సాల్ భార్య మీరా అతన్ని విడిచి ఇండియాకు వెళ్లిపోయింది. సాల్‌కు తెలుసు, ఆమె తన కోసం అంత దూరం నుంచి వచ్చినా, పని ఒత్తిడి కారణంగా టైము కేటాయించలేకపోయానని, కనీసం వరసగా 12 గంటలైనా తనతో గడపకపోవడంతో ఆమె విసిగిపోయిందనీ! తన నిస్సహాయతను తనే నిందించుకుంటూ ఆమె ఎయిర్‌పోర్టుకి టాక్సీ ఎక్కుతున్న సమయానికి రాగలిగాడు. నా వృత్తిధర్మమే నా బలహీనత అని ఒప్పుకున్నాడు. ఏ విధమైన వాగ్వివాదమూ లేకుండా యిద్దరూ విడిపోయారు. టామ్ వ్యవహారం కారణంగా విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు చెప్పే అవకాశం కూడా లేకపోయింది. టామ్ ఫోటో రిలీజ్ చేసిన తర్వాత అక్కడ చూశాం, యిక్కడ చూశాం అంటూ 2 వేల కాల్స్ వచ్చాయి, అన్నీ బోగసే.
వాస్తవానికి టామ్ సౌదీ రాయబారి జహ్రానీ అందచేసిన రైఫిల్‌తో అడవుల్లో ప్రాక్టీసు చేస్తున్నాడు. రెండు రోజులకు అక్కడకు ఓ వేటగాడు వచ్చాడు. ఇతని తుపాకీ చూసి ముచ్చటపడ్డాడు. ఏదీ చూడనీ అంటూ చేతిలోకి తీసుకుని మెచ్చుకున్నాడు. తనదీ యితనికి యిచ్చాడు. టామ్ యిదంతా సహించాడు. అడ్డు చెపితే అనుమానం వస్తుందని జంకాడు. కానీ వచ్చిన వేటగాడికి అతని మొహం ఎక్కడో చూసినట్లు అనిపించింది. సరే, వస్తా అంటూ రోడ్డు మీదకు వచ్చి ట్రక్కులో పడివున్న పేపరు చేతిలోకి తీసుకుని, దానిలోని ఫోటో పోల్చి చూసుకున్నాడు. ఇతనే టామ్ అని తోచింది. వెంటనే అక్కణ్నుంచి పారిపోబోయాడు. ఇదంతా టామ్ ముందే ఊహించాడు. అందుకే వెంటాడుతూ వచ్చి, అతన్ని చంపేశాడు. అతని శవాన్ని ట్రక్కులో పడేసుకుని, ఊళ్లోకి బయలుదేరాడు.
ఎఫ్‌బిఐ ఏజంట్లు మసీదులో కాల్పులు జరిపి యిద్దరు భక్తులను కాల్చేయడం పెద్ద గొడవ రేపింది. ఆ ప్రాంతంలోని ముస్లిములందరూ ఆందోళన చేస్తున్నారు. క్యారీ అక్కడకు వెళ్లి మసీదు పెద్దగా వున్న ఇమామ్‌ను కలిసింది. ఆ టామ్ ఎవడో మాకు తెలియదు. ఇటు ఎప్పుడూ రాలేదు, మాకు తెలిసినదల్లా ఎఫ్‌బిఐ వచ్చి అమాయకులైన భక్తులను కాల్చేసి, మసీదును అపవిత్రం చేసింది అన్నాడతను కోపంగా. అక్కడకు ఎఫ్‌బిఐ తరఫున హాల్ అనే స్పెషల్ ఏజంటు వచ్చాడు. హత్యాస్థలాన్ని పరిశీలించి, టామ్ మసీదుకి తరచుగా వస్తూండాలని, అతనికి మసీదు ఆనుపానులన్నీ తెలుసని చెప్పాడు. టామ్ తొలిసారిగా కాల్చాడని, ఎఫ్‌బిఐ ఎదురుకాల్పులు జరిపిందని, ఆ క్రమంలో అనుకోకుండా మరణాలు సంభవించాయని అతను ఇమామ్‌తో వాదించాడు.
