తెలంగాణ నెహ్రూ…!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మొన్నటివరకు అంటే ఆయన సీఎం పీఠం అధిష్టించడానికి ముందువరకు ఆయన పార్టీ వారు, అభిమానులు  ‘తెలంగాణ జాతిపిత’ అంటూ మహాత్మాగాంధీతో పోల్చి కీర్తించారు. భారత దేశానికి స్వాతంత్య్రం కోసం అనేకమంది…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మొన్నటివరకు అంటే ఆయన సీఎం పీఠం అధిష్టించడానికి ముందువరకు ఆయన పార్టీ వారు, అభిమానులు  ‘తెలంగాణ జాతిపిత’ అంటూ మహాత్మాగాంధీతో పోల్చి కీర్తించారు. భారత దేశానికి స్వాతంత్య్రం కోసం అనేకమంది పోరాడినప్పటికీ స్వాతంత్య్రం తెచ్చారనే పేరు గాంధీజీకి దక్కింది కదా…! ఆ కోణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడటానికి కారణం కేసీఆరేనని, ఆయన పుష్కరకాలం సాగించిన పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చిందంటూ  తెలంగాణ జాతిపితగా కీర్తించారు. ఇక అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న తరువాత అభిమానులకు, ఆయన సొంత పత్రిక ‘నమస్తే తెలంగాణ’కు భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ గుర్తుకొచ్చారు. నెహ్రూను నవ భారత నిర్మాత అంటుంటారు. అదేవిధంగా కేసీఆర్ తెలంగాణ నెహ్రూ అని ప్రశింసిస్తున్నారు. బ్రిటిష్ వారి విధానాల నుంచి దేశాన్ని తప్పించి స్వయంపోషకంగా, అభివృద్ధికరంగా మార్చడానికి నెహ్రూ పునాదులు వేశారని, అదేతీరుగా కేసీఆర్ కూడా ఆంధ్రుల చేతిలో దోపిడీకి గురైన తెలంగాణను అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేస్తున్నారని అభిమానుల ఉవాచ. 

ఏం చేయలేదు…ఎంతో చేశాం

ఈ వంద రోజుల్లో కేసీఆర్ ఎంతో దూకుడుగా వ్యవహరించారు. ఆయన స్పీడు చూసి అనేకమందికి కళ్లు తిరిగాయి. కొందరు విశ్లేషకులు కేసీఆర్ వేగం చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై పెదవి విరిచారు కూడా. ఈమధ్యే వంద రోజులు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని బీజేపీ నాయకులు కితాబు ఇస్తే మన్మోహన్ సింగ్ విధానాలనే కొనసాగిస్తున్నారని, కొత్తదనం ఎక్కడుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కేసీఆర్ విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇది సహజమే. మెదక్ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల ముందు వరకూ కాంగ్రెసు, బీజేపీ, టీడీపీ కేసీఆర్‌పై పెద్దగా విమర్శలు చేయలేదు. అడపాదడపా చిన్నాచితక వ్యాఖ్యలు మినహా ఆయనపై పెద్ద ఎత్తున ‘మాటల దాడి’ చేసిన దాఖలాలు లేవు. కాని మెదక్ ఉప ఎన్నిక ప్రచారంలో అన్ని పార్టీల వారు విరుచుకుపడ్డారు. కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. ఇందుకు టీఆర్‌ఎస్ నాయకులూ దీటుగానే సమాధానమిచ్చారు. తాము ఎంతో చేశామన్నారు. కేసీఆర్‌ను ఆకాశానికెత్తారు. ఆయన్ని మించిన నాయకుడు లేడన్నారు. కేసీఆర్ సొంత మీడియా  స్తోత్రపాఠాలు చదివింది. దాంతోపాటు కేసీఆర్‌తో పెట్టుకుంటే ఏం తిప్పలు పడాల్సివస్తుందో అనుకునే మీడియా కూడా కేసీఆర్ పాలన అద్భుతమంటూ రాశాయి. ‘నమస్తే తెలంగాణ’ తన సంపాదకీయం ‘వందరోజుల స్ఫూర్తి’లో తెలంగాణ జాతి స్వేచ్ఛా గమనానికి దిశానిర్దేశం జరిగిందని రాసింది. ‘ఈ వంద రోజుల పాలనలో అద్భుతమైన అభివృద్ధి జరగకపోవచ్చు’ అంటూనే గత ప్రభుత్వాలను దూషిస్తూ కేసీఆర్ చర్యలను పొగిడింది. సమగ్ర సర్వే, దళితులకు మూడెకరాల భూపంపిణీ, పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించిన ఫాస్ట్ పథకం మొదలైనవాటిని ప్రస్తావించింది. కాని కేసీఆర్ మైనస్ పాయింట్లను ప్రస్తావించలేదు.

