ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల్లాళ్లయింది. ఫలితాలు ఎలా వచ్చాయో వివరిస్తూ ఒక సంక్షిప్త వ్యాసం రాశాను. ఇప్పుడు ఫలితాలు అలా ఎందుకు వచ్చాయో, అనేక చోట్ల నుంచి సేకరించిన సమాచారంతో విశ్లేషణలు రాస్తాను. ఈ విశ్లేషణ రాయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నారంటూ కొందరు మెయిల్స్ గుప్పిస్తున్నారు. వీళ్లంతా నేను చెప్తే తెలుసుకుందా మనుకునే బ్యాచ్ కాదని నాకు తెలుసు. నేను అప్‌లోడ్ చేసిన ఐదు నిమిషాలకే ‘నువ్వు అలాటివాడివి, యిలాటివాడివి. నీకేం తెలియదు.’ అంటూ రాసే వాళ్లే. ఇది నాకు నవ్వు తెప్పిస్తుంది. గతంలో ఎయన్నార్, ఎన్టీయార్ అభిమానులు అవతలివాళ్ల సినిమా వాల్‌పోస్టర్ల మీద పేడముద్దలు వేసేవారు. రాత్రి పూట వాళ్లు పోస్టర్లు అంటించడం తరువాయి, వీళ్లు సిద్ధంగా కాచుకుని ఉండేవారు. ఒక్కోప్పుడు పేడముద్దల బ్యాచ్ ముందే వచ్చేసి, ‘పోస్టర్ల బ్యాచ్ ఇంకా రాలేదేమిటి?’ అని విసుక్కునేవాళ్లు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి అని తోచి, నవ్వు వస్తోంది. నన్ను రాయనీకుండా, నా రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చకుండా డిస్కరేజ్ చేయాలనే బ్యాచ్ ఒకటి పని చేస్తోంది. ఇలా చెప్తే అతిశయంగా వుందని మీరనుకోవచ్చు. కానీ రియాక్షన్స్ తీరును గమనిస్తే మీకూ అర్థమౌతుంది. సాధారణంగా నా ఆర్టికల్స్‌కు 20-30 రియాక్షన్స్ ఉంటాయి. వాటిలో సగటున 65% మంది హ్యేపీ అని పెడతారు. ఒక 5-10% ఏంగ్రీ పెడతారు. ముళ్లపూడి వారి కోటబుల్ కోట్స్ రాస్తే 13% మంది ఏంగ్రీ అని పెట్టారు. ‘‘కానుక’’ కథ పెట్టినా యాంగ్రీ అని పెట్టారు. శాడ్ అనేదానికి అర్థమేమిటో నాకు తెలియదు. ఏదైనా మరణవార్త పెడితే శాడ్ అని నొక్కవచ్చు. తక్కినవాటిలో వ్యాసం బాగా లేకపోవడం చేత బాధపడ్డామనా? లేక దానిలో విషయం తెలిసి బాధపడామనా? తెలియదు. ఇక అన్‌మూవ్‌డ్ ఆప్షన్ నాకు నవ్వు తెప్పిస్తుంది. మనకు ఇంట్రస్టు లేకపోతే, పట్టించుకోనే కోము. వీళ్లెవరో పనిగట్టుకుని ఆ ఆప్షన్ నొక్కుతున్నారే అనుకుంటాను.
ఇదీ సాధారణంగా నా వ్యాసాలకు వచ్చే రియాక్షన్స్ పరిస్థితి. కానీ నేను ఏదైనా వ్యాసంలో బిజెపి గురించి విమర్శలు చేశాననుకోండి, ఒక రోజు పాటు యిలాగే వుంటుంది. మర్నాటికల్లా ఎవరో ఓ మిడతల దండుని పురమాయిస్తారు లాగుంది. వందలాది మంది టపటప మని యాంగ్రీ బటన్ నొక్కేస్తారు. రియాక్షన్స్ ఒక్కుమ్మడిగా వచ్చి పడిపోతాయి. కొన్ని ఉదాహరణలు చూపుతా. వ్యాసం టైటిల్, రియాక్షన్లు, హేపీ శాతం, యాంగ్రీ శాతం వరుసగా యిస్తున్నాను. ‘గుజరాత్‌లో మాంసాహారంపై కట్టడి’ 77-22-75, ‘ఆత్మహత్యేనా? మతహత్యా?’ 96-11-50, ‘యుపిలో రాజకీయ వలసలు’ 118-8-89, ‘బెంగాల్ ఎన్నికల ఫలితాలు 2’ 161-10-86, ‘రైతు విజయంలో లఖింపూర్ పాత్ర’ 173-5-92, ‘బెంగాల్ ఎన్నికల ఫలితాలు 1’ 229-10-87.