విడిగా క్యారీతో మాత్రం మావాళ్లే ముందుగా కాల్చారు అని ఒప్పుకున్నాడు. అతనికి తెలియకుండా క్యారీ దాన్ని రికార్డు చేసి డేవిడ్‌కు వినిపించింది. ‘ఇమామ్‌కు టామ్ గురించి తెలుసు. కానీ ఎఫ్‌బిఐ వాళ్లు తమ తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే తప్ప అతను నోరు విప్పడు. మనం యీ టేపు సహాయంతో ఎఫ్‌బిఐను వంచుదాం.’ అంది. కానీ డేవిడ్ ఒప్పుకోలేదు. ఎఫ్‌బిఐతో తగవేసుకుంటే చాలా సమస్యలు వస్తాయన్నాడు. పైగా యింతా చేసి ఇమామ్ ఏమైనా చెప్తాడో లేదో గ్యారంటీ లేదన్నాడు.
ఇక గత్యంతరం లేక ఇమామ్‌ను బతిమాలడానికి క్యారీ అతని యింటికి వెళ్లింది. అతను భార్యచేత టీ యిప్పించి మర్యాదలు జరిపాడు కానీ ఎఫ్‌బిఐ క్షమాపణ చెప్పాకనే తక్కిన సంగతులు చూద్దామన్నాడు. టామ్ కాల్చలేదని, ఎఫ్‌బిఐయే కాల్చిందని సాక్ష్యం చెప్పడానికి ఏడుగురు భక్తులు సిద్ధంగా ఉన్నారని ధాటీగా చెప్పాడు. పెద్దమనిషిగానే తోచాడు, టెర్రరిజానికి వ్యతిరేకంగానే ఉన్నాడు కానీ కాల్పుల కారణంగా ఆత్మాభిమానం దెబ్బ తిని, సహకరించటం లేదని క్యారీకి అర్థమైంది. తన విజిటింగ్ కార్డు బల్ల మీద పెట్టి, సాయపడదామని ఎప్పుడైనా తోస్తే ఫోన్ చేయమని అడిగి వచ్చేసింది.
నజీర్ పట్ల తన ఆగ్రహాన్ని జహ్రానీ వద్ద వ్యక్తం చేసి వచ్చేసిన తర్వాత బ్రాడీ మనసు తేలికపడింది. గతాన్ని పాతిపెట్టి, తన కుటుంబంలోని వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచుకుందామనుకుని, యింటి పనుల్లో పాలుపంచుకోసాగాడు. భార్య యిల్లు సర్దుతూంటే తను ఆవిడ యిచ్చిన వెచ్చాల జాబితా పట్టుకుని సూపర్ మార్కెట్‌కు వెళ్లాడు. ఏదో ఒక వస్తువు గురించి అర్థం కాక యింటికి ఫోన్ చేశాడు. ఆమె తీయకపోతే వేరేది కొనేసి పార్కింగ్ లాట్‌కు వచ్చి కారులో సామాన్లు పెడుతున్నాడు. మిస్‌డ్ కాల్ చూసుకుని జెసికా అతనికి ఫోన్ చేయడంతో అతని దృష్టి మరలింది. సరిగ్గా అదే సమయానికి ముగ్గురు మనుషులు అతన్ని స్పృహతప్పేలా చావబాది కారులో తీసుకుపోయారు.
