ఎమ్బీయస్‍: డాన్సింగ్ హీరోలకు ఐడాల్

టైటిల్‌లో డాన్సింగ్ హీరోలు అని ప్రత్యేకంగా అనక్కరలేదేమో! నేటి తెలుగు సినిమాలు చూస్తే, డాన్సు రాకపోతే హీరో కానేరడు అనిపిస్తోంది. ఒకప్పుడు హీరో, హీరోయిన్లంటే పాడడం తెలిసి ఉండాలి. లేకపోతే ఛాన్సు వచ్చేదే కాదు.…

టైటిల్‌లో డాన్సింగ్ హీరోలు అని ప్రత్యేకంగా అనక్కరలేదేమో! నేటి తెలుగు సినిమాలు చూస్తే, డాన్సు రాకపోతే హీరో కానేరడు అనిపిస్తోంది. ఒకప్పుడు హీరో, హీరోయిన్లంటే పాడడం తెలిసి ఉండాలి. లేకపోతే ఛాన్సు వచ్చేదే కాదు. ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చాక పాడకపోయినా ఫర్వాలేదన్నారు. కానీ డాన్సు విషయానికి వస్తే డ్యూప్ వచ్చి డాన్స్ చేస్తానంటే ప్రేక్షకులు ఒప్పుకోరు. పౌరాణిక పాత్ర వేసినా యీ నాటి హీరో డాన్సింగ్, ఫైటింగ్ చేయాల్సిందే, అంతలా డాన్సు ప్రాధాన్యత పెరిగింది. డాన్సులు, స్టెప్పులతోనే చిరంజీవి గిన్నీస్ బుక్‌కు ఎక్కారు. మిథున్ చక్రవర్తి ‘ఐ యామ్మే డిస్కో డాన్సర్’’ అంటూనే దాదా ఫాల్కే ఎవార్డు కొట్టేశాడు. ‘నాటు, నాటు’ అంటూ మన జూనియర్, రామ్‌చరణ్ ఆస్కార్ వాళ్లకూ ఆ డాన్సు అంటించి వచ్చారు. తమ నాట్యకౌశలం ద్వారానే తారా పథాన్ని చేరుకొన్న ఈనాటి తెరవేలుపులు ముందుగా తలచుకోవలసిన వ్యక్తి జీన్ కెల్లీ!

కానీ వీళ్లందరికీ అతని గురించి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ, వాళ్ల డాన్సులకు కోరియోగ్రఫీ చేసిన వారికో, వారి గురువులకో తప్పకుండా తెలిసి ఉంటుంది. నృత్యదర్శకత్వం నుంచి నటనలోకి వచ్చిన కమల్ హాసన్, ప్రభుదేవా వంటి వారు తప్పకుండా కెల్లీ సినిమాలు చూసి నేర్చుకుని ఉంటారు. ఎందుకంటే నృత్యం అతని సహజగుణం కనుక. అప్రయత్నంగా, పసిపాప బోసినవ్వు నవ్వినంత అనాయాసంగా అతని శరీరం నర్తించేది కనుక. వీచకుండా గాలి ఉండలేనట్లే, అతని పాదాలు కూడా అతని ప్రసక్తి లేకుండా కదిలినట్లనిపించేది. అతనికి సమకాలీనులైన డాన్సింగు హీరోలు కూడా అద్భుతంగా నాట్యం చేసేవారు, ‘చేస్తే ఇలాగే చెయ్యాలి’, అని అనిపించేటట్టు!

కానీ కెల్లీలో ఉన్న విశిష్టత ఏమిటంటే అతడు ప్రత్యేకంగా పనిగట్టుకొని డాన్స్ చేసినట్టు అనిపించదు. ‘నిత్య జీవితంలో నడవటానికి బదులు నాట్యం చేసే ఆలవాటు మనకి అబ్బిందనుకోండి మనం కెల్లీలా నాట్యం చేస్తాం. ఫ్రెడ్ ఏస్టైర్‌లా కాదు’ అంటారు విమర్శకులు. పండిత ప్రకాండుల మధ్యనే నలుగుతున్న నృత్యకళను రెక్కట్టుకొని లాక్కొచ్చి సామాన్య జనుల మధ్య పడేశాడు కాబట్టే జీన్ అంతటి ప్రజారంజకుడయ్యేడు. అతన్ని ప్రజలకు చేరువ చేసినదీ, తన కొత్త తరహాతో అతను సుసంపన్నం చేసినదీ, ‘‘అమెరికన్ మ్యూజికల్స్’’యే!. అమెరికన్ మ్యూజికల్స్ ప్రభావానికి భారతీయ చిత్రాలు ఎంతగా లోనయ్యాయో నిరూపించడానికి 30 ఏళ్ల క్రితం వివిధ నగరాలలో సచిత్ర ప్రసంగాలిచ్చారు. ప్రఖ్యాత సంగీత, నృత్య విమర్శకుడు వి.ఎ. కె. రంగారావు గారు. దాని గురించి మరోసారి రాస్తాను. అప్పటి కంటె ఎక్కువగా భారతీయ సినిమాలు కథపై కాకుండా, నృత్యసంగీతాలపై ఎక్కువ ఆధారపడే రోజులు వచ్చేశాయి. వాటికై నిర్మాతలు ఎంతో ధనం, సమయం, కొత్త కొత్త టెక్నిక్కులు వెచ్చిస్తున్నారు.