ఇదంతా యాదృచ్ఛికం అనుకోవడానికి లేదు. ఒక ప్రణాళిక ప్రకారమే సాగుతోందనుకోవాలి. ఒక ప్రాంతీయ భాషలో, సగటున 25 రియాక్షన్స్ తెచ్చుకునే ఒక సాధారణ వెబ్ కాలమిస్టుపైనే యింత నిఘా పెట్టి వీళ్లు చూస్తున్నారంటే, వేధించి ‘ఎందుకొచ్చిన గొడవ, నోరు, పెన్నూ మూసేసి కూర్చుంటే మేలు కదా’ అనిపిద్దామని చూస్తున్నారంటే, మెయిన్‌స్ట్రీమ్ మీడియా వ్యక్తులపై ఎంత ఒత్తిడి ఉంటోందో మీరూహించుకోవచ్చు. బెంగాల్ ఎన్నికల ఫలితాల వ్యాసంలో అంత కోపం తెచ్చుకోవడాని కేముంటుంది చెప్పండి. సీట్ల సంఖ్య, ఓట్ల సంఖ్య అన్నీ గణాంకాలే కదా! ఏ గ్రూపు ఎలా ఓటేశారు అనేది ఫలానా సంస్థ చేసిన సర్వే ఫలితాలివి అనే కదా రాసేది. నేనేమీ ఊహించి రాయనుగా! అయినా భరించలేరు. ఇప్పుడీ వ్యాసపరంపరపై కూడా యిదే రకమైన కోపాన్ని ప్రదర్శిస్తారేమో చూదాం.
ఇప్పుడు గోవాతో విశ్లేషణ ప్రారంభిస్తాను. హంగ్ అసెంబ్లీ రావచ్చనే అంచనాలు తల్లకిందులు చేస్తూ గోవాలో బిజెపికి గతంలో కంటె 7 సీట్లు, 0.8% ఓట్లు పెరిగి మూడోసారి అధికారం దక్కినా కొన్ని పరిణామాలు గమనించదగినవి. 2017తో పోలిస్తే బిజెపికి 7 సీట్లు పెరిగాయి కానీ ఎన్నికలకు ముందు 27 సీట్లు ఉండగా, తర్వాత 20 మాత్రమే గెలిచిందని గమనించాలి. గోవాలో ప్రాంతీయ పార్టీలే కింగ్‌మేకర్స్ పాత్ర పోషిస్తూ వచ్చాయి. ఈసారి బిజెపి 20 సీట్లతో దాదాపు స్పష్టమైన మెజారిటీ తెచ్చుకోవడంతో వాటి ప్రాధాన్యత తగ్గింది. 2017లో ఏ సీటు రాని ఆప్‌కు యీసారి 2 సీట్లు వచ్చాయి. రివల్యూషనరీ గోవన్స్ పార్టీ (ఆర్‌జిపి) అనే కొత్త పార్టీకి 1 సీటు, 9.45% ఓట్లు వచ్చాయి. కాంగ్రెసుకు అవకాశాలు బాగానే ఉన్నా, సరైన స్ట్రాటజీ లేక, ఛాన్సు పోగొట్టుకుంది. 6 సీట్లు, 4.9% ఓట్లు తగ్గి 11 సీట్లు, 23.5% ఓట్లు వచ్చాయి. దానితో జత కట్టిన జిఎఫ్‌పికి 2 తగ్గి 1 సీటు 1.7% తగ్గి 1.8% ఓట్లు వచ్చాయి. తృణమూల్‌తో ఎన్నికలలో పొత్తు పెట్టుకున్న ఎంజిపికి 1 సీటు తగ్గి 2 వచ్చాయి. 3.7% తగ్గి 7.6% ఓట్లు వచ్చాయి. నెగ్గాక బిజెపికి మద్దతిస్తోంది.