అతనికి గతమంతా గుర్తుకు రాసాగింది. మూడేళ్ల క్రితం బందీగా ఉన్న తనను నజీర్ మేల్కొల్పాడు. కొత్త యింటికి తీసుకెళ్లి, గడ్డం గీసుకుని, స్నానం చేయమన్నాడు. కట్టుకునేందుకు మంచి బట్టలు యిచ్చాడు. ఆహారం పెట్టాడు. ఒక చిన్న కుర్రవాణ్ని చూపించి ‘‘వీడు నా కొడుకు ఐసా. వీడికి నువ్వు ఇంగ్లీషు నేర్పాలి. ఇక్కడే వీడితో బాటు ఉంటూండు. ఇకపై ఇదే నీ యిల్లు .’’ అన్నాడు. బ్రాడీకి ఏమనాలో తెలియదు. అతనికి అరబిక్ రాదు, పిల్లవాడికి ఇంగ్లీషు రాదు. సిగ్గరి. తనకెప్పుడూ పాఠాలు చెప్పిన అనుభవమూ లేదు. ఏది ఏమైనా ఏకాకిగా, బందీగా వుండే బదులు యిది నయం కదా అనుకున్నాడు.
అమాయకంగా కనబడే ఆ పిల్లవాడు చూడగానే ముచ్చట వేస్తున్నాడు. వాడికి సాకర్ అంటే యిష్టమని గ్రహించాడు. దాని ద్వారా దగ్గరయ్యాడు. ఓ సారి అతను గాజుపాత్రలు విరక్కొట్టేస్తే నజీర్ కోప్పడబోయాడు. వెంటనే బ్రాడీ ఆ తప్పు తనమీద వేసుకుని, పిల్లవాడి ప్రేమ చూరగొన్నాడు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ పోనుపోను బ్రాడీకి కూడా అతనంటే పుత్రవాత్సల్యం కలిగింది. సొంత కొడుకు లాగే చూసుకున్నాడు. ఇంగ్లీషు నేర్పాడు. ముస్లిముగా మారి అతనితో కలిసి ప్రార్థనలు చేశాడు. ఐసాకు బ్రాడీ ఎంతో నచ్చేశాడు. ఇద్దర్నీ కలిపి బొమ్మ వేసి చూపించాడు. నజీర్ కూడా బ్రాడీని ఆప్యాయంగా చూశాడు. ఇద్దరి మధ్య ఆత్మీయత ఏర్పడింది.
ఏళ్లు గడిచాయి. నజీర్ కొడుకు ఐసాకు బ్రాడీ పెంపుడు తండ్రిలా వ్యవహరిస్తున్నాడు. ఓ రోజు అతను యితర పిల్లలతో కలిసి చదువుకోవడానికి మదరసాకు వెళ్లాడు. అంతలో అమెరికా సైన్యం ఆ స్కూలుపై డ్రోన్‌తో బాంబులు కురిపించింది. ఆ పేలుళ్లు విని బ్రాడీ అటు పరిగెట్టాడు. శిథిలాలలో ఐసా శవం కనబడింది. ఆ దాడిలో చనిపోయిన 83 మంది పిల్లలలో ఐసా ఒకడు. అది నజీర్‌ను ఎంత కలచివేసిందో బ్రాడీని యింకా అంతకంటె కలచివేసింది. అతని అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అతని చావుకి కారకులైన వారిపై పగ తీర్చుకుంటానని శపథం చేశాడు.
జరిగినదేమిటంటే సిఐఏ నజీర్‌కై వెతుకుతూన్నపుడు అతను ఒక మదరసాలో దాగున్నాడని వాళ్లకు కబురు వచ్చింది. దానిలో పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది కాబట్టి అమాయకులపై బాంబులు వేయకూడదని సిఐఏలో కొందరి అభిప్రాయం. రూలు ప్రకారం కూడా అలా వేయకూడదు. అయితే మాజీ సిఐఏ డైరక్టరు, అప్పటి వైస్ ప్రెసిడెంటు ఐన వాల్డెన్ బాంబులు వేసేద్దామని నిశ్చయించుకున్నాడు. ఆ ప్లానులో డేవిడ్‌ను భాగం చేశాడు కానీ, అతని కంటె సీనియర్‌గా ఉన్న సాల్‌కు చెప్పలేదు.