హామీలు ఘనం…మరి చేతలు?

కేసీఆర్ అథికారంలోకి రాకముందు, వచ్చాక కూడా అనేక హామీలు ఇచ్చారు. ఆయన దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక హామీ ఇస్తూనే ఉన్నారు. అందులో ఎన్ని సఫలమవుతాయి? ఎన్ని విఫలమవుతాయి? అనేది కాలం గడిచిన కొద్దీ తెలుస్తుంది. ‘జెట్ స్పీడులో కేసీఆర్ ఎక్స్‌ప్రెస్’ అని నమస్తే తెలంగాణ వంద రోజుల ప్రత్యేక సంచికలో వ్యాసం రాసింది. నిజమే…! కేసీఆర్ స్పీడుగా వెళుతున్నారనేది కాదనలేం. ఫాంహౌస్‌లో పడుకొని ఉంటారని ఆయనను ప్రతిపక్షాలు విమర్శిస్తూండేవి. కాని పాలన విషయంలో పడుకొని మాత్రం లేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా అనేక విజయాలు సాధించిన నేతగా పేరుంది. కాని…కేసీఆర్‌కు మంత్రిగా, ఉద్యమ నాయకుడిగా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. అయితేనేం…ఆయనకంటూ ఓ విజన్ ఉంది. తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆ తపనతోనే ఆయన అనేక వరాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అయితే వాటిపై ముందుగా అధ్యయనం చేసి తరువాత ప్రకటిస్తే బాగుంటుంది. కాని ముందు ప్రకటించేసి సాధ్యాసాధ్యాలపై తరువాత అధ్యయనం చేస్తున్నారు. 

రోజుకో నిర్ణయం

కేసీఆర్ తన వంద రోజుల పాలనలో నూటొక్క నిర్ణయాలు తీసుకున్నారు. అంటే రోజుకో నిర్ణయమన్నమాట. ఇది ఆయన స్పీడుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇందులో మంత్రివర్గం తీసుకున్న కీలకమైన నిర్ణయాలు 42 ఉన్నాయి. ఈ నిర్ణయాలన్నీ అమలు  చేస్తనని కేసీఆర్ చెబుతున్నారు. వీటిల్లో అయిదారు నిర్ణయాలు అమలు జరిగాయి కూడా. అయితే ఈ నిర్ణయాలన్నీ యథాతథంగా అమలు చేయడం అంత సులభం కాదు. ఇప్పటికే రుణమాఫీ, దళితులకు మూడెకరాలు భూపంపిణీ, ఫాస్ట్ పథకం అనేక తలనొప్పులు కలిగిస్తున్నాయి. రుణ మాఫీ విషయంలో అనుకున్నది అనుకునట్లు చేయలేకపోవడంతో రైతుల్లో వ్యతిరేకత కూడా వచ్చింది. టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఉత్తర తెలంగాణలోనే రైతులు రోడ్డెక్కారు. ఫీజు రీయింబర్స్‌మెంటుకు సంబంధించిన ఫాస్ట్ పథకం విషయంలో ప్రభుత్వం అనేక మల్లగుల్లాలు పడింది. మార్చి మార్చి అనేక నిబంధనలు పెట్టింది. 1956 స్థానికత నిబంధన చివరకు తెలంగాణవారికి నష్టం కలిగించేవిధంగా తయారైంది. కాబట్టి రోజుకో నిర్ణయం ప్రకటించి స్పీడుగా పనిచేస్తున్నామంటే కాదు. 

బడ్జెటు పెట్టేందుకు భయం

వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం సెప్టెంబరు మొదటివారంలో బడ్జెటు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఏడు లేక పదో తేదీ బడ్జెటు ప్రవేశపెడతామని చెప్పారు కూడా. అన్ని శాఖలు కసర్తు చేశాయి. అంతా అయ్యాక కేసీఆర్ దాన్ని అక్టోబరుకు మార్చారు. కారణం? ఇచ్చిన హామీలకు బడ్జెటులో నిధులు కేటాయించాలి. చేసిన నిర్ణయాలకు బడ్జెటులో కమిట్‌మెంట్ ఉండాలి. దీంతో కేసీఆర్ వెనక్కి తగ్గారనే విమర్శలు వస్తున్నాయి. సెప్టెబంరు 30 తరువాత ప్రభుత్వ అవసరాల కోసం డబ్బు కావాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయాలని కొందరు అధికారులు చెబుతుంటే అలా అక్కర్లేదని, ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బడ్జెటులో నిధులు కేటాయించడానికి ప్రపంచంలో ఎక్కడా జరపని విధంగా ఒకే రోజు నిర్వహించిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే వివరాల క్రోడీకరణ పూర్తికావల్సి ఉంది. అదయిపోతే స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 

‘బలి’ చక్రవర్తి…!

ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా పాలిట ‘బలి’ చక్రవరిలా మారారనే విమర్శలున్నాయి. పురాణాల్లో బలి చక్రవర్తిని విష్ణుమూర్తి వామనుడి రూపంలో పాతాళానికి తొక్కేస్తే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీడియాను బలి తీసుకుంటున్నారు. అందుకు ఆయన ‘తెలంగాణ’ ముసుగును వాడుకుంటున్నారు. ‘నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే సహిస్తానుగాని, తెలంగాణను కించపరిస్తే మెడలు విరిచేస్తా’ అంటున్నారు. కాళోజీ జయంతి రోజు మీడియాను నానా తిట్టారు. జర్నలిస్టులపై లాఠీఛార్జి జరిగింది. చాలారోజుల తరువాత కేసీఆర్ తన నోటికి పని చెప్పారు. ఆయన విశ్వరూపం మరోసారి చూపించారు. మళ్లీ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, టివి9 ఛానెళ్లపై విరుచుకుపడ్డారు. ఈ రెండు ఛానెళ్లను  రోజులుగా (ఈ ఆర్టికల్ రాసేనాటికి) నిషేధించిన ఎంఎస్‌ఓలను అభినందించారు. వారికి శాల్యూట్ చేశారు. జర్నలిస్టులను ‘గరీబ్‌గాళ్లు’ (కేసీఆర్‌కు కోట్ల రూపాయల ఆస్తులున్నాయిగాని జర్నలిస్టుల్లో చాలామంది గరీబులే) అని ఈసడించారు. టీవీ 9 ఛానెల్ శాసనసభ పట్ల, శాసనసభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిందేమోగాని, తాము ఏం పాపం చేశామని ఆంధ్రజ్యోతి మీడియా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆంధ్రజ్యోతితో కేసీఆర్‌కు చాలాకాలం నుంచి వైరం ఉంది. అందులో ఆంధ్రావారి పెట్టుబడులు ఉన్నాయని, వారే దాని నడిపిస్తున్నారని ఆయన అభిప్రాయం. ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేస్తూ ఈమధ్య ‘నమస్తే’లో ఓ వ్యాసం ప్రచురితమైంది. వాస్తవానికి టీవీ9 చర్యను జర్నలిస్టులూ ఖండించారు. ఆ టీవీ యాజమాన్యం కూడా క్షమాపణలు చెప్పింది. అయినా నిషేధం తొలగలేదు. ఈ నిషేధంతో తనకుగాని, ప్రభుత్వానికిగాని సంబంధం లేదని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. కాని అది వాస్తవం కాదు. ఆయన ఎంఎస్‌ఓలకు ఒక్కమాట చెబితే నిషేధం తొలగుతుంది. కాని ఆయన ఆ పని చేయాలనుకోవడంలేదు. కేంద్ర ప్రభుత్వం మొదట్లో హూంకరించినా ఇప్పుడేమీ మాట్లాడటంలేదు. కేసీఆర్‌ను సంతృప్తిపరచడానికి టీవీ9 తెలంగాణ ఛానెల్‌ను ప్రారంభించబోతున్నది. 

నెహ్రూకు కేసీఆర్‌కు పోలిక ఎక్కడ?

కేసీఆర్ అభిమానులు ఆయన్ని తొలి ప్రధాని నెహ్రూతో పోలుస్తున్నా ఆయనకు, ఈయనకు పొంతన లేదు. నెహ్రూకు మీడియా అంటే గౌరవం. తనను కూడా విమర్శించాలని కోరుకునేవారు. తన సొంత పత్రిక ‘నేషనల్ హెరాల్డ్’లోనే నెహ్రూపై విమర్శలు ప్రచురితమయ్యేవి. ఆయనపై కార్టూన్‌లు వచ్చేవి. ఆ కార్టూన్‌లను ఆయన ఎంజాయ్ చేయడమే కాకుండా ఇంట్లో భద్రపరిచేవారని ఆ తరం వారు చెబుతుండేవారు. తనపై కార్టూన్‌లు వేసే కార్టూనిస్టులను ఆయన అభినందించేవారు కూడా. తన పాలనను విమర్శిస్తూ తానే మారు పేరుతో వ్యాసాలు రాసేవారట…! అంతటి విశాల దృక్ఫథం, ఉదారత కేసీఆర్‌కు ఎక్కడివి? ప్రజలను తెలంగాణ సెంటిమెంటుతో ఉంచడమే ఆయన చేస్తున్న పని.

ఎం.నాగేందర్