నాకు జీన్ కెల్లీ పరిచయమైంది డాన్సర్‌గా కాదు, డైరక్టరుగా! 1972లో రామకృష్ణా 70ఎంఎంలో ‘‘హలో డాలీ’’ (1969) సినిమా చూశాను. అప్పటికే ‘‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’’ (1965), ‘‘మై ఫెయిర్ లేడీ’’ (1964) చూసి మ్యూజికల్స్‌పై మక్కువ పెంచుకున్నాను. కానీ యిది వాటి కంటె భిన్నంగా పాట కంటె నృత్యానికి ఎక్కువ ప్రాధాన్యత నిచ్చింది. అంత పెద్ద స్క్రీన్‌పై అంత మంది, ఎలక్ట్రిక్ స్పీడుతో డాన్సులు చేయడం చూసేసరికి మతిపోయింది. ఆడవాళ్లు ఏ తరహా నృత్యం చేసినా బాగానే ఉంటుంది కానీ, మగవాళ్లను శాస్త్రీయ, జానపద తరహా నృత్యాలలో మాత్రమే చూడగలను నేను. ‘‘దసరా బుల్లోడు’’ (1971) నుంచి అక్కినేని, డాన్సుల పేరుతో ఆడవారిలా కులుకు చూపిస్తూంటే నాకు చికాకు వేసేది. కానీ ప్రేక్షకులకు అదే నచ్చింది. దాంతో భారీకాయంతో ఎన్టీయార్ దగ్గర్నుంచి అందరూ ‘స్టెప్స్’ వేశారు, వేస్తున్నారు, వేస్తూనే ఉన్నారు.

ఇదొక తప్పనిసరి తద్గినంగా భావించకుండా తాము స్వయంగా ఆనందిస్తూ డాన్స్ చేస్తున్నారని నాకు అనిపించేది కమలహాసన్, చిరంజీవి, జూనియర్ మాత్రమే! చిరంజీవి వలన డాన్సులకు ఒక కొత్త కళ వచ్చిన మాట వాస్తవమే కానీ కొత్తగా వచ్చిన గిన్నెస్ రికార్డులో 24 వేల స్టెప్స్ అని ఎలా లెక్కపెట్టారో నాకు అర్థం కాలేదు. 537 పాటలు అంటే యీజీగా లెక్కపెట్టవచ్చు. కానీ స్టెప్స్? ఇప్పుడు ఆవు పాలు పితుకుతున్నట్లో, గుళ్లో గంట కొడుతున్నట్లో ఒక స్టెప్పు ఉందనుకోండి. ఏదైనా పనిని రెండు సార్లు ఒకేలా చేసినా, యిద్దరు లేక అంతకంటె ఎక్కువ మంది ఒకేలా శరీరాన్ని కదిలించినా, దాన్ని స్టెప్ అని జనరల్‌గా అంటున్నారు. కానీ గిన్నెస్ వాళ్ల లెక్కేమిటి? గంట కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తడం, వేళ్లు వంచడం, ముందుకు కదిలించడం.. యివన్నీ వేర్వేరు స్టెప్సా? అదంతా ఒకే స్టెప్ కింద లెక్క వేశారా? తెలియదు.

ఏది ఏమైనా నాకు జీన్ కెల్లీ తరహా డాన్సే యిష్టం. మగవాడు, మగవాడిగానే ఉంటూ, తన మానసిక ఆనందాన్ని శారీరకపు కదలికల ద్వారా వ్యక్తం చేయాలి. ఎవరో డ్రిల్లు మాస్టారి ఆదేశాల ప్రకారం కాళ్లూ చేతులూ ఆడించకూడదు. జీన్ నటుడిగా, కోరియోగ్రాఫర్‌గా బాగా పేరు తెచ్చుకున్నాక, వయసు మీరుతోందను కున్నపుడు డైరక్షన్ మీదనే దృష్టి పెట్టి తీసిన సినిమా ‘‘హలో డాలీ’’! దానికి ఆధారభూతమైన ‘‘ద మ్యాచ్ మేకర్’’ నాటకం (థామ్‌టన్ వైల్డర్ రచన) తెలుగు సేత చదివి ఉన్నాను. పెళ్లిళ్ల పేరమ్మగా అవతారమెత్తిన ఒక వితంతువు తన కొంటెతనంతో, కిలాడీతనంతో ఒక ధనికుడైన బ్రహ్మచారిని బుట్టలో పెట్టి వలపించుకునే హాస్యనాటకమది. కానీ దాన్ని తెరపై గ్రాండ్ స్టయిల్‌లో చూస్తూ ఉంటే కళ్లు చెదిరిపోయాయి. దాని ట్రైలర్ యీ లింకులో చూడవచ్చు.