డ్రోన్ ద్వారా బాంబులు వేస్తే నజీర్ దొరకలేదు కానీ, 83 మంది పిల్లలు మాత్రం చనిపోయి చాలా అల్లరై పోయింది. దాంతో ప్రభుత్వం ఆ దాడి జరగలేదని బుకాయించింది.
దానికి సంబంధించిన ఫైళ్లన్నిటిని వాల్డెన్, డేవిడ్ ద్వారా సిఐఏ రికార్డుల్లోంచి మాయం చేయించాడు. పిల్లలు చనిపోయారని అల్‌ఖైదా వీడియో విడుదల చేస్తే, అదంతా అల్‌ఖైదా కల్పించిన అబద్ధపు వీడియో అని, ఓ మిసైల్ ప్రయోగిస్తే అది వెళ్లి నజీర్ కాంపౌండులో పడిందంతేనని వాల్డెన్ పబ్లిగ్గా ఓ ప్రకటనలో ఖండించాడు.
ఆనాడు సిఐఏ కౌంటర్ టెర్రరిజం శాఖలో చిరుద్యోగిగా ఉన్న డేవిడ్ యీనాడు దానికి డైరక్టరు. ఆనాడు అతనికి సీనియర్‌గా ఉన్న సాల్, యీనాడు డేవిడ్‌కు జూనియర్. ఆ శాఖలోని సాల్‌కు, క్యారీకి, మరెవరికీ యీ డ్రోన్ దాడి గురించి తెలియదు. తెలిసిన డేవిడ్ నోరు విప్పడు. ఆ ఘోరానికి మూలకారకుడైన వాల్డెన్ అతన్ని సకలవిధాలా కాపాడుతున్నాడు.
బ్రాడీకి మెలకువ వచ్చేసరికి అతను పక్క మీద పడివున్నాడు. డాక్టర్ పరీక్షిస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి కంప్యూటర్ ఆన్ చేశాడు. దానిలో నజీర్ వీడియో కాన్ఫరెన్సింగ్‌కు వచ్చాడు. ‘టామ్ చచ్చిపోయాడని చెప్పి నన్ను ఎనిమిదేళ్లగా మోసం చేశావు.’ అని బ్రాడీ నిందించాడు. ‘అవన్నీ చిన్న విషయాలు. ఐసా దుర్మరణానికి కారకుడైన వాల్డెన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని నీ అంతట నువ్వే ప్రతిజ్ఞ చేశావ్. అది మర్చిపోయావా?’ అని అడిగాడు నజీర్. ఆ తర్వాత మదరసాపై దాడి జరగలేదని, అదంతా అల్‌ఖైదా ఉత్తుత్తి ప్రచారమని అప్పుడు వాల్డెన్ యిచ్చిన ప్రసంగం వీడియోను చూపించారు. చూడగానే బ్రాడీ రక్తం సలసల కాగింది.
అది గమనించి జహ్రానీ ఆ గదిలోకి వచ్చాడు. ‘వైస్ ప్రెసిడెంట్ వాల్డెన్ రాజీనామా చేసిన కాంగ్రెస్‌మన్ స్థానంలో నిన్ను నిలబడమంటాడు. ఆ ఆఫర్‌ను నువ్వు స్వీకరించాలని నజీర్ కోరుకుంటున్నాడు. అప్పుడే నువ్వు లక్ష్యానికి కట్టుబడినట్లు నమ్ముతాడు.’ అని చెప్పాడు. బ్రాడీని విడుదల చేసేశాడు. సూపర్ మార్కెట్ నుంచి హఠాత్తుగా మాయమై పోయి, ఫోన్ తీయక ఎప్పటికో గాయాలతో తిరిగి వచ్చిన అతన్ని చూడగానే భార్య ఆందోళన పడింది. బ్రాడీ, భార్యతో ఎవరో దుండగులు దాడి చేశారని చెప్పాడు. ఆమెకు నమ్మాలో, వద్దో తెలియలేదు కానీ వైస్ ప్రెసిడెంటు నుంచి అతని కోసం ఒక వాయిస్ మెయిల్ వచ్చిందని చెప్పింది.