ముఖ్యమంత్రి సావంత్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందనేది సగం సీట్లు మాత్రమే గెలవడంతో, 7 సీట్లు కోల్పోవడంతో స్పష్టం. అయినా అందరికీ అందుబాటులో ఉంటాడనేది వ్యక్తిగతంగా ఓటర్లను మెప్పించింది. కానీ సావంత్‌కు 666 ఓట్ల మెజారిటీ మాత్రమే రాగా, ముఖ్యమంత్రి పదవికి పోటీదారైన ఆరోగ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడైన విశ్వజిత్ రాణెకు 7 వేల మెజార్టీ వచ్చింది. మొత్తం ఓట్లలో బిజెపికి మూడోవంతు మాత్రమే రావడం, చాలా చోట్ల గెలుపు మార్జిన్లు తక్కువగా ఉండటంతో ప్రతిపక్షాలు ఐక్యంగా వుండి పోటీ చేసి వుంటే ఫలితాలు తారుమారయ్యేవి అనే వ్యాఖ్య వినబడుతోంది. మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ టిక్కెట్టు గొడవ తప్పిస్తే బిజెపి తన అభ్యర్థుల ఎంపికను తెలివిగానే (తన అభ్యర్థులలో 33 మంది ఫిరాయింపుదారులే) నిర్వహించింది. ఉత్పల్ స్వతంత్రుడిగా పోటీ చేసి, 700 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. కాంగ్రెసు అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యం చేసింది. పొత్తులు కుదుర్చుకోవడంలో నిర్లక్ష్యం చూపింది. ఆప్, తృణమూల్ ఎవళ్లకి వాళ్లే ఏదో ఊడపొడిచేస్తామన్న బిల్డప్ యిచ్చి చివరకు చతికిలపడ్డాయి.
40 సీట్లలో 9 సీట్లలో గెలుపు మార్జిన్ వెయ్యికి లోపే ఉంది. కొన్ని చోట్ల వందకు లోపే ఉంది. గోవాలో పార్టీ ఫిరాయింపులు ఎక్కువ. ఓటర్లలో 64% మంది పార్టీని బట్టి కాక, నాయకులను చూసి ఓటేస్తామని సర్వేలో చెప్పారు. కాంగ్రెసు పార్టీని విడిచి ఎమ్మెల్యేలందరూ వెళ్లిపోయారు. ఒక్కడే మిగిలాడు. అయినా ఈసారి ఓటర్లు పార్టీ తరఫున నిలబడిన 11మందిని గెలిపించారు. దీన్ని బట్టి అర్థమౌతున్నదేమిటంటే బిజెపికి ప్రత్యర్థిగా కాంగ్రెసునే పరిగణించారు ఓటర్లు. ప్రాంతీయ పార్టీలకు కొన్ని చోట్ల పట్టుంది కాబట్టి వాళ్లకు కొన్ని ఓట్లు వచ్చాయి. తృణమూల్, ఆప్ స్థానిక నాయకులనే చేర్చుకున్నా, వాళ్లని బయటి పార్టీలగానే చూశారు. లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్) చేసిన పోస్ట్-పోల్ సర్వే ప్రకారం ఓటర్లలో 33% బయటివారి విషయంలో బాగా సీరియస్‌గా ఉన్నారు. 31% మంది ఓ మాదిరి సీరియస్‌గా ఉన్నారు.
కశ్మీరు భారత్‌లో భాగమైనప్పుడు అక్కడ బయటివాళ్లు ఆస్తులెందుకు కొనకూడదు? అని మనం అడుగుతూంటాం. బయటివాళ్లు గోవాలో ఆస్తులు కొనడం గురించి అక్కడి ప్రజలేమనుకుంటున్నారు అని యీ సర్వే అడిగితే బయటివాళ్లను కొననివ్వకూడదు అని 49% మంది చెప్పారు. ఫర్వాలేదులే అని 17% మంది చెప్పారు. బయటి నుంచి వచ్చినా దశాబ్దాలుగా గోవాలో ఉండిపోయినవారు తాము నివసిస్తున్న యిళ్లు కొనుక్కోవచ్చంటారా? అని అడిగితే 22% మంది మాత్రమే ఔనన్నారు. ఫర్వాలేదులే అని 18% మంది అన్నారు. 33% మంది కుదరదన్నారు. కొనుక్కోనివ్వకపోవడం మంచిదని 14% మంది అన్నారు.
బిజెపి హయాంలో రోడ్ల వంటి ఇన్‌ఫ్రా పనులు బాగా జరిగినా, కరోనా సమయంలో జరిగిన అవినీతి, పర్యావరణాన్ని పట్టించుకోకుండా బొగ్గు రవాణాను అనుమతించడం, మైనింగ్ మాఫియా వంటి కారణాల కారణంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత గురించి వచ్చిన రిపోర్టులు కరక్టేనా తేల్చుకుందామని యీ సర్వే ప్రయత్నించింది. ఈ ప్రభుత్వం మళ్లీ రాకూడదు అని 43% మంది, యింకో ఛాన్సివ్వాలి అని 31% మంది అన్నారు. 26% మంది ఎటూ తేల్చుకోలేక పోవడం చేతనే బిజెపి లాభపడింది. మళ్లీ రాకూడదని అనుకున్నవాళ్లలో 4% బిజెపికి, 39% కాంగ్రెసుకి, 18% తృణమూల్‌కు, 11% ఆప్‌కు, 15% ఆర్‌జిపికి, 15% ఇతరులకు వేశారు. మళ్లీ రావాలని అనుకున్నవాళ్లలో 74% బిజెపికి, 10% కాంగ్రెసుకి, 5% తృణమూల్‌కు, 1% ఆప్‌కు, 3% ఆర్‌జిపికి, 7% ఇతరులకు వేశారు. ఎటూ తేల్చుకోలేని వారిలో 32% బిజెపికి, 21% కాంగ్రెసుకి, 14% తృణమూల్‌కు, 6% ఆప్‌కు, 10% ఆర్‌జిపికి, 17% ఇతరులకు వేశారు. ఆఖరి కేటగిరీ కారణంగా మొత్తం మీద బిజెపికి 33% ఓట్లు వచ్చి 20 సీట్లలో నెగ్గింది.