ప్రధాన పాత్ర వేసినది, బార్బరా స్ట్రయిసండ్! 27 ఏళ్ల వయసులో వయసుకి మించిన పాత్రను ఎంత హుషారుగా వేసిందో చూడండి – ‘జస్ట్ లీవ్ ఎవిరీథింగ్ టు మీ’ పాటలో. ! ఈ సినిమా డైరక్టరు గురించి తెలుసుకోవాలన్న కుతూహలం, అమెరికన్ మ్యూజికల్స్ గుట్టుమట్ల పట్ల ఆసక్తీ పెరిగాయి. అప్పట్లో సమాచారం దొరకడం అంత సులభమేమీ కాదు. ఈ రోజుల్లో సమాచారం చాలా దొరుకుతుంది కానీ దేని కోసం వెతకాలో చెప్పేవాడు లేడు. మద్రాసులో ఉండగా అమెరికన్ లైబ్రరీలో సభ్యత్వం తీసుకుని హాలీవుడ్ గురించి చాలా చదివాను. ఏయే సినిమాలు చూడాలో తెలిసింది. కానీ అవి దొరికేవి కావు. వీడియో కాసెట్లు అప్పుడప్పుడే పాప్యులర్ అవుతున్నాయి. కొంతకాలానికి కేబుల్ టీవీలు వచ్చి, కొన్ని ఛానెళ్లు పాత విదేశీ సినిమాలను చూపించసాగాయి. జీన్ కెల్లీ డాన్స్ బుల్లి తెరపై చూసి థ్రిల్లయిపోయాను. ఇన్నాళ్లూ చూడలేక పోయానే అనుకున్నాను. అతని ప్రథమ వర్ధంతికి నివాళిగా ఆంధ్రజ్యోతి వీక్లీలో (28-02-1997) ‘జీన్స్ కెల్లీ నాట్యకేళి’ పేరిట ఒక వ్యాసం రాశాను. అప్పట్లో యూట్యూబు లింకులిచ్చే సౌకర్యం లేదు. అతను గొప్ప డాన్సర్ అని నేను రాస్తే ఓహో అనుకుని పాఠకుడు ఊరుకోవాలి. ఇప్పుడైతే మీకు నచ్చాడో లేదో తెలుసుకోవడానికి క్లిక్ చేస్తే చాలు.

ఇంతకీ అమెరికన్ మ్యూజికల్స్ కథేమిటంటే, ‘అమెరికన్ మ్యూజికల్’ అనే ధోరణి చిత్రాలు 1930 ప్రాంతంలో రూపుదిద్దుకున్నాయి. న్యూయార్కులోని బ్రాడ్వే నాటకశాలయే వీటికి స్ఫూర్తి నిచ్చింది. 1927వ సంవత్సరంలోనే ‘‘షో బోట్’’ అనే సంగీత నాటకం, వార్నర్ బ్రదర్స్ వారి ‘‘జాజ్ సింగర్’’ అనే మొట్టమొదటి మ్యూజికల్ చిత్రం తయారయ్యాయి. రెండు విజయవంతమై, తరువాత సంవత్సరం ‘‘ది సింగింగ్ పూల్’’’ అనే సినిమా వెలువడడానికి దోహద పడ్డాయి. 1929లో వెలుగు చూసిన ఎమ్.జి.ఎమ్. వారి ‘‘బ్రాడ్వే మెలడీ’’ మ్యూజికల్స్ భవిష్యత్తును నిర్దేశించింది. దీని విజయానికి కారణాలలో ముఖ్యంగా చెప్పవలసినది సంగీతానికి కథను జోడించడం! అంటే ఒక మ్యూజికల్ తయారయ్యేటప్పుడు తెర వెనుక పాత్రధారుల జీవితం గురించీ, వారి ప్రేమ వ్యవహారాల గురించి గెలుపు ఓటముల గురించీ చూపిస్తూ మధ్య మధ్య రిహార్సల్స్‌లో డాన్సులు చూపిస్తూ క్లైమాక్స్‌లో బ్రహ్మాండమైన డాన్స్ సీక్వెన్స్ చూపించడం! ఈ ఫార్ములా తరువాతి మ్యూజికల్స్‌కి తారకమంత్రం అయిపోయింది.

“బ్రాడ్వే మెలడీ” తో గీత, సంగీతకారునిగా ఆర్థర్ ఫ్రీడ్ రంగప్రవేశం కూడా జరిగింది. ఎమ్.జి.ఎమ్ సంస్థ ద్వారా అతని నిర్వహణలో “మీట్ మీ ఇన్ సెయింట్ లూయీ” (1945), ‘‘యోలాండా అండ్ ద తీఫ్’’ (1945), ‘‘ది పైరేట్’’ (1948), ‘‘ఈస్టర్ పెరేడ్’’ (1948), ‘‘ఆన్ ది టౌన్’’ (1949), ‘‘ద బేండ్ వేగన్’’ (1953) వంటి నలభై పైచిలుకు కళాత్మక, సంగీత చిత్రాలు విడుదలై విజయ వంతమయ్యాయి. విన్సెంట్ మిన్నెలి, స్టాన్లీ డోవెన్, జీన్ కెల్లీ వంటి హేమాహేమీలతో కలిసి ఆర్డర్ ఫ్రీడ్ మ్యూజికల్స్‌కి కావలసిన కథ విషయంలో కొత్త పుంతలు తొక్కాడు. నిజానికి ఒక మ్యూజికల్ విజయవంతం కావాలంటే భారీతనమే కాదు, వివిధ శాఖల సమన్వయం నిర్దుష్టంగా ఉండాలి. నటీనటులు, సంగీతకారుడు, గీతకారుడు, సెట్ డిజైన్, ఆర్టు డైరెక్టర్, ఆర్చెస్ట్రా, నృత్య దర్శకుడు, డైరెక్టర్, స్క్రిప్టు రచయిత, ఫోటోగ్రాఫర్, ఎడిటర్ – ఇంతమంది కలిసి రావాలి. అందువలననే కాబోలు మ్యూజికల్స్ నిర్మాణంలో ప్రముఖులు అనేక శాఖలను తామే స్వయంగా నిర్వహించేవారు. (కొన్ని సినిమాల్లో జీన్ డాన్సర్‌గా, కోరియాగ్రాఫర్‌గా, డైరక్టరుగా చేశాడు)