ఇక్కడిలా జరుగుతూండగా ఇమామ్ భార్య భర్తకు తెలియకుండా క్యారీకి రహస్యంగా ఫోన్ చేసింది. ఒక సూపర్ మార్కెట్‌లో కలిస్తే తనకు తెలిసిన విషయం చెప్తానంది. చెప్పింది కూడా. టామ్ తమ మసీదుకు ఓ పదిసార్లు వచ్చాడని, వచ్చినపుడల్లా అతనితో ఒక వ్యక్తి వచ్చాడని, అతను ముస్లిమే కానీ, ప్రార్థనలకు తమ మసీదుకి రాడని చెప్పింది. సౌదీ రాయబార కార్యాలయానికి చెందిన కారులో వచ్చేవాడని చెప్పింది. క్యారీ ధన్యవాదాలు చెప్పి వచ్చేసింది.
ఇక ఆ సమాచారంపై సాల్, క్యారీ వర్క్ చేసి అతను జహ్రానీ అని కనిపెట్టేశారు. టామ్‌ను పట్టుకుని అతను చేయబోయే ఘోరాన్ని ఆపాలంటే జహ్రానీని నిర్బంధించి, అతని చేత నిజాలు కక్కించాలి. కానీ అతను రాయబారి కార్యాలయపు ఉద్యోగి కాబట్టి ఇమ్యూనిటీ వుంటుంది. అధికారికంగా అతన్ని ఏమీ చేయలేరు. మరెలా?
బ్రాడీ యింటికి హఠాత్తుగా పోలీసులు వచ్చారు. ఇల్లంతా వెతుకుతామన్నారు. ఎందుకాని కంగారు పడ్డాడు బ్రాడీ. చివరకు తేలిందేమిటంటే వైస్ ప్రెసిడెంట్ వాల్డెన్ వాళ్లింటికి వస్తున్నాడు. ఇది సెక్యూరిటీ చెక్. వాల్డెన్ వచ్చాడు. అందర్నీ పంపించేసి, ఒంటరిగా బ్రాడీతో మాట్లాడాడు. ‘సెక్స్ స్కాండల్‌లో యిరుక్కున్న కాంగ్రెస్‌మన్ చేత రాజీనామా చేయిస్తున్నాం. ఆ స్థానానికి రాబోయే ఉపయెన్నికలో నిన్ను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. నువ్వు సరేనను. ఇది మంచి అవకాశం.’ అన్నాడు. ‘మా ఆవిణ్ని అడిగి చెపుతా’ అన్నాడు బ్రాడీ.
భార్యతో చెపినపుడు ఆమె వద్దంది. ‘ఒకసారి రాజకీయాల్లోకి వెళితే మన బతుకు బజార్న పడుతుంది. ఇన్నాళ్లూ గుట్టుగా బతుకుతున్నాం. కాంగ్రెస్‌మన్ అనగానే మీడియా వాళ్లు మన గతాలను తవ్వుతారు. పిల్లలపై నిరంతరం నిఘా పెడతారు, ఉన్నవీ లేనివీ కథనాలు వండి వారుస్తారు. నాకు, మైక్‌కు ఉన్న సంబంధం బయటకు వస్తుంది. అందరి ఎదుటా దోషులుగా నిలబడతాం. నాదే కాదు, నువ్వు ఆ సిఐఏ పిల్లతో వారాంతాలు డేటింగ్ చేసిన విషయమూ పేపర్లో వస్తుంది. ఇదంతా మనకు అవసరమా? ఉన్నంతలో హాయిగా బతకవచ్చు కదా’ అంది. సిఐఏ పిల్ల అనగానే బ్రాడీ గతుక్కుమన్నాడు. ఎలా తెలిసింది? ఎంతవరకు తెలిసింది? వంటి ప్రశ్నలు వేసే ధైర్యం చేయలేదు. ఆలోచిద్దాం అని చెప్పి వూరుకున్నాడు. ప్రజాజీవితంలోకి వెళతానని అవతల అబు నజీర్‌కు మాట యిచ్చివున్నాడు. ఎలా?