గతంలో బిజెపికి ఓట్లేసినవారిలో 65% మంది మాత్రమే యీసారి బిజెపికి వేశారు, 14% కాంగ్రెసుకు, తక్కినవారు తక్కిన పార్టీలకు వేశారు. గతంలో కాంగ్రెసు, దాని భాగస్వాములకు ఓటేసినవారిలో 59% మంది మాత్రమే యీసారి కాంగ్రెసుకు ఓటేశారు. 13% బిజెపికి, తక్కినవారు తక్కిన పార్టీలకు వేశారు. గతంలో ఆప్‌కి వేసినవారిలో 32% మాత్రమే యీసారి ఆప్‌కు వేశారు. 16% బిజెపికి, 14% కాంగ్రెసుకు మళ్లిపోయారు. ఎన్నికలలో కులం ప్రాధాన్యత ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్నంతగా గోవాలో లేదనుకుంటారు. కానీ సర్వే ప్రకారం కులం చాలా ముఖ్యం అన్నవారి శాతం, కొంతవరకు ముఖ్యం అన్నవారి శాతం యిలా ఉన్నాయి. గోవాలో 33-15. పంజాబ్‌లో 33-13, యుపిలో 32-12, ఉత్తరాఖండ్‌లో 24-10. అంటే కులస్పృహలో గోవా యుపి, పంజాబ్‌లకు తీసిపోదని తెలుస్తోంది.
కులాలవారీ ఓటింగు ఎలా జరిగిందంటే 1) జనాభాలో 16% ఉన్న హిందూ అగ్రవర్ణాలు బిజెపికి గతంలో కంటె 10% ఎక్కువగా, 49% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 6% తక్కువగా 17% వేశారు. 2) జనాభాలో 7% ఉన్న మరాఠా క్షత్రియులు బిజెపికి గతంలో కంటె 19% తక్కువగా 34% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 7% తక్కువగా 14% వేశారు. 3) జనాభాలో 16% ఉన్న భండారీ సమాజ్ వారు బిజెపికి గతంలో కంటె 10% తక్కువగా 44% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 4% తక్కువగా 14% వేశారు. 4) జనాభాలో 11% ఉన్న ఒబిసిలు బిజెపికి గతంలో కంటె 1% తక్కువగా 38% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 4% ఎక్కువగా 20% వేశారు. 5) జనాభాలో 9% ఉన్న ఎస్‌టిలు బిజెపికి గతంలో కంటె 27% ఎక్కువగా 58% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 7% తక్కువగా 21% వేశారు.
6) జనాభాలో 9% ఉన్న ముస్లిములు బిజెపికి గతంలో కంటె 7% ఎక్కువగా 17% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 2% తక్కువగా 45% వేశారు. 7) జనాభాలో 27% ఉన్న క్రైస్తవులు బిజెపికి గతంలో కంటె 5% తక్కువగా 13% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 6% తక్కువగా 35% వేశారు. 8) జనాభాలో 5% ఉన్న ఇతరులు (హిందూ దళితులు కూడా వీరిలో ఉన్నారు) బిజెపికి గతంలో కంటె 7% తక్కువగా 33% వేశారు. కాంగ్రెసుకు గతంలో కంటె 18% ఎక్కువగా 37% వేశారు. దీన్ని బట్టి చూస్తే బిజెపి బలం గణనీయంగా పెరిగింది ఎస్టీలలోనే, ఆ తర్వాత అగ్రవర్ణాలలో. బిసిల్లో తగ్గింది. క్రైస్తవుల్లో తగ్గింది, ముస్లిముల్లో పెరిగింది. ఎన్నికల అనంతరం ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు ఎంజిపి ఎమ్మెల్యేలు మద్దతివ్వడంతో పూర్తి మెజారిటీతో బిజెపి ప్రభుత్వం సావంత్ నేతృత్వంలో ఏర్పడింది. (ఫోటో – సావంత్ ప్రమాణస్వీకారం వేళ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)