విరుద్ధ భావాల మధ్య ఘర్షణయే సినిమా కథకు ప్రాణం అనుకొంటే అటువంటి అనేక ఘర్షణలు, వివిధ స్థాయిలలో వారు సమకూర్చారు. వాస్తవికతకూ, కాల్పనికతకూ; లౌకివాదానికి, ఆదర్శవాదానికి; వ్యక్తివాదానికి, రసవాదానికీ; ప్రేమకూ, సమాజానికి; – వీటి మధ్య జరిగే సంఘర్షణలతో సంగీతం ఆలంబనగా కథను నడిపించారు. వార్నర్ బ్రదర్స్ వారు 1933లో నిర్మించిన “ఫార్టీ సెకండ్ స్ట్రీట్”లో ఓ చిన్న తార పోరాటం, అంతిమంగా ముఖ్యపాత్రతో బాటు నాయకుడి హృదయాన్ని గెలుచుకోవడం చూపించబడింది. అదే సంవత్సరంలో వెలువడిన డిక్ పవెల్ హీరోగా నటించిన “గోల్డ్ డిగ్గర్స్ ఆఫ్ 1933” లో ఒక ఓ థియేటర్ సిబ్బంది ఇబ్బందుల పాలవడం, అమెరికన్ ఆర్థిక మాంద్యం నాటి దుర్భర పరిస్థితులను చవి చూస్తూ థియేటరును నిలబెట్టుకోవడం చిత్రీకరించారు. (1970 నాటి హిందీ చిత్రం ‘‘ఉమంగ్’’ లో నృత్యశాలను కాపాడుకోవడానికి కళాకారులు సలిపిన పోరాటమే కథాంశం)

1940లో ఎమ్.జి.ఎమ్. వారు ‘‘విజర్డ్ ఆఫ్ జాజ్’’, ‘‘బేబ్స్ ఇన్ ఆ(ర్)మ్స్’’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించినా ఆ దశాబ్దం ఆర్.కె.ఓ. కంపెనీకి చెందిందనే చెప్పాలి. వారు వార్నర్ బ్రదర్స్ చిత్రాల వంటి సాంకేతిక నిపుణత చూపించలేక పోయినా, ఫ్రెడ్ ఏస్టయిర్ – జింజర్ రోజెర్స్‌లతో తీసిన ‘‘టాప్ హేట్’’ (1935), ‘‘ఫాలో ది ఫ్లీట్’’ (1936), ‘‘స్వింగ్ టైమ్’’ (1936), ‘‘షల్ వియ్ డాన్స్’’ (1937) చిత్రాలు ఘన విజయం సాధించేయి. ఇరువురు యువతీయువకుల మధ్య సమాగమం, ప్రేమావిర్భావం, వివాహం అనే మూడు అంచెలు, వాటికి సంబంధించిన సహయోగ వియోగాలు వీటన్నింటినీ సంగీత నృత్యాల ద్వారా పరిష్కరించు కోవడాలు అనే ఫార్ములాకు ప్రజామోదం తెచ్చిపెట్టిన ఫ్రెడ్ ఏస్టైర్ అమెరికన్ మ్యూజికల్స్ నిలదొక్కుకోవడానికి చేసిన కృషి అనన్య సామాన్యమైనది.

ఈ ఫార్ములా ప్రకారం చురుకుదనం, పసిపిల్లవాని అమాయకత్వం, మకురుతనం, స్వేచ్ఛాప్రియత్వం కలబోసిన కథానాయకుడు, సంసారపక్షంగా ఉండి సేద దీర్చగల ఓర్మి, ప్రతిభ కలిగిన కథానాయికను వలచి, వలపించుకొని సంగీత నృత్యాల ద్వారా ప్రేరేపించి, చివరికి ఇద్దరూ కలిసిపోవడం కథాంశంగా ఉండేది. ఫ్రెడ్ ఏస్టయిర్- జింజర్ రోజర్స్ జంట తెరమీద సాగించిన ప్రణయం ఈ సినిమాలకి దన్నుగా నిలిచింది. 1942 విడుదలైన ‘‘ఫర్ మీ అండ్ మై గాల్’’తో చిత్రరంగాన్ని ప్రవేశించిన మూడు నాలుగేళ్లలోనే ఫ్రెడ్ ఏస్టయిర్‌తో సమానమైన స్థానాన్ని జీన్ పొందగలిగాడంటే దానికి కారణం అతని విలక్షణమైన నేపథ్యమే!