క్యారీ, వర్జిల్ కలిసి జహ్రానీపై నిఘా పెట్టి చాలా వివరాలు సేకరించారు. డిపార్టుమెంటు ద్వారా కొన్ని తెలుసుకున్నారు. అవన్నీ క్యారీ తన డిపార్టుమెంటులో అందరికీ కలిపి సెషన్ పెట్టి చెప్పింది – జహ్రానీ రాయబారి కార్యాలయంలో ఉన్నతోద్యోగి, జీతం బాగానే వస్తుంది కానీ ముగ్గురు భార్యలు. వాళ్లందరికీ కలిపి 10మంది పిల్లలు. ఇంతమంది భార్యలున్నా ఓ మసాజ్ సెంటరుకి వెళ్లి ఒక మగవాడితో రమిస్తాడు. విపరీతంగా అప్పులు చేశాడు. ఒక బ్యాంకుకు 75 వేల డాలర్లు అప్పుపడ్డాడు. అయినా అప్పుడప్పుడు ఒక స్విస్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తూంటాడు. ఆ డబ్బు అతనిదే అయితే అప్పు తీర్చేసేవాడు కదా. దాని అర్థం అల్‌ఖైదా తరఫున దాని ఏజంట్లకు స్విస్ బ్యాంకు ద్వారా డబ్బు పంపిణీ నిర్వహిస్తూ వుంటాడు. అతని దగ్గరకు వెళ్లాలంటే దౌత్యనిబంధనలు ఒప్పుకోవు. అందువలన అతనికి ఋణాలిచ్చిన బ్యాంకు ద్వారానే అతన్ని హ్యేండిల్ చేయాలి. వాళ్లు పిలిపించినట్లు రప్పించి ప్రశ్నలడిగి బెదిరించాలి. డేవిడ్ అంతా విని మీకు తోచినట్లు చేయండి అన్నాడు.
క్యారీ బ్యాంకుకి వెళ్లి మీరు మాకు సహకరిస్తే మేం మీ దగ్గర ఖాతా తెరుస్తామని ఆశ పెట్టింది. వాళ్లు జహ్రానితో లోను గురించి మాట్లాడాలని చెప్పి పిలిపించారు. వచ్చాక స్టాఫ్ ఎవరూ లేని టాప్ ఫ్లోరుకి తీసుకెళ్లడంతో, జహ్రానీకి అనుమానం వచ్చి వెళ్లిపోతానన్నాడు. సాల్, క్యారీ అతన్ని ఆపారు. మసాజ్ సెంటర్లో స్వలింగ సంపర్కం ఫోటో చూపించి మీ రాయబారితో సహా కుటుంబంలో అందరికీ చెప్తామని చెప్పి బెదిరించారు. నా పెళ్లాలకు యిది ముందే తెలుసు, లోకం ఏమనుకుంటుందో నాకు ఖాతరు లేదు, నేనేమీ చెప్పను అన్నాడతను. అప్పుడు క్యారీ ‘నీ కూతుళ్లలో ఒకామె చాలా తెలివైనది. నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌తో యేల్ యూనివర్శిటీలో చదువుతోంది. నీకు దౌత్యరక్షణ వుంది కానీ ఆమెకు లేదు. మా దగ్గరున్న ఆధారాలు చూపించి ప్రభుత్వం చేత ఆమెను అమెరికా నుండి బహిష్కరింప చేస్తాం. యూరోప్‌లో కూడా ఎక్కడా సీటు రాకుండా చేస్తాం. ఇక ఆమె సౌదీ అరేబియాకి తిరిగివెళ్లి బురఖా వేసుకుని, తక్కిన ఆడవాళ్లలాగానే ద్వితీయశ్రేణి పౌరురాలిగా బతకాల్సి వస్తుంది.’ అంది. తన కూతురు భవిష్యత్తు పాడవుతుందనగానే జహ్రానీ వణికాడు. నోరు విప్పాడు.
