అతని విగ్రహాన్ని పెట్టడం అనవసరం.’’ అన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఫిలిప్ జాక్సన్ అనే శిల్పికి విగ్రహం తయారుచేయమని పురమాయిస్తే ఆ పని ఒప్పుకోవద్దు అని అతనికి కూడా ఉత్తరం రాశాడు. అసలు ఈ శిఖ్కు సంస్థల్లోనే గాంధీ పేరు గురించి కాస్త గందరగోళం వున్నట్టుంది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 సం॥ జరిగిన సందర్భంలో దాన్ని జరిపించిన ఇందిరా గాంధీపై కోపంతో ఇటీవల బ్రిటన్ శిఖ్కులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వాటిల్లో భాగంగా లీసెస్టర్‌లో వున్న గాంధీ విగ్రహాన్ని ఎవరో విరక్కొట్టారు – ఆ గాంధీ, ఈ గాంధీ ఒకరే అనుకున్నారో ఏమో!
శిఖ్కులకు తోడయిన సంస్థ – ఇండో బ్రిటిష్ హెరిటేజ్ ట్రస్ట్. దానికి అధినేతగా వున్న డా॥ కుసుమ్ వడ్‌గామా బ్రహ్మచర్య ప్రయోగాల విషయంలో గాంధీని తప్పుపట్టారు. ఆ ప్రయోగాలలో భాగంగా గాంధీ నగ్నంగా వున్న బాలికల (వారిలో తన మనుమరాలి వరస అమ్మాయి కూడా వుండేది) మధ్య నిద్రపోయేవాడని అందరికీ తెలిసిన విషయమే. ఆయన బతికి వుండగానే వాటిపై విమర్శలు వచ్చాయి. తన దీక్షకు తాను పెట్టుకుంటున్న పరీక్ష అని గాంధీ చెప్పేవాడు. వినడానికే చాలా ఎబ్బెట్టుగా వుండే ఈ చర్యల పట్ల గాంధీ అనుయాయులే ఇబ్బంది పడేవారు. ఎవరు చెప్పినా ఆయన వినలేదు. అది ఒక వికారం అనుకుని సర్దిచెప్పుకున్నారు. గాంధీలోని అనేక సద్గుణాల మధ్య, ఇలాంటి అభావ చేష్టలు విస్మరించారందరూ. ఇప్పుడు ఈ కుసుమ్ వాటిని పట్టుకున్నారు. ‘‘మన పాఠ్యపుస్తకాలు చదివి ఈ గాంధీగారిని నేనూ నెత్తిన పెట్టుకునేదాన్ని. ఆయన పేరు మీద జరిగే ఉత్సవాలకు ఎంతో సాయపడేదాన్ని కూడా. కానీ ఈ ప్రయోగాలు విన్న తర్వాత భారతీయ మహిళల పట్ల గాంధీకి ఎంత చిన్న చూపుందో అర్థమైంది. అలాంటి ప్రయోగాలలో ఆయన నిబ్బరంగా వుండగలిగాడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆయన మనసు చెదిరి ఏదైనా జరిగి వుంటే ఆ అమ్మాయిల గతి ఏమిటి? ఆడవాళ్ల పట్ల అంత చులకనా? అందుకే ఆయన విగ్రహాన్ని పెట్టకూడదంటున్నాను. పెడితే భారతీయ మహిళలను అవమానించినట్లే!’’ అని ఆవిడ వాదిస్తున్నారు.
దీనికి సమాధానంగా గాంధీ ఫౌండేషన్‌కు చైర్మన్‌గా ఉన్న లార్డ్ భిఖ్కూ పరేఖ్ ‘‘అహింసా మార్గంతో రాజకీయంగా గాంధీ సాధించిన అద్భుత విజయాలను దృష్టిలో పెట్టుకుని విగ్రహం పెడుతూ వుంటే మధ్యలో వ్యక్తిగతమైన ఈ అలవాట్ల గురించి చర్చ ఎందుకు? అక్కడ పెట్టే విగ్రహం గాంధీ పడుక్కున్నట్టో, హరిజన సేవ చేస్తున్నట్లో వుండదు కదా. దండీయాత్రకు ఉద్యమిస్తున్న పోజులో విగ్రహం పెడితే సరి..’’ అన్నాడు. ‘‘అయినా వీళ్లు అభ్యంతర పెడుతున్న బ్రహ్మచర్య ప్రయోగాల్లో అవతలి మహిళలు ఇష్టపడే పాల్గొన్నారు కదా. గాంధీగారు వారిని బలవంతంగా లాక్కుని రాలేదు. ఇద్దరూ కలిసి చేసిన ప్రయోగాలే అవి. వాళ్లు అన్నట్టు అవి బెడిసి కొట్టి వుంటే ఇద్దరూ వాటి ఫలితం అనుభవించేవారు. ఆ విషయం తెలిసే వాళ్లు సిద్ధపడ్డారు. భారతస్వాతంత్య్ర పోరాటంలో అనేకమంది మహిళలను ప్రోత్సహించి, నాయకురాళ్లగా తీర్చిదిద్దిన మహనీయుడు గాంధీ. ఆయనపై మహిళా వ్యతిరేకి మద్ర వేయడం పొరబాటు.’’ అన్నాడాయన. అయినా వీళ్లు వినడం లేదు. ‘‘రాజకీయకోణంలో చూసినా గాంధీ కంటె గొప్పవాళ్లు చాలామంది వున్నారు. బాల గంగాధర్ ఠిళక్, లాలా హర్ దయాల్.. ఇలా ఎవరో ఒకరి విగ్రహం పెట్టవచ్చుగా. అంతెందుకు, బ్రిటన్ పార్లమెంటు ముంగిట్లోనే భారతీయ నాయకుడి విగ్రహం పెట్టాలనుకుంటే 195లో బ్రిటన్ లేబర్ పార్టీ తరఫున తొలి ఆసియన్ ఎంపీగా గణతెకక్కిన దాదాభాయ్ నౌరోజీ విగ్రహం పెట్టవచ్చు. గాంధీది ఎందుకు?’’ అని వాదిస్తున్నారు.
ఎమ్బీయస్ ప్రసాద్