జీన్ (పూర్తి పేరు యూజీన్) కెల్లీ 1912 ఆగస్టులో అమెరికాలోని పెన్సిల్వేనియాలో పుట్టాడు. తల్లి యితన్ని, తమ్ముణ్ని డాన్స్ స్కూలుకి పంపింది కానీ యిరుగుపొరుగు పిల్లలు ఆడంగి అని ఏడిపించడంతో వీళ్లు నేర్చుకోవడానికి మొరాయించారు. జీన్ ఆటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఆట, నృత్యం రెండూ రిథమ్ మీద ఆధారపడ్డాయని ఆటగాళ్లకు, నర్తకులకు పెద్ద తేడా లేదని నిరూపిస్తూ తర్వాతి రోజుల్లో షోలు చేశాడు. మంచి స్పోర్ట్స్‌మన్ అనిపించుకున్నాక డాన్స్ క్లాసులకి కూడా వెళ్లాడు. 1929లో అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చి, తండ్రి ఉద్యోగం పోయినప్పుడు స్కూలు చదువు మానేసి, బంకులో పెట్రోలు పోయడం, గోతులు తవ్వడం, వంటి చిల్లరమల్లర ఉద్యోగాలు చేసి, ఫైనల్‌గా డాన్సు టీచరు అవతారమెత్తి, యింట్లో డాన్సు స్కూలు పెట్టాడు. కుటుంబమంతా దానిలో పాలు పంచుకుంది. అతనూ, తమ్ముడూ డాన్సు పోటీల్లో పాల్గొంటూ, నైట్‌క్లబ్బుల్లో డాన్సులు చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ఆదుకునేవారు.

1931 నాటికి పరిస్థితులు మెరుగుపడడంతో పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో చేరి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశాడు. కాలేజీ రోజుల్లో రంగస్థలంపై మ్యూజికల్స్‌లో పాల్గొనేవాడు. 1933లో డిగ్రీ చేతికి వచ్చాక, లా కోర్సులో చేరాడు కానీ అది మధ్యలో మానేసి కుటుంబం నడిపే డాన్సు స్కూల్లో టీచరుగా చేరాడు. కానీ ఆడపిల్లలు పది మంది చేరితే, మగపిల్లవాడు ఒక్కడు చేరేవాడు. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆడపిల్లలు స్కూలు మానేసేవారు. ఇక్కడే ఉంటే లాభం లేదని, ఆరేళ్ల తర్వాత 1937లో న్యూయార్క్ వెళ్లి అక్కడ బ్రాడ్వే వంటి నాట్యశాలల్లో కోరియోగ్రాఫర్‌గా ప్రయత్నిద్దామనుకున్నాడు. అయితే అక్కడి వారు ‘నీకు నృత్యదర్శకత్వం ఏమొచ్చు, డాన్సర్‌గా చేరు’ అన్నారు. డాన్సింగ్‌తో పాటు యాక్టింగ్ కూడా ఉంటుంది. కొద్దికాలంలో కోరియోగ్రఫీ ఛాన్స్ కూడా వచ్చింది. ‘‘పాల్ జో’’ (1940) అనే నృత్యనాటికలో అతనికి మెయిన్ రోల్ యిచ్చారు.

అది చూసిన డేవిడ్ సెల్జ్‌నిక్ అనే నిర్మాత (‘‘గాన్ విత్ ద విండ్’’ తీశాడు) యితన్ని చూసి ముచ్చట పడి కాంట్రాక్టులోకి తీసుకున్నాడు. అయితే అతని దగ్గర యితన్ని పెట్టి తీసే సినిమా సబ్జక్టు లేదు. అందువలన తన మావగారు, ఎంజిఎమ్‌లో భాగస్వామి ఐన లూయీ మేయెర్‌కి యీ కాంట్రాక్టులో సగభాగాన్ని అమ్మి వేశాడు. ఎంజిఎమ్ వాళ్లు కూడా మ్యూజికల్స్‌లోకి దిగారు కాబట్టి ఆర్థర్ ఫ్రీడ్ నిర్వహణలో యితన్ని హీరోగా, అప్పటికే స్టార్ అయిన జూడీ గార్లండ్‌ను హీరోయిన్‌గా పెట్టి ‘‘ఫర్ మీ అండ్ మై గాల్’’ (1942) సినిమా తీశారు. యాక్టరుగా యితని ప్రతిభ వెలికి రావడానికి జూడీ గార్లండ్ ప్రోత్సహించింది. అప్పటికే అతనికి 29 ఏళ్లు. డాన్సింగ్ స్టార్లు యింకా తక్కువ వయసులోనే హీరోలయ్యారు. ఫ్రెడ్ ఏస్టయిర్ వెలిగిపోతున్నాడు. అతనిలో ఉన్న ఎలెగన్స్ జీన్‌లో లేదు. అందుకని అతనికి భిన్నంగా యితన్ని తీర్చిదిద్దారు.