క్యారీ అతన్ని ప్రశ్నలడిగింది. అబు నజీర్ తెలుసని, తనకు వచ్చిన ఆదేశాలను టామ్‌కి అందిస్తూంటానని చెప్పాడు. ‘అయితే రేపు ఫర్రాగట్ స్క్వేర్‌లో కలవమని టామ్‌కు సిగ్నల్ యివ్వమని చెప్పింది. తన యింటి కిటికిలో ఒక వస్తువు పెడితే టామ్‌కి అర్థమవుతుందని, అలా చేసి మీకు చెపుతానని జహ్రానీ ఒప్పుకున్నాడు.
ఇంతలో బ్రాడీ ‘మీ యింటికి వచ్చి కలుస్తా’నంటూ క్యారీకి ఫోన్ చేశాడు. ఈమె పొంగిపోయింది. తన ప్రేమలోని నిజాయితీని గుర్తించి వస్తున్నాడని మురిసిపోయింది. కానీ బ్రాడీ ప్లాన్లు వేరు. అతను మైక్ వద్దకు వెళ్లి ‘నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు క్షమించు. నేను చచ్చిపోయానని అనుకునే కదా, మీ యిద్దరూ చేరువయ్యారు. జెసికాది కూడా ఏ పొరపాటూ లేదు. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళతానంటూ వుంటే వద్దంటోంది. నా కంటె నీ మాటకే ఎక్కువ విలువిస్తుంది. కాస్త నచ్చచెప్పు’ అన్నాడు. తర్వాత క్యారీ యింటికి వెళ్లాడు. ఆమె యితని కోసం చాలా హడావుడి పడిపోయింది. మంచి బట్టలు కట్టుకుంది. చక్కటి వైన్ ఏర్పాటు చేసింది. డిన్నర్ వండింది. మ్యూజిక్ పెట్టింది. కానీ బ్రాడీ వస్తూనే అతి సీరియస్‌గా ‘నేను కాంగ్రెస్‌మన్‌గా పోటీ చేయబోతున్నాను. మన బంధం రహస్యంగా వుంచకపోతే యిద్దరం యిబ్బంది పడతాం. ఆ మేరకు నాకు మాట ఇయ్యి.’ అన్నాడు. ఇందుకా వచ్చింది అనుకుని హతాశురాలైన క్యారీ సరేనని మాట యిచ్చింది. థ్యాంక్స్ అంటూ అతను వెళ్లిపోయాక వైన్ బాటిల్ సింక్‌లో ఒంపేసి, తన ఒంటరి బతుకు గురించి తలచుకుని వెక్కివెక్కి ఏడ్చింది.
ఫర్రాగట్ స్క్వేర్ వద్ద ఉన్న పార్కులో సిఐఏ, ఎఫ్‌బిఐ తమతమ దళాలతో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఎఫ్‌బిఐ మన సిబిఐ లాటిది. దేశంలో జరిగే ఘటనలను యిన్వెస్టిగేట్ చేస్తుంది, దోషులను పట్టుకుంటుంది, కేసు నడిపి శిక్ష పడేట్లు చేస్తుంది. టామ్‌ను పట్టుకోవడం వాళ్ల పని కూడా. అతను టెర్రరిస్టు కాబట్టి సిఐఏ సహకరిస్తోంది. క్యారీ, వర్జిల్ స్వయంగా ఫీల్డ్‌లోనే ఉన్నారు. జహ్రానీ యిచ్చిన సంకేతం అందుకుని టామ్ అక్కడకు నియమిత సమయానికి రావాలి. అతను రాగానే సజీవంగా పట్టుకుని, నజీర్ ఉనికి గురించి అడగాలని వీళ్ల ప్లాను. అనేకమంది వాకీటాకీలతో చుట్టూ తిరుగుతున్నారు. క్యారీ కూడా అక్కడక్కడే తిరుగుతూ ఆదేశాలు యిస్తోంది. జహ్రానీ వచ్చి కారు దిగాడు. పార్కులో నడవసాగాడు. కొద్ది క్షణాల్లోనే టామ్ లాగే నల్లజాతీయుడైన ఒక వ్యక్తి టోపీ పెట్టుకుని అతని వైపుగా నడుస్తున్నాడు. ఎడమ చేతిలో బ్రీఫ్‌కేస్ వుంది. టామో, కాదో తెలియాలంటే సరిగ్గా కనబడటం లేదు. వేరే ఎవరో అయితే ఏ కాలి మీదో కాలిస్తే మసీదు దగ్గర అల్లరైనట్లు యిక్కడా అవుతుంది. అందుకని అందరూ తటపటాయిస్తున్నారు.