ఏస్టయిర్ సన్నగా, రివటలా ఉంటాడు. ఇతను మంచి స్పోర్ట్స్‌మన్‌లా, దృఢంగా, సెక్సీగా అనిపిస్తాడని తీసుకున్నారు. ఏస్టయిర్‌ది అద్భుతమైన ఫుట్‌వర్క్. కానీ నడుము పై భాగం అడుగుబద్ద మింగేసినట్లు స్టిఫ్‌గా పెడతాడు. జీన్ ఒళ్లంతా కదుపుతూ, ఏరోబిక్స్ చేస్తున్నట్లు తన డాన్సులు డిజైన్ చేసుకున్నాడు. క్రీడాకారుడు కాబట్టే అతని కదలికలలో అంతటి చురుకుదనం, సొగసు కనబడతాయి. అప్పట్లో డాన్సింగ్ స్టార్లందరూ కోటూ, సూటూ వేసుకుని డాన్సు చేసేవారు. “నేను హాలీవుడ్‌కి రాగానే సామాన్య ప్రేక్షకుణ్ణి అలరించాలని నిశ్చయించు కొన్నాను, సూటూ బూటూ వేసుకొని డాన్స్ చేస్తే అతడు నా పాత్రతో తాదాత్మ్యం చెందలేడు. అందుకని పాంటు, టీషర్టు వేసుకొని నాట్యం చేశా. అలాగయితేనే శరీరం కదలికలన్నీ వారికి కనబడతాయి. మనకూ స్వేచ్ఛగా ఆడడానికి వీలుంటుంది.” అనేవాడు కెల్లీ. ఇతనికి కండలూ అవీ ఉన్నాయి కాబట్టి అలా చెల్లింది. సామాన్య ప్రజలు కూడా యితనితో ఐడెంటిఫై అయి, థియేటర్లోంచి బయటకు వెళ్లేటప్పుడు డాన్సు చేసుకుంటూ వెళ్లేవారు. అక్కినేని, ఎన్టీయార్ డాన్సులకు భిన్నంగా చిరంజీవి తన స్టయిల్ యివాల్వ్ చేసుకోవడం యిక్కడ గుర్తు చేసుకోవచ్చు.

‘‘ఫర్ మీ అండ్ మై గాల్’’ సినిమా హిట్ కావడంతో వరుసగా సినిమాలు వచ్చాయి. ఎంజిఎమ్ వారి వద్ద నుంచి అరువు తీసుకుని కొలంబియా వాళ్లు కొన్ని సినిమాలు తీశారు. మళ్లీ ఎంజిఎమ్‌కి వచ్చి ‘‘ఏంకర్స్ ఎవై’’ (1945) సినిమాకి పని చేశాడు. తన సహచరుడు స్టాన్లీ డొనైన్‌తో కలిసి దానిలో జెర్రీ (టామ్ అండ్ జెర్రీలో ఎలుక) కార్టూన్ బొమ్మతో కలిసి డాన్సు చేసే సీను పెట్టాడు. దాని లింకు యిదిగో –  ‘‘రాజా, చిన్నరాజా’’ (1989)లో చిత్రంలో రజనీకాంత్ కార్టూన్ బొమ్మలతో కలసి నృత్యం చేయడానికి యిది నాలుగు దశాబ్దాల ముందే! ఆనాటి సాంకేతిక పరిమితులలో ఒక కార్టూన్‌ బొమ్మతో కలిసి నృత్యం చిత్రీకరించడం ఆర్టిస్టుకి ఎంత కష్టమో సులభంగా ఊహించుకోవచ్చు.

అతను నటించిన సినిమాల లిస్టు యివ్వటం లేదు. నాకు నచ్చిన కొన్ని సన్నివేశాల లింకులు యిస్తున్నానంతే! ‘‘జిగ్‌ఫీల్డ్ ఫాలీస్’’ (1946) సినిమాలో ఫ్రెడ్ ఏస్టయిర్‌తో కలిసి చేసిన ‘ద బాబిట్ అండ్ బ్రోమైడ్’ డాన్సు చూడండి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జీన్ నేవీలో చేరాడు. నేవీ వాళ్లు ఆర్మీని ఉత్సాహ పరచడానికి తీసే ప్రమోషనల్ ఫిల్మ్స్‌లో నటించే, దర్శకత్వం వహించే బాధ్యత జీన్‌కి అప్పగించారు. సినిమా ఎలా తీయాలో అక్కడ అతను కొంత తర్ఫీదు అయ్యాడు. యుద్ధానంతరం జీన్ తన 37వ ఏట తన సహనృత్యదర్శకుడు స్టాన్లీ డోనెన్‌తో కలిసి దర్శకత్వంలోకి దిగి ‘‘ఆన్ ది టౌన్’’ (1949) తీశాడు.

దీనిలో విశేషమేమిటంటే అప్పటిదాకా మ్యూజికల్‌లో డాన్సులన్నీ స్టూడియోలోనే తీసేవారు. దీన్ని ఔట్‌డోర్‌లో తీశాడు. ఆ సినిమాలో ప్రసిద్ధ నటగాయకుడు ఫ్రాంక్ సినాట్రాకు డాన్స్ నేర్పించి అతనితో కలిసి చేసిన డాన్సు చూడండి.

‘‘ఏన్ అమెరికన్ ఇన్ పారిస్’’ (1951)కు దర్శకుడిగా విన్సెంట్ మిన్నెల్లి పేరు ఉన్నా జీన్ చాలా కంట్రిబ్యూట్ చేశాడు. ఈ పాటలో అతని ఫుట్‌వర్క్ చూడండి. ఆ సినిమాలో 17 ని.ల బ్యాలే పెట్టాడు. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా యూట్యూబులో పెట్టారు. 7 వ భాగం లింకు యిది.

స్టాన్లీతో కలిసి దర్శకత్వం వహించిన ‘‘సింగింగ్ ఇన్ ది రెయిన్ (1952)’’ అనే సినిమాలో అతను చేసిన గొడుగు డాన్సు నాకు భలే యిష్టం. అదే సినిమాలో యింకో యిద్దరితో కలిసి చేసిన ‘గుడ్‌మార్నింగ్’ పాట ఎంత లైవ్లీగా ఉంటుందో చూడండి. స్టాన్లీతో కలిసి దర్శకత్వం వహించిన మరో సినిమా ‘‘ఇట్స్ ఆల్వేస్ ఫెయిర్ వెదర్’’ (1955),

పెన్సిల్వేనియా నుంచి న్యూయార్క్ వచ్చాక జీన్‌కి బెట్సీ బ్లయర్ అనే కోరస్ గర్ల్‌తో పరిచయమై ప్రేమకు దారి తీసింది. 1941లో 24 ఏళ్ల వయసులో 17 ఏళ్ల బెట్సీని పెళ్లాడాడు. ఆమెకు నటిగా కూడా అవకాశాలు వచ్చాయి. ఆమెవి కమ్యూనిస్టు భావాలు. జీన్‌ది కమ్యూనిజం కాదు కానీ ఉదారవాదం. రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాలో మెక్‌కార్థీయిజం ప్రబలింది. వామపక్ష భావాలున్న హాలీవుడ్ రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులందరినీ బ్లాక్ లిస్ట్ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ హంఫ్రీ బోగార్ట్ వంటి హీరోలతో కలిసి జీన్ ప్రదర్శన నిర్వహించాడు. అతన్నేమీ చేయలేదు కానీ బెట్సీని మాత్రం బ్లాక్‌లిస్ట్ చేశారు. దాంతో జీన్, బెట్సీ కలిసి ఇంగ్లండు వెళ్లిపోయారు. దాని వలన యిద్దరికీ హాలీవుడ్ అవకాశాలు తగ్గాయి.

కానీ ఎంజిఎమ్‌ను ఒప్పించి, పూర్తిగా తన దర్శకత్వంలో ‘‘ఇన్విటేషన్ టు ద డాన్స్’’ (1957) తీశాడు. ఈ సినిమాలో విశేషం ఏమిటంటే మూడు కథలను, మాటా, పాటా లేకుండా, కేవలం నృత్యరూపంలో చెప్పబూనడం. అది ఫెయిలయింది. దానికి తోడు భార్య జీన్‌కి ఆ ఏడాదే విడాకులు యిచ్చి, 1963లో ఒక చెక్-బ్రిటిషు నిర్మాతను పెళ్లి చేసుకుంది. ఇతను అమెరికాకు తిరిగి వచ్చేసి, స్నేహితుడు, కో-డైరక్టరు అయిన స్టాన్లీ డోనెన్‌ మాజీ భార్య, ఎప్పటి నుంచో తనకు అసిస్టెంటు కోరియాగ్రాఫర్‌గా ఉన్న జీన్ కాయ్‌నీని 1960లో చేసుకున్నాడు. 1973లో ఆమె లుకేమియాతో మరణించేవరకు జీన్‌తో వైవాహిక బంధం సాగింది. తర్వాత ఒంటరిగానే ఉంటూ మొదటి భార్య ద్వారా కలిగిన ఒక కూతుర్ని, రెండవ భార్య ద్వారా కలిగిన కూతురు, కొడుకులను చూసుకుంటూనే గడిపిన జీన్ తన 77వ ఏట 1990లో 30 ఏళ్ల వయసున్న పాట్రిసియా వార్డ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె సవతి బిడ్డలను దగ్గరకు రానీయలేదు. ఆరేళ్ల తర్వాత 1996లో జీన్ మరణించాడు.

‘‘లే గర్ల్‌స్’’ (1957) అనే సినిమాయే జీన్ నటించిన మ్యూజికల్. 50 ఏళ్లకు దగ్గర పడుతూండడం, ఎల్విస్ ప్రెస్లీ తరహా నృత్యానికి ఆదరణ పెరగడంతో, డాన్సింగ్ హీరో అవతారం చాలించి, పూర్తి స్థాయి డైరక్టరుగా స్థిరపడ్డాడు. టీవీ షోలలో కనబడ్డాడు. ఇతనికి అనేకసార్లు ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. 1952లో ఆనరరీ ఆస్కార్ ఎవార్డు యిచ్చారు, ‘సినిమా నృత్యాల విషయంలో సాధించిన విజయాలకై..’ అంటూ! అందుకే సినిమా నృత్యాల ద్వారా పేరు తెచ్చుకుంటున్నవారందరూ యితని గురించి తెలుసుకోవాలని నా అభిప్రాయం. అతని పై తీసిన యీ డాక్యుమెంటరీ చాలా చక్కగా ఉంది. వీలైతే చూడండి.

కొసమెరుపుగా, నన్ను అంతగా మెప్పించిన ‘‘హలో డాలీ’’ సినిమా గురించి చెప్పాలంటే, తర్వాతి రిలీజుల్లో పెట్టుబడి రాబట్టింది కానీ రిలీజైనప్పుడు విజయవంతం కాలేదు. పెట్టిన భారీ వ్యయాన్ని రాబట్టలేక పోయింది. అదే ఏడాది కొత్త తరహా డాన్సు చిత్రాలు రావడంతో యిది ఓల్డ్ స్టయిల్ అనిపించుకుంది. సినిమాకు ఆర్ట్ డైరక్షన్, మ్యూజిక్‌లో, సౌండ్‌లో ఆస్కార్లు వచ్చాయి. బెస్ట్ పిక్చర్‌గా నామినేషన్ వచ్చింది కానీ గెలవలేదు. (ఫోటో – ‘‘ఏన్ అమెరికన్ ఇన్ పారిస్’’ పోస్టర్, ‘‘సింగింగ్ ఇన్ ద రెయిన్’’లో గొడుగు డాన్స్, ‘‘ఏంకర్స్ ఎవై’’లో జెర్రీతో డాన్స్, ‘‘హలో డాలీ’’లో బార్బరా, ‘‘ఫర్ మీ అండ్ మై గాల్’’లో జూడీ గార్లండ్‌తో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2024)

[email protected]

17 Replies to “ఎమ్బీయస్‍: డాన్సింగ్ హీరోలకు ఐడాల్”

  1. ఇక పై లడ్డూ విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దని అలా supreme తీర్పుని ఇవ్వగానే గురువు గారు వెనువెంటనే పాటించేసారు.