ఇంతలో క్యారీ చూపు అతని కుడి మణికట్టుపై పడింది. అక్కడ వాచీ వుంది. అంటే యితను ఎడమచేతి వాటం వాడన్నమాట. బ్రీఫ్‌కేసు కూడా ఎడం చేత్తో పట్టుకున్నాడు. కానీ టామ్ కుడిచేతి అలవాటున్నవాడు. ఇతను టామ్ కాదన్నమాట. టామ్‌కి సంగతి తెలిసిపోయి, వేరెవర్నో పంపాడు. జహ్రానీ చేసిన మోసాన్ని గ్రహించి, అతన్ని చంపడానికి బ్రీఫ్‌కేసులో బాంబు తెస్తున్నాడేమో! ఈ ఆలోచన రాగానే క్యారీ వెంటనే అందర్నీ దూరంగా పారిపోమని అరిచింది. అప్పటికే యిదంతా దగ్గర్లో వున్న ఓ భవంతి కిటికీ నుంచి చాటుగా గమనిస్తున్న టామ్ తన చేతిలోని సెల్‌ఫోన్ ద్వారా రిమోట్ నొక్కాడు. ఆ పాటికే వచ్చినవాడు జహ్రానీని చేరుకోవడం, బాంబు పేలి జహ్రానీతో పాటు వచ్చినవాడు, కొందరు పౌరులు, సిఐఏ, ఎఫ్‌బిఐ సిబ్బంది చచ్చిపోయారు, గాయపడ్డారు. క్యారీ ఒక్కసారిగా వెనక్కు విరుచుకుపడింది. తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
జెసికా వద్దకు మైక్ వెళ్లి బ్రాడీకి నచ్చినట్లు చేసుకోనీ, అడ్డుపడకు అని చెప్పడంతో ఆమె ఒప్పుకుంది. బ్రాడీతో సరేనని చెప్పింది. పిల్లలు కూడా చప్పట్లు కొట్టారు. అతను వెంటనే వాల్డెన్‌కు తన అంగీకారం తెలిపాడు. ఆసుపత్రిలో సాల్ క్యారీని కలిసి దుర్ఘటన వివరాలు చెప్పే సమయానికి బ్రాడీ కాంగ్రెసుకు పోటీ చేస్తున్న సంగతి టీవీలో వస్తోంది. మనం అనుకున్నంతా అయింది అన్నాడు సాల్. సూట్‌కేస్ పట్టుకుని వచ్చిన ఆఫ్రో`అమెరికన్ యిల్లు లేనివాడని, టామ్ అతనికి డబ్బు ఆశ చూపించి పంపించి వుంటాడని అన్నాడు. టామ్‌కి ఎలా తెలిసింది అని క్యారీ అడిగితే ఈ ఆపరేషన్‌లో మొత్తం 16 ఏజన్సీలు పాలుపంచుకున్నాయి. ఎవరో లీక్ చేసి వుంటారన్నాడు.(ఫోటో- ఎడమవైపు ఇమామ్ భార్య, జహ్రానీ కుడివైపు నజీర్ కొడుకు ఐసా (పాత్రధారి భారతీయ మూలాున్న రోహన్ చంద్‌తో బ్రాడీ) (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2020)
[email protected]