  2. మీకు అక్కినేని డ్యాన్సులు నచ్చకున్నా ఒకటి మాత్రం నిజం. తెలుగు సినిమాలలో హీరోల డ్యాన్స్ లకు ఆరాధ్యుడు అక్కినేని వారే. ఇది జగమెరిగిన సత్యం.

    1. నాకు నచ్చవు అనే మాట ఎంత నిజమో, హీరోల డాన్సులకు ఆద్యుడు అనే మాట కూడా అంతే నిజం. అదే నన్ను బాధించే విషయం కూడా.

      గతంలో హీరోయిన్ డాన్సు చేస్తూంటే హీరో చేతులు కట్టుకుని నిలబడి మనలాగే ఆమెను చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు ఆమె కేసి చూడడు, మన కేసి చూస్తూ ‘నిన్ను వలచాను, నీ ఒంపుసొంపులు నాకు నచ్చాయి’ అంటూ కాళ్లూ చేతులూ తెగ ఆడించేస్తూ ఉంటాడు.

      నాగేశ్వరరావులా డాన్సు చేయకపోతే కుదరదని చెప్పడంతో ఎన్టీయార్ కూడా భారీకాయంతో డాన్సు చేశాడు, కృష్ణ, కృష్ణంరాజు లాటి వాళ్లు తిట్టుకుంటూ ఆ క్రతువు ముగించేవారు. పాత్ర ఔచిత్యం వదిలేశారు. ఆకాశం నీ హద్దురా సినిమా చూడండి, హీరోది గొప్ప లక్ష్యం,అయినా శవాల ముందు డాన్సు చేసేవాడిలా ఓ డాన్సు పెట్టాల్సి వచ్చింది.

      1. DVS కర్ణ లో హీరో దుర్యోధనుడు కనుక ఆ పాత్ర కి కూడా చిత్రం భళారే విచిత్రం అని డ్యూయెట్ పెట్టారు, మీరు అన్నట్లు గా!

  3. సినిమాలలో నాకు నచ్చిన కొన్ని డాన్స్ లలో భూకైలాస్ సినిమా లో మున్నేట పవళించు అనే పాట లోది. స్వతహగా ఆయన డాన్సర్ అనుకుంటాను! సహజం గా చేసినట్లు ఉంటుంది.

    1. మున్నేటి పవళించులో మగ డాన్సర్ లేడు. ఆ పాటకి నర్తించిన నర్తకి పేరు కమలాలక్ష్మణ్ (కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ మొదటి భార్య. లక్ష్మణ్ రెండో భార్య పేరు కూడా కమల కావడం ఒక తమాషా). భూకైలాస్ ఇంకో డాన్స్‌లో నర్తించింది మాత్రం ప్రఖ్యాత నర్తకుడు, కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ.

  4. Mbs gaaru Mee articles dwaara chaala తెలుసుకున్నాను. లేట్ ninties lo cartoon network channel 9pm varaku vachi adey channel TNT ga(9PM to 6AM) తర్వాత TCM(TURNER classic movies) ga vachedi. Ma nanna alarm petti raatri 2am ki 4 am ki kuda cinemalu choopinchevaru. Hollywood golden age cinemalu chaala appude choodagaligaamu , nenu ma తమ్ముడు. Gene Kelly gurinchi meeru cheppina విశేషాలు చాల కరెక్ట్ గా చెప్పారు. ముఖ్యం Fred astair తో కాంట్రా

    స్ట్ గురించి. Athletic build gurinchi.ఉదయ్కిరణ్ పాట ఉదయించిన సూర్యుడినదిగా సింగింగ్ ఇన్ ద రైన్ పాటకి మక్కి

    కాఫీ. ఓం శాంతి ఓం లో studio set లో పాట కూడా సింగింగ్ ఇన్ ద రైన్ లో ఒక పాట కి మక్కి. I think it’s a tribute by Farah Khan to Gene. Latest ga national award vachina Dhanush pata kuda singin in the rain paata spirit vuntindi.

  5. It is very nice on your part to remember Gene Kelly at a time even Hollywood has forgotten him. However, I think no one will connect to this article as very people in AP even in our generation watched his movies. Kelly did only one movie without dancing which is Three Musketeers. His fencing skills in that movie were so very good that he made he made fencing look like a dance.

    1. True. Very few people know about him and there may not be much response to this kind of articles. Still, I want to write some more articles like Danny Kaye, Fred Astaire, and some Hindi artistes and technicians of yesteryears. Telugu media does not cover them but speaks volumes about present day artistes. I wish to introduce great artists and writers to my readers. Now that you tube links are available, let the readers know that there is or was a lot of world beyond current stars. Some of them may go deeper to learn more about them.

Comments